| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము |
| చ. |
‘వినుము నరేంద్ర! పాండవులు విక్రమ దుర్దముఁ డైన పార్థనం దనునకుఁ దోడ్పడం గడఁగి దంతితురంగ రథోత్కరంబులం దునుముచు సత్వరస్ఫురణఁ ద్రోఁచిన నీ పెనుమూఁక పాయవి చ్చి నిలిచి చూచుచుండె నవిచేష్టితులైరి బలాధినాథులున్. |
63 |
| వ. | పాంచాల యాదవ పాండ్య కేకయ మాత్స్య ప్రముఖ మహనీయ సైన్యంబులతో న ట్లురవడించిన నయ్యుధిష్ఠిరుండను మహావాయువునకు జయద్రథుం డద్రియపోలె నడ్డపడియె’ నని చెప్పుటయు విస్మితుం డగుచు వైచిత్రవీర్యుం డతని కిట్లనియె. | 64 |
| చ. |
తనయునిమీఁది కూరిమి నుదగ్రత సేనలతోడఁ బాండునం దనులు రయంబుమై నడరఁ దా నొకరుండ భుజాబలంబు నే పునఁ గుదియించెనే యతఁడపో! కురుసేనకు మేటి సింధురా జున కది యేమహాతపము సొంపున నత్తఱి సంభవించెనో! |
65 |
| వ. | అనిన విని సూతసూనుఁ డమ్మానవపతి కిట్లనుఁ బాండవు లరణ్యంబున నున్ననాఁ డతండు ద్రౌపదికతంబున భీమసేనుచేత భంగపడి, సంతప్త చిత్తుండై చిత్తజారాతి నారాధించిన నతని గరిష్ఠ నిష్ఠాతిశయంబునకు భక్తవత్సలుండగు నప్పరమేశ్వరుండు ప్రీతుండై పొడసూపిన జయద్రథుండును గౌంతేయుల నివారించునట్లుగా వరం బొసంగవలయునని విన్నవించిన, నద్దేవుండు ‘(నర్జునుండు దక్క దక్కిన నలువురు) పాండవులు నీచేత నివారితులగుట యొక్క దివసంబునం గలుగుఁగాక!’ యని పలికి యంతర్హితుం డయ్యె; నదికారణంబుగా నట్టి గౌరవం బా రథికవరునకు దొరకొనియెఁ దత్పరాక్రమంబు తెఱం గెఱింగించెద నాకర్ణింపుము. | 66 |
| సీ. |
సింధుదేశోద్భవ స్థిర వాహనంబులఁ | బూనిన యరదంబు పొలుపు మిగుల, రత్నమయోగ్ర వరాహధ్వజంబు న | భస్థలిఁ జంచల ప్రభల మెఱయ, సాంద్ర చంద్రాతప సదృశమై యుజ్జ్వల | చ్ఛత్ర చామరముల చాయ నిగుడ, వజ్రముక్తాఫల వ్రజకిరణావళి | కలిత భూషణములు వెలుఁగుచుండఁ , |
|
| తే. |
జిత్తమున వరగర్వంబు చిగురు లొత్తఁ | బాండుపుత్త్రుల దుర్దాంత బాహుబలము మొనలపెల్లును సరకుగాఁ గొనక యేచి | యార్చి వారికి నీయల్లుఁ డడ్డపడియె. |
67 |
| వ. | ఇవ్విధంబున నడ్డపడి సాత్యకిని సాయకత్రయంబునను, భీమసేనుని బాణాష్టకంబునను, ధృష్టద్యుమ్నుని నిరువది యమ్ములను, విరాటుని శిఖండిని బదిపదితూపులను, బాంచాలపతి నేడింటను, ద్రౌపదేయుల బదియేనింటను, గేకయుల నిరువదేనింటను, ధర్మసూను సప్తతి శరంబులను నేసి యాసేన నానాస్త్రంబులం గప్పె,నప్పు డప్పాండవాగ్రజుం డతని కోదండంబు దుండంబులు సేసిన నా సైంధవుం డొండువింట మంటలుం బోని మార్గణమ్ము లమ్మనుజపతి మీఁదను, దదనుచరుల యంగంబులందును, బరఁగించినం బవనతనయుండు దలకడచి రభసంబున. | 68 |
| క. |
భల్లముల మూఁట గొడుగును | విల్లును బడగయును ద్రుంప వేఱొక విలు నీ యల్లుఁడు గొని భీము గొడుగు | విల్లును బడగయును ద్రుంచి విరథుం జేసెన్. |
69 |
| వ. | ఇట్లు వికల సాధనుం డై. | 70 |
| సీ. |
అనిలసుతుండు సాత్యకి తేరిమీఁదికి | నరిగిన నీ సేన యార్చుటయును సైంధవుపై వారి సైనికోత్తము లనే | కాస్త్రముల్ వఱపిన, నతఁడు వాని మరలింప ము న్నభిమన్యుచేఁ గూలిన | రథదంతి హయ భటరాజికతన నతి విషమంబైన యానేల నవిహత | గతి నరదంబులు గ్రందు వఱపి |
|
| ఆ. |
వారు సేసి రాహవము; దాని కోర్చి యం | దఱును దమక తమక దనిసి వెనుక కొదుఁగునట్లు గాఁగ నుజ్జ్వల శరనికా | యములు గురిసె నా జయద్రథుండు. |
71 |
| వ. | ఇత్తెఱంగున సింధురాజు పాండవుల వేఁడిమి యుడిపిన, నుభయపార్శ్వ ంబులకు మున్ను దొలంగియున్న నీ బలంబులు గోల్తల సేసి య క్కౌంతేయ సైన్య సంతానంబుతోఁ దలపడినం బోరు ఘోరంబయ్యె; నక్కడఁ గుంభసంభవ ప్రయత్న విశేషంబునం జేసి వాహిని మగుడ నడరి యభిమన్యుం బొదివిన నక్కుమారుండు నుక్కునం గడంగి. | 72 |
| క. |
అభిముఖ సంవృత్తములగు | నిభతురగ స్యందనంబు లిలఁ గూల్పఁగ న క్షుభితుం డగు వృషసేనుఁడు | రభసంబున నతనిఁ బటు శరంబుల నొంచెన్. |
73 |