| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అట్లు మర్దించి మగుడు నప్పుడు మాధవు నాలోకించి. | 225 |
| చ. |
‘కలయఁగ దుర్నిమిత్తములు గానఁగ నయ్యె; మదీయ చిత్తముం గలఁగెడు; మేను మ్రానుపడఁగాఁ దొడఁగెన్; గురుఁ డారయంగఁ గే వలుఁడె? నృపాలుఁ డేదెసకు వచ్చెనొ?’ యన్న నతండు రాజుఁ ద మ్ములు సుఖు లొండుమై నశుభముం గల దిప్పు డెఱుంగ నయ్యెడున్.’ |
226 |
| వ. | అని పలికెఁ; దదనంతరంబ యద్దామోదర ధనంజయులు సంధ్యా సముచిత కరణీయంబు లాచరించి యరుగుదెంచి నిజ శిబిరంబు సొత్తెంచి; రది చిట్లిన చిత్రరూపంబులు గల కుడ్యంబునుం బోలె వివర్ణాకారులైన జనులవలనం బాడఱియున్నం, దత్ప్రకారం బనుసంధించి య న్నరుండు నారాయణున కిట్లనియె. | 227 |
| క. |
‘సైనికులు నన్నుఁ గనుఁగొని | యాననములు వాంచి తొలఁగి యరిగెద రది యే మో నేఁడు వేణు వీణా | గానస్వనములును వీటఁ గలుగవు కృష్ణా! |
228 |
| క. |
ఈ మేలు ప్రజ కొనర్చిన | యా మహిమకు నెలవు గొంతి యగ్రతనయుఁ డో, భీముఁ డొకొ, తమ్ముఁగుఱ్ఱలొ | కో, మఱి యెవ్వరొకొ! తలఁపుఁ గొలఁదికి మీఱెన్. |
229 |
| ఆ. |
అలరు మొగముతోడ నభిమన్యుఁ డేలొకో | యెదురు రాఁడు; నాకు నెట్టివార్త చెవులు సోఁకు నొక్కొ! చేవెట్టి కలఁచిన | భంగిఁ ద్రిప్పికొనఁ దొడంగె మనము. |
230 |
| క. |
పలుమాటల కిటు మఱుమా | టలు వలుకని కృష్ణుతో నడలు మది మొలవం బలుకుచు ధర్మసుతుని విడి | దల కరిగెను మోము వెల్లఁదనమునఁ గదురన్. |
231 |
| వ. | ఇవ్విధంబున నరిగి, యన్నరపతి బంధు మిత్త్రులును మాన్యరాజన్యులుం దానును నొక్కయెడ నున్నం దత్ప్రదేశంబునకుం గేశవుండును దోడన చనంజని, వా రుమ్మలించి యునికియు వారలలోన సుభద్రాసూనుండు లేమియుం జూచి, సవ్యసాచి యడుగులు దొట్రువడ నక్కొలువులోనికిం బోయి కలయంగనుంగొని యెలుంగు రాల్పడ నిట్లనియె. | 232 |
| క. |
‘ఆననములు వెలవెల్లం | గా నడ లొదవినది మీకుఁ; గానఁ దడవ మీ లో నభిమన్యుఁడు లేఁడే | మో, నాకుం జెప్పుఁ; డేల యూరకయుండన్. |
233 |
| క. |
ధనురాచార్యుఁడు దగఁ బ | న్నిన పద్మవ్యూహ మొరులు నేరరు చొరు మం చనుమానింప కతనిఁ జొరు | మనరుగదా! మీ యుపాయ మాఱఁడిఁ బోవన్. |
234 |
| ఉ. |
అమ్మొనసొచ్చు చొప్పు తెలియన్ వినె; నంతియకాని యిమ్ములం గ్రమ్మఱు భంగి వాఁడు వినఁగానఁడు దీని నెఱుంగ కున్కిఁ బా పమ్మునఁ బోయి మీరు సొరఁ బంచిన నుక్కునఁ జొచ్చి యోధబృం దమ్ములచేత మ్రగ్గఁడుగదా! కురువీరులు సుట్టుముట్టినన్. |
235 |
| మ. |
హరిమేనల్లుఁడు, గొంతి కూర్చు మనుమం, డస్మత్తనూజుండు, సం గరకేళీ నిపుణుండు, దివ్య శరశిక్షాశాలి యవ్వీరు నె వ్వరొకో నేలకుఁ దెచ్చి? రొక్కరునిచే వాఁడేల చిక్కుం? బొరిం బొరిఁ బెక్కండ్రురు విచ్చుచుం బొదువుచుం బోరాట గల్గెం జుమీ! |
236 |
| క. |
గురులకు భక్తుఁ డుదారుఁడు, | గరుణ గలఁడు, శౌర్య ధైర్య గాంభీర్యధురం ధరుఁడు, మొగమోడు నా సుర | వరపౌత్రుఁడు లేమి కోర్వవచ్చునె చెపుఁడా! |
237 |
| క. |
అన్నగుమోమును, నత్తెలి | గన్నులు, నవ్వెడఁద యురముఁ గన్నారంగాఁ గన్నను బ్రదుకుదుఁ; గానక | యున్నను బ్రాణంబు లెట్టు లుండఁగ నేర్చున్? |
238 |
| సీ. |
హంసతూలిక పాన్పునందుఁ బొందెడు మేను | కఠినంపు నేలతోఁ గదిసె నేఁడు; గొడుగుల నీడ పై నడరఁ జెన్నగు మోము| పొరిఁ బర్వు పెందూళి బ్రుంగె నేఁడు; లలనలు లీలమైఁ గొలువ నుండెడు భోగి | వఱళులలో నున్నవాఁడు నేఁడు; నానాజనములకు నాథుఁడై శోభిల్లు | దొర యనాథత్వంబుఁ బొరసె నేఁడు; |
|
| ఆ. |
వినయరతుఁడు, హృదయవిదుఁడు, సుభద్ర గా | రాబుపట్టి, మగలరాజు, మాన ధనుఁడు, దివిజరాజు మనుమఁడు, నా చెలి | కాఁడు, ముద్దులాఁడు లేఁడు నేఁడు. |
239 |
| ఉ. |
అక్కట! మందభాగ్యునకు నట్టి తనూభవరత్న మెవ్విధిన్ డక్కు? విధాత నిర్దయుఁ; డొడంబడునే కడు మేలి వస్తువుల్ పెక్కుదినంబు లున్కి? యరిబృందము పిల్చినఁ బోటు బంటనై యక్కడ కేల పోయితి? మహాగుణభూషణుఁ గోలుపోయితిన్.’ |
240 |
| వ. | అనుచుఁ జదికిలం బడి ఫల్గునుండు. | 241 |
| ఉ. |
హా! యను, ధర్మరాజ తనయా! యను, న న్నెడఁబాయ నీకుఁ జ న్నే?’ యనుఁ, దల్లి నేఁప జనునే! యనుఁ, గృష్ణుఁడు వీఁడె వచ్చె రా వే! యను, నొంటి వోకఁ దగవే! యను, నేగతిఁ బోవువాఁడ నే నో యభిమన్యుఁడా! యనుఁ, బ్రియోక్తుల నుత్తరఁ దేర్పవే! యనున్. |
242 |
| వ. | అని మఱియు ననేక ప్రకారంబులం బలవించి యుధిష్ఠిరు నాననం బాలోకించి. | 243 |
| ఉ. |
‘పావని సేరి యుండఁ డొకొ! పార్షతుఁ డచ్చట లేఁడె? యొండుమైఁ బోవఁగఁ బంచితే ద్రుపదుఁ? బోరికి సాత్యకి రాక తక్కెనే? భూవర! మత్స్య నాథుఁ డెట వోయెనొ! డెప్పరమైన నీకునుం గావఁగ రాక తక్కెనొ! తెగం గత మేమి సుభద్ర పట్టికిన్? |
244 |