| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము |
| తే. |
ఇవ్విధంబునఁ గదిసి నరేంద్రముఖ్య! | నీదు మనుమలు సూపఱ నెమ్మనముల కద్భుతంబును శోకంబు నావహిల్ల | లావు వెరవును మెఱయఁ జలంబు నెఱయ. |
121 |
| ఉ. |
ఒండొరుమీఁది కోపమున నుగ్రతఁ బోరి రుదగ్రులై గదల్ మండఁగ, నెత్తురుల్ సెదర మాంసము పిండిగ నెంపనుగ్గు లొం డొండ ధరిత్రిపైఁ దొరఁగ నొప్పెడు మేనులు వ్రాల వానిలో నుండక ప్రాణముల్ వెడలె నుబ్బునఁ గ్రాలఁగ దేవకామినుల్. |
122 |
| వ. | ఇ త్తెఱంగున. | 123 |
| చ. |
వనగజ మంబుజాకర మవారణఁ జొచ్చి కలంచి యాడఁగా మనమునఁ గొంకులేక కృప మాలిన బోయలు ముట్టి చంపు చా డ్పున భవదీయ సేన పొరిపుచ్చఁగ జుట్టునుముట్టి పార్థనం దను నలయించి నిర్దయ విధంబునఁ జంపి రనేక సైనికుల్. |
124 |
| వ. | అట్టి యెడ. | 125 |
| సీ. |
జగము లన్నియును దేజంబున వెలిఁగించి | యపరాద్రి సేరిన తపనుమాడ్కిఁ, దఱచైన కానలు దరికొని నీఱుగాఁ | జేసి యాఱిన దవశిఖి విధమున, గగనంబుతో రాయు కరడులుగల జలం | బివురఁ బాఱిన మహార్ణవము కరణి, నున్నతగతి సెడి యుర్విపైఁ గడు విన్న | నై పడియున్న సుధాంశుభంగి |
|
| తే. |
బీరమునఁ దమవారికిఁ బెం పొనర్చి | యరుల సమయించి వసమఱి యనువు దప్పి తెగియుఁ జూడ్కికిఁ జాల వ్రేఁగగుచుఁ బొలిచె | మహితమూర్తిశోభితుఁ డభిమన్యుఁ డధిప! |
126 |
| ఉ. |
నెత్తుటఁ దోఁగి నేల యెఱనింగి తెఱంగున నుండె; నక్కుమా రోత్తముఁ డందుఁ జంద్రుక్రియ నొప్పె సితాయుధ ఖండభూషణో దాత్తమణిప్రతానములు తారల చందము నొంది యంద మై యత్తఱి నుల్లసిల్లె వసుధాధిప! చూపఱపిండు చూడ్కికిన్. |
127 |
| సీ. |
కరికళేబరములు ధరణీధరములు, దు | రంగ గాత్త్రమ్ములు గ్రాహసమితి, నరశరీరములు మీనములు, గౌక్షేయక | క్షురికాది శస్త్రంబు లురగకులము, రుధిరార్ద్రశరములు రుచిర ప్రవాళముల్, | ప్రేవుల ప్రోవులు ఫేనతతులు, నెత్తురు వెల్లువ నీళులు భూషణ | స్తోమాస్థిచయము తుమురు లిసుక |
|
| ఆ. |
గాఁగ నంబురాశి కరణి సంగ్రామ భూ | భాగ మొప్పు మిగుల భవ్యయోగ నిద్ర నున్న విష్ణునికిఁ బాటి యగుచు శో | భిల్లె నమ్మురారియల్లుఁ డందు. |
128 |
| వ. | అ బ్బాలుండు. | 129 |
| తే. |
మహితలావణ్యమును, సుకుమారమైన | యంగమును, బూర్ణచంద్ర నిభాననంబుఁ గ్రొత్తపెంపుగ నెంతయుఁ గొమరు మిగిలి | చెన్నుఁ దలకట్టునై పడియున్నఁ జూచి. |
130 |
| క. |
నీ సైనికు లెంతయు సం | తోసిల్లుచు నార్చి రపుడు దుఃఖితులై కుం తీ సుతులవారు, దీనద | శాసంగతులైరి బాష్పజలములు దొరఁగన్. |
131 |
| క. |
నెఱి దప్పంబడి పెల్లుగ | నొఱలెడి నరవాజికరుల యులి వభిమన్యుం డఱిమురిఁ బడుటకు వగ మదిఁ | బఱిగొన నిల పెలుచ నఱచుభంగిఁ జెలంగెన్. |
132 |
| వ. | ఆ సమయంబున. | 133 |
| క. |
‘పెక్కండ్రు గూడి యిమ్మెయి | నొక్కనిఁ జంపుట యధర్మ మోహో!’ యని న ల్దిక్కులను బెద్దయెలుఁగున | నక్కజముగ భూత సంచయంబులు వలికెన్. |
134 |
| వ. | ఇట్లు శౌర్య సార సంపాదిత రౌద్రుండైన సౌభద్రుండు వడుటయు, వారి బలంబులు ఱిచ్చవడి, భండనంబు దక్కి తలరిన, ధర్మపుత్త్రుండు ప్రబలయోధవీరలోకంబు నాలోకించి యిట్లనియె. | 135 |
| సీ. |
‘మార్బలంబులు సొచ్చి, మాతంగములఁ గూల్చి, రథరాజిఁ గలఁచి, తురంగమములఁ ద్రుంచి, పదాతులం దునుమాడి పెక్కండ్రు | సైనిక ప్రవరుల సమయఁ జూచి మూఁకల విరియించి, వీఁక నాచార్యాది | యోధుల నెల్లను నొక్కదెసకు వెలిచి, వియచ్చరుల్ వినుతింప నాకంబు | చూఱగొన్నట్టి యర్జునతనూజుఁ |
|
| ఆ. |
జూచి మనకు నేల శోకింప! వైరుల | గం డడంచి గెలుపు గంద ముచిత భంగిఁ; బ్రొద్దుకొలఁది పరికించి మనసైన్య | ముల మరల్త మెలమి దలకొనంగ.’ |
136 |
| వ. | అని పలికి బరవసంబు సేసి సేనలం బురికొల్పికొని యవష్టంభ విజృంభితుండయి నిలిచెఁ; బదంపడి యరుణకిరణుం డపరమహీధరంబు మౌళికి సరసీరుహశేఖరంబై చెలువారం, దదనంతరంబ రిత్తచోట్లును నెత్తుటన్ జొత్తిల్లుచున్నట్లుండెఁ; బిండుగట్టి పిశాచనిశాచరులు నలిరేఁగి రక్తపానంబును మాంసఖాదనంబునుం జేయుచు మోదంబునం బొందుచు నాడుచు పాడుచుండు కలకలంబునను గుణపభక్షణవ్యగ్ర విహంగ సముదయతుములంబునను, బలలఖాదన సంరంభ శివా నివహ కోలాహలంబునను, బరమాభీలంబైన సంధ్యాకాలంబు నిరూపించి నిజ శిబిరంబులకు నుభయబలంబులుం బోయె; నప్పుడు నీ కొడుకు లుబ్బునం గొమరు మిగిలి యరిగిరి; కౌంతేయులు చిన్నఁబోయిన యాననంబులతో శోకసంతప్త చిత్తులయి చని; రివ్విధంబున ధర్మతనయుండు దననికేతనంబున కరిగి యచట నిఖిల పరిజనంబులుం దానును సన్నాహంబు లెడలించి శూన్యాకారులై యున్న సమయంబునం దమ్ముని దెస కూరిమి నారం గూరినవగ పెంపున ధైర్యంబు సొంపఱి వివర్ణవదనుం డగుచు నిట్లనియె. | 137 |