| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
సేనాపతిత్వమునకుం | బూని యొకఁడు నడపకున్నఁ బొడవడఁగదె? యా సేన యనిఁ గర్ణధార వి | హీనం బగు కలము జలధి నెడలిన భంగిన్.’ |
60 |
| వ. | కావున నొక్కరు నిరూపింపు మనవుడు గాంధారేయునకు రాధేయుం డిట్లనియె. | 61 |
| సీ. |
‘అధిప! నీయోధులయందు సేనాపతి | త్వమునకుఁ జాలని వారుఁ గలరె? యందఱు నయ విక్రమాది గుణంబుల | మాననీయుల యట్టు లైన నెల్ల వారి ముఖ్యులఁ జేయవచ్చునే? యొక్కరుఁ | గైకొన్న మత్సరగ్రస్తబుద్ధి నన్యులు విపరీతులై కలంగకయుండు | వాఁడు గావలయు; నెవ్వరును ద్రోణుఁ |
|
| తే. |
డనినఁ గాదన; రాతండ యర్హుఁ డాధి | పత్యమునకు; నాచార్యుండు బ్రాహ్మణుండు వివిధ రణ కోవిదుఁడు వయోవృద్ధుఁ డధిక | బలుఁడు శూరుండు గట్టుము పట్ట మతని.’ |
62 |
| వ. | అనుటయుం గురురాజు దగు రాజులం గూర్చుకొని గురుం డున్న యెడకుం జని సవినయంబుగా నతని కిట్లనియె. | 63 |
| ఉ. |
‘ప్రాయము కల్మి నొక్కటన భవ్యధృతిన్ మహనీయశీలతన్ సాయక సంపదం బటు భుజావిభవంబునఁ గార్యతంత్ర శి క్షాయుత బుద్ధి వృద్ధుఁడవు గావె? ధరాసురవర్య! మున్ను గాం గేయుఁడు మాకు నెల్ల నెఱిఁగింపఁడె నీదు మహానుభావమున్.’ |
64 |
| వ. | అని వెండియు. | 65 |
| క. |
‘కనువెలుఁగు నీవు గానీ | వెనుక భవన్మతమ యూఁది వీరలు నేనుం జనుదెంచెద మూఱట నెల | కొన వృషభము పజ్జ నడచు గోవుల పగిదిన్.’ |
66 |
| ఆ. |
అనుచు నచట నున్న యవనీపతులఁ జూపి | మఱియు నిట్టులనియె మనుజ విభుఁడు ‘దేవసేన నడపి దితిజుల గెలిచిన | షణ్ముఖుండు నీవు సరియ కాదె! |
67 |
| వ. | కావున. | 68 |
| తే. |
సర్వసేనాధిపత్యంబు నిర్వహింప | వలయు’ ననవుడు నమ్మహీశ్వరులు నట్ల చెప్పి, ‘గెలువుము నీ’వని చెలఁగి యతనిఁ | బ్రస్తుతించి ప్రార్థించిరి భరతముఖ్య! |
69 |
| వ. | మఱియు నమ్మహీశ్వరుండు. | 70 |
| క. |
‘సేనా సముదయ వర్తకుఁ | గా నిను నేఁ బడసినపుడ కౌంతేయులు నా చే నడఁగ రెట్లు? భీష్మవి | హీనుల మగు మమ్ముఁ గావు మెల్ల విధములన్.’ |
71 |
| వ. | అని వేఁడికొనిన నయ్యందఱం గలయం గనుంగొని యాచార్యుం డి ట్లనియె. | 72 |
| ఉ. |
‘వేదములుం దదంగములు వింతలుగా నొక కొన్ని నేర్తు ధై ర్యాది గుణంబు లెందుఁ గల వైనను నింతటి వానిఁ గాఁగ న త్యాదర వృత్తి మీరు విజయాశ ననుం గొనియాటఁ జేసి యౌఁ గాదన కియ్యకొంటిఁ దగఁ గౌరవనాథుని కోర్కి దీర్పఁగన్. |
73 |
| శా. |
భవ్యంబైన బలాధిపత్యమునకుం బట్టంబు గట్టుండు న; న్నవ్యాకీర్ణ గజాదియై మెఱయు సైన్య శ్రేణిఁ బాలించి, కౌ రవ్యోత్సాహముఁ బెంచి, మార్కొనిన, వీరవ్రాతముం ద్రుంచి, నా దివ్యాస్త్రంబులఁ బంచి పాండవుల దీప్తిన్ మాయఁజేయించెదన్. |
74 |
| వ. | అని పలికినం బ్రీతచేతస్కుండై నీ తనూభవుండు గనకకలశంబులం బావన జలంబులు దెప్పించి, మంగళోపకరణ శోభితంబు గావించి, పుణ్యాహనాదంబులుం బరమాశీర్వాదంబులున్ మాగధ గీతంబులున్, వందిజనస్తుతి వ్రాతంబులుం జెలంగఁ బ్రభూత భూపతులుం దానును ద్రోణాచార్యునకు సేనాధిపత్యాభిషేక పట్టబంధం బొనర్చి పేర్చినం గని, రథికవరు లార్చి, నిజశంఖంబులు పూరించిన, నఖిలసైన్యంబులందును భేరీ మృదంగ పణవాది తూర్య నినాదంబులు నిగిడి నింగి ముట్టె; నిట్లు సకల చమూపతిత్వపదభాసితుండై భారద్వాజుండు. | 75 |
| సీ. |
కౌరవసేనా ముఖంబునఁ దిలకమై | యొప్పిరాధేయాది యోధవరులఁ గొని పాండురాజ నందనుల సైన్యములతోఁ | దొడరి ధైర్యంబు నద్భుత మహాస్త్ర వీర్యంబు ననివార్య శౌర్యంబు దోర్బలౌ | దార్యంబు మెఱయ నీతనయు వలని కూరిమి వెలయ నక్షోహిణిపైఁ గొంత | బలమును దొర లనేకులను గూల్చి |
|
| తే. |
చామర చ్ఛత్ర కేతు భూషణ తురంగ | దంతి రథహేతి వర్మయోధ వ్రజంబు తునియ లిల నించి కతిపయదినము లరులు | సురలు వినుతింప విహరించె ధరణినాథ! |
76 |
| క. |
అడవుల దవశిఖి దరికొను | వడువున ని ట్లరిబలం బవారణఁ బొడిగా నడరి యతఁడాఱె ద్రుపదుని | కొడు కార్వ నుభయ జనములకున్ వగ మిగులన్. |
77 |
| క. |
దుష్ట మనస్కుం డగు నా | ధృష్టద్యుమ్నుండు దక్క దేవా! సుజనో త్కృష్టుఁడగు గురుని తెగుటకు | నిష్టాపముఁ బొందె భూతనికరము లెల్లన్. |
78 |
| వ. | అనిన విని యాంబికేయుండు హృదయంబు జల్లనఁ జెదర, వదనంబు వెల్లనై మొగుడ నివ్వెఱఁగంది, కొండొక ప్రొద్దు నిశ్చేష్టితుండై యుండి, గద్గద వికల కంఠుం డగుచు సంజయునితో నిట్లనియె. | 79 |