పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము
అర్జునుఁడు ధర్మరాజు నభిమన్యుండు సచ్చిన విధంబు నడుగుట (సం. 7-50-45)
క. పడుఁ గాక యేమి? పగఱం | గడిమి మెఱసి చంప నొంపఁ గనియెనె నృప! నీ
కొడు కిట యట సూడక యె | క్కుడు మగఁటిమి నుఱికి పేరు గొనియెనె పోరన్‌?
245
వ. అని పలికి నిట్టూర్పు నిగిడించి చింతించి. 246
చ. పలువురు సుట్టుముట్టుకొని బాణకృపాణ ముఖాస్త్ర శస్త్ర పం
క్తులఁ గడు నొంపఁగాఁ దనకుఁ దోడ్పడు వారలు లేక నన్‌ మదిం
దలఁపఁడ? యత్తఱిన్‌ రిపువధంబున కెయ్దుము తండ్రి! యేను గొం
దలమునఁ బొందకుండ నని తాఁ బలుమాఱును జీరకుండునే?
247
క. అక్కట! తప్పఁ దలంచితి | నక్కొలఁదులవాఁడె కృష్ణు నల్లుఁడు? పోరన్‌
స్రుక్కునె! బాహాగర్వము | దక్కునె! నా కొడుకు మిన్ను దలపైఁ బడినన్‌.
248
ఆ. పిన్న నగవుతోడఁ జెన్నెసలారు సౌ | భద్రుమొగము సూడఁ బడయకున్న
వాఁడ; నా మనంబు వ్రయ్యలై పో; దిది | ఱాతఁ జేసినది యొకో తలంప!
249
క. పలువురు క్రూరత బాలునిఁ | జలము కొని వధించునపుడు శౌరిని నన్నుం
దలఁప రొకో మనముల వా | రలు దానికి నేమి నీఁగ రాదయ్యెడినో!
250
క. కటకట! పేరిన పెన్నె | త్తుట జొత్తిలియున్న మేనితోఁ గొడు కేచ
క్కటిఁ బడియున్నాఁడో? య | చ్చొటు సూపెడు వారు లేరె? చూచెద వానిన్‌.
251
సీ. పడియుండి వాఁ డిలఁ బొడిచిన చందురు | క్రియఁ దత్తలము వెలిఁగింప కున్నె!
యే మని నాతోడఁ బ్రేముడించు నొకో! సు | భద్ర పుత్త్రునిఁ జూడఁ బడయ కున్కిఁ;
బగతుర నిర్జించి మొగము పోటుల నొచ్చి | పొడసూపరాఁడయ్యెఁ గొడుకు నాకు;
నడలునఁ దల్లడ పడియెడు ద్రౌపది | వంత మాన్పింప నెవ్వరికి వశమె?’
 
తే. యని యలంతమైఁ బలుమాట లాడుచుండి | తలఁచి మఱియును ధర్మనందనుని యాన
నంబు వీక్షించి నిర్జరనాథ తనయుఁ | డెలుఁగు గుత్తుకఁ దగులంగ నిట్టు లనియె.
252
వ. సంశప్తక సమితి తోడం దమకించి పోరి పోరి కౌరవసైనికుల సింహనాదంబుల వింటి; నప్పు డెలుంగెత్తి యుయుత్సుం డాడినమాటల నాకర్ణించితి. 253
సీ. ‘పెనఁగంగఁ జాలరు బీభత్సుతో మీరు; | బాలుని నొక్కరుఁ బలువు రిట్లు
సంపితి; రిది మీకు సంతోషకాలమే? | యేడ్తురు గా, కార్వ నేల చెపుఁడ!
హరికి నర్జునునకు నప్రియం బొనరించి | బ్రదుకంగ వర్చునే భవునకైన?
నది యట్టులుండె; నీ యధికపాపము ఫలం | బెట్లును జెఱుపక యేల తక్కు?’
 
ఆ. ననియె నివ్విధమున నరిసేన యోధుల | నతఁడు వలుక వీనులార వినియుఁ
దెలియనైతి; వాసుదేవుండు వినియెన | యని తలంచి దాని నంత గొనక.
254
క. మనుజాధిప! తగు సమయం | బున నీ వెఱిఁగింపఁ గన్నఁ బొరివుచ్చనె వే
చనుదెంచి నీ సుతుం బొది | వినయెడఁ దత్క్రూర యోధవీరుల నెల్లన్‌.’
255
క. అని పలికి మఱియుఁ గొడుకుం | బనవుచు శోకమున మునుఁగు ఫల్గునునిఁ దగం
దనకరములఁ బొదువుచు ని | ట్లను హరి చిత్తంబులోన నడ లూనంగన్‌.
256
చ. ‘ఇటు దగునయ్య శూరులకు నెల్లను బోకడ యిట్ల కాదె! యే
మిటికి నలందురన్‌? మొనలు మేకొని యాయుధ జీవనంబు నూఁ
దుటయు నెఱుంగవే? రిపులఁ ద్రుంచి యశం బిల నించి పుత్త్రుఁ డె
క్కటి దివి చూఱకోల్‌ ప్రియమ కా కిది యప్రియమే తలంపఁగన్‌?
257
ఆ. ఎఱుఁగవలయుదాని నెఱిఁగి కోవిదుఁ డగు | నట్టి నీకు వగవ నగునె పార్థ!
నీదు వంత సూచి నీ వార లందఱు | దీను లైరి; వీరిఁ దేర్పవలదె?
258
వ. వీరలం జూచి తగుమాట లాడు’ మనిన నత్యంత శోకాక్రాంతస్వాంతుం డగుచు సుభద్రాకాంతుండు గద్గదకంఠంబుతోడం దోడంబుట్టువుల కిట్లనియె. 259
చ. ‘మనసిజమూర్తి యైన యభిమన్యుని మాటలు వీనులార నే
వినవలతుం; దదీయమృతి వేడ్క నొనర్చిన వారు గ్రక్కునం
జని తగ వానిఁ గాంచి సుఖ సంగతిమై జరియించునట్లుగా
ననిచెద; నేఁటి పోరు దెలియంగల భంగియు మీరు సెప్పుఁడా!’
260
వ. అని మఱియును. 261
చ. ‘అలవుఁ జలంబు శౌర్యమును నస్త్రమహత్త్వముఁ గల్గు నిందఱున్‌
గలుగఁగ నెట్లు సచ్చు బలఘస్మరుచే నయినం బ్రచండదో
ర్బల విభవాభిరాముఁడు సుభద్ర సుతుం? డిది యెన్ని భంగులం
దలఁచినఁ బోల; దేమిటికతంబున నా ఘనుఁ డిట్టు లయ్యెనో?
262
క. మిమ్మునుఁ బాంచాలురఁ గడు | నమ్మి చెడితి; వాని రక్షణమ్మునఁ బ్రౌఢ
త్వ మ్మిట్లు లేమి యెఱిఁగిన | నెమ్మెయిఁ గాచికొననేరనే యబ్బాలున్‌.
263
క. రథవితతి వఱపి మీ రవి | తథముగఁ గలియంగ మిమ్ముఁ దాఁకి కలఁచి యే
రథికులు సమయించిరి యరి | మథన భుజా విభవు నక్కుమారోత్తమునిన్‌?’
264
వ. అని యంతకంత కగ్గలించు నుమ్మలికంబునం గలంగి, యంత నిలువక. 265
క. ‘ఉక్కును నస్త్రబలము మీ | కెక్కడియది? సాలరైతి రిందఱు? నని న
య్యొక్కరుఁ గావఁగ మీ రీ | తక్కువ కోర్చితిరి? మిమ్ముఁ ద క్కన నేలా?
266
క. బలహీనులు సంగర భీ | తులు నగు మి మ్మెఱిఁగి యెఱిఁగి తొలఁగి తనూజుం
దలఁపక యొంటి మెలఁగు వెం | గలి నగు నను దూఱుకొందుఁగా కే మందున్‌?
267
తే. మానుసులు వోలె నున్నార; లేను లేని | తఱి మహాగుణశాలి నా తనయుఁ గాచి
కొనఁ గడంగర? సింగారమునకుఁ గాక | మఱువులును గైడువులు మీకు మానమునకె?’
268
వ. అని భంగించి యూర్పులు సందడింప మొగంబు బిగువారం గ్రోధశోకంబులు మనంబునఁ బెనంగొనం గన్నీ రొలుక నూరకున్న, నెల్లవారు నతనికి మాఱుపలుకను దేఱిచూడను వెఱచియుండి; రప్పు డచ్యుతుం డొక్కరుండు ననునయాలాపంబులం దేర్పుచుండం బాండవాగ్రజుండు గుపితాఖండలనిభుండగు నా సవ్యసాచితో సాంత్వన స్వరంబున నిట్లనియె. 269
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )