పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము
దుశ్శాసనుఁడు అభిమన్యుడితోడం బోరి పారిపోవుట (సం. 7-38-26)
వ. అని పలికి యార్చి యమ్ములు నిగిడించుచు, ధనంజయ నందనుం దాఁకిన నతండు షడ్వింశతి సాయకంబులు దనువునం జొనిపినం గనలి దుశ్శాసనుండు శరాసార ఘోరంబుగాఁ గవిసినం, గిరీటి కొడుకునుం బేర్చి పెనంగ నయ్యిరువుర కరలాఘవ శరలాఘవ ప్రకారంబులు రథ చిత్ర ప్రచారంబులుఁ జూప ఱగ్గించి; రప్పు డగ్గలిక సొంపున సుభద్రాసూనుండు నీ సుతువిల్లు ద్రుంచి, భల్లంబుల మేను సెక్కి స్రుక్కించి యతనితో నిట్లనియె. 49
చ. ‘అనఘుని ధర్మనందనుని నా సభ నమ్మెయి నీవు నొవ్వఁ బ
ల్కిన ఫల మందఁజేసెదఁ జలింపక యించుక సేపు నిల్వుమీ !
నిను లఘుచిత్తుఁ గ్రూరు నవినీతు మదాంధునిఁ ద్రుంచి నన్నుఁ బెం
చిన గరువంపుఁ దండ్రులకుఁ జిత్త మెలర్ప ఋణంబుఁ దీర్చెదన్‌.’
50
క. అని యతని జత్రుదేశం | బున నొకవాలమ్ము వక్షమునఁ బెక్కును గ్రు
చ్చినఁ ద్రెళ్ళి యెన్నఁడో చ | చ్చిన యట్లు రథంబు మీఁదఁ జేడ్పడి యుండెన్‌.
51
వ. ఇట్లు మూర్ఛిల్లిన దుశ్శాసను తేరు సారథి తొలంగఁ దోలుకొని పోయె; నంతకుమున్న కౌంతేయులు సౌభద్రుండు సొచ్చిన పథంబున నా పద్మవ్యూహంబు సేనాసందోహ సహితులై చొచ్చి యెడనెడ నడ్డపడు సైన్యంబులతో సంగరంబు సేయుచు నక్కుమారుం దలలెత్తి చూచుచు నతం డరిబలంబులం గలంచుటకు సంప్రీతులగుచుఁ దోఁతెంచువారు ముందట దుశ్శాసనుండు భంగపడుట గనుంగొని పొంగి యార్పులు నింగిముట్ట నయ్యభిమన్యు ననేక భంగులం బ్రశంసించుచుం దఱిమి; రట్టియెడ. 52
సీ. రాధేయుఁ జూచి రారాజు ‘దుశ్శాసనుఁ | డభిమన్యుచే నొచ్చె నకట! కంటె!
యనవుడు నతఁడు సేనాన్వితంబుగ నక్కు | మారు పై నడర నవ్వీరుఁ డేచి
ముందటి మూఁకల మ్రందించి కదిసి డె | బ్బది మూఁడు దూఁపులఁ బటురయమున
నొంచిన రక్తాననుండయి దివ్యాస్త్ర | జాలంబు వఱపు నా జామదగ్న్య
 
తే. శిష్యు భుజవీర్యశౌర్య విశేషభంగి | సరకుగొనక య బ్బాలుండు సమదలీలఁ
బెనఁగ న య్యంగరాజు డస్సిన, నెఱింగి | యతని తమ్ముఁ డయ్యర్జునసుతునిఁ దాఁకి.
53
చ. హయముల మీఁద సూతుపయి నాతని యంగములందు నస్త్రసం
చయ మడరించినం గమలచారు ముఖంబున నెఱ్ఱనవ్వు చె
న్నయి విలసిల్ల భల్లమున నన్నరసూనుఁడు ద్రుంచె విద్విష
ద్భయద విలాస బాహు సముదగ్రత వాని శిరంబు గ్రక్కునన్‌.
54
ఉ. ఇమ్మెయిఁ దమ్మునిం దునుము నేపు గనుంగొని యోహటించి, శీ
ఘ్రమ్మునఁ బెంపఱం దొలఁగెఁ గర్ణుఁడు పెక్కు బలంబు లప్పు డొ
క్కుమ్మడిఁ ద్రోచి యుద్ధత మహోదధిఁ బోలఁగ మందరమ్ము చం
దమ్మున నొప్పె నుద్భటవిధస్ఫురణుం డగు పార్థపుత్త్రుఁడున్‌.
55
వ. ఇట్లు మూఁకలం గలంచి. 56
క. వెస రాధేయుని తొలఁగిన | దెసకుం జనుటయు నతండు ధృతిసెడి విఱిగెం
బస పొడవడఁగఁగఁ బెఱయో | ధ సమూహము వాఱె ధరణితల మద్రువంగన్‌.
57
వ. ఇ వ్విధంబున సైన్యంబులు దారును బఱచు దొరలం జూచి యాచార్యుండు. 58
చ. నిలు నిలు కర్ణ! యో కృపుఁడ! నీ విటు లేల కడంక దక్క, సౌ
బల! ధృతి దూల నేమిటికి? బాహ్లిక! యిత్తఱిఁ గౌరవేంద్ర! నీ
బలముఁ జలంబుఁ జూపి నిలుపందగు సేనల’ నంచుఁ బెక్కు భం
గులఁ బురికొల్ప నెవ్వరును గోల్తల సేయర యేమి సెప్పుదున్‌!
59
వ. ఇట్లు ప్రళయ సమయ ధారాధరస్ఫీత నిర్ఘాతచ్ఛటాభీలంబగు నబ్బాలుని బెడిదంపు టంపఱ సైరింపంజాలక నీబలంబులువాఱిన నక్కుమార కంఠీరవుండు సింహనాదంబు సేసి శంఖంబు పూరించి గుణంబుసారించి యనికిం దనివి సనక వెనుకం దవిలి వట్టియడవి ముట్టి యేర్చు కార్చిచ్చు చందంబునం జతురంగబలంబులం బారిసమరినం దేరులు నలియం ద్రెళ్ళిన శుండాలంబులును గాలుబలంబుల పీనుంగుపెంటలమీఁద నూఁదుకొనం గూలిన ఘోటకంబులును, గుఱ్ఱపు టట్టలరాసులు మూసికొని యఱవఱలైనయరదంబులును గరటి కళేబరంబులు వొదవినంగాలుగాలం బెనఁచుకొని పడియున్న సుభట సమూహంబులును,గంకణాంగద కాంతంబులైనకరకాండంబుల గములును, ముసుంగు వడ డొల్లిన సకుండల మస్తకంబులును, వీరకటకంబులు మెఱయఁ జిక్కువడియున్న చరణంబులును, గ్రిందుపడం దొరంగిన గాత్ర ఖండంబులును దునియలైన ధనురాది హేతివ్రాతంబులపైఁ బొడవు సెడక బాహువుల తోడం బొలుచు కృపాణ ప్రముఖ ప్రహరణంబులును, గొడుగుల కుప్పలును జామరంబుల ప్రోవులును, సిడంబుల తిట్టలును, నయి సంగరాంగణంబు ఘోరభంగి యయ్యె; నప్పుడు గగనమధ్యభాగంబున భాసమానుం డయిన మార్తాండు రెండవ మూర్తియుం బోలె నయ్యేకవీరుండు వెలింగె’ ననవుడు నాంబికేయుండు సంజయున కిట్లనియె. 60
ఆ. ‘బాలుఁడొంటి యిట్లు పలువురతోడఁ బో | రంగఁ జూచి పాండురాజతనయు
లందుఁ దోడు పడుటకై యొకరుండును | గడఁగ కునికి కేమి కారణంబు?’
61
వ. అనవుడు సంజయుం డిట్లనియె. 62
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )