పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము
షోడశ రాజ చరిత్రము (సం. అను. 1-8-360 పంక్తి)
వ. అవధానాయత్తం బగు చిత్తంబుతో విను’ మని యి ట్లనియె. 196
సీ. సంవర్తుఁ డను మహాసంయమి దేవతా | గురుతోడి యీసున నరుగుదెంచి
పూని యుపద్రష్టయై నడపంగ, హి | మాచల పాదంబునందు శక్ర
వరుణ ప్రభృతులైన సురలు మహామునీం | ద్రులును సహాయులై మెలఁగుచుండ
శాలా ప్రముఖ భవ్య సాధనంబులు గన | కమయంబులుగ వస్త్రకాంచనాజ్య
 
ఆ. దధి పయః ఫలాది తర్పణ ద్రవ్య స | మృద్ధి సకల జనులు మెచ్చ,ఁ బెక్కు
లధ్వరములు సేసె; నట్టి మరుత్తుండు | నిత్యపదవి నుండ నేర్చెనయ్య?
197
సీ. సన్మార్గమున రాజ్యసంపద నొంది భూ | సురపూజ లొనరించి, సువ్రతముల
బృందారకులఁ బ్రీతిఁ బొందించెఁ దన కర్థిఁ | బర్జన్యుఁ డేఁ టేఁటఁ బసిఁడివాన
కనకమయములైన కర్కట ఝషనక్ర | కూర్మచయముతోడఁ గురియుచుండ
నయ్యర్థ మెల్ల ధనార్థుల కిచ్చుచుఁ | గురు జాంగలంబునఁ బరమనిష్ఠ
 
ఆ. నశ్వమేధముఖము లైన రాజార్హయ | జ్ఞములు పెక్కు సేసె సకలజనులుఁ
బొగడునట్టి పాడి(ట) నెగడె సుహోత్రుఁ డ | వ్విభుఁడు దెగియె ననఁగ వినమె అధిప!
198
సీ. కాంచనాలంకార కాంతంబులై రూఢి | కెక్కిన గజములు పెక్కువేలు,
జవసత్త్వ రూపాది సకల గుణములఁ బెం | పెసఁగిన హయము లనేక లక్ష,
లమల సువర్ణమయము లగు కొమ్ములం | గొమరారు పశువులు గోటు, లూర్జి
తాంగక విలసదజావికంబులు గణ | నాతీతములు, గన్య లప్రమేయ
 
ఆ. లఖిల రత్నవిరచితాభరణంబు ల | నల్పములు, మహీసురావళులకు
నిచ్చి చేసెఁ గ్రతువు లెన్నియేనియు నంగుఁ | డతఁడు నన్యలోక గతుఁడు గాఁడె?
199
సీ. ఏడు దీవులయందుఁ గ్రీడాగతులఁ దన | రథము చరింప నరాతు లనఁగ
వినియు నెఱుంగక విభవ మార్జించుచోఁ | బ్రజల నొప్పింపని పరమపుణ్య
కర్మంబునకు మెచ్చి గారవంబునఁ దన | కక్షయధనము ఫాలాక్షుఁ డొసఁగ
నశ్వమేధములు జాహ్నవిపొంత శిష్టజ | నాకీర్ణములుగఁ బె క్కాచరించెఁ;
 
ఆ. దారకములు వృష్టిధారలు లెక్కింప | వచ్చుఁగాని యతని యిచ్చుగోవు
లెన్నఁ గొలఁది గాదు; సన్నుతిపాత్ర మా | శిబికి నుర్వి నునికి సెల్లె నయ్య?
200
సీ. యౌవనంబునఁ దప మాచరింపఁగఁ దండ్రి | పంపున నరిగిన పెంపు కలిమి,
సేతువు జలధిఁ బ్రఖ్యాతంబుగా నొన | ర్చిన మర్త్యలోక పావన విభూతి,
త్రైలోక్య కంటకు దశముఖు బంధుయు | క్తంబుగాఁ జంపిన కలితనమ్ము,
బాలురమరణంబు వాటిల్ల కుండంగఁ | జేసిన యత్యంత చిత్రమహిమ
 
ఆ. గలిగి యశ్వమేధములు మున్నుగా ననే | కాధ్వరము లొనర్చి యఖిల జనులఁ
దల్లి వోలె నరసి దశరథ రాముండు | గాలవశత నొందెఁ గాదె యధిప!
201
సీ. పూర్వవంశ్యులఁ గావఁ బూని వియద్గంగ | నవని భాగీరథి యనఁగఁ బఱపి
శక్రుండు మెచ్చఁ బరాక్రమంబునఁ బేర్చి | యప్రతిహతముగ నశ్వమేధ
యాగంబు లొనరించునప్పుడు వేయు వే | లరదంబులందుఁ గన్యల నలంకృ
తలఁ జేసి యునిచి, రథంబు రథంబున | కిభములు నూఱు నూఱేసి, యేనుఁ
 
తే. గేనుఁగునకు గుఱ్ఱములు వేయేసి పాటి | హయము హయమున కట్ల గోచయ మమర్చి,
భూరి భూరి యుతంబుగ భూసురులకు | నొసఁగినట్టి భగీరథుం డున్నవాఁడె?
202
సీ. అర్థి విశ్వావసుం డాదిగాఁ గలుగు గం | ధర్వులు హృద్యవాదన మొనర్ప,
నప్సరోనికురుంబ మాటలుఁ బాటలు | నై వినోదింపంగ, నమరగణము
బహువిధాలంకార భంగుల విన్నాణ | ములు సూప, దివ్యమునులు నుతింప
మనుజలోకం బెల్లఁ గనకాన్నవస్త్రభూ | షణ దానములఁ దృప్తి సనఁగ నశ్వ
 
ఆ. మేధ సమితిఁ జేసి మెప్పించె నింద్రుని; | శతతమాధ్వరమున నతఁడు హయము
నాస పడిన నిచ్చె నా దిలీపునిఁ జూపు | మా! ధరిత్రి నిపుడు మనుజనాథ!
203
సీ. జనన మాదిగఁ బాకశాసనుకరమునఁ | బ్రవహించు నేయును బాలుఁ ద్రావి,
ద్వాదశదినము లాతఁడు గారవింపంగ | వర్ధిల్లి, పండ్రెండు వత్సరముల
ప్రాయ మై రాజ్యసంప్రాప్తికి నేతెంచి, | యర్కుని యుదయంబు నస్తమయము
నగునట్లు పొలిమేర లైన మహాక్షేత్ర | మంతయు నొక్కండ యనుభవించి,
 
ఆ. యన్న పర్వతముల నాజ్యనదుల విప్ర | భోజనము లొనర్చి, రాజసూయ
ములును నశ్వమేధములుఁ జేసె మాంధాతృఁ డింద నిలిచెనే నరేంద్రముఖ్య!
204
సీ. అనిమిషాసుర యుద్ధమున నసురావళి | సమయించి, వర్ణాశ్రమముల నేర్ప
రించి, భూమి యలంకరించి, యగ్నిష్టోమ | హయమేధ వాజపేయాతిరాత్ర
పౌండరీకము లనఁ బరఁగిన యధ్వరం | బు లనేకములు సేసి, భూసురులకు
నఖిల భూములఁ గలయర్థంబు లెల్లను | దనకని యేమియు నునుప కిచ్చె;
 
ఆ. శుక్రునల్లుఁ డనఁగ శోభిల్లు తనయందు | ధర్మతత్త్వ మూర్జితముగ నియమ
నిష్ఠుఁడై యయాతి నెగడె శాశ్వతుఁ డయ్యె | నే నృపాల! య మ్మహీశ్వరుండు.
205
సీ. ఓర్వక పెక్కండ్రు రుర్వీశు లొక్కటఁ బైనెత్తి వచ్చిన భండనమున
వారి హేతిచ్ఛత్ర వాహన ధ్వజములు | నఱికిన నడు నడు నడిఁకి వార
లభయంబు వేఁడిన నందఱఁ గృపఁ గాచి | యేలె; నీ పెన్నేల యెల్లఁ దాన
కొని యధ్వరములు పెక్కు లొనర్చి వేడుకఁ | బాయసమ్ములు నపూపములు మోద
 
ఆ. కములు లోనుగాఁగఁ గల వంటకముల ను | ర్వీసురావళులకుఁ బ్రీతిఁ జేసి
దక్షిణలుగ మణివితానంబు లిచ్చిన | యంబరీషుఁ డేమి యయ్యెఁ? జెపుమ.
206
సీ. లక్షభార్యల నుపలాలించి యొక్కొక్క | వెలఁదికి వేవురు వేవు రాత్మ
జులు గాఁగఁ బదికోటు లలఘుమూర్తులఁ గాంచె; | వారును దోర్బలోజ్జ్వలులు నార్య
చరితులునై పేర్చి తురగమేధంబు లం | దఱు బహుదక్షిణోదాత్త భంగిఁ
జేయుచుఁ దనపంపు సేసి వర్తింపంగఁ | దానును విశ్రుతాధ్వరము లొప్పఁ
 
తే. బెంపు సొంపును సువ్రత సంపదయును | నిర్మల శ్రద్ధయును గర్మనిపుణతయును
నెఱయ శశిబిందుఁ డొనరించి నెగడె; నతఁడు | వడయఁ జాలెనె యెన్నఁడుఁ జెడని యొడలు?
207
సీ. అధికతపంబున నగ్ని నారాధించి | ప్రత్యక్ష మగుటయు బ్రహ్మచర్య
వృత్తంబు దమమును వేదవిత్త్వము నహిం | సయుఁ బాత్రదానంబు శమము వరము
గాఁ గోరికొని వేదికాస్థలి మణికన | కాత్మిక యై ముప్పదాఱు యోజ
నముల ధైర్ఘ్య ము నంత కమరు విస్తారంబుఁ | గలుగంగ నొనరించి క్రతువు సేసి
 
తే. విప్రతతులకు దాని నతిప్రియముగ | నిచ్చి, తనపేర గయ నుతి కెక్క వటము
పొగడు వడయంగఁ బుణ్యుఁడై నెగడె గయుఁడు | భూవరోత్తమ! యతఁ డెందుఁ బోయెఁ జెపుమ!
208
సీ. ఇరువది యేవురు పరిణత పాచకు | లభ్యాగతులకును నతిథులకును
బాటించి క్రొత్తగాఁ బవలును రేలును | వలయు నన్నము లిడ వెలసెఁ బశువు
లర్థి నుత్తమగతికై తామ చనుదేర | విశసించు నమరులు వేడ్కతోడఁ
బొడసూపి కడుపారఁ గుడువ హవిర్భాగ | ములు వెట్టు నివ్విధమున మహాద్భు
 
తే. తముగ నొనరించె సత్త్రయాగము దదుత్స | వంబుఁ గొనియాడ వచ్చిన వార లెల్లఁ
బ్రచుర పుణ్యాత్ముఁ డన నొప్పె రంతిదేవుఁ | డవ్విభునకును వలసె లోకాంతరంబు.
209
సీ. శరభసింహవ్యాఘ్ర సత్త్వ చయంబుల | నేడిక లె ట్లట్ల యెక్కి యాడి
కట్టుచు విడుచుచుఁ గణ్వాశ్రమంబున | దమియింపఁగా సర్వదమన నామ
మిడియె నమ్ముని; పదంపడి మహారాజ్య ప | దస్థుఁడై కాళింది తటమునందు
భాగీరథీ తీర భాగంబునను సర | స్వతి సమీపంబున వాజిమేధ
 
తే. రాజసూయాది వివిధాధ్వరము లొనర్చి | కనక నిర్మిత కరితురంగమ రథంబు
లసదృశప్రీతి విప్రులఁ కొసఁగె భరతుఁ | డన్నరేంద్ర చంద్రుండును జన్నవాఁడ.
210
సీ. మిఱ్ఱుఁ బల్లంబు నై మెలఁగంగఁ దనరథ | ప్రముఖ వాహనములఁ బఱప ననువు
గా కున్న మేదినిఁ గడుసమస్థలి గాఁగ | వెరవున నొనరించి, విశ్రుతముగఁ
దనపేరఁ బృథివినాఁ జనఁ జేసి, గోరూప | యైన యవ్వసుమతి నమరగణముఁ
బనిచి యోషధులును బహురత్నములుఁ బిది | కించి జగంబుఁ ఘోషించె పృథుఁడు;
 
తే. సేసె నానాధ్వరము లవి సెప్ప నేల, | సకల ధాత్రియు బ్రాహ్మణసమితి కిచ్చె;
నమ్మహానుభావునకును నతుల యశమ | కాక సుస్థిరమయ్యెనే కాయ మనఘ
211
సీ. బ్రహ్మవిద్వేషంబు పరికించి కోపించి | యవిధేయుఁ డైన సహస్రబాహుఁ
బరిమార్చి నృపతులఁ దర మిడి తునుమాడె | నిరువది యొక్కమా ఱెల్లచోట
నందఱ యేలెడు నన్ని భూములుఁ దాన | యేలె ధర్మోజ్జ్వల పాలనమున;
రాజయోగ్యములు ధరాసురార్హంబులు | నగు నధ్వరములు పె క్కాచరించెఁ
 
ఆ. గశ్యపునకు నిచ్చి కాశ్యపి యను పేరఁ | జనఁగఁ జేసె నుర్వి జామదగ్న్యు
వినమె యమ్మహాత్ముఁడును బరితోష వి | భ్రాంతి గలిగెనేని బ్రదుక లేఁడు.
212
చ. నలుమడి నీకు నమ్మనుజ నాయకు లేమిటఁ జూడ వచ్చినం
దలఁప భవత్సుతుండును ను (నను) దాత్తుఁడు వారలకంటె, నెందునుం
గలయది, దీని కేల యధికంబగు నెవ్వగ నింత నొవ్వ; ని
త్తెలివి మనంబునం జొనుపు ధీరతసారత గూర్పు నేర్పునన్‌.
213
వ. అని నారదుండు. 214
తే. ఆయువును బుణ్యమును జిరశ్రీయుఁ జేయఁ | జాలు షోడశరాజన్య చరిత మిట్లు
సెప్ప, నేర్పడఁగా విని సృంజయుండు | పాండవాగ్రజ! యేమియుఁ బలుక కుండె.
215
చ. పలుకక యున్న యద్ధరణిపాలుఁ గనుంగొని యమ్మునీంద్రుఁ ‘డేఁ
దెలియఁగఁ జెప్పినంతయు నతిస్థిరమై భవదీయ బుద్ధియం
దొలసెనొ? బూదిలోనఁ గ్రమ మొందఁగ వేల్చిన నేయి వోలె ని
ష్ఫల మయి పోయెనో’ యనుడుఁ బ్రాంజలియై తగ నాతఁ డిట్లనున్‌.
216
తే. ‘పుత్త్రశోకాపహంబును బుణ్యతమము | నైన యాఖ్యానమున నాదు మానసంబు
కలఁక యంతయుఁ బాసె; నిష్కల్మషుండ | నైతి నీ దయఁ జేసి సంయమివరేణ్య!’
217
వ. అనిన విన యత్తపోధనుండు ప్రీతుండై ‘నీ కెద్ది వలయు నడుగు; మిచ్చెద’ ననుటయు సృంజయుండును ‘దేవా! నీవు ప్రసన్నుండ వగు నంతకంటె మిక్కిలి వలయునది యెయ్యది? భవత్ప్రసాద భాజనంబు లయిన వారికి దుర్లభంబులగు వస్తువులుం గలవే?’ యనుటయు నమ్మునివరుండు. 218
క. ‘మ్రుచ్చుల మూఢత్వము నం | జచ్చి నరకవాసమునకుఁ జనిన తనయు నేఁ
దెచ్చెద మగుడఁగ వే నీ | కిచ్చెద వగ పుడుగు మింకనేనియు నధిపా!’
219
వ. అని చెప్పిన. 220
క. దేవముని యిమ్మెయిం దగు | దీవన యిచ్చుటయు నరుగుదెంచె సువర్ణ
ష్ఠీవి కడు నద్భుతంబుగ; | నా విభుఁడుఁ బ్రమోద సంభృతాత్ముం డయ్యెన్‌.
221
వ. ఇవ్విధంబున నత్తపస్వి యిచ్చిన యక్కుమారునకు సృంజయుం డస్త్ర శిక్షగావించి, వివాహం బొనరించి, యతండు యాగంబులఁ ద్యాగంబుల భోగంబులం దనమనంబునకుఁ బ్రియంబు సేయుచు సంతానవంతుండై నెగడిన, నతం డత్యంత సంతోషంబునం బొదలె ని ట్లా సువర్ణష్ఠీవి యశిక్షితా స్త్రుండును నకృత వివాహుండును నయాగకర్తయు నత్యాగవిదితుండును నభోగభాగియు నసంతానవంతుండును నగు సమయంబున సమయుట కారణంబుగా న న్నారదుండు గారుణ్యంబునం గ్రమ్మఱ వానిం గలిగించె; నది యట్లుండె; నవ్విశేషంబులన్నియు సంపన్నంబులయి శౌర్యంబున శత్రుధైర్యంబు దూలించి మేలిమి వడసి నాకలోక సౌఖ్యంబునం బొందిన వాసవపౌత్త్రునకు వగచుట వివేకంబు తెరువుగాదు; విను మీ లోకంబు దుఃఖబహుళం బగుటయుఁ దపోదానాద్యనుష్ఠానంబుల మానవులు సురలోక సుఖంబు సాధింపం జూచుట సుప్రసిద్ధంబు గాదె! నీ వయ్యర్జున నందనుఁ డెట్టి పుణ్యపరులుం బడయ నరిది యగు పదంబున నునికి దెలియుటకును బావనంబులైన పలువుర భూపతుల వృత్తాంతంబులు వినుటకును ఫలంబయిన పరిజ్ఞానంబున సమాధాన సుస్థిరుండవై యుండుము; పోయి వచ్చెద’ నని పలికి, పారాశర్యుం డంతర్ధానంబు సేయుటయు, ధర్మసూనుం డుపశమితశోకుం డయ్యును వివ్వచ్చుండు వచ్చిన వానితో నే మనువాఁడ నను తలంపు పుట్ట నూరకుండె’ నని సంజయుండు సెప్పుటయు. 222
తే. ‘అతనితో ధృతరాష్ట్రుఁ డిట్లనియెఁ ‘గ్రీడి | సంగరమున సంశప్తక సమితి నేమి
సేసె? సుతువార్త యెవ్వరు సెప్పి? రాతఁ | డట్లు దెగుట యెఱింగి యెట్లయ్యెఁ జెపుమ!’
223
క. అనిన విని సూతసుతుఁ డి | ట్లనుఁ బేరడవులు దహించు ననలము చందం
బున సంశప్తక సేనల | ననిమిషపతి సుతుఁడు దీవ్రుఁడై పొరివుచ్చెన్‌.
224
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )