| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
కని కౌరవపతి దుశ్శా | సనుతో నిట్లనియెఁ గంటె? శాంతనవునిపై ఘన సేన ద్రోచెఁ జని కై | కొనుఁ డీవును సౌబలుఁడు నకుంఠితవృత్తిన్.’ |
237 |
| క. |
అనవుడు నయ్యిరువురు నే | పునఁ గదియుడుఁ జూచి ధర్మపుత్త్రుఁడు మాద్రీ తనయులు నడరిన దుర్యో | ధనుఁ డపుడు తురంగమాయుతముఁ బురికొలిపెన్. |
238 |
| వ. | ఆ పదివేవురు నెఱరావుతులును నొక్కపెట్ట శకునిదుశ్శాసనులకుం దలకడచి యెక్కినం బాండవబలంబు మహామత్స్యసమూహవిహారంబునం గలంగు మడువునుంబోలె సంక్షోభించినం గోపించి కౌంతేయాగ్రజుండును గవలును, వివిధవిశిఖపరంపరలు వరగింప ముందటికాళ్ళు దునిసిన మ్రొగ్గ తిలంబడియును మోరలు పఱియలైన నెఱి దప్పం గూలియు, గుండియ లవిసిన నెగసి కెడసియు వాగెలు ద్రెవ్విన వలియం బాఱియు నాశ్వికులు నేల కొఱగినం జెనఁటి దిరిగియు, ననేకఘోటకంబులు రూపఱిన నేపఱి యత్తురంగనికరంబు లేటమొగంబు వడి చెదరి కనుకనిం బఱచిన. | 239 |
| క. |
భేరీశంఖాదిరవ | స్ఫారత నప్పాండుపుత్ర బలమేచుటయుం గౌరవపతి శల్యునితో | గారవమున నిట్టు లనియెఁ గడు దీనుం డై. |
240 |
| క. |
‘వెలివిరిసి వచ్చు జలనిధి | పొలుపునఁ దోఁతెంచు ధర్మపుత్రుని బలు గో ల్తల నిలువరింప నీ వొక | చెలియలికట్ట వయి మమ్ముఁ జేకొను మిచటన్.’ |
241 |
| ఆ. |
అనుడు నతఁడు పాండవాగ్రజుఁ గవలను | దాఁకి విపులబాహుదర్ప మొప్ప నారసములఁ బొదివి మారిమసంగిన | ట్లయినఁ జూచి నరుఁడు ననిలసుతుఁడు. |
242 |
| క. |
ఒక్కటఁ గడంగి శల్యునిఁ | బెక్కమ్ముల నొంచుటయును భీష్మద్రోణుల్ గ్రక్కునఁ దఱిమిన నయ్యిరు | దిక్కులసైన్యములు నత్యుదీర్ణత బెరసెన్. |
243 |
| వ. | ఇట్లు గలయన్ బెరసి యపరాహ్ణంబున నుభయ చతురంగమథనం బగు ప్రధనంబు చెల్లె నట్టియెడ భీష్మ గ్రీష్మాదిత్యుండు వేఁడి మిగిలి వాఁడి మెఱసిన నారసంబులను కిరణంబుల పరగించి. | 244 |
| సీ. |
పండ్రెంటఁ బండ్రెంటఁ బాండవాగ్రజుని భీముని మాద్రికొడుకుల మూఁట మూఁట నేడింట నేడింట నేచి సాత్యకిని ధృష్టద్యుమ్ను నొప్పించి సమదవృత్తి నార్చిన మాత్స్యపాండ్యానీకములును సోమకవరూథినియును మగధబలముఁ గాశసైన్యంబుఁ గరూశసేనయు నొక్క పెట్ట రయంబున భీష్ముమీఁద |
|
| తే. |
నురవడించినఁ బాండవోత్కరముఁ గృష్ణు | తమ్ముఁ బాంచాలనందను సమ్ముఖమున కడరనీ కాఁగి యందఱ కన్నిరూపు | లై మహారణ మొనరించె నస్త్రగురుఁడు. |
245 |
| ఉ. |
శాంతనవుం డనేకబలసంతతి నుద్భట శౌర్యసారదు ర్దాంతపరాక్రమస్ఫురణఁ దాఁకి సముజ్జ్వలశాతసాయక క్రాంతపరీతనిర్మథితకంపితపాతితమూర్తిఁ జేసి య త్యంతరయంబునం దనరథంబుగతుల్ మెఱయం బ్రదీప్తుఁ డై. |
246 |
| మ. |
గజరాజోజ్జ్వలఘంటికావళిఁ దురంగప్రస్ఫురత్కింకిణీ వ్రజముం గాహళ దుందుభిప్రభృతితూర్య శ్రేణులన్ సుందర ధ్వజఘంటాతతులన్ శరాసనగుణవ్రాతంబుఁ దున్మాడి ధ ర్మజసేనాతతి ముంపఁ జేసెఁ బటుదోర్గర్వం బఖర్వంబుగన్. |
247 |
| వ. | ఇట్లు బల్లిదుం డయి మల్లడిగొని మార్కొనుమగలు లేక మదంబునం బొంగి గాంగేయుండు పాండవేయులు వెఱఁగుపడియుండ మఱియునుం గడంగి దుర్వారంబు లగు దివ్యాస్త్రంబులు దీటుకొల్పి యే దిక్కు సూచినం దాన యై రథికులను, హాస్తికులను, నాశ్వికులనుం దునిమిన గంధసింధురక్రీడనంబున మ్రోడుపడిన యుద్యానంబు చందంబున నగుచున్న చోట్లును, గాలుబలంబులం గనుపుకొట్టిన గాలు, చేయి, తల, డొక్క, యని యేఱుపాటు లేక వండం దఱిగినయ ట్లున్న యెడలును, బెక్కు దెఱంగుల చప్పుళ్ళు నిగుడ రథచయంబు నవయవంబులుం గరిహయనికరంబుల యెమ్ములు విఱుగం గార్చిచ్చు పొదివిన వెదురుటడవి తెఱంగునం దోఁచుపట్లును, దఱచు గొడుగులు విట తాటనంబు సేసినం బెనుగాలిం జిక్కువడిన కుసుమితకాశవనంబునుం బోలు చక్కట్లును, బహురత్నమయ మకుటాది భూషణ వ్రజంబు వివిధ వర్ణ చామరజాతంబు నఱికి పడవైచినం బ్రబలోద్ధతలులాయలులితంబయి కమలకైరవోత్పలాకీర్ణం బగుకొలని ననుకరించు ప్రదేశంబులును నై పాండవసైన్యంబులు దైన్యంబు నొందియుఁ గలగుండుగొనియు బెండువడియుఁ గలంగంబాఱియుఁ దొలంగం దెరలియుం గోలాహలబహుళంబు లగుటం గనుంగొని గోవిందుండు. | 248 |
| ఉ. |
‘అర్జున! చూచితే? మనబలావళి నెల్లఁ గలంచుచున్నవాఁ డూర్జితశౌర్యసంపదయు నుగ్రభుజాబలవైభవంబు వి స్ఫూర్జితవిక్రమోద్ధతియుఁ జూపె నదీసుతుఁ డిట్టి చోట నీ దుర్జయదర్పవిభ్రమము దోఁ పఁగఁ జేయకయున్కి యొప్పునే?’ |
249 |
| వ. | అనిన వివ్వచ్చుండు విచారడోలాయత్తం బగుచిత్తంబుతోడ నిరుత్సాహుం డై యున్నం జూచి వెన్నుం డతని కి ట్లనియె. | 250 |
| క. |
‘మును మత్స్య నాథునగరం | బున సంజయుతోడ నీవు పొంగుచు బె ట్టా డినమాట లెల్ల మఱచిన | నిను నగరే రథికవరు లనింద్యచరిత్రా! |
251 |
| వ. | అనుటయు నర్జునుండు. | 252 |
| ఆ. |
‘సకల బంధుజనులఁ జంపి కౌరవ హీన | మైన రాజ్యమహిమ యేను బడసి యనఘ! యేమిసుకృత మాచరించినవాఁడ | నగుదు? మనసు గొలుపదయ్యె ననికి. |
253 |
| వ. | అయిన నీతో నప్పటప్పటి కేటి మాటలు గలవు మిన్నేటి కొడుకుం బడవైచెదం దేరు నడపు’ మనుటయు నారాయణుండు నదీనందనుస్యందనంబునకు సమ్ముఖంబుగా రథ్యమ్ములం ద్వరితగతి నడపినం దెరలిన సైన్యంబులు గూడికొని గాంగేయుపయిం గవియ నతండు సెలంగి మహాస్త్రనికరంబులు నిగిడించి యబ్బలంబు నిలువరించి సింహనాదంబు సేసి. | 254 |
| మ. |
ఖరనారాచపరంపరోగ్రనిహతిన్ గాండీవియంగంబు లా తురతం బొందఁగ నేసి బాణమయగాత్రుం జేసి గోవిందు ని ష్ఠురలీలం దురగంబులం బటుశరస్యూతాస్యముల్ గాఁగ స త్వరుఁడై యేసి, రథంబు గూడఁ బొదివెన్ వాలంప మొత్తంబులన్. |
255 |
| వ. | అప్పుడు. | 256 |
| తే. |
బీఱువోయి రథ్యంబులు మాఱు మొగము | వడినఁ దా నొచ్చి యుండియుఁ దడవి శౌరి నూలుకొనఁ జేసి తఱిమిన వ్రాలి తీవ్ర | భల్లమునఁ గ్రీడి భీష్మునివిల్లు దునిమె. |
257 |
| క. |
అతఁ డొండొక విల్లెత్తిన | నతిరయమున నదియుఁ దునుమ నాతం డౌరా శతమఖనందన! యనుచును’ ధృతి వేఱొకవింట శరతతిం బరగించెన్. |
258 |
| క. |
ఆ బెట్టిదంపు టంపఱ | చే బీభత్సుండు నొచ్చి చేడ్పడి మఱియుం దా బంటుతనమ పటుబా | హాబలముగఁ బోరుచుండె నంగము దూలన్. |
259 |
| క. |
వివ్వచ్చునొవ్వు నెంతయుఁ | గ్రొవ్వున భీష్ముండు గడఁగుకోల్తలయుం ద క్కెవ్వరు నాతనిఁ జేరక | దవ్వుల నిల్చుటయుఁ జూచి తన చిత్తమునన్. |
260 |
| క. |
దారుణరోషం బడరఁగ | నారాయణుఁ డపుడు సైరణం దొఱఁగి వెసం దేరి నొగలఁ బగ్గము లిడి | క్రూరత మునికోల యెత్తికొని యిల కుఱికెన్. |
261 |