పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము
కర్ణుఁడు మొదలగు యోధులు వంచనచే అభిమన్యుని విరథుఁ జేయుట (సం. 7-47-31)
చ. అన విని సూతసూనుఁడు భయం బెదఁ గూరినవాఁడ పోలె నై
వెనుక కొదింగి యా రథికవీరు పిఱిందికిఁ జుట్టి వచ్చి వం
చనకు సహాయులై యచటి సైనికు లన్నరపుత్త్రు బిట్టు మా
ర్కొని పెనఁగంగఁ జేరి యలఘు ప్రదరంబున విల్లు ద్రుంచినన్‌.
106
వ. ఆ లోన. 107
క. గురుఁ డశ్వంబులఁ గూల్చెను | సరభసముగఁ గృపుడు సంపె సారథి నిమ్మై
నరసుతుఁ డనాయుధుండును | విరథుండును నగుట సూచి వెఱపేది వడిన్‌.
108
క. శకుని కృతవర్మ శల బా | హ్లిక గురుసుతు లాదిగా ననేకు లడరి య
స్త్ర కలాపంబుల శస్త్ర | ప్రకరంబుల నొంచి చిక్కువఱిచి యలఁచినన్‌.
109
క. వాలును బలకయుఁ గొని య | బ్బాలుఁడు రయమార గగనభాగంబున కు
న్మీలిత ధృతిసారుండై | లీల నెగసిపోయె మండలీభూతగతిన్‌.
110
క. తన విద్య కలిమి వినతా | తనయుని భంగిం జరింపఁ దమతమపైఁ దెం
పున నుఱుకు నను తలంపున | మన యోధులు భయము గొనిరి మనుజాధీశా!
111
చ. ఎడగని వాలు బల్లెమున నేసె వెసం దునియంగఁ ద్రోణుఁ డ
ప్పుడు శకలంబులై పలక భూమిపయిం దొరఁగంగఁ జేసె నె
క్కుడువడిఁ గర్ణుఁ; డా శిశు వకుంఠగతిన్‌ దన తేరిమీఁద నొ
ప్పెడు ఘనచక్రముం గొని యుపేంద్రుఁడు లీల నటించు చాడ్పునన్‌.
112
వ. సంరంభ విజృంభితుండై. 113
సీ. నెత్తుటఁ జొత్తిల్లి నెఱసిన యలుక ను | గ్రంబైన వదనంబు కాంతి పరఁగఁ,
గౌరవ సైనికోత్కరమున కతి భయ | దంబగు సింహనాదంబు సెలఁగ,
నింగికి నిగుడు రథాంగరోచులు మణి | కంకణద్యుతులతోఁ గలసి వెలుఁగ,
సిళ్ళు సూపిన గంధసింధురం బను రేఖ | దలఁపించు పటుగతి చెలువు మెఱయఁ,
 
తే. కుంభసంభవుఁ డున్న దిక్కునకుఁ గవిసి | యడ్డపడు సేనఁ జించి చెండాడు నక్కు
మారవరుమేని యొప్పును మగతనంబుఁ | జలము బలముఁ గీర్తించె నిర్జరగణంబు.
114
వ. అట్టియెడ. 115
తే. శకుని కృతవర్మ కృప కర్ణ శల్య ముఖ్యు | లైన యోధులు పెక్కండ్రు రఖిల దిశలఁ
బొదివి యతని కరంబునఁ బొలుచు చక్ర | మలఁతి తునియలుగా నేసి రాగ్రహమున.
116
వ. ఏసిన నతండు రయంబున. 117
క. గద గొని యశ్వత్థామం | గదియుడు దంభోళికొదమ కైవడి మెఱుఁగుల్‌
వొదలించు దానిఁ గని కడు | బెదరి యతఁడు రథము డిగ్గి పిఱిఁదికిఁ జనియెన్‌.
118
వ. సుభద్రాతనయుం డతని రథ్యంబులను సారథినిం జదియ మోఁది మనజోదుల యమ్ముల నేదు వెఱిఁగిన చందంబున సౌబలుని దెసకు నడచి యాతనికి నడ్డపడిన గాంధారుల సప్తవింశతి రథికులం బొరిగొనుటయుం, బురికొని తన్ను మార్కొనిన వసాతీయులం బదుండ్ర నేనుంగుల తోడన పీనుంగులఁ గావించి, యందంద తఱిమిన కేకయ సప్తకంబు రథ సహితంబుగా నగ్గలిక నుగ్గు (గ్గ)సేసి, డస్సి తూఁగాడుచుఁ దొలంగిన యోధుల నుల్లసం బాడుచు, నఱిమిన వారి నుఱుమాడుచు, వీరవ్రతంబు ధీరత్వ నిష్ఠం జలుపుచుండె. 119
ఉ. ఆ సమయంబునం గడఁగి | యాయిత మైన రథంబుతోడ దౌ
శ్శాసని రా నతం డడరి సారథిఁ జంపి హయంబులం బడన్‌
వ్రేసిన నాతఁ డల్గి గద వే కొని యుద్ధతిఁ దేరు డిగ్గ ను
ద్భాసితమూర్తులం బొలిచె భ్రాతృకుమారయుగం బుదాత్తమై.
120
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )