| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | ఇట్లు దాఁకి విరటుతమ్ముండు వాలమ్ముల నొప్పించినం గోపించి. | 391 |
| శా. |
విల్లుం గేతువుఁ ద్రుంచి సూతు వెస నుర్విం గూల్చి రథ్యంబులన్ డొల్లం దీవ్రత నేసి యాతఁడు భుజాటోపంబు శౌర్యంబు శో భిల్లన్ వైచిన శక్తియుం దునిమి యాభీలద్యుతిప్రస్ఫుర ద్భల్లం బొక్కటి భీష్ముఁ డేసి నఱకెం దన్మస్తకం బుగ్రతన్. |
392 |
| వ. | ఇవ్విధంబున శతానీకుం జంపిన. | 393 |
| క. |
మొనలెల్ల విఱుగ మధ్యం | దినమున యినుమాడ్కి బయలఁ దేజోనిధి శం తను సూనుఁ డొప్పె నప్పుడు | గనుఁగొని యిట్లనియె శౌరి గాండివితోడన్. |
394 |
| క. |
‘మనమోహరములు సెడి, కను | కనిఁ బాఱెడు నిప్పు డాపగాసుతునకు గ్ర క్కున నీవు మార్కొనక త | క్కినఁ గార్యము దప్పుఁ బొదివి గెలువుము కడఁకన్.’ |
395 |
| వ. | అనిన విని యతండు రథరథ్యసారథిసహితంబుగా సురనదీనందను నమందమార్గణపుంజంబునం బొదివె శిఖండియుం జేరి నారాచంబుల నొప్పించిన దేవవ్రతుండు వాని నేయ నొల్లనిసందున నాసవ్యసాచి యతని విల్లు దునిమి పెల్లేయుచున్నం జూచి సైరింపక శలశల్యకృప కృతవర్మచిత్రసేనభూరిశ్రవః ప్రభృతివీరలోకం బతిలోకంబుగ దివ్యాస్త్రజాలంబులు నెఱపుచు నేయుచు భీష్మున కడ్డపడుండు దలకడవుం’డను నెలుంగులు నింగి ముట్ట బలసమేతంబుగా నడరినం గని సమీర నందన సాత్యకి సౌభద్ర విరాట ద్రుపద ఘటోత్కచ ప్రముఖ యోధవర్గం బనర్గళభంగిం దఱుమం దత్సైన్యంబులు గూడుకొని కవిసిన దివిజదానవసంపాతసమయ సమరం బయ్యె నందుఁ బురందరనందనుండు మన సైనికుల కందఱ కన్నిరూపులయి యైంద్రవారుణాగ్నేయాది మహాశరంబులం దెరల్చుచు సురక్షితుం డైన శిఖండిం బురికొల్పికొని మీ తండ్రి నేయించుచు నతండెన్ని విండ్లెత్తిన నన్నిటిం దోడ్తోన తునుమాడుచుండె నా క్రీడిపై నతం డుగ్రశక్తి ప్రయోగింప నదియునుం ద్రుంచి సూతునిం గేతనంబునుం గూల్చిన. | 396 |
| సీ. |
మనమున భీష్ముఁ డిట్లని వితర్కించుఁ | ‘బాండవుల నాయొక్క వింటన కడంగి గెలువనే? వీరికిఁ గృష్ణుండు ప్రాపు గా | కున్న నిం కది యట్టు లుండనిమ్ము కృష్ణుఁ దోడుగఁ గొని కీడ్పడి వీరలు | వచ్చినఁ జెప్పితి వధవిధంబు సమర ముపేక్షించి శాంతిమై నుండెద | నడిచిపాటేటికి?’ ననఁగ నెఱిఁగి |
|
| తే. |
చదల సుర లిట్లు ‘మే లిది సమ్మతంబు | మాకు’ నని ప్రీతిమైఁ జెప్పుమాట లాతఁ డొక్కరుండును వినియె; నే నొకఁడు వింటి | మునిమహానుభావంబున మనుజనాథ! |
397 |
| వ. | తదవసరంబున సూక్ష్మజల శీకరశిశిరం బగు మారుతంబు మరుత్తటినీతనయు మీఁద సుడిసె సుర దుందుభులు మ్రోసెఁ గుసుమవర్షంబులు గురిసె నవియు ననన్యగోచరంబులయ్యె నిట్లు నిశ్చయించియు న మ్మహాత్ముం డూరకున్నం గెలని కొకభంగియై తోఁచు నని తలంచి. | 398 |
| తే. |
ఒక్క వి ల్లెక్కుపెట్టంగ నుఱక వెస శి | ఖండి పటు మార్గణంబులఁ గడఁగి యేయ నతఁడు మిసిమింతుఁడును గామి కల్ల నవ్వి | పఱపెఁ దనయమ్ము లతనిపై ఫల్గునుండు. |
399 |
| వ. | శాంతనవుండును సముల్లాసంబున నేసిన. | 400 |
| క. |
నరుఁడు, దనమీఁదఁ దొరఁగెడు | శరములు వారించి యతని చాపం బధిక త్వరితగతిఁ ద్రుంచి యతిని | ష్ఠుర నారాచంబు దనువు సొర నేయుటయున్. |
401 |
| వ. | తమకుం దమ యోధవరులకును వారింపం జేరం జెనయం గొలఁది గాక వెల్లివిరిసిన శరనిధిభంగిం బొంగిన వివ్వచ్చు వెఱఁగుపడి చూచుచుం దన్ను విడువక కెలంకులనున్న నీ కొడుకులం గలయం గనుంగొని మీ తండ్రి రారాజుతో నిట్లనియె. | 402 |
| మ. |
‘అని దేవాసురకోటి కైనను నశక్యం బిమ్మహావీరు మా ర్కొన వీఁ డల్గిన మర్త్యు లే యెదు రుదారుండైన యీ క్రీడి ద క్కిన ని ప్పాండవసైన్య మింతయును మ్రగ్గింపంగ నేఁ జాలుదున్ విను, సత్యం బిది వీని వింటి కెదురన్ విల్లెత్తలేఁ డెవ్వఁడున్.’ |
403 |
| క. |
అనునెడ శిఖండిచాపము | వెనుకం దనవిల్లు నిల్పి వెస నాతం డే సిన భంగిగ నరుఁ డేసెను | జననాయక! దొడ్డనారసంబులు భీష్మున్. |
404 |
| వ. | అప్పుడు దేవవ్రతుండు దుశ్శాసను నాలోకించి. | 405 |
| సీ. |
“అశనికల్పము లివి యర్జును బాణముల్ | గాని శిఖండివి గావు సుమ్ము; కర్కటిగర్భంబు కరణి గాత్రము వ్రచ్చె | నిట్టివి వీనికి నెందుఁ గలవు? బహ్మదండంబులపాటి యై మర్మంబు | లిట్టు నోనాటునే? యితని చేత జముదూత లట్లు ప్రాణముల వెలార్పంగ | నీ ద్రుపదాత్మజుఁ డెన్నఁ డేసె? |
|
| ఆ. |
దృఢవిముక్తములును దీప్తాకృతులు లక్ష్య | శుద్ధిమంతములును సునిశితములు నైననారసంబు లతనివి గాక యీ | తనివి యగునె? యెవ్విధమునఁ జూడ.’ |
406 |
| క. |
అనుచుఁ బటుశక్తి నప్పా | ర్థుని వైచిన నది యతండు దునుమాడుడు శాం తనవుఁడు వాలుం బలకయుఁ | గొని యరదము డిగ్గఁజూచుకొలఁదిం బెలుచన్. |
407 |
| తే. |
ఏసి యా రెంటిఁ దునియలు సేసి యెలుఁగు | సూపి యే నుండ వెఱ పేల? నాపగాత నూజుఁ బొదువుఁడు మీ’ రని యోజఁ జెప్పె | శక్రతనయుండు దనయోధజనుల కెల్ల. |
408 |
| వ. | అ ప్పలుకు లాకర్ణించి. | 409 |
| క. |
ఏయుఁడు పొడువుం డడువుఁడు | వ్రేయుఁ డనుచు వారు జాహ్నవీతనయుఁ గడున్ డాయుఁడు, మన సైనికులుం | గో యని తలపడ్డఁ బోరు ఘోరం బయ్యెన్ |
410 |
| వ. | అప్పుడు. | 411 |
| తే. |
ఏసి గాండీవి కురుసేన నెగువ నతని | వారు వెన్‌ఱవక భీష్మునిఁ జేరి యొడల వ్రేలెఁ డెడ లేనియట్లుగ వివిధభంగి | నిష్ఠురాస్త్రశస్త్రంబుల నినిచి రధిప! |
412 |