పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము
కర్ణార్జునుల యుద్ధము (సం. 7-31-49, 50)
క. తన వెనుక దెసకు పాఱిన | ఘన యోధులఁ జూచి బాహుగర్వస్ఫూర్తిన్‌
దనరుచు నోడకుఁ డోడకుఁ | డని పలుకుచుఁ దాఁకెఁ గర్ణుఁ డమరేంద్రసుతున్‌.
383
వ. ఇట్లు దాఁకి యతనిపై నాగ్నేయాస్త్రంబు ప్రయోగించిన నతండు వారుణ బాణంబున వారించి వాలమ్ములు గురియం గూడుకొని భీమ సాత్యకి ధృష్టద్యుమ్నులు శరత్రయంబులు సూత సూను మేన నాటించిన, నతండు గాండీవ నిర్గత చండమార్గణంబుల మగిడించుచు నమ్మువ్వుర చాపంబులు నవ్వుచుం ద్రుంచి, వారలు శక్తులు వైవ వానిం దునిమి పేర్చియార్చిన నర్జునుండు నారాచసప్తకంబున నవ్వీరు నొప్పించి యతనిం దల కడచి తన్నుఁ దలపడిన యతని తమ్ముల తలలు మూఁడును భూమిదేవికి బలిసేసె నంత భీముండు రథంబు డిగ్గివచ్చి గదాదండంబునఁ గర్ణబంధువులం బదివేవురం బడలు వఱిచి మరల రథస్థుఁడై వేఱొక్కవిల్లు గొని విశిఖంబులు వఱపి యంగపతి యంగంబులం దురంగ శరీరంబులను నొప్పించె నాలోనన యప్పాంచాల వరసుతుండును శైనేయుండును నొండు విండ్లు గొని యతని సారథి యొఱగను జాపంబు విఱుగను నేసి; రా సమయంబున దుర్యోధనుండును ద్రోణ జయద్రథులును నెయిది శాత్రవ సముద్రంబున మునుంగకుండ నారాధేయు నుద్ధరించి రట్టియెడ. 384
క. ఉభయ బలంబులుఁ బురికొని | యిభరథ తురగ భటతతి మహిం గూలఁగ న
క్షుభితములై పోరాడెం | బ్రభువులు వెనుదన్ని చూడఁ బార్థివముఖ్యా!
385
సీ. కాలువలై పాఱు కీలాల జలములఁ | దేలిపోయెడు మృతదేహములును,
బ్రేవుల ప్రోవుల పెల్లునఁ జిత్రత | చ్ఛాయంబులగు మాంస సంచయములుఁ,
గరి హయంబుల కళేబరముల క్రిందఁ గొం | డొక తోఁచు భట గాత్ర నికరములును
దలల పెందఱచులో మిలమిల మెదలెడు | కర పదంబుల నవఖండములును
 
తే. రౌద్ర బీభత్సనర్తన రంగభంగి | నపుడు సమరాంగణము ఘోరమయ్యెఁ జూడ
ద్రోణఫల్గున నిష్ఠురోద్ధురనిపాత | జాతమగు నమ్మహోద్భట సంకులమున.
386
వ. అంత పతంగుండు పశ్చిమాచలంబునవులకుం జనిన సంధ్యారాగంబు సొంపునఁ గెం పినుమడించు నెత్తురు మడువుల నోలలాడు భూతబేతాళంబులను, శవకబళన లోలంబులగు సృగాలంబులను, మాంసచర్వణ కోలాహల బహుళంబులగు కంకగృధ్రాది పక్షి కులంబులనుం జూచియుఁ బాండవబలంబు సమయ సముచితంబగు సమర విరామంబునకు నున్ముఖం బగుట యెఱింగియు మున్ను సవ్యసాచి యురవడికింగాక తమ మొన దెరలుచునికిం జేసియు నదియ మెయిగా నాచార్యుండు దొరలకుం జెప్పి సేనలఁ దివియ నియోగించెఁ; బాండవ సైన్యంబులును మరలె; నివ్విధంబున నుభయ సైన్యంబులు నిజస్కంధావారంబులకుం జను నవసరంబున మన జనంబులు ద్రోణు ప్రతిజ్ఞాభంగంబును ఫల్గును పరాక్రమ స్ఫురణంబును నతని యెడ నచ్యుతునకుం గల సౌహార్ద విశేషంబును నుగ్గడించుచు విన్ననై పోయిరి. వేగుటయుఁ గయ్యంబునకు వెడలునప్పుడు విషాద వివర్ణవదనుం డగుచు నీ తనయుఁ డెల్ల యోధులు వినం గుంభసంభవున కి ట్లనియె. 387
మ. ‘పెనుపారన్‌ వర మిచ్చి తట్లు గడిమిన్‌ భీమాగ్రజుం డాజిఁ గి
ట్టినఁ బట్టం గడు నగ్గ మైన యెడఁ గ్రేడిం తెప్డు ని ట్లైనఁ జా
లని వాఁడందురు నిన్ను; నన్నుఁ గుటిలాలాపంబులన్‌ వెఱ్ఱిఁ జే
సిన నీ కైనది యేమి? యాశ్రితగుణశ్రేష్ఠుండు వంచించునే?’
388
వ. అనిన విని గురుం డప్రీతుం డయ్యును గటకటం బడక యతనితో నిట్లనియె. 389
ఆ. ‘నరుని విక్రమంబు నారాయణుని మహ |త్త్వంబు నెఱిఁగి యెఱిఁగి తగునె యిట్లు
వలుక? ధర్మపుత్రుపైఁ జేయి వదలక | వారు రారె పెక్కు వరుస లధిప!
390
ఉ. ఎవ్వరి నెట్లు సేసెదనొ యేర్పడఁ జూడుము; నేఁడు పోరికిం
గవ్వడి రాక యుండఁ దొలఁగంగొని పోవఁగఁ జాలువారి నీ
వెవ్వరి నైనఁ బంపు; మిదిఁ యేటికి? నొండొక బుద్ధి సేసెదే?
నవ్వుచుఁ బల్కినన్‌ ధరణినాథ! యసత్యము గల్గ నేర్చునే?’
391
వ. అనవుడు. 392
మ. విని సంశప్తకు ‘లేము దక్క నొరు లా వివ్వచ్చు భంగించి బె
ట్టనికిం బాపి యలంపనేర్పుగలరే!’ యంచున్‌ వెసం బోయి పి
ల్చిన నప్పార్థుఁడు నుద్ధతిం జనుడు నక్షీణోగ్రశస్త్రాస్త్ర వ
ర్తన ఘోరంబగు సంగరం బచట రౌద్రస్ఫూర్తిమై జెల్లఁగన్‌.
393
వ. ఇక్కడ భారద్వాజుండు పద్మవ్యూహంబు గావించినం గౌంతేయాగ్రజు ననుమతి నభిమన్యుం డయ్యొడ్డు భేదించి సొచ్చి, బృహద్బల లక్ష్మ ణ ప్రభృతులగు భూపతులను భూపకుమారులను బెక్కండ్రం బారిసమరి యనేక యోధ వీర విక్రమ సంకులంబునం జిక్కువడి యుక్కుమురిసినట్లు సమసిన మన మొనలు సెలంగుచుం బాండవ బలంబులు పొగులుచుం దమ తమ యునికిపట్లకుం జనియె నని సంజయుండు ధృతరాష్ట్రునకు సౌభద్రుండు వడుట సెప్పె ననిన విని నాఁటి కయ్యంబు కలరూపంతయు నేర్పడ నెఱింగింపు మనుటయు. 394
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )