పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము
ద్రోణాచార్యుల రెండవ నాఁటి యుద్ధము (సం. 7-16-3)
ఆ. నరుఁడు లేని చోట ననుఁ గని వెన్నిచ్చి | పాఱకున్నఁ బట్టువడియెఁ గాఁగఁ
దలఁపు ధర్మపుత్త్రు ధరణీశ! పాఱుట | గలిగెనేని నంత కంటె మేలు.’
217
వ. అనిన విని సుశర్మ దుర్యోధనున కిట్లనియె. 218
క. ‘ఆ నరుఁ డెప్పుడు మము నవ | మానించుచు నునికిఁ జేసి మనుజేశ్వర! కో
పానలము సంతతము మా | మానసములఁ బొదువ నతని మార్కొను కడఁకన్‌.
219
వ. తమకించుచుందుము. నీకు బాస యిచ్చి పెద్ద కాలంబయ్యె; నేఁడు రణభూమియందు నర్జునుం డొండెఁ ద్రిగర్తు లొండెం గావలయు; నే మతనిఁ బెద్ద కయ్యంబులోనం బాపికొని పోవుట నీ చిత్తంబునకు వచ్చున కాదె.’ యనవుడు నతని తమ్ములు సత్యవ్రతుండును సత్యకర్ముండును సత్యవర్ముండును నిబ్భంగిన పలికిరి; వారల పక్షంబైన రథిక వర్గంబు నత్తెఱంగున నియ్యకొని యుల్లసిల్లె; నిమ్మెయిం ద్రిగర్తులు పదివేవురు దొరలు గడంగినం గని తుందికేరళ మాళవ శిలీంధ్ర మగధ మచ్ఛిల్లికాది దేశాధీశులును, బంధు మిత్త్రసహితంబుగా నివ్విధంబున వారి తోడి వారై పంతంబులు పలికి యుబ్బునం బొంగి; రిట్లప్పరుసున నగణ్య రథికోత్తము లుత్సహించి కృతస్నానులై యగ్నులం బూజించి తత్సన్నిధి సర్వయోధులు నాకర్ణింప నందఱు నిట్లనిరి. 220
సీ. ‘అర్జునుఁ జంపుదు మతని కోడితిమేని | గోవధంబును వనితా వధంబు
బ్రహ్మవధంబును బరదార గమనంబు | బ్రహ్మస్వ హరణంబుఁ బరధనాప
హరణంబు గురుజన త్యాగంబు శరణాగ | తారక్షణము ననృతాభిరతియు
మద్యపానము నర్థిమానవవైముఖ్య | మును గృహదాహంబు జనుల నెట్టి
 
ఆ. గతులఁ బుచ్చు నట్టి గతులు వాటిలు నక్కి | రీటి కోలుతలకు నోట లేక
దురము సేసి తగిన తుది గన్న పుణ్యాత్మ | కలితగతుల మేలు గలుగు మాకు.’
221
వ. అని సంశాపంబులు పలికి సంశప్తకు లనేక రథికముఖ్యులు బహుళ చతురంగ బలపరివృతులై కురురాజు సంతసిల్ల నుల్లాసంబునం జనిరి; గురుండును గరుడవ్యూహంబు సమకట్టి, దానికిఁ జంచువై తాను నిలిచె; దుర్యోధనుండును దమ్ములుం దలయును, గృప కృతవర్మలు గన్నులును, సింహళాభీర శూరసేన కేకయ ప్రముఖులు మెడయును, బాహ్లిక భూరిశ్రవస్సోమదత్త శల శల్యులు వలపలి ఱెక్కయు, నశ్వత్థామ సుదక్షిణ విందానువిందులు దాపలి ఱెక్కయు, శకుని పౌండ్ర కళింగాంబష్ఠమాగధులు వెన్నును, నానాజనపదసేనా సమన్వితుండై సూతపుత్రుండు పుచ్ఛంబును, సైంధవాది వివిధ దేశాధీశులు నెడనెడం గలయన్‌ బెరసి యొడలి పొలుపును బలుపునునై నిలువ నియోగించిన నమ్మోహరంబు మహాపవన సముద్ధూత సాగరాకారంబై యుత్సాహ నృత్యంబు సేయు చందంబునం జూడనొప్పె నందు మధ్యమ ప్రదేశంబున భగదత్తుండు గజారూఢుండై యుదయాచలంబుపైఁ బొలుచు భానుండునుంబోలెఁ దేజరిల్లుచునుండె నంత నక్కడం ద్రిగర్తాదులు పాండవసేన దక్షిణ దిక్కునకుం జని సమరంబునకు సవ్యసాచిం దొలంగం బిలుచుటయు నన్నర శార్దూలుం డన్నతో నిట్లనియె. 222
చ. ‘తఱిమి సుశర్మ దమ్ములును దానును నాజికి నన్నుఁ బిల్వ నే
నెఱుఁగని యట్టు లుండు టిది యే పురుషార్థము? వారి నెల్ల నే
డ్తెఱ నుఱుమాడఁ బంపుము; కడిందిగఁ జూడకు; నీకు నేమియుం
గఱగొఱ గాదు; పోమి గడుఁగష్టము నాకు నుదాత్తమానసా!’
223
వ. అనుటయు నయ్యుధిష్ఠిరుండు. 224
తే. ‘గురుని బల శౌర్యములు నెఱుంగుదుము; మనకు | నతని పూనికి బొంకు సేయంగవలయు;
దీని కెయ్యది కార్యంబు దాని నీవు | బుద్ధి నుచితంబుగాఁ దలపోయు’మనుడు.
225
వ. ధనంజయుం డతని కిట్లనియె. 226
చ. ‘పిలిచినఁ బోవకుండు టిది బీదతనం బగుఁ గాన నేర్పుగాఁ
దలఁపదు లోక; మే నరివధం బొనరింపఁగ నెట్లుఁ బోయెదం
జలము బలంబు ధైర్యమును శౌర్యమునుం గలవాఁడు వీఁడు నేఁ
డలఘుఁడు గుంభసంభవుని నాఁగు భవత్పరిరక్షణార్థి యై.’
227
వ. అని పాంచాలవరుం డగు సత్యజిత్తుం జూపి. 228
క. ఇతఁ డున్న యంతసేపును | మతి నేమియు వెఱవవలదు మార్తుర చేతన్‌;
హతుఁ డయ్యెనేని నిలుచుట | చతురతగా దనికిఁ దొలఁగి చనవలయు నృపా!’
229
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )