| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము |
| చ. |
అన విని మేను వెంచి రయమారఁగ సూతుఁడు దేరు వోవని చ్చినఁగని వారి సైన్యములు చెచ్చెర ధర్మజు మించి త్రోవఁ, బే ర్చిన భుజసంపదం గడఁగి, సింధుర లీలఁ దెరల్చి, తాఁకె న మ్మనుజ విభున్ గురుండు, పటుమార్గణ సంపిహితాంబరంబుగన్. |
200 |
| క. |
తాఁకినఁ బొగడం దగియెడు | వీఁకం బతి ద్రోణు బాణవృతుఁ జేయ నతం డాఁక గొనక యతని ధనువు | వ్రేఁకని భల్లమునఁ ద్రుంచి వెస డగ్గఱియెన్. |
201 |
| వ. | ఇ ట్లుద్ధతుండై యగ్గురుండు పొంగిన జలధియుం బోలెం గవిసిన ధర్మనందను చక్ర రక్షకుండగు సుకుమారుండు చెలియలికట్ట తెఱంగున నిలువరించి, నిశితశరం బతని యురంబున నాటించిన, నప్పాంచాలవరుం బ్రశంసించు నెలుంగులు సెలంగఁ బాండవ బలంబులు పేర్చి యార్చిన. | 202 |
| క. |
పెనుగాలిఁ బెఱుగు కార్చి | చ్చును బోలెం బొదలి గురుఁడు సుకుమారునిఁ గాం చన పుంఖ శరజ్వాలా | వినిపాతితుఁ జేసి తఱిమి విభునిం గదిసెన్. |
203 |
| వ. | అప్పుడు పాండవ యోధు లొండొరుల మీఱి యుధిష్ఠిరు ముందరికి వచ్చి యాచార్యుం బొదివిన నతండు నలిరేఁగి. | 204 |
| సీ. |
నకులుని నైదుసాయకముల స్రుక్కించి, | సహదేవు నేడింట సాధుఁ జేసి, నవవిశిఖముల మాత్స్యవరేణ్యు నడఁగించి, | యేనింట సాత్యకియేపు మాపి ద్రౌపదేయుల శరత్రయములఁ గలఁచి, విం | శతి నుత్తమౌజుని చలము మాన్చి, పండ్రెండు పండ్రెండు పటు మార్గణంబులఁ | బాండవాగ్రజుని శిఖండి నొంచి |
|
| తే. |
మఱియు మార్కొన్న రథికుల మదము సెఱిచి | మెఱుఁగుఁ దూపు లాధర్మజుమీఁద నిగుడ నడర నఱిమి యుగంధరుఁ డడ్డపడిన | నవ్వి యవ్విభుఁ దెగటార్చె నారసమున. |
205 |
| వ. | అట్టియెడఁ గేకయపతులును, బాంచాల నాథుండును, దదీయ జ్ఞాతులగు సింహసేన వ్యాఘ్రదత్తులు లోనైన యోధు లనేకు లాచార్యుం బొదివి, శౌర్యబాహువీర్యంబులు నెఱపి; రందు సింహసేనుండును; వ్యాఘ్రదత్తుండును నెట్టన నానాస్త్రంబుల నొప్పించిన నా ధనుర్ధర గురుండు. | 206 |
| తే. |
కన్నుఁగవఁ గెంపు గదురంగఁ గౌరవులకుఁ | జిత్త మలరంగ నా వ్యాఘ్రదత్త సింహ సేన మస్తకములు రెండు శితశరములఁ | గుండలంబులతో నేలఁ గూల నేసి. |
207 |
| క. |
తక్కటి రథికుల నెల్లను | జిక్కువడం జేసి పురుషసింహుండు మదం బెక్కి యుధిష్ఠిరుఁ బొదివెడు | నెక్కుడు తమకమునఁ గదిసె నేడ్తెఱ మెఱయన్. |
208 |
| వ. | అయ్యవసరంబున నా సైన్యంబుల జనంబులు. | 209 |
| క. |
‘అదె పట్టువడియె ధర్మజుఁ | దదయుం డగు ద్రోణుచేత నక్కట! నేఁ డు న్మదుఁడై సుయోధనుఁడు దం | డ్రి దలిర్పఁగ నేఁగుఁ గరిపురికిఁ గొని యెలమిన్.’ |
210 |
| వ. | అనుచు సంభ్రమాకులచిత్తు లగుచు నున్నంత. | 211 |
| మ. |
ధరణీభాగము గ్రక్కునం గదల రథ్యవ్రాత చంచద్గతి స్ఫురణం బొప్పఁగ బాణజాలము నభంబుం గప్ప నత్యంత ని ష్ఠుర సంతర్జన ఘోషభీషణ మహాటోపంబు దిగ్దంతు లా తురతం బొందఁగఁ జేరవచ్చి వడిఁ బార్థుం డగ్గురుం దాఁకినన్. |
212 |
| వ. | కౌరవయోధవరు లొక్కపెట్ట భారద్వాజునకు బాసటయై ససైన్యంబుగా సవ్యసాచిం బొదివిన, నవ్వీరుండు ఘోరాకారుండయి గాండీవచండ నిస్వనంబు లొండొండ నిగుడ, నిశిత సాయకపరంపరలు గురిసి కపాలోపలంబును, మేదో మాంస పంకంబును, నస్థిచూర్ణసికతంబును నగు శోణిత నదీ ప్రకరంబును బఱపె; నంత గభస్తిమంతుం డస్తశైలాంతరితుండైనఁ బార్థు బాణాంధకారంబునకుఁ దోడు సంధ్యాసంతమసంబు గవిసినం గురుసైనికులకుఁ దమవార లె రివారలని నిరూపింప నశక్యం బగుటయు ద్రోణ దుర్యోధనులు సమరంబు సాలించి వాహినులఁ దివియించినం, దిరంబై ధనంజయుండును, జయతూర్యస్వనంబులును, బాంచాల కేకయాది బంధుమిత్త్ర ప్రశంసా వచనంబులును, వీనులం బొలయఁ దనబలంబుల మరల్చి, ధర్మనందనుం గొలిచి చనియె; నిత్తెఱంగున రెండు సేనలుఁ దమ తమ విడిదలల కరిగి యథోచిత వ్యాపారంబుల నుండి నాఁటిరాత్రి సనిన మఱునాఁడు. | 213 |
| క. |
రేపకడ యుభయ బలములు | నేపును నెలమియును నెసకమెసఁగ వెడలి యా టోపంబున రణ సన్నా | హోపక్రమలీల మెఱయ నుజ్జ్వల భంగిన్. |
214 |
| వ. | ఉన్న సమయంబున లజ్జా విషాదంబులు మొగంబునం దోఁప ద్రోణుండు దుర్యోధనున కిట్లనియె. | 215 |
| చ. |
‘నరవర! మున్న చెప్పితి రణంబున నర్జునుఁ డొద్దనున్న నె వ్వరికిని ధర్మసూనుఁ బొదువంగ నశక్య; మొకండు పార్థు ను ద్ధురుఁ డయి నేల వాపికొని దోర్బల మొప్పఁగఁ బోవఁ జాలినన్ వెరవునఁ బట్టెదం బరులు వేవురు మార్కొనినం గలంచెదన్. |
216 |