| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
దానవజయ మింద్రున కె | ద్దానివలనఁ గలిగె మున్ను దానోగ్రము న య్యేనుఁగు భగదత్తుఁడు పవ | మాన తనయుఁ దెసకుఁ గొలిపె మద మెలరారన్. |
315 |
| వ. | ఇట్లు మన సైన్యంబు దైన్యంబు వాయం గొలుపుటయు నగ్గజంబు. | 316 |
| సీ. |
కినుకమై నిగిడిన కనుఁగవ మెఱుఁగుల | గములు ముందటఁ గెంపు గడలుకొనఁగఁ జెవులు మ్రొగ్గించి పూఁచిన రౌద్రతరరేఖ | వినువీథిఁ జూపఱ వేడ్కఁ బెనుప గండునఁ జాఁగిన తొండంబు లయసమ | వర్తిదండము లీలఁ బట్టువఱుపఁ గడు బెట్టిదపు టురవడిఁ బదన్యాస మి | లాస్థలి గ్రక్కదలంగఁ జేయ |
|
| ఆ. |
ననిలపుత్రుదెసకు నడరినఁ గని ధర్మ | తనయు సేన జనులు దల్లడిల్లి చంపెఁ జంపె భీము సామజం బనియెడు | నులివు గలయఁ జెలఁగఁ గలఁగి రధిప! |
317 |
| వ. | తదనంతరంబున యుధిష్ఠిరుండు. | 318 |
| క. |
అలుకొందు మనముతోఁ దన | బలముం బురికొలిపి పొదివి భగదత్తుని న మ్ములఁ గప్పె; నతఁడు వానిన్ | విలసిల్లు మహాంకుశమున విరియ జడియుచున్. |
319 |
| క. |
గజముఁ గొలిపి యాదిక్కున | గజఘోటక భటనికాయ కాయములు రథ వ్రజములుఁ బొడిపొడిగా న | క్కజముగ విహరించె బాహు గర్వ స్ఫూర్తిన్. |
320 |
| వ. | అప్పు డాలోకించి. | 321 |
| చ. |
అలిగి దశార్ణ భూరమణుఁ డాతనిఁ దాఁకినఁ జూడ నొప్పె ఱె క్కలు గల పర్వత ద్వయము కైవడి వారల దంతియుగ్మ మి ట్టల మగు వీఁకఁ దత్కరిఁ బడం బొడిచెన్ వడి సుప్రతీక ము త్తలపడువానిఁ జంపె భగదత్తుఁడు దోమరసప్తకంబునన్. |
322 |
| ఆ. |
చంపి విక్రమంబు సొంపారఁ బాండవ | బలము బడలువడఁగ భద్రదంతిఁ జటుల గతులఁ బఱప సాత్యకి యడ్డంబు | నడచి యేసె దొడ్డ నారసమున. |
323 |
| చ. |
కరిపతి జిఱ్ఱనం దిరిగి క్రమ్మఱ నూల్కొని వృష్ణివీరు ను ద్ధురరథ ముద్ధతిం బెనఁచి తొండమునన్ వెస నెత్తి వీచి వై చె రయముమై నతం డిలకుఁ జిత్రముగా నెడ దాఁటి పోయెఁ జె చ్చెర గజ మొండుమైఁ గవిసి చిందఱ వందఱ సేసె మూఁకలన్. |
324 |
| క. |
సారథి తురంగముల మెలు | పారం గాఁ బూన్చి తేర్చి యవికలమగు నా తే రల్లఁ దేర సాత్యకి | బీరము వొలివోవకుండఁ బ్రియమున నెక్కెన్. |
325 |
| ఉ. |
భీముఁ డుదగ్రతం గవియఁ బెల్లగు నా కరిచేతి శీకర స్తోమమునం దురంగములు దోఁగి కడున్ వెగడంది యీడ్చె సం గ్రామ వినోద లీలకు విఘాతము గాఁగ రథంబు నప్పు డు ద్దామ పరాక్రమ స్ఫురణఁ దాఁకి సుపర్వుఁడు సచ్చె హస్తిచేన్. |
326 |
| వ. | అతని పడుట గనుంగొని సౌభద్రుండును ద్రౌపదేయ పంచకంబును జేకితానుండును ధృష్టకేతుండును యుయుత్సుండును గడంగి సామజంబుపై శరవర్షంబులు గురిసిన నది కోపించి యురవడించి. | 327 |
| క. |
పదముల రథవాహంబులఁ | జదుపుచుఁ బైకొని యుయుత్సుసారధిఁ జంపెన్; బెదరక యభిమన్యుని తే | రొదవిన నది యెక్కి యాతఁ డుద్ధతి నేసెన్. |
328 |
| క. |
నరతనయ ప్రముఖ రథిక | వరులు నిభముమీఁద నేయు వాలమ్ములు ని ష్ఠురగతి శరదభ్రముపైఁ | బరఁగు తరణికిరణ చయము పగిదిం బొలిచెన్. |
329 |
| క. |
రభసంబునఁ బ్రాగ్జ్యోతిష | విభుఁడు గరిం గొలుపుటయును వెస నది యరి వీ రభయంకరముగ వారల | ప్రభ సెడ నరదములు వైచెఁ బలుదెసలఁ బడన్. |
330 |
| ఆ. |
ఇట్లు భీమసేను నేపు నర్జున సుత | ప్రముఖులైన యలఘు రథికవరుల జృంభణంబుఁ జెడినఁ జేడ్పడి చెడి పాఱఁ | జొచ్చెఁ బాండురాజ సుతుల సేన. |
331 |
| క. |
నలి భగదత్తుఁడు గదుపుల | వెలుచు పసులవాని యట్ల విలసద్గతి న బ్బలము నెగువ ధూళియు నా | కుల సంరావంబు గగన కుహరము నిండెన్.’ |
332 |
| క. |
అని చెప్పి సంజయుఁడు ‘గురు | జన నాయక! యపుడు సవ్యసాచి రణము ది క్కునఁ జిత్తం బిడి యడిగితి; | విను మయ్యోధవరు తెఱఁగు విస్పష్టముగాన్. |
333 |
| వ. | అనవుడు నాంబికేయుం డాకర్ణనవాంఛ మిగుల ‘నది సెప్పు’ మనుటయు నాతనికి నా సూతనందనుం డి ట్లనియె. | 334 |