పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - తృతీయాశ్వాసము
ద్రోణాచార్యు లశ్వత్థామను భీష్మునకు సహాయంబుగాఁ బంపుట (సం. 6-108-1)
వ. అక్కడ నడచినం గౌంతేయాగ్రజుండు తోడన తవిలి సేనాసమేతంబుగా నడ్డపడి పోనీక పెనంగుచుండ నక్కుంభసంభవుండు. 349
క. అప్పుడు క్రోధమునం గను | నిప్పులు రాలంగఁ దనకు నెఱసంగడ మై
యొప్పిన తనయున కి ట్లని | చెప్పెం దత్కాలగతి విశేషము లెల్లన్‌
350
చ. ‘తడఁబడె దివ్యబాణముల తంత్రము, మంత్రముఁ దప్పెడుం గడు
న్వడఁకెడుఁ జాపదండము, మనంబును నాకు వశంబుగాదు, వీ
డ్వడియెడుఁ జెయ్వు లంగము గడంక దొఱంగెడు, నేఁటి భంగిఁ గ
వ్వడి తనపూన్కిఁ దీర్చుట ధ్రువంబని బుద్ధి జనించెఁ బుత్రకా!
351
వ. అతని మును మటు తలయెత్తి చూడుము. 352
క. కూలెడు గుఱ్ఱంబులు ధర | వ్రాలెడు నేనుఁగులుఁ గెడయు రథములు నై యా
భీల యుగాంత సముద్భట | కాలపురోభాగరేఖ గానఁగనయ్యెన్‌.
353
వ. అదియునుం గాక. 354
తే. అడరి కురుసేనపై గ్రద్దలాడఁ జొచ్చెఁ | బడుచునున్నవి యుల్క లిక్కడ వినంగ
వచ్చె నతిరూక్షభంగి శివారుతంబు | లాపగానందనునకుఁ గీ డావహిల్లు.
355
వ. యుధిష్ఠిరు మొగంబునం గ్రోధం బగ్గలం బై తోఁచుచున్నయది ద్రౌపదేయ నకులసహదేవసహితుం డయి తఱుము నతని మిగిలి నాకు రా రాదు నీవు దేవవ్రతుపాలికిం బోయి యతనికి దాపట వలపటం బ్రాపై నిలువు మిది ప్రాణంబులు డాఁచు సమయంబు గా దని పలికి పనిచిన నశ్వత్థామ యుద్దామగతిం జనియె నక్కడ భీమసేనుండు. 356
క. నరుఁ డేచి శిఖండిఁ బుర | స్సరుఁగాఁ గొని యపుడు భీష్ము సమయింపఁగ స
త్వరుఁ డగుటకుఁ దగ రణత | త్పరుఁ డై కురుసేనమీఁదఁ దఱిమెం బెలుచన్‌.
357
వ. ఇట్లు దఱిమి గాంగేయుముందటిబలంబుల బారిసమరం దొడంగిన భగదత్తకృపకృతవర్మశల్యసైంధవ చిత్రసేనదుర్మర్షణవిందానువిందవికర్ణులు పదుండ్రు నొక్కపెట్ట భీమునిం బొదివి నానాస్త్రసంతానంబుల నొప్పించిన నొచ్చియుం జలింపక పోరునమ్మారుతిం గనుంగొని క్రీడి తోడై తఱియ నుఱికి ధనువుల తునియలను, బాణంబులపఱియలను, గేతుచత్ఛ్త్రచామరంబులచెక్కలను, భూషణంబులపొళ్ళను, బుడమిం గప్పినం జూచి సుయోధనుండు సుశర్మాదిభూపాలకుల నాలోకించి యా భీమార్జునులం దాఁక నియోగించిన. 358
క. ముందటిపదుండ్రు నా నృపు | లందఱునుం గూడి పెనఁగి యయ్యిరువురచే
తం దూలపోవఁ జొచ్చినఁ | గ్రందుగ బలుమొనల నెల్లఁ గవియం బనిచెన్‌.
359
వ. ఇవ్విధంబునం బెక్కు మొనలు పయింబడిన నయ్యిరువురకుఁ బోరు భరం బగుట యెఱింగి సౌభద్రసాత్యకి ప్రముఖులగు రఙథికజనంబులు సైన్యోపేతంబుగాఁ ద్రోచి యేచిన. 360
క. పాండవబలముల యత్యు | ద్దండపరాక్రమము సూచి దర్పోద్ధతవే
దండములఁ గనిన కేసరి | చండత భీష్ముండు వొదివెన్‌ శరనఖరములన్‌.
361
క. డొల్లెడుసూతులుఁ బెలుచం | ద్రెళ్ళెడు తురగములుఁ గా నతిక్రూరగతిం
బె ల్లేయుచు సత్వరముగ | నెల్లెడలం దాన యగుచు నేడ్తెఱఁ బొదివెన్‌.
362
వ. ఇట్లు పెద్దయుంబ్రొద్దు విహరించి యపరాహ్ణం బగుటయు నతం డాత్మగతంబున. 363
తే. ‘ఉత్తమక్షత్రియుల నెల్ల నుగ్రవృత్తి | నేఁడు పదినాళ్ళగోలె నా నిశితశరచ
యములఁ గూల్చితి వేసరినట్టులయ్యె | మేనితోడి పొత్తిం కిట మానుటొప్పు.’
364
వ. అని తలంచి తొలంగి బలంబులం దెరల్చికొనుచుం గయ్యంబు సేయు చందంబునం గౌంతేయాగ్రజుం గదిసి యల్లన యతనితో ని ట్లనియె. 365
క. ‘జనియించినంతనుండియు | జనపతులం గ్రూరవృత్తిఁ జంపుచు నుండం
జనియెం గాలము విసివితి | ననఘా! యే నింకఁ జాల నాసురవిధికిన్‌.
366
ఆ. మీరు నా హితంబుఁ గోరుదురేని శి | ఖండి మున్ను గాఁగఁ గడఁగి యంత
వట్టు వారు నొక్క పెట్టకాఁ బైఁబడి | యేయుఁ డింకఁ దడవు సేయ వలదు.’
367
వ. అని పలికి సమరప్రకారంబునం దేరు గ్రేళ్ళుదోలి పాంచాలబలంబులపయి నడరె నప్పు డయ్యజాతశత్రుండు సమీపవర్తి యగు ధృష్టద్యుమ్ను నాలోకించి. 368
క. ‘దేవవ్రతు పలుకులు విం | టే? వేగమ పనుపు మొక్కటిగఁ దఱుమఁగ యో
ధావళి నెల్లను భీముఁడు | నీవును నరుతోడఁ గూడి నిగుడుఁడు పెలుచన్‌.’
369
వ. అనవుడు నతండు. 370
సీ. మాత్స్య కైకేయాది మనుజేంద్రులకుఁ జేయఁ | గలయట్టి యోధవీరులకుఁ జేయి
సూపి మరున్నదీసూనుపైఁ గవియింపఁ | బవనజపార్థుల ప్రాపుకలిమి
వెఱ పేది యందఱుఁ దఱుమఁ గౌరవపతి | తమ్ములు దొరలును, దానుఁ దాతఁ
గడచి తాఁకినఁ బోరు ఘన మయ్యె నప్పుడు | సౌభద్రుఁ డమ్మహీశ్వరుని నొంచె;
 
తే. ద్రోణతనయుండు శైనేయు బాణమయ శ | రీరుఁ గావించెఁ జేదీశ పౌరవు లస
మాన విక్రము లై యొప్ప మారుతాత్మ | జుండు రారాజు నేనిక పిండుఁ జదిపె.
371
వ. మఱియు నందు నిందును మందాకినీనందనుపయిం ద్రోవను నతనిం గావను దలంచి గడంగిన సైనికు లనేకులు నానాప్రకారంబుల వివిధాయుధంబులం బెనంగుచుండ. 372
క. మొనసి మృగేంద్రుఁ మృగేంద్రుఁడు | చెనయంజను పగిది నరుఁడు శీఘ్రగతిన్‌ శాం
తనవుపయిఁ గవియ దుశ్శా | సనుఁ డడ్డము సొచ్చె దేవసంఘము వొగడన్‌.
373
ఆ. ఆతని కప్పు డెదుర నమ్మొన నెవ్వరుఁ | జాలరైరి సవ్యసాచి యొకఁడ
నిశితవిశిఖపంక్తి నిగిడించి నొప్పించి | యొత్తి భీష్మువెనుక కొదుఁగఁ జేసె.
374
వ. తదవసరంబున సరభసంబున. 375
క. భగదత్తుని నా కవ్వడి | వెగ డొందఁగఁ జేసి యతని వెల్లేనుఁగుఁ గెం
పుగఁ జేసిన నాతండును | నిగిడెం బాంచాలమేదినీపతిమీఁదన్‌.
376
వ. ఆఖండలనందనుండును శిఖండిం దఱిమి తెఱపి సూపి దేవవ్రతు నేయుమని పురికొలిపె నంత. 377
క. మనయోధప్రకరము శాం | తనవుం దలకడచి యత్యుదగ్రత నయ్య
ర్జునుఁ బొదివె నతం డలిగినఁ | బెనుగాలిం దూలు మొగిలుపిండునుబోలెన్‌.
378
వ. (తూలె) నట్లు దూలిన. 379
ఆ. అట్టియెడ శిఖండి యాపగాసుతుమీఁద | వాలుటమ్ము లేయ వాని నేయ
నొల్ల కతఁడు గెలని యోధవీరావళి | నేయుచుండె శౌర్య మెసకమెసఁగ.
380
క. నరుఁడు శిఖండిం దఱిమిన | శరము లతఁడు భీష్మునురుభుజామధ్యమునం
గురియఁగ నవ్వుచునుండెం | గరి యంత్రజలంబు దొరఁగఁగా నున్న క్రియన్‌.
381
వ. ఇట్లు దేవవ్రతుండు శిఖండి యేయుట సరకుసేయక యతం డగ్గ మైననేయక సాయకంబులు సవ్యసాచిపయి నిగిడింప మగిడి దుశ్శాసనుండు గడంగి కవ్వడి వెగడుపడునంతకయ్యంబు సేసి నొచ్చి పాసినం గౌరవపతి గనుంగొని యెలుంగు సూపి చేయివీచి పురికొల్పినం గళింగమాళవ బాహ్లిక విదేహ శూరసేన ప్రముఖ బలంబులు బలమర్దనుతనయు దెసకుం గవిసిన 382
తే. అతఁడు దివ్యాస్త్రజాలంబు నతిశయంబు | సూపి చతురంగబలముల రూపు మాపి
యుఱక తఱిమి శిఖండికిఁ దెఱపి సూప | వాఁడి తూపులు భీష్ముపై వాఁడు నినిచె.
383
వ. ఆ సమయంబునం గృపశల్యవివింశతివికర్ణులం గూర్చికొని పేర్చి దుశ్శాసనుండు శాంతనవున కడ్డపడినం బార్థుం డయ్యేవురను విరథులం జేసిన. 384
క. కురుపతియు ననుజవర్గముఁ | బరమక్రోధమునఁ దెంపు బలుపును మెఱయన్‌
సురనాథనందనునిపై | నురవడిఁ ద్రోచుటయు సేన లుగ్రత నడరెన్‌.
385
క. పాండవ బలములు దలపడి | భండన మొనరింప నగ్ర భాగంబున ను
ద్దండతఁ బోరెడు మనుమల | తండము గని మెచ్చి య ప్పితామహుఁడు వెసన్‌.
386
తే. అరిబలంబుపై నొక్క దివ్యాస్త్ర మేయఁ | దలఁచి యరిఁబోసి తిగిచి యుదగ్రవృత్తిఁ
గవిసి ముందట నున్నశిఖండిచూడ్కి | దొడరుటయుఁ దాల్మిమైఁ దెగ యుడిపె నధిప!
387
వ. అంత. 388
క. సోమక మాత్స్య ప్రముఖో | ద్దామబలము లేచి పెలుచఁ దఱుముటయును సం
గ్రామతలము సేనాంగ | స్తోమాంగమయంబు సేసె దుర్దాంతగతిన్‌.
389
క. సేనల నిమ్మెయి భీష్ముఁడు | దీనతఁ బొందింప నలిగి ధీరత్వము వీ
రానీకం బగ్గింప శతానీకుఁ | డెదిర్చె నతని నాసురభంగిన్‌.
390
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )