| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | దేవా! వైశంపాయనునకు జనమేజయుం డి ట్లనియె. | 2 |
| క. |
‘ముని జన వల్లభ! యివ్విధ | మున దేవవ్రతుఁడు శాంతిఁ బొందినక్రమ మె ల్లను ధృతరాష్ట్రమహీశుఁడు | విని యెయ్యది యాచరించె వినిపింపు తగన్.’ |
3 |
| వ. | అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె. | 4 |
| క. |
అనిమిష నదీ తనూజుఁడు | సనుటయు విని యవ్విభుండు సంజయుఁ బోవం బనిచెను దనయుని కడకు న | తని విజయము కాంక్ష దన హృదయమున మొలవన్. |
5 |
| క. |
పనిచి కృతపడిన గాంగే | యుని దెస యుమ్మలిక నాతఁ డుల్లము నానా ఘనతర చింతాభర మొం | దినఁ గుందుచు నుండఁ గొన్ని దివసంబులకున్. |
6 |
| క. |
వ్యాసప్రసాదమహిమం | జేసి యుభయ సైన్యగత విశేషజ్ఞుం డై యా సంజయుఁ డొకనాఁటి ని | శా సమయమునందుఁ గడు వెసం జనుదెంచెన్. |
7 |
| వ. | ఇట్లు శిబిరంబుననుండి సూతనందనుండు గరినగరంబునకు వచ్చి యంతఃపురంబున నున్న ధృతరాష్ట్రు నుచిత ప్రకారంబునం గనిన నమ్మనుజవల్లభుం డతనిం దన చేరువ నునిచికొని యాదరించి. | 8 |
| చ. |
అమరనదీతనూజు సమరావనిఁ గోల్పడి నాదు యోధవ ర్గము మఱి యెవ్వరిం గొని పరాక్రమ దుర్దమ పాండుపుత్ర సై న్యమునకు మార్కొనం దలఁచె? నక్కట! కౌరవు లేమి సేసి రా సమయమునన్ బలప్రచయ సంఘటనం బెటులయ్యె సంజయా! |
9 |
| క. |
అనిన విని సూతసుతుఁ డి | ట్లను నక్కురునాథుతోడ ‘నవహితమతివై విను మంతయుఁ జెప్పెదఁ గ్రమ | మున నీ యడిగిన తెఱంగు భూవర! తెలియన్.’ |
10 |
| వ. | దేవవ్రతుండు దేవభావంబునం బొందిన యప్పుడు కురుపాండవు లతని కడకు వచ్చుటయు నా సమయంబునఁ బుట్టిన విశేషంబులు నాఁడు నీ కెఱింగించితి; శరతల్పగతుం డైన శాంతనవుండు సెప్పిన హితవచనంబు లాదరింపక రోషసంరక్త నయను లగుచు నతని వీడ్కొని యట్లు సనిన కౌరవులు నాటి వేకువ నీ కడనుండి యేను బోయి శిబిరంబు సొచ్చు నవసరంబున. | 11 |
| మ. |
సమరోద్యోగము వీటికిం దెలుపు నిస్సాణాది తూర్యంబు లొ క్కమొగిన్ మ్రోయఁగ వారణాది చతురంగస్ఫార సన్నాహ సం గమనాటోపము మిక్కుటంబుగఁ గడంకన్ వీరనైపథ్య వి భ్రమలోలాకృతు లైరి మోముల వివర్ణత్వంబు సంధిల్లఁగాన్. |
12 |
| వ. | ఇట్లు సన్నద్ధులై వెడలి యసమెడలిన బలంబులం గూర్చుకొనుచుండి. | 13 |
| ఉ. |
అప్పుడు భీష్ములేమి హృదయంబుల నుమ్మలికంబు గూరఁగా నెప్పటి చందముల్ విడిచి యేడ్తెఱఁ దక్కిన చూడ్కు లొండొరు న్రెప్పల మాటునం బొలయ నీ సుతు పాలికి వచ్చు రాజులం దిప్పు డతండు రా వలవదే యని కర్ణుఁ దలంచి రందఱున్. |
14 |
| వ. | అట్టి యెడ. | 15 |
| చ. |
పతిరహితాత్మ యైన సతి భంగియు గోపక హీనమైన గో ప్రతతి విధంబు, సస్య విధుర స్థితి యైన ధరిత్రి చాడ్పు, ను ద్ధత హరి శూన్యమైన వసుధాధర కందర భూమి చందమున్ మతి మనసేనఁ దోఁచె బుధమాన్యుఁడు భీష్ముఁడు లేకయుండుటన్. |
16 |
| ఉ. |
అంగద నాథు మ్రింగిన వృకావలి దన్ వెస ముట్టికొన్న స ర్వాంగములుం జలింప వెగడందుచు దిక్కులు సూచుచున్న సా రంగియ పోలె నుండెఁ గురురాజ! భవత్సుతు సేన భీష్ము నా జిం గబళించి పాండవులు జృంభిత విక్రమలీలఁ బొల్చుటన్. |
17 |
| ఆ. |
‘కర్ణ! కర్ణ! వచ్చి కావు మనాథుల | మైతి’మను నెలుంగు లగ్గలముగ బలములోన నెల్లఁ గలయంగ వీతెంచె | నార్తి దెల్లముగ జనాధినాథ! |
18 |
| వ. | తదనంతరంబున. | 19 |
| క. |
‘పిలువుఁడు దడయక కర్ణుని; | బలవిక్రమశాలి యతఁడు; పది దివసములుం గలనికి రాఁడు నదీసుతు | పలుకులకుం గనలి సచివబంధుయుతముగన్.’ |
20 |
| వ. | అని కౌరవులును దక్కటి జనపతులును దగుజనంబులును నతని నాసపడి పలుకుచుండి; రాతని తెఱంగు దొల్లియు నీ వాకర్ణించి తది యెయ్యది యనిన. | 21 |
| చ. |
అనఘ! సరిత్సుతుండు దను నర్ధరథుండని పల్కినన్ మనం బునఁ గడునొచ్చి ‘నీ వనికిఁ బోయిన నద్దెస రాను; నీ జయం బున వనవాసి నయ్యెద; రిపుల్ నిను నోర్చిన వారి నోర్చెదన్ ఘన భుజశక్తి నే’ననియెఁ గాదె! నృపుల్ విన నమ్మహాత్ముతోన్. |
22 |
| వ. | కావున నతం డంతకు మున్నుకయ్యంబునకుం దొలంగియుండె; నాఁ డట్లు మా మనంబులెల్ల నా సూతనందను దెసకుం బాఱె’ననిన విని యాంబికేయుండు సంజయున కిట్లనియె. | 23 |
| క. |
‘తను నిమ్మెయిఁ దలచిన య | మ్మను జేంద్రులఁ గౌరవులను మన మూఁకల న య్యనిఁ గర్ణుఁడు గాచెనె? తన | మనోరథము లెల్ల ఫలసమగ్రతఁ బొందన్.’ |
24 |
| వ. | అనవుడు నమ్మనుజపతికి నతం డిట్లనియె. | 25 |
| క. |
వననిధి నడు నీటఁ గలము | మునిఁగిన బెగడందు చిత్తములు గలిగిన త జ్జనుల క్రియ నున్న సేనలు | గనుఁగొన దీవిగతిఁ దోఁచెఁ గర్ణుం డంతన్. |
26 |
| వ. | ఇట్లు పురంబు వెడలి యతండు కురుపతి కడ కేతెంచి ప్రీతుం డగు నతని చేత నభినందితుండై రాజలోకంబు నాలోకించి. | 27 |
| చ. |
‘దమమును సత్యముం దపము దానము శీలము నస్త్రవీర్య శౌ ర్యములును భీష్మునంద కల; వట్టి మహాత్ముఁడు పోర నీల్గె; నిం క మనకు నేటి బాహు బల గర్వము లెక్కడి సేన లక్కటా! సమసెనె కౌరవేశ్వరుని సంపద?’ యంచు విషణ్ణమూర్తియై. |
28 |
| క. |
కన్నీ రొలుకఁగ వగచిన | నన్నరపతులెల్ల నేడ్చి రార్తరవంబుల్ మిన్నంద నశ్రుజలములు | విన్నని వదనంబులందు వెల్లిగొనంగన్. |
29 |
| వ. | అప్పుడు దన్నుం దాన యుపశమించుకొని యందఱడెందంబుల యుమ్మలికంబులు వాయ రాధేయుం డిట్లనియె. | 30 |
| క. |
‘మీ రెల్లఁ జూచుచుండఁగఁ | గౌరవ నికురంబమునకుఁ గన్నాకై యొ ప్పారెడు భీష్ముఁడు వడియెను | మేరు వొఱగినట్టు లసము మిగుల నరునకున్. |
31 |
| వ. | నా తెఱంగు వినుండు. | 32 |
| క. |
కలఁగిన సేనలఁ గాచెద; | నిలిపెద నర్జునుని కడఁక నెఱపెద; బాహా బల మా భీష్ముం డె ట్ల | గ్గలిక మెఱసె నట్ల మీకుఁ గన్నులు దనియన్. |
33 |
| ఉ. |
ధర్మజ భీమ పార్థులును దమ్ములు నుద్భట సంగరక్రియా కర్మఠు లచ్యుతానుజుని గర్వము దుర్విషహంబు వారి మ త్కార్ముక ముక్త చండశర ఖండిత దేహులఁ జేసి యిత్తు నేఁ బేర్మిగఁ గౌరవేంద్రున కభీష్టత రాజ్యరమా విలాసమున్. |
34 |
| క. |
కాదేని గాండివజ్యా | నాదము సురదుందుభి ప్రణాదంబును నిః ఖేదుఁడనై వించు నధిక | మోదంబున నిత్య సౌఖ్యముం గైకొందున్. |
35 |
| క. |
కౌరవులం గాచుచు రణ | శూరులఁ బాండవుల నోర్చుచుం గీర్తి కర స్ఫారవిహారత భీష్మునిఁ | జేరంజను కంటె నొప్పు సెప్పం గలదే?’ |
36 |
| వ. | అని పలికి తన సారథిం గనుంగొని. | 37 |
| సీ. |
‘మణిగణోజ్జ్వలమైన మన యరదంబున | జవనాశ్వములఁ బూన్పు; చాప బాణ ఖడ్గాది సాధనోత్కర మొడఁగూర్పుము | రత్నధ్వజం బెత్తు రశ్ములడర శంఖ మృదంగ నిస్సాణాది తూర్యముల్ | సంఘటింపుము రభసమున’ ననుడు వాఁ డట్ల చేయ దుర్వార గర్వోద్ధతి | నగ్నిప్రభంబగు నారథంబు |
|
| తే. |
పటురయంబున నెక్కి భూపతికి మ్రొక్కి | యాతఁ డెల్ల కౌరవులును నఖిల నృపులుఁ దన్నుఁ గొనియాడఁ గర్ణుఁ డుత్సాహ లీల | నిజ బలాభీల సుందర ధ్వజము లొప్ప. |
38 |
| వ. | నడచి, నదీనందనుం డున్న యెడకుఁ జేర ంబోయి, శోషించిన సముద్రంబు చందంబున, విమానంబు విఱిగిపడిన దివ్యుని తెఱంగున, భూతల పతితుండైన పతంగు భంగిని, భగ్నపక్షంబైన మైనాకంబు మాడ్కిం బొలుచు నతని కడకుం బాదచారియై యరిగి, ఫల్గును నారాచనిచయంబునం బొదువంబడి యమునానదీ హ్రదస్థితంబును మదనిమీలితాక్షంబునునై శోభిల్లుశుండాలంబు ననుకరించుచు వీరశయన మహనీయుండైనయమ్మహానుభావుని యడుగులపైఁ గన్నీరు దొరఁగం బ్రణమిల్లి, కేలు మొగిచి, వినయ వినమిత శరీరుండై. | 39 |
| క. |
‘వచ్చితి రాధేయుఁడఁ; గను | విచ్చి ననుం జూడు భరత వీరాగ్రణి! నీ సచ్చరితము ఫలమే యి | ట్లిచ్చట నీ యునికి? ధాత నేమన నేర్తున్? |
40 |
| ఆ. |
పావనంబు లయిన పలుకులు నా చెవు | లార నెమ్మి నన్ను నాదరింపు మయ్య! ధర్మనిత్య! యంచితసత్య! శం | తను కుమార! గాఢ ధైర్యసార! |
41 |
| ఉ. |
పేర్చిన మూఁకఁగూడ నడపింపఁగఁ గోల్తలసేయఁ దీవ్ర బా ణార్చుల మార్బలంబుల రయంబున నీఱుగఁ గాల్ప నాజి నీ నేర్చిన భంగి నొండొకఁడు నేర్చునె? పాండవ బాహు సంపదల్ పేర్చు నెలర్చు నింకఁ గురుబృందము లెల్లనుఁ దల్లడిల్లఁగన్. |
42 |
| క. |
శర జిహ్వా భీకరుఁ డగు | నరుఁ డను శిఖి నిగుడఁ జేసి నారాయణ దు ర్భర పవనుఁ డింక బంధుర | కురుసేనా కాననంబు క్రొ వ్వడఁగించున్. |
43 |
| మ. |
భరితాశాంతర పాంచజన్యరవ దృప్యద్దేవదత్త ధ్వని స్ఫురణన్ వీనులు వ్రయ్యఁ గేతన కపిస్ఫూర్జత్ప్రభం జూడ్కు లా తురతం బొందఁగఁ జండగాండివ సముద్భూతాస్త్రజాలంబు లె వ్వరు సైరింతురు? నీవు దక్క భుజగర్వస్ఫూర్తి నిర్వాహకా! |
44 |
| ఆ. |
మెయి మెయిం బెనంగి మెచ్చించి ముక్కంటి | చే వరంబు గొని విశిష్ట దివ్య కర్మదీప్తుఁ డైన గాండీవి నొరుఁ డాజిఁ | జెనయఁ జాలకునికి సెప్ప నేల?’ |
45 |
| క. |
అని పెక్కు మాట లాడిన | విని యాదరభరితనేత్ర విస్తారుం డై యనిమిష నదీతనూజుఁడు | గనుఁగొనుటయు మఱియు మ్రొక్కి కర్ణుఁడు వలికెన్. |
46 |
| ఉ. |
‘ఆ నరు నే నొకండన విషానల దుస్సహ దృష్టి భీషణం బైన మహా భుజంగమము నద్భుత మంత్ర నిరస్త దర్పముం గా నొనరించునట్లు భుజ గర్వ మడంచెద నస్త్ర శస్త్ర వి ద్యా నిపుణత్వ సంపద నుదాత్త గుణోత్తర! నీవు పంపఁగన్.’ |
47 |
| వ. | అనిన గాంగేయుండు రాధేయున కిట్లనియె. | 48 |
| మ. |
‘తగఁ బర్జన్యుని సొంపునన్ బ్రతుకు భూతవ్రాతముల్ వార్ధి సొ చ్చి గరిష్ఠస్థితి నుండు నేఱులును, సంక్షీణంబులై యుర్వి ని ల్చి గుణాధిక్యముఁ బొందు బీజములుఁ బోలెం గౌరవుల్ విశ్రుతం బగు నీప్రోపును బ్రాపుఁ గాపుఁ గని సౌఖ్యం బొందు టొప్పుం గడున్. |
49 |
| చ. |
అరయఁగ బంధుకోటులకు నక్కురునాథుని యట్లకావె, నీ వరిబలభేది! జన్మమున నయ్యెడు చుట్టఱికంబుకంటె సు స్థిరతరమైన సంగడము చే నగు బాంధవ మెక్కుడండ్రు రా నరపతి రాజ్యభారము మనంబున నీయదిగాఁ దలంపుమీ! |
50 |
| వ. | అంబష్ఠ విదేహ పౌండ్రాది దేశాధీశుల గెల్చి, దుర్యోధనాధీన వర్తులంగా నిర్వర్తించిన నీకు నిట్లు సెప్పవలయునే? యండజంబులు పండినవృక్షంబు నుపజీవించు చందంబున నిన్నుం జెంది బంధువులు సుహృజ్జనులు సుఖులై యుండువారుగాక! నాకు నీవును సుయోధనునట్ల కావున మేలాడెదఁ; గౌరవుల నడపికొని, యమ్మహీ విభునకు విజయంబు గావింపుము పొ’మ్మని సమ్మదంబునం బలికిన సూతనందనుండు ప్రీతుండై యద్దేవవ్రతుచరణంబులు శిరంబు సోఁక వినతుండై వీడ్కొని, యరదం బెక్కి యరుగుదెంచి, భవదీయ సైన్యంబు దైన్యంబు వాపి, యే పగ్గలించి కలయం గనుంగొని. | 51 |
| క. |
నరపతి యలరఁగ రథకరి | తురగ సుభట సముదయముల దోర్గర్వధురం ధరలీల మెఱసి యతి బం | ధురములుగా సంఘటించె దురమునకుఁ దగన్. |
52 |
| వ. | అట్టి యెడ. | 53 |
| క. |
అరుణాశ్వములు రుచిర రు | క్మరథంబుఁ బ్రదీప్తవేదికాధ్వజమును ను ద్ధుర గాత్ర కలిత సిత భా | సుర బంధుర కంకటంబు శోభిల్లంగన్. |
54 |
| క. |
మొగమునఁ గయ్యపు వేడుక | చిగురొత్త నుదాత్తమూర్తిఁ జెలువొందు గురుం దగు రాజులుఁ గౌరవులును | పొగడి రులివు మిగులఁ బ్రమద పూర్ణ హృదయులై. |
55 |
| తే. |
అపుడు నీ యగ్రనందనుఁ డల్లఁ దనదు | తేరు రాధేయు నరదంబు సేరఁ బోవ నిచ్చి మనమున సంతస మెసక మెసఁగ | నాదరంబున నిట్లను నతనితోడ. |
56 |
| క. |
నీ వలన సనాథంబై | యీ వీడెంతయును మెఱసె నిం కిట మనకుం గావింప వలయు కార్యము | నీ వెఱిఁగింపంగ వలయు నెయ్య మెలర్పన్. |
57 |
| క. |
అనిన నతం డిట్లను ‘బహు | జనరక్షకులైన నృపులు సద్బుద్ధులు గా వున నీవు సెప్పఁగా నే | వినియెద; నెయ్యది దలంపు వివరింపు తగన్.’ |
58 |
| ఉ. |
నావుడుఁ గర్ణుతోడ నరనాయకుఁ డిట్లను ‘సర్వయోధ సం భావితుఁ డైన శాంతనవు బాహుల మాటున నస్మదీయ సే నా విభవంబు సెల్లెఁ బదినాళ్లును; నీ మదికెక్క నాదు యో ధావలిలోన నింకఁ బృతనాధిపుఁగాఁ గొన నెవ్వఁ డర్హుఁడో? |
59 |