పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - తృతీయాశ్వాసము
శ్రీకృష్ణుఁడు రథంబు డిగి భీష్మునిపైకిఁ బోవుట (సం. 6-102-52)
వ. ఇట్లు లంఘించి. 262
మ. ధరణీచక్రము గ్రక్కునం గదల దిగ్దంతావళశ్రేణి కం
ధరముల్‌ మ్రొగ్గఁబడన్‌ దిశావలయ ముత్కంపంబుగా నీబలం
బురులం బాఱఁగ భీష్ముపైఁ గవిసె రౌద్రోద్రేకముం జూచి ఖే
చరలోకంబును సంచలింప హరి చంచద్బాహుఘోరాకృతిన్‌.
263
తే. లలితపీతాంబరంబు విలాస మొప్పసింహనాదోద్భటం బగు చెలువుతోడ
మెఱుఁగు వెలుఁగును గర్జయు మెఱయ వచ్చు కారుమొగిలనఁ గృష్ణునాకార మొప్పె.
264
వ. అట్టియెడ. 265
క. బలు జీవము వోయిన వెల వెలఁ బాఱుచు నీదుయోధవీరులు పొలిసెం
బొలిసె నదె భీష్ముఁ డనుచును గలఁగంబడి యఱ్ఱు లెత్తి కనుఁగొనుచుండన్‌.
266
చ. కనుఁగొని భీష్ముఁ డుల్లము వికాసము నొందఁగ నల్ల నవ్వి యి
ట్లనుఁ ‘జనుదెమ్ము వేగమ మహాత్మ! వికస్వరపుండరీకలో
చన! యిది లెస్స నా కిచట శాశ్వత మైనయశంబు నచ్చట
న్వినుతికి నెక్కు సద్గతియు నీ దయఁ జేకుఱఁజేయు మిష్టమున్‌.’
267
వ. అని పలుకు నంత జంభాంతకసూనుండు సరభసంబుగా రథంబు డిగ్గనుఱికి వెన్నుని వెనుక నెయిది కరంబులఁ గ్రుచ్చి పట్టిన నతండును దిగిచికొని వెండియుం బోవం బోవఁ బదియడుగులకొలంది నా కౌంతేయుండు పదస్థైర్యంబును, బాహు వీర్యంబును మెఱయ మహీతలం బూని మెట్టి నిలువం బట్టి నిట్టూర్పు నిగిడించుచు నద్దనుజమర్దనుతో ని ట్లనియె. 268
ఉ. కయ్యము సేయ నే నని యకల్మషబుద్ధిఁ బ్రతిజ్ఞ సేసి నీ
వియ్యెడఁ దప్పితేని జగ మేమను? నించుకసేపు పోరులన్‌
డయ్యుట దప్పె? నాపయిఁ గడంగిన భీష్మునిపాటు సూతు రా
వయ్య, రథంబుమీఁది కిటు లాశ్రితమానము వీటిఁబుత్తురే?’
269
వ. అని ప్రార్థించినం బార్థుపలుకులకుం బ్రియం బంది ముకుందుం డూరక మరలె నయ్యిరువురు నెక్కిన యరదంబు శిఖరద్వయసుందరం బైన శైలంబునుంబోలెఁ బొలిచి నిలిచినం బ్రళయకాలభైరవరవం బగు వారిదంబు కరణి గర్జిల్లుచుఁ బటునారాచపటలాసారంబు నిగిడించి వారల వెగడు వఱిచి యచ్చట నొండొరుల మెచ్చక యఱిమి తఱిమిన వైరుల రూపు మాపి భీష్ముండు భీషణాకారుం డై పరిశ్రాంతులయిన కృష్ణార్జునులును, భీతు లగు భీమసేన ప్రముఖులును, జేయునది లేక చూచుచుండం బాంచాలబలంబుల బారిసమరునప్పుడు బలుమానిసి చలిచీమలం గాలం జమురు చందంబు దోఁచె నయ్యవసరంబున. 270
క. తా నస్తశిఖరి మఱువడఁ | బోనియపుడు పాండురాజపుత్త్ర విరాజ
త్సేన పొడవడఁగు ననుకృప | నో నలినాప్తుండు గ్రుంకె నుర్వీనాథా!
271
వ. అట్టియెడ ధర్మతనయుం డతిఘోరం బగు సంధ్యాసమయంబునం బంకనిర్మగ్నయైన గోవునుం బోలె నున్న నిజసేనం జూచి యొక్కింతసేపు చింతా క్రాంతుండై యప్పటికిం దిగుటయ కర్జంబుగాఁ దలంచి తగువారల నెల్లం దివియ నియమించి. 272
క. గాంగేయుచేత నెంతయు | భంగపడితి మనుచు వగచు పార్థాదులు ద
న్నుం గొలిచి చనఁగ విడిదల | కుం గడువిన్ననయిపోయెఁ గురువంశనిధీ!
273
వ. ఇట్లు పాండవ వ్యూహంబు లోహటించి పోయినం దారును దమబలంబులఁ దివియ నియమించి. 274
చ. ఎలమి నమస్కరించుచు నహీనపరాక్రమభంగు లేర్పడం
బలికి యుదాత్తవాక్యములఁ బ్రస్తుతి సేయుచు భీష్ము నందఱున్‌
బలసి భవత్తనూజులు మనంబులు నిండి ముదంబు మోములన్‌
వెలి విరియంగ నేఁగిరి నవీనవిభూతి నివాసభూమికిన్‌.
275
వ. ఇట్లు ధర్మతనయుండు దొమ్మిదవ నాఁటి బవరంబున బెండువడి యా నిశాసమయంబునందు రహస్య ప్రకారంబున. 276
క. మనమున విషాద మడరఁగ | ననుజులఁ గూర్చికొని దానవాంతకుసదనం
బునకుం జని యి ట్లను నా | తనితో నాత్మీయకార్యదశ దెలియుటకున్‌.
277
క. ‘కార్చిచ్చు గవిసి మృగతతి | నేర్చుకరణి నేఁడు భీష్ముఁ డేచిన కడిమిం
బేర్చి మనసేనఁ బొదివె శ | రార్చుల నవ్వీరుఁ గన్నులారం గంటే?
278
మ. మనవా రెవ్వరు నోర్వ రాతనికి దుర్మానంబునం జేసి యే
మును గార్యస్థితిఁ గాన నైతి విను నిర్మూలంబుగాఁ బోరఁ జ
చ్చిన సామ్రాజ్యము గొన్న యట్లగునె? నిశ్చింతంబునం గాననం
బునకుం బోయెదఁ దమ్ములం గొని తపఃపూజ్యుండ నై యుండెదన్‌.
279
క. మున్నును నేఁగారణముగ | నన్నియిడుమ లనుభవించి రనుజులు వీరిం
గన్నారఁ జూతుఁ గాని జ | గన్నుత! భీష్మునకుఁ గోలుగా నీఁ జాలన్‌.
280
వ. నీకు మా దెస ననుగ్రహంబు గలదేని కయ్యంబు దక్కి ధర్మ విరోధంబు గాకుండునట్టి యొక్క తెరువు సెప్పు’ మని సకరుణంబుగాఁ బలికిన విని శౌరి సాంత్వనవచనంబుల ననునయించి యతని కి ట్లనియె. 281
క. ‘సత్యప్రతిజ్ఞుఁడవు నీ | వత్యద్భుత బాహువీర్యు లనుజన్ములు దౌ
ర్గత్యము గల్గునె? నీకు న | మాత్యుఁడ నై యేను రాజ్యమహిమ నొనర్తున్‌.
282
క. వగవఁగ నేటికిఁ బార్థుఁడు | దెగువకుఁ జొరకున్న భీష్ముఁ దెగఁ జూచి వెసం
బగ యడఁగించెద నన్నున్‌ | మగిడింపక చూచుచుండు మనుజాధీశా!
283
తే. సఖుఁడు సంబంధి శిష్యుండు సవ్యసాచి | నాకు, నతనికి నై యేను నరవరేణ్య!
కూర్మిమై నిత్తుఁ గండలు గోసి యైన | నరయ నాతండు నాయెడ నట్టివాఁడ.
284
వ. ఉపప్లావ్యంబున నతండు సంజయుతో నాడినబలుమాటలకు, నులూకుండు వచ్చినప్పు డతని పలుకులం బుట్టిన బెట్టిదంపుఁదనంబునకుం దగినయంత నాకుం జేయవలయు నేను నీ రెండెడలం బెక్కులు వలికినవాఁడ మా కిరువురకు నొండొరువుల పలుకులు పరిపాలించుట సమయంబయి యుండు ననిన వసుదేవనందనునకు ధర్మనందనుం డి ట్లనియె. 285
క. ‘కయ్యము సేయక తగు సా | హాయ్యము సేయఁగలవాఁడ నని పలికితి ని
న్ని య్యెడ నేఁ బొంకింతునె? | దయ్యము నా కేల యిట్టి దైన్యము దెచ్చెన్‌?
286
వ. నాకు దేవవ్రతునకు నొక్క సమయంబు గల దమ్మహాత్ముండు కౌరవులకు నయి కయ్యంబు సేయుటకును, నాకు హితం బగు కార్యంబు బుద్ధిం దలకొనుటకుం బూనినవాఁ డతండు రాజ్యం బొసంగు నని పలికి సఖేదంబుగా ని ట్లనియె. 287
ఆ. ‘అకట! తండ్రి సచ్చినంతనుండియు మమ్ము | నరసి ప్రోచినట్టి యనుఁగుఁ దాతఁ
జంప మదిఁ దలంచుతెంపు సూచితె? రాజ | ధర్మ మింత క్రూరకర్మమగునె?’
288
వ. అనవుడు. 289
తే. విని మురాంతకుఁ డితఁడు శాంతనవుకడకు | నరుగఁ జూచినవాఁ డని యాత్మ నెఱిఁగి
క్రమ్మఱంగ ‘నేతెంచెదు గాక!’ యనిన | యన్నదీసూనుతొంటి వాక్యములు దలఁచి.
290
వ. అజాతశత్రున కిట్లనియె. 291
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )