పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము
వృషసేనుం డభిమన్యుం దాఁకి మూర్ఛితుం డగుట (సం. 7-43-5)
ఉ. నొంచినఁ గెంపు సొంపునఁ గనుంగవ యొప్పఁగ సూతుఁద్రుంచి, విల్‌
ద్రుంచి తురంగ వక్త్రములఁ దూఁపులు నించి, యలంచి, మేను నొ
ప్పించినఁ దేరితోడ నఱపీనుఁగు నీడిచికొంచుఁ బాఱె సే
నాంచలభూమికిం బెలుచ నత్తురగంబులు విహ్వలంబులై.
74
వ. ఇట్లు వృషసేను నరదంబు పఱచిన తెఱపిన యభిమన్యుండు నిజస్యందనంబు పఱపించినం బటు సంరంభంబున నెదుర్కొని. 75
ఆ. శౌర్యధుర్యుఁ డగు వసాతి భూపతి షష్టి | శితశరంబు లేయ నతఁడు దొడ్డ
నారసమున వాని నలిఁ దూల నేసినఁ | గూలి పెలుచఁ దన్నికొనుచుఁ జచ్చె.
76
క. చచ్చిన వసాతిఁ గనుఁగొని | యచ్చటి భూపతులు పెలుచ నడరుటయును వి
వ్వచ్చుకొడుకు కోపించినఁ | జిచ్చు మిడుతపిండు నేర్చు చెలువము దోఁచెన్‌.
77
వ. ఆ సమయంబునం జేడ్పడి నీ సేనలు దీనదశకు వచ్చిన నానాదేశాధీశులు పరస్పరాహ్వాననాదంబులు సింహనాదంబులు శింజినీ స్వనంబులుం జెలంగ ధనంజయతనయుపై నొక్కుమ్మడి నురవడించిన నయ్యతిరథవర్యుండు లేళ్ళగమిం గనిన బెబ్బులి యుబ్బుదోఁప నలిరేఁగి యందఱ నుఱుమాడిన నంగకంబుల వివిధ ఖండంబుల కెంపునను గరితురగ నరశవంబుల వికృతాకారంబుల నాయుధంబుల మెఱుంగుల నాభరణంబుల తఱచునం దత్ప్రదేశంబు దారుణ ప్రియదర్శనంబయ్యె; నప్పుడు దెరలిన మూఁకలు దన్నుఁ దేఱి చూడనుం జాలక యంతంత ఱిచ్చవడిన నా గుంపులకుం గవిసి, నిలింపపతి మనుమండు సత్యశ్రవఃప్రభృతి భూపాల లోకంబు జములోకంబున కనిచినం జుట్లనుండి చూచు మానధను లగు మానవపతులు నేన నేన యని కడంగి యక్కుమారుని మీఁద నుఱికి పెనుజోఱ మొగంబునం బడిన చిఱుచేప తండంబుల చందంబున దావానలంబు దఱియం బాఱిన మృగకులంబు చాడ్పున సముద్రంబు సొచ్చిన యేఱుల చందంబున నతని యంద డిందిన. 78
ఉ. అచ్చట సైన్యమంతయు భయాకులతన్‌ నలుదిక్కులన్‌ వెసన్‌
విచ్చిన శల్యనందనుఁడు ‘వీనికి నోడఁగ నేల మీకు? నే
వచ్చితిఁ బట్టి తెచ్చెద; నవారణ బెట్టు పెనంగె నేనియుం
జచ్చు మదీయ భూరిభుజశక్తిఁ గనుంగొనుఁ డంచు నుద్ధతిన్‌.
79
వ. రుక్మరథుం డనువాఁడు పాండుపౌత్త్రుం దలపడి తొమ్మిదియమ్ము లురమ్మున భుజమ్ముల రెండును నాఁటించి వెండియు నేయం గడంగునెడ నా సుభద్రాసూనుండు. 80
ఆ. శరముతోడ నొక్క కరము చాపము తోడ | నొకటి బొమలు గదిసి యున్న యుగ్ర
రేఖతోడఁ దల ధరిత్రిపైఁ బడనేసె | రయము మెఱయఁ బటు శరత్రయమున.
81
వ. ఇ ట్లర్జునపుత్త్రుండు చిత్రకౌశలంబు సూపిన. 82
ఆ. రుక్మరథుడు వడిన రోషాత్తచిత్తులై | యతని చెలులు పలువు రవనిపతులు
గవిసి రపుడు తేరుగములతో వడి భవ | త్పౌత్త్రుమీఁద నీదు పుత్త్రు లలర.
83
క. అమ్మనుజవిభుల బహుల శ | రమ్ములచే సూత కేతు రథ రథ్య సమే
తమ్ముగఁ బొదువంబడు తన | తమ్మునిసుతుఁ జూచి పతి ముదమ్మునఁ దేలెన్‌.
84
వ. ఇ ట్లభిమన్యుండు మడిసెనకాఁ దలంచి దుర్యోధనుండు సంతోషింప నా సౌభద్రుండు భద్రగజంబు బరిగోలల పోట్లం గనలు కైవడిం గినిసి, గాంధర్వియైన మాయ గావించె; నది దొల్లి ధనంజయు తపంబునకుం బ్రియం బంది తుంబురు ప్రభృతు లొసంగినట్టిది; దానం జేసి యమ్మానవనాథుల యాలోకనంబులకుం బెక్కు రథమ్ములవారు దమ్ముఁ బొదివికొని యనేకాస్త్ర శస్త్రంబులు ప్రయోగించిన చందంబు దోఁచిన వారు వెగడుపడి చూచుచుండ నతండు మండల ప్రచారంబులం దేఱు మెఱయ మెఱుంగు వాలమ్ములం గూల నేసియు, వెడందతూపులం ద్రుంచి పడవైచియు, బడలు వఱచిన నన్నరపతులు నఱుకుడు వడిన యెలమావి జొంపంబుల చందంబగుటయు, నుబ్బు దక్కి వెక్కసంబును వెల్లఁబాటునుం గదిరి యక్కురువిభుండు దన కొడుకు కడిమి సైరింపంజాలక యతనిపై నడరి కొండొకసేపు గన్నుల పండువుగా భండనంబు సేసి సంరంభ విజృంభితుండగు నవ్వీరవరు విశిఖ వేగంబునకుం గాక విముఖుండయ్యె’ ననిన విని యాంబికేయుండు సంజయున కిట్లనియె: 85
ఉ. ‘ఇమ్మెయి బాలుఁ డొక్కరుఁడ యిందఱఁ దోలి వధించె నన్న నే
నమ్మఁగఁ నేరనయ్యెద; వినం గడు నక్కజ; మట్టు లేల చి
త్తమ్మున సంశయింప? విను: ధర్మ మధర్మము నోర్వకున్నె క
య్యమ్ము తెఱంగు సెప్పు మెటులయ్యెఁ బదంపడి సూతనందనా!
86
వ. అనిన నమ్మనుజవల్లభునకు సంజయుం డిట్లను ‘నట్లు పెక్కండ్రురాజులు సచ్చుటయును సుయోధనుండు దెరలుటయును గని భవత్కుమారవర్గంబును దోడియోధవరులును మేనులు సెమర్ప మొగంబులు వెలవెలంబాఱ నోళ్ళెండం గాళ్ళు వడంక నలుదిక్కులుం జూచుచు ధృతి దఱిగిపోయిన వెఱచఱచి విఱిగి; రప్పుడు మగుడం గోల్తలసేసి కురువిభుండు గురుపుత్త్ర కృప కర్ణ కృతవర్మ బృహద్బల సౌబల సమేతంబుగా సౌభద్రు నెదుర్కొనిన. నతండు గెలుపు నుబ్బునం గొండొక పెద్ద యనక పిడుగు చందంబునన్‌ గర్జిలి యుఱికిన నయ్యరదంబుల తండంబులు లేటమొగంబు వడియె; నట్టియెడ. 87
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )