| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
‘జనపాలక! సృంజయుఁ డను | మనుజేంద్రుఁడు పుణ్యమూర్తి మహిమాస్పదుఁ డి వ్వననిధి వలయములోని య | వని నొక్కఁడ యేలు దుర్నివారస్ఫురణన్. |
188 |
| వ. | సంతానార్థి యయి సంతతంబును భూసుర పూజనంబులు సేయుచుండు నా నరపతికి నారదుండు సఖుం డగుట నతని పాలికిఁ బలుమాఱు నరుగుదెంచుచుండు; నొక్కనాఁడు విప్రవరు లతిప్రయత్నంబునం గూడికొని యమ్మునివరునితో నిమ్మహీపతి కోర్కి దీర్పవలదే యని చెప్పిన. | 189 |
| క. |
‘అతఁ డతనితోడ ‘భవదీ | ప్సిత మెయ్యది నాకు నేల చెప్ప?’ వనుడు ‘నం చితగుణుఁడు రూపసియు నగు | సుతుఁ గోరుదు నెపుడు నేను సురగణవంద్యా! |
190 |
| వ. | అక్కుమారుండును మూత్రపురీష లాలాశ్రుస్వేదంబులు సువర్ణంబు లగునట్టివాఁడు గావలయు’ ననిన నమ్మహీపతికి నమ్మహాత్ముం డవ్వరం బిచ్చె; నా సృంజయుండు నత్తెఱంగుతనయుం బడసి సువర్ణష్ఠీవి యను పేరిడి ప్రియంబునం బెనుచుచు వానివలనం గనకం బనుదినంబు నుత్తరోత్తరాభివృద్ధి యగుచుండ సమృద్ధి నొంది, శయనాసన సదన ప్రాకార ప్రభృతి సమస్త వస్తువులను కాంచన మయంబులు గావించికొని యసమాన మహిమానందంబునం బ్రకాశుం డై. | 191 |
| క. |
విలసిల్లుచు నుండఁగ మ్రు | చ్చిలి పట్టి కుమారునోరఁ జీర దుఱిమి వెం గలు లగు క్రూరులు కొందఱు | వెలువడఁ గొనిపోయి యొక్క విపినములోనన్. |
192 |
| ఆ. |
కడుపు (వ) వ్రచ్చి యొడలు గలయంగ జల్లించి | పాపి పాపి చూచి, పసిఁడి గాన కచట శవము వైచి యరుగుచునుండి త | త్కర్మ ఫలముఁ దమ్ముఁ గలఁచుటయును. |
193 |
| వ. | ఆ పాపాత్ములు తమలోనం గలహించి, యొండొరుల వధియించి, యందఱు నధోగతిం జెందిరి; సృంజయుండును గొడుకుం గానక వెదకి తత్కళేబరంబు గని పరలోక క్రియలు నిర్వర్తించి, శోకంబునం బలవించుచున్న న న్నరేంద్రు కడకు నారదుం డరుగుదెంచి యతనిచేత నర్చితుండై. | 194 |
| క. |
‘జననాథ! యిట్లు శోకం | బునఁ గుందినఁ దనువు విడిచి పోదె యుసుఱు? స చ్చిన వారలు వత్తురె యే | డ్చినఁ? జెలిమిం జేసి హితము సెప్పెద నీకున్. |
195 |