పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - తృతీయాశ్వాసము
అర్జునుఁడు ద్రోణాచార్యులతో యుద్ధముసేయుట (సం. 6-98-4)
వ. వినుము. 217
సీ. అర్జునుం డడరి ద్రోణాచార్యు మూఁడు నారసముల నేసి యుగ్రంపుటంప
వెల్లువ వఱపిన వెగడొంద కాతఁ డాతనిమేనఁ దూపులు దఱుచు గాఁగ
నాటించె నంత భూనాథుండు పురికొల్పఁ గాఁ ద్రిగర్తులు గురుఁ గడచి కవియ
నరుఁడేచి వాయుబాణమ్మున నమ్మొనఁ దూలింపఁ గుంభజుశైలశరము
 
ఆ. వచ్చి యుడుప నలిగి వాసవినారాచ | వర్షమునఁ ద్రిగర్తవరునిపుత్ర
చయముఁ దెరలుచుటయు జనపతి కృపశల్య | బాహ్లికులునుఁ దానుఁ బార్థుఁ దాఁకె.
218
వ. అట్లు దాఁకుటయు వారల నతండు గన్నె రా కమ్ములం జీకాకు పఱిచె నట్లు గురుండు మొదలైనయందఱకును నా ధనంజయుపోరు దలమునుకలయ్యెఁ గురుపితామహుండు ధర్మసూతి యున్న తిట్ట కుఱికి తలలు చెండాడె శకునిభూరిశ్రవసులు గవలం దలపడిరి కళింగపతియును భగదత్తుండును నిభసేనలతోడం దొడరి భీమసేనుం బొదివిన. 219
క. గిరి డిగు కేసరి చాడ్పున | నరదము డిగి భ్రమితపటుగదాభీలత నా
కరువలిపట్టియుఁ గవిసినఁ | గరులుఁ దెరలెఁ బవనధూతఘనపంక్తి గతిన్‌.
220
తే. క్రందుకొని యిట్లు మాతంగ ఘటలు విఱుగ | నా శ్రుతాయువుఁ బ్రాగ్జ్యోతిషాధిపతియుఁ
బోక నిలిచి యమ్మారుతపు త్త్రుజోడుఁ | దనువుఁ జించిరి వివిధాస్త్రతతులు వఱపి.
221
వ. అప్పుడు గాంగేయుండు సేయు దారుణరణంబు ధర్మపుత్రునకు భరం బైన నతం డెలుంగెత్తి పేరువేరం బిలిచి చేయి వీచిన నా కళింగనాథ భగదత్తుల విడిచి యవుడు గఱచుచు. 222
క. కలయఁగఁ గరములఁ జరణం | బుల నురమున శోణితంబు బోరనఁ దొరఁగం
దలి రెసఁగిన నడమామిడి | చెలువునఁ బఱతెంచె భీమసేనుఁ డచటికిన్‌.
223
వ. అంతకు మున్న ధృష్టద్యుమ్న శిఖండి విరాటద్రుపదులు ధర్మనందనున కడ్డపడి భీష్ముపై నడరి బహుప్రకార విశిఖంబుల వెగడు పఱచిన నతం డలిగి శిఖండి నేయనొల్లక యమ్మువ్వురను మూఁడేసి వాఁడితూపుల నేసిన నావీర రథికులు హుతాగ్నిత్రయంబునుం బోలెఁ బ్రజ్వలించి బాణజ్వాలలు నిగిడించి యతని నొప్పించిరి వృకోదరుఁ డద్దెసం గవియుటం గనుంగొని కేకయగణశైనేయద్రౌపదేయులు గూడుకొని కవిసినం గౌరవసేనం జేయంగలమేటిమగ లెల్లను మిన్నేటికొడుకునకుం దలకడచి వారిం దలపడిన నిరుదెఱంగుల దొరలును, బలంబులును నొక్కుమ్మడిం గ్రందుకొన బెరసి పోట్లాడుచుండం జండరశ్మి వినువీథి చక్క సగంబునకుం జనుదెంచె నట్టియెడ. 224
తే. రథములను సామజములఁ దురంగమముల | నుఱక నెత్రుటేఱుల నీఁది తఱియ నడచి
పోరి రేటును వ్రేటును బోటు నొక్క | యలవిఁ జెలఁగంగ నుభయసైన్యములవారు.
225
వ. అప్పుడు మన బలంబుల జనంబులు. 226
క. ‘ధృతరాష్ట్రుండును బుత్త్రులు | నతిలోభంబునఁ బ్రజాక్షయము సేసిరి ధ
ర్మతనూజు గెలువ వచ్చునె? | మతి లేరై రింక నేటిమాటలు? మనకున్‌’
227
ఆ. అనుచు వగచు పలుకు లాలించు భీష్మాది | యోధవరులతో సుయోధనుండు
‘చెనఁటి మాటలేమి వినియెద?’రనిన వా | ర దియు నదియు విననియట్ల పోలె.
228
వ. పరాక్రమక్రీడలు సలుపుచుండి రాసందడికయ్యంబునం గిమ్మీరమర్దనుండు గదపండువు సేయుచుండె నప్పుడు. 229
క. సరభసముగ సారథి దన | యరదముఁ దెచ్చుటయు నెక్కి యతినిశితశర
స్ఫురణాపరిణతి బాహ్లికు | విరథుం గావించె సురలు వినుతింపంగన్‌.
230
తే. చిత్రసేనుండు సౌభద్రుఁ జిత్రబాణ | పాతమున నొంచి యార్చినఁ బాండుపౌత్రుఁ
డతని సారథిఁ బడ నేసి యంతఁ బోక | తురగములఁ జంపి యాతని త్రు ళ్ళడంచె.
231
వ. అక్కుమారుండును దుర్ముఖునిరథంబెక్కెఁ బాంచాలపతి గుంభసంభవుపై నడరి యతనిమేన నానాస్త్రంబులు నించిన. 232
క. ద్రోణుఁడు గోపించి తను | త్రాణం బఱువుళ్ళు సేసి తనువున రాజ
ద్బాణంబులు గ్రుచ్చిన సం | క్షీణబలుండై యతండు సిగ్గఱి తొలఁగెన్‌.
233
సీ. తఱిమి సుశర్ముండు దాఁకి యర్జును నొంచి | కృష్ణుపై నమ్ములు గీలుకొలుప
నలిగి యన్నరుఁడు వాలంపకాలువ లోలి | నడరించుటయు వానియఖిలబలముఁ
జేతిసమ్మెటలను జేరుకోలల వ్రేసి | యంకుశంబుల నూఁటి యతిరయమున
వాహనంబులఁ దోలువారును విండ్లును | బలకలు వైచుచుఁ బఱచువారు
 
తే. నైన మీ తండ్రి క్రీడిపై నడర నడుమఁ | జొచ్చె సాత్యకి యన్నదీసుతుఁడు శక్తి
వైవ మెయి వాల్చి యది పట్టి వైచె మగుడ | నాతఁ డా భీష్ముఁ డెడఁ దునుమాడె నధిప!
234
వ. ఇట్లు ద్రుంచి. 235
క. ఆలోనన మెయిఁ దొమ్మిది | వాలమ్ములు నాటఁ బాండవవ్యూహము శుం
డాలరథఘోటసుభటా | భీలతఁ దలకడచి పొదివెన్‌ భీష్ముని నంతన్‌.
236
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )