| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
అరదంబులు మొదలగు ను | ద్ధుర వాహనకోటి డిగ్గి దుర్దాంత గతిం దురగంబులపై హరిపై | నరుపై నూడుకొనఁ బడిరి నలి నార్పులతోన్. |
260 |
| వ. | ఇత్తెఱంగునం జేయి గాలార్పనుం జూడ్కి వఱపను రాకుండునట్లుగా గుంపులు గొనం బైపైఁ దొరంగినం గృష్ణు లగపడిరి తెగిరి మడిసిరి మ్రగ్గిరను మాటలతోఁ దతై న్స్యంబుల సింహనాదంబులుఁ దూర్యనినదంబులుఁ జెలంగె; నప్పుడు సెమర్చి చేడ్పడి వసుదేవ నందనుండు. | 261 |
| ఆ. |
‘ఎచట నున్నవాఁడ? వేమైతి? ప్రాణానఁ | గలవె? యేను నిన్నుఁ గానకునికిఁ దలఁకుచున్నవాఁడ ధైర్యధౌరేయ! నీ | యెలుఁగు సూపవే సురేంద్ర తనయ!’ |
262 |
| వ. | అనిన విని యతండు ముకుందుని మానుషభావం బూహించుచు నుత్సాహంబు వాటించి. | 263 |
| క. |
అనిలాస్త్రంబు ప్రయోగిం | చిన సంశప్తకులు దెసలఁ జెదరి చొరువు చా డ్పునఁ దూలఁగ బహువిధ శర | వినిహతి బడలువడఁ జేసె వెన్నుఁడు మెచ్చన్. |
264 |
| క. |
శిరము లురంబులు గరములు | చరణంబులు రూపు మాయ శకలములై సం గరధరఁ దొరఁగిరి యోధులు | గరితురగ రథాస్త్ర శస్త్ర ఖండంబులతోన్. |
265 |
| వ. | అట్లు గసిమసంగి కిరీటి కల్పాంతపురాంతకుండునుంబోలె బారిసమరుచుండ వెండియు వెఱచఱవక తఱిమి పెనంగు నబ్బలంబు లతని బాణపరంపరల బలితంపుఁ బరపునం జేసి. | 266 |
| ఆ. |
కూలురూపుఁ, దన్నికొనియెడు రూపును, | నొఱలు రూపు, నేల కొఱగు రూపు, బొరలు రూపు నయ్యె నరవాజి గజములు | ప్రథనభూమి ఘోరభంగి గాఁగ. |
267 |
| వ. | ఇవ్విధంబున నసమ సమర తత్పరులై తనవలన నేమఱి యా మఱందియు బావయు నట్లుండ, నిక్కడ ధర్మజుండు పురికొల్ప నుదగ్ర సైన్యంబులు మన మొనలు దలంకం దఱిమె; నాచార్యుండును ధర్మసూను సైన్యంబులు దలంకఁ దఱిమె; నప్పుడు నీ కొడుకు దుర్ముఖుం డతనికిఁ బ్రియంబుగా ధృష్టద్యుమ్నుం దలపడినం గురుపాంచాల కుమార వర్గంబు లగ్గలికం గవిసి పోరె; నట్టియెడ. | 268 |
| చ. |
గురుఁ డను తీవ్రమారుతము కోల్తల కోర్వక ధర్మపుత్ర బం ధుర బల వారిదోత్కరము దూలుడు నాతఁ డదల్చి వీర సుం దరముగఁ జేయి వీచిన నుదగ్ర గతిం బురికొన్నఁ గౌరవ స్ఫురణము నుద్భటం బగుడు సూర్యుని మ్రింగె ధరా పరాగముల్. |
269 |
| వ. | ఇబ్భంగి నుభయ సైనికులును గలయన్ బెరసిన మణిభూషణ కిరణ జాలంబుల కతంబున ధూళికృతంబు లగు తిమిరంబుల గెలిచి పోరుచుండ ధారాళ రక్తసిక్తం బై యారజఃపటలం బడంగుటయు. | 270 |
| క. |
ఇరు వాఁగును దార్కొని వి | స్ఫురణ మెఱయ నాయుధముల పొగ లేని శిఖల్ దరతరమ యెగయఁ బోరఁగ | ధరఁ జతురంగములు నద్భుతంబుగఁ గెడసెన్. |
271 |
| క. |
కరిఘటలు దురగముల దళ | మరదంబుల మొత్త మనక యడరి వడిం గా ల్వురు మ్రగ్గఁ జేయుచును మ్ర | గ్గిరి విస్మయ మొలయఁ జూచు ఖేచర తతికిన్. |
272 |
| ఉ. |
తేరుల యొప్పు మ్రోడుపడఁ దేఁకువ లేని పదాతి కోటి ను గ్గై రుధిరంబులో మునుఁగ నానిన యేనిక పిండు పక్షముల్ ఘోరముగాఁగఁ ద్రెవ్వి వెసఁ గూలు కులాద్రులఁ బోల నాశ్వికుల్ వీర వినోదముల్ సలుపు వేడుక సొంపునఁ గూడి యెక్కినన్. |
273 |
| చ. |
నిలిచిన రూపు డొల్లి ధరణింబడి యున్న శరీర మింత లిం తలు శకలంబులై నెఱయ దందడి మూఁక గలంగ నొంటి గుం పులు పఱివోవ రక్త జలపూరము రొంపులు ధూళిగా రథం బులు రభసంబునం బఱపి పోరిరి యోధులు గ్రోధ దీప్తులై. |
274 |
| క. |
కొమ్ములఁ గ్రుమ్మియుఁ బాదత | లమ్ములఁ జమరియును గరములం బఱిపఱి యై యి మ్మెడలఁగఁ దిగిచియు నర | దమ్ముల నేనుఁగులు వీటతాటము సేసెన్. |
275 |
| క. |
తురగమున నరుని వ్రేయుచుఁ | గరిదంతము వెఱికి యన్యకరి వైచుచు ను ద్ధుర రథము చదలఁ ద్రిప్పుచుఁ | గరులు వినోదంబు సేసెఁ గనుఁగొను ప్రజకున్. |
276 |
| క. | ఒక్కొక్క చోట. | 277 |
| చ. |
మెఱుఁగులు గర్జితంబులును మిక్కిలి సోనయుఁ గల్గు మేఘముల్ గిఱికొన నొప్పు నాకసము లీల రణక్షితి సూడఁ బొల్పగుం దఱచగు భూషణద్యుతి వితానము పర్వ గజవ్రజంబు పె ల్లొఱలుచు నెత్తురుల్ దొరఁగుచుండ నొగిం బడి యున్కి నత్తఱిన్. |
278 |
| ఆ. |
అశ్వసుభట తతుల యంగ ఖండంబులు | రుధిర కర్దమమున బ్రుంగియున్న పెల్లు చూడ రౌద్ర బీభత్స కరుణ భ | యానకైక హేతువయ్యె నధిప! |
279 |
| వ. | అట్టి సమయంబున నారోహకులు వడినం దెరలంబారు వారణ హయంబులును, వాహనంబులు నిహతంబులైన వెడ వెడ మెలంగు వివిధ యోధులును, రుధిర మాంస మస్తిష్క మయ మహా పంకంబునం గలయ మునింగియుం, గాళులు వెఱుక రాకుండియు, గొరిజ దిగంబడియును రథకరి ఘోటకంబులు సంచరింప నేరకునికి వెడంగు వడుచుం బెనంగు కడింది మగలును రక్తాంబు తురగా వర్త కరిగిరి కలితంబైన సమరాంగణ సాగరంబు నానావిధ వాహన యానపాత్ర గతులం దరియం జొచ్చి తమయట్టివారు గొందఱు మునింగినను వెండియు విజయధన వాంఛంజేసి వెఱవక వర్తించు వీరవ్యవహారులు నయి యెయ్యది సూచిన నెత్తుటం గెంపెక్క సైనికు లుక్కునం బొంపిరి వోవుచున్న సంకుల సంగ్రామంబునఁ జెక్కు సెమర్పక దర్పంబునం జెలంగుచు ద్రోణుం డెలుంగు సూపి కడంగి. | 280 |
| క. |
కరియూథనాథుఁ బొదువం | ద్వరితోద్ధతి యానదుర్నివారం బై కే సరి సనియెడు పగిది యుధి | ష్ఠిరు దెసకుం జనియె నతని సేన దలంకన్. |
281 |
| క. |
అతి కోలాహల వికల | స్థితి యగు తన బలము మిగిలి ధీరత్వమహో న్నతుఁ డగు నతండు విశిఖ | ప్రతతి వఱపె గురునిపై నరాతులు వొగడన్. |
282 |