పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము
ద్రోణాచార్యునిచేత సూర్యదత్తుఁడు సచ్చుట (సం. 7-20-20)
సీ. ఆతని వెనుకొన నాచార్యునకు నడ్డ | పడి వారిమొన లెల్లఁ గడఁక నొక్క
పెట్ట త్రోచిన దూదితిట్టలపైఁ బ్రాఁకు | నగ్గి చందంబున మ్రగ్గఁజేయు
నగ్గురుఁ దాఁకి మాత్స్యానుజుఁ డాఱు దూ | పుల నొంచి యార్చిన నలిగి యతని
తల కుండలములతో నిలఁ బడ నతఁ డేసె | ధరణి నాయక! సూర్యదత్తుఁ డిట్లు
 
ఆ. వడినఁ జూచి మత్స్యబలకోటి విచ్చినఁ | జేది మగధ కేకయాదిసేన
లెల్లఁ జెదరఁ దలరఁ దల్లడపడఁ గల | గుండుఁ గొనఁగఁ జేసెఁ గుంభజుండు.
293
క. మెఱుమ ధనుర్దండము గుణ | ముఱుమఁగ విశిఖతతి దొరుఁగ నొక్కటఁ దఱచై
పఱవ రుధిరంపుఁ గాలువ | లఱిముఱి ఘనభుజుఁడు ద్రోణుఁ డడరె నరేంద్రా!
294
క. వీరాస్థిశర్కరాఘన | భేరీ మండూక కవచ పృథులోర్మి రథ
స్ఫారావర్త గజ మకర | ఘోర మహిమ రక్తనదులకుం దగియె నృపా!
295
వ. ఇవ్విధంబునం బాండవాగ్రజుం బట్టికొన నప్పళించి తఱుము నమ్మహావీరు మార్కొని యుధామన్యుండును, నుత్తమౌజుండును, వసుదానుండును, శిఖండియును నైదైదు శరంబు లేసిరి; సాత్యకి క్షత్రధర్ములు వరుసన నూటయిరువదింటఁ బదింటం గప్పి రయ్యుధిష్ఠిరుండును; మరలి బాణ శతత్రయ ప్రయోగ తీవ్రులగు ధృష్టద్యుమ్న చేకితానుల మున్నిడుకొని పొంగి తానును బండ్రెంట నొప్పించె; నప్పు డా భారద్వాజుని మఱియునుం బలువురు పాండవ పక్షయోధవీరులు వొదివినం గని మన్నించు రాజులు రాజకుమారులు నతనికి బాసటయై కలిసి; రతండు వసుదాను వసుధం గూల్చి క్షేము జముకడ కనిచి యుధామన్యు నుత్తమౌజుని శిఖండిని సాత్యకిని బెక్కమ్ము లెమ్ములం గీలించి తన్నుం గదిసినం గని యయ్యజాతశత్రుండు వెండియుఁ గైతవంబున రణంబునకుం దొలంగం బాఱిన. 296
క. గురు దృఢసేనుఁడు దాఁకిన | హరి సారథి కేతురథ శరాసన శకలో
త్కరములతోడ నతండును | దొరఁగించెఁ దదీయ తనువు దునియలు ధరణిన్‌.
297
వ. ఇత్తెఱంగునం దునిమి తఱుము నతని దోర్విలాసంబు దుస్సహం బగుటయుం బాండవ బలంబులు దెరలినం గురు సైనికులు నలుగడలకు నెగచి; రట్లు విజృంభించిన కుంభసంభవు నెదుర్కొని వార్ధక్షేమియుఁ జిత్రసేనుండును సేనాబిందుండును సువర్చసుండును ధృష్టద్యుమ్నుండును జేకితానుండును శిఖండియు సాత్యకియును సుమిత్రుండును సాయక జాలంబులు నిగిడించిన. 298
తే. అందఱకు నన్నిరూపులై యతఁడు వోరి | యా సుమిత్త్రునిఁ గూల్చిన నతనిఁ గేక
యులును మాత్స్యపాంచాలురు నొక్కపెట్ట | కవిసి విరిసిరి తచ్ఛరాఘాత భీతి.
299
వ. ధృష్టద్యుమ్న సాత్యకి సేనాబిందు ప్రముఖ రథిక వరులును వసమఱియుండిరనిన విని, ధృతరాష్ట్రుం డచ్చెరువడి ‘యిట్లు పేర్చిన యాచార్యు శౌర్యభుజ వీర్యంబులు సైరింప నక్కడ నెవ్వరు లేరైరి గదే, యనుటయు సంజయుం డది సెప్పెద నాకర్ణింపు’మని యిట్లను నట్లు గలంగిన కౌంతేయ సేనఁ గనుంగొని కలకల నవ్వుచుఁ గురువిభుండు కర్ణునితో నిట్లనియె. 300
క. ‘పెనుగాలిని వెసఁ గూలిన | వనము క్రియం బడిన పాండవ బలముఁ గంటే?
విను మింక నెన్నఁడును మొగ | కొన రీ యోడి చనువారు గురుకోల్తలకున్‌.
301
చ. పవనతనూజుఁ గంటె? నిజపార్శ్వములం దనవారు లేక కౌ
రవులు మహోగ్రభంగి నడరం గడు దైన్యముఁ బొందియున్న వాఁ
డవిరళ దివ్యమార్గణ దురాసదు ద్రోణునిఁ జూచి వీఁడు రా
జ్యవిభవకాంక్ష యెల్లఁ దెగటాఱఁగఁ బాఱెడు నట్లు సూడుమీ!’
302
వ. అనిన విని కర్ణుం డతని కిట్లనియె. 303
ఉ. ‘భీముఁడు నట్టివాఁడె? యరిభీషణ విక్రముఁ డస్మదీయ సం
గ్రామ జయంబు ప్రాణములు గల్గఁగ సైఁచునె? పాండవేయు లు
ద్దామ బలాఢ్యు; లాహవము దక్కుదురే? యదిగాక వారు నీ
చే మును పడ్డపాట్లు దమ చిత్తములన్‌ మఱవంగ నేర్తురే?
304
చ. వినుము తదీయ యోధులును వీర గుణాఢ్యులు భీము మున్నుగాఁ
గొని గురుఁ దాఁక కుండుదురె? కూడుద మీతఁడు నొవ్వకుండఁగా
మనమును నీతనిం బలసమగ్రులమై; యటు గాక యోడి రం
చునికి ప్రమాద; మేను మొగమోడక చెప్పితిఁ గౌరవేశ్వరా!’
305
వ. అని పలుకునంతకుం గూడుకొని. 306
సీ. హంస గౌరములగు హయములు నమృతాంశు | కేతువు మెఱయ నజాతరిపుఁడు
రురునిభాశ్వంబులు హరికేతనంబును | బ్రస్ఫురితములుగఁ బవనసుతుఁడు,
శుకవర్ణహరులు ప్రస్తుత శరభధ్వజం | బును నొప్ప సహదేవ పూర్వజుండు,
నంబుద చ్ఛాయ రథ్యములు శుండాల ప | తాకయు శోభిల్లఁ దదనుజుండుఁ
 
తే. గడఁగి తమ తమ సిడములు గ్రాల ద్రుపద | మాత్స్య సాత్యకి ముఖ యోధ మండలములు
దారుణాటోప విక్రమోత్సాహ లీలఁ | దోడు నడవంగ నడరిరి ద్రోణు మీఁద.
307
వ. ఇట్లు పాండవ బలంబులు జలధరంబులు శైలంబు గప్పుకరణిం గుంభసంభవుం బొదివిన దృష్టిపథం బవరుద్ధం బగుటయు నతండు దెగియె నను దిగులు మన వారికిం బుట్టె; నట్టియెడ నీ కొడుకు గడంగి సేనలకుం జేయి వీచి యందు ముంగలియై నడచు వడముడిం దాఁకినం దమకించి సాత్యకిని గృతవర్మయు, క్షత్త్రధర్ముని సైంధవుండును, యుయుత్సుని సుబాహుండును , నకులుని దుశ్శాసనుండును, సహదేవునిఁ జిత్రవర్ముండును, ధర్మనందను శల్యుండును, ద్రుపదుని బాహ్లికుండును, విరాటుని విందానువిందులును, శ్రుతకీర్తిని వివింశతియు, శ్రుతసేనుని సాల్వుండును, శ్రుతసోమునిఁ జిత్రసేనుండును, శతానీకుని శ్రుత వర్మయుఁ, బ్రతివింధ్యుని నశ్వత్థామయు, సౌభద్రుని లక్ష్మణుండును, శిఖండిని వికర్ణుండును, గుంతిభోజుని దుర్ముఖుండును, గేకయ, పంచకంబును, గర్ణుండును, గాశీశ్వరుని జయుండును, బాండ్యుని- జయత్సేనుండును, ధృష్టద్యుమ్నపుత్రుల బృహద్ధనుర్జయ మిత్రులును, వార్‌ద్ధక్షేమిని గృపాచార్యుండును, మణిమంతుని భూరిశ్రవుండును, ఘటోత్కచుని నలంబుసుండును దలపడి; రెన్నం గొలఁదిగాదు గాని మఱియు ననేకుల మార్కొని; రిబ్భంగి భారద్వాజునిం బరిమార్పను గావను బూని యక్కడి యిక్కడి వీరు లుక్కు మిగిలి యొండొరుల కేతనంబులు గూల్చియు, ఘోటకంబుల ప్రాణంబులఁ బీల్చియు, సారథుల రూపు మాపియు, నరదంబులు పఱియలు వాపియు నాతపత్ర చామరంబుల బడలువఱిచియుఁ, జాపంబులు విఱిచియుఁ గత్తళంబుల తునియలు ధరన్‌ దొరలించియు, నెత్తురు లురలించియు నిత్తెఱంగున ఘోర సంగ్రామంబు సేయుచుండ మధ్యాహ్నం బయ్యె, నప్పుడు దన్నుం గవిసిన ధృష్టద్యుమ్ను నమ్ముల నవలీలం గుదియించి యగ్గురుండు వెండియుం గొందఱం జిక్కువఱిచె’ ననిన విని ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె. 308
క. ‘వీ రిచట నివ్విధంబునఁ | బోరఁగ నర్జునునితోడఁ బోక పెనఁగు న
వ్వీరులు సంశప్తకు లె | ట్లైరొకొ? యాతని పరాక్రమాతిశయమునన్‌.’
309
చ. అనవుడు నాతఁ డిట్టులను నవ్విభుతో ‘నది వెండి చెప్పెదన్‌
వినుము నరేంద్ర! యట్టి యెడ వీరరసస్ఫురణంబునన్‌ భవ
త్తనయుఁడు గంధసింధుర వితానముపై నడరించి భీమసే
నునిఁ గినియించె నాతఁడు గనుంగవ నిప్పులు రాలుచుండఁగన్‌.
310
క. శరజాల మహావాత | స్ఫురణంబున నుగ్రదంతి భూరి ఘటా బం
ధుర వారివాహపటలము | విరియించుచు బెట్టు గవిసి విభు నొప్పించెన్‌.
311
వ. అట్లు కురురాజు నొచ్చిన నడ్డంబు సొచ్చి. 312
శా. వంగాధీశ్వరుఁ డేనుఁగుం గొలిపి గర్వస్ఫూర్తి దివ్యాస్త్ర వి
ద్ధాంగుం జేసె మరుత్తనూజు; నతఁ డుద్యత్క్రోధుఁ డై వాని మా
తంగంబుం బడనేసి వాఁ డొఱగుచోఁ దన్మస్తకం బుర్వి డొ
ల్లం గేలీ విధ మొప్ప నేయ బల మెల్లం బెల్లగిల్లెన్‌ వడిన్‌.
313
వ. ఆ సమయంబున. 314
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )