పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము
అభిమన్యుని మరణమునకు ధర్మరాజు దుఃఖించుట (సం. 7-49-1)
మ. ‘గురు శారద్వత ముఖ్యయోధ వరసంగుప్తంబు, నిర్భేద్య, ము
ద్ధుర మా సైన్యము; దానిఁ జొచ్చి ననుఁ బ్రీతుం జేయఁగాఁ బూని యొ
క్కరుఁడున్‌ గోవులలోనఁ జొచ్చు బలు సింగం బొక్కొ నా నట్లు సొ
చ్చి రయంబార ననేకవీరశిరముల్‌ చెండాడె నుద్దండుఁ డై.
138
క. ఈసును రోసముఁ గల దు | శ్శాసను నొప్పించి పఱపి చతురంగములన్‌
గాసిలఁ జేయుచు న ట్లు | ల్లాసముతో మెలఁగఁగాఁ దలంబె యొరులకున్‌!
139
తే. కొడుకుఁ బొడగాన కర్జునుఁ డడిగె నేని | వానితో నింక నే మనువాఁడ? హరికి
నతని గారాబు చెలియలి కధికదుఃఖ | మేన చేసితి; వగవంగ నేమి గలదు?
140
క. బాలుఁడు సుకుమారుఁడు పె | క్కాలములం జొచ్చి యెఱుఁగఁ డనక మొన సొరం
జాలుదు చొరు మని పనిచితి; | నేలా న న్నాస దోస మెఱుఁగఁగ నిచ్చున్‌?
141
క. కుడువను గట్టను బూయను | దొడువను బోఁబనిచి కాక తొలుత మొన సొరం
గొడుకుం బనుచుట కెవ్వఁడు | గడఁగునె! నాయట్టి పాపకర్ముఁడు దక్కన్‌.
142
తే. వానితోడిద లోకమై యేను బోవ | నైతిఁ బోఁగన్నఁ బుత్త్ర శోకాతురత్వ
మున నితాంత వివర్ణతఁ బొందుచుండఁ జూడకుండెడివాఁడ నర్జును మొగంబు.
143
ఉ. వాసవునంత వానికిని వచ్చిన యాపదఁ దీర్చుఁ గాలకే
యాసురు లట్టి బల్పగఱ నైనను వ్రేల్మిడిఁ ద్రుంచు నాజి న
వ్వాసవి యాత్మజుండు పగవారలచే హతుఁడైన దుర్దశం
జేసి యలంతఁ జేడ్పడఁగఁ జేసె; విధాతృని నేమి సెప్పుదున్‌!
144
చ. కొడుకు వధించి రన్నఁ గురుకోటికి నెట్టన యల్గి రూపుమా
పెడున కడంగి పార్థుఁ డెద బేర్చిన శోకము నార్పఁ జాలునే?
పుడమి ధనంబు నాకము విభూతియుఁ జేరెన యేని నల్ల న
వ్వెడు నభిమన్యు నెమ్మొగము వే యగు పాలును బోల నేర్చునే?
145
వ. అని మఱియు ననేక ప్రకారంబులం బలవించుచున్న సమయంబునం గృష్ణద్వైపాయన మునీంద్రుం డయ్యెడకు విజయంచేయుటయు, నవ్విభుండు ప్రత్యుత్థానంబు సేసి, దండప్రణామం బాచరించి, యాసన విన్యాసన ప్రముఖ పూజావిశేషంబుల నారాధించి య మ్మహాత్ముతో నిట్లనియె. 146
సీ. ‘పరసేన భేదింపఁ బనిచితి నేను సౌ | భద్రుని వాఁడు నబ్బలము సొచ్చె;
వెనుక నేమును జొచ్చి చనఁగ సైంధవుఁడు మ | మ్మాఁగినఁ దోడ్పడ ననువు దప్పె;
నప్పుడు పెక్కండ్రు రప్పాడి న వ్వీరుఁ | బొదివిన నాఱడిఁ బోయె నట్లు
సుకుమారమూర్తిఁ బుత్త్రకు నొంటిమైఁ బిన్న | పాపని నలుఁగుల పాలు పడఁగఁ
 
ఆ. బనిచి తాను బ్రతుకు పాపాత్ముఁ డెందును | గలఁడె? విపుల శోకజలధి మునిఁగి
పేర్చు తల్లడమున బిమ్మిటి కొనియెడుఁ | జిత్త; మింక నేమి సేయువాఁడ?’
147
వ. అనిన విని మునీశ్వరుం డమ్మనుజేశ్వరున కిట్లనియె 148
చ. ‘పలువురు రాజులం దునిమె బల్లిదుఁ దాతఁడు పిన్నపాపఁడే?
యలుగుల పాలు సేయకభియాతులు పువ్వుల కోల సాఁతురే?
కలఁగుదురే విపద్దశల కాఱియ నార్యులు సావు లింత విం
తలె? గరుడోరగ ద్యుచర దానవకోటుల చావుఁ జూడమే?’
149
క. ‘ఎప్పాట నెవ్వరికి విధి | దప్పింప వశంబె? ధైర్యధనఘనుఁ డవు నీ
విప్పరుసున నడలుట గడు | నొప్పదు; శమియింప వలయు నుర్వీనాథా!’
150
వ. అనిన సాత్యవతేయునకుం గౌంతేయాగ్రజుం డిట్లనియె. 151
చ. ‘వెరవును లావునుం గలిగి విక్రమసంపద నొప్పి ధీరు లై
పరఁగిర కాని తమ్ము మృతభావ వికారము వొందకుండ సు
స్థిరముగఁ బ్రాణరక్షణము సేయఁగ రాజులు సాల రైరె? యె
వ్వరుఁ దలపోయ మృత్యు వనివార్యమె? తాపసముఖ్య! యిమ్మెయిన్‌.’
152
వ. అనుటయుఁ, బారాశర్యుండు పాండవాగ్రజున కిట్లనుఁ ‘దొల్లి యిట్లు పుత్త్ర మరణ శోకాతురుండైన యకంపనుం డనురాజు నారదమునిచేత మృత్యుప్రకారంబు దెల్లంబుగా విని యుపశమితశోకుం డయ్యె నని విందు మయ్యితిహాసంబు తెఱం గెఱింగించెద; నది నీయంతఃకరణంబు సంతాపంబు మాన్చి శాంతి యొనర్చు నవహితుండ వై యాకర్ణింపుము. 153
సీ. పగతు రకంపను పై నెత్తి వచ్చి క | య్యము సేసి యాతని నడఁగఁ బట్టి
కొనుటయుఁ జూచి తత్తనయుండు హరియను | వాఁడు దోర్దర్పదుర్వారమూర్తి
యవ్విరోధులమీఁద నడరి బల్విడిఁ దండ్రి | విడిపించి విక్రమ విహరణమునఁ
దనివోక మఱియు నుద్ధతిఁ గరిరథఘోట | భటనికాయంబుల బడలు పఱుప
 
ఆ. నుగ్రు లగు ననేకయోధులు చలమునఁ | గూడుకొని మహాస్త్ర ఘోరశస్త్ర
తతుల నక్కుమారు మృతుఁ జేసి; రప్పుడు | గనలి రభసమున నకంపనుండు.
154
క. విపినంబు నడఁచు దవశిఖి | కుపమాస్థానమయి పగఱ యొప్పు సెఱిచి యా
త్మపురము సొత్తెంచెం దూ | ర్యపటు ధ్వను లెసఁగ ననిమిషాధిపు భంగిన్‌.
155
వ. ఇట్లు గెలిచి వచ్చియు. 156
ఆ. పుత్త్రుఁ దలఁచి తలఁచి పొగులుచు నున్న య | న్నరవరేణ్యు కడకు నారదుండు
నెమ్మి వచ్చుటయును నిభృతుఁడై యాసనా | ర్ఘ్యా ది పూజనంబు లాచరించి.
157
వ. అతనికడ నుండి యమ్మహీపతి యత్తాపస ముఖ్యునకు నిజవృత్తాంతం బెఱింగించి, కొడుకు గుణంబు లగ్గించి వానిం గోలుపోవుటం జేసి విజయంబు ప్రియంబు సేయకున్నదని తన వగపును తెలిపి మఱియును. 158
క. ‘మునినాయక! మృత్యువు ప్రభు | వని విందుము లోకమునకు; నది యెట్లొకొ! త
జ్జననంబుఁ దత్ప్రభావము | వినఁ దలఁచెద; నుచితమేని వినిపింపు తగన్‌.
159
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )