| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
‘అనఘ! సంశప్తక హననంబునకు నీవు | సనిన నొడ్డన మేర్చికొని కడంగి నడచి ద్రోణునిఁ దలఁపడితి మవ్వీరు మో | హర మేము సొరఁ జాలమైతి మనఁగ నేల తద్బాణార్చు లేర్చిన నక్కడఁ | దేఱిచూడను లేక త్రిప్పికొంటి మమ్మొన భేదింప నభిమన్యుఁ డోపుఁ బొ | మ్మనియెడు తలఁపు నా కపుడు పుట్టి, |
|
| ఆ. |
వానిఁ బిలిచి ‘నీవు వాకిలిఁ బుచ్చు మం | దఱము మొగ్గరంబుఁ దఱియఁ జొచ్చె దము వడిని భవత్పథంబున’ ననుడు నం | భోధి సొచ్చు కరటి పోల్కిఁ జొచ్చి. |
270 |
| క. |
నీ యుపదేశముఁ దనచే | దోయి బలువుఁ దోడు గాఁగ ద్రోణుఁ గడచి వే పోయి మొనఁ జొచ్చి సైన్యము | పాయ వడఁగఁ గలఁగఁ జెదరఁ బఱవఁగఁ జేసెన్. |
271 |
| క. |
కని కుంభజముఖ్యులు వా | నిన పొదువఁగ నేముఁ జొచ్చి నిరతిశయ రయం బున వానికిఁ దోడ్పడుటకుఁ | జనఁ జన మా కడ్డపడియె సైంధవుఁడు వడిన్. |
272 |
| వ. | అతండు రుద్ర వరానుభావంబునం జేసి యక్షుద్ర బలుం డగుటనే మతని మిగులం జాలక చిక్కితి; మా సౌభద్రుం జుట్టుముట్టి గురుకర్ణ కృతవర్మ కృపగురు పు త్తాది యోధవీరులు పెక్కండ్రు సిక్కు వఱుపం, జేవ సెడక వాఁడు బలంబు మెఱయఁ జలంబు నెఱయ నా రాధేయ ప్రముఖులం బఱపియు, బృహద్బల లక్ష్మ ణ ప్రభృతులగు రాజుల రాకుమారులఁ బలువురం జంపియు, సొంపారెం; బదంపడి పదాతియు గదాపాణియునై రథాంగపాణి యల్లుండు దూఁగాడుచుం బోరాడునెడ దుశ్శాసన తనయుండు దాఁకి వానిచే విరథుండై తానును గదగొని పెలుచం దలఁపడియె; నత్తెఱంగున నైన గదారణంబున వారిరువురుం బరస్పర నిహతులై పడి; రివ్విధంబున నక్కుమారుండు దన తండ్రులకును మామలకును రూఢియగు రణక్రీడం గీర్తిపరిస్ఫూర్తియు నాకలోక సుఖంబునుం జేకొనియె’ నని చెప్పుటయు. | 273 |
| క. |
తెల్లముగ సుతుపడుట విని | జల్లని డెందంబు సెదర, సంధులు ప్రిదులం, దల్లడ మగ్గలమై మూ | ర్ఛిల్లె నరుఁడు బంధు లెల్లఁ జేష్టలు దక్కన్. |
274 |
| వ. | ఇట్లు పరవశుండైనఁ గృష్ణయుధిష్ఠిరులు గరతలంబుల నెత్త, నొక్కింతసేపునకు సేదదేఱి సైంధవుం దలంచి యతండు. | 275 |
| ఆ. |
అవుడు గఱచి యెఱ్ఱ నగు నాననంబుతో | బొమలు ముడిచి, చెమట పొడమ, మేను కంప మొందఁ, గనలు గదిరిన కటికి న | వ్వెసక మెసఁగ నన్న కిట్టు లనియె. |
276 |
| మ. |
‘వినుఁడీ! నాదు ప్రతిజ్ఞ నీవు నిఖిలోర్వీనాథులున్; సింధురా జు నవశ్యంబును నెల్లి సంపుదు భయస్థుండై నినుం జొచ్చినన్, వనజాక్షున్ శరణంబు వేఁడినను, గర్వం బేది నన్నుం దగం గనినం, బోరు దొఱంగి పోయిన నెఱుంగం గాని సత్యవ్రతా! |
277 |
| క. |
బాలధ్వంసకు నా దు | శ్శీలుం గాచుటకు నన్నుఁ జెనకిన నస్త్ర జ్వాలలఁ గౌరవ యోధులఁ | దూలించుచు వానిఁ గవియుదుం జటుల గతిన్. |
278 |
| ఆ. |
ఇట్లు సేయనైతి నేని గురుద్రోహి | గతికి, బ్రహ్మఘాతిగతికి, మద్య పానరతుని గతికి, మానార్హ జనపరి | వాదిగతికిఁ బోవువాఁడ నధిప! |
279 |
| వ. | మఱియు నొక్క ప్రతిన యవధరింపుము. | 280 |
| చ. |
అనిమిష దైత్యకింపురుషు లాదిగ నెవ్వరు వచ్చి కాచినం దునుముదు నెల్లి సైంధవునిఁ దోయజమిత్త్రుఁడు గ్రుంకకుండుము న్న నరవరేణ్య! యిత్తెఱఁగు నా కొనరింపఁగ రాక యున్న నే ననలము సొచ్చువాఁడ నృపులందఱుఁ జూడఁగ గాండివంబుతోన్.’ |
281 |
| వ. | అని పెలుచం బలికి, యప్పరమ కోదండంబు దెప్పించి, సజ్యంబు గావించి, గుణధ్వని నిగుడం జేయుటయుఁ, బద్మనాభుండు పాంచజన్యంబు పూరించె, దేవేంద్ర పుత్త్రుండు దేవదత్తం బొత్తె; నన్నాదంబులును దత్సైనిక సింహనాదంబులును దూర్యనినదంబులును నింగి వొంగం జెలంగె; నగ్గాండీవంబును నృత్తంబు సేసిన చందంబు నొందె; నస్త్రంబు గవదొనలు వెలువడి వెలింగె; నయ్యవసరంబునం గొండొక దెలివొంది పవననందనుఁ డప్పురందరనందను వదనంబు వీక్షించి. | 282 |
| క. |
‘అతి తీవ్రమైన నీదగు | ప్రతిన కుపోద్బలము గాఁగ బరఁగిన ధీరో ద్ధతి పాంచజన్య రవమున | ధృతి తూలక యున్నె కురుపతికి నింద్రసుతా!’ |
283 |
| వ. | అని యగ్గించె; నా సమయంబునం గోపంబు పెంపునను బూనికిపై భరంబునను భీమసేనుని సల్లాప సౌహార్దంబునను దన డెందంబు శోకంబు డిందువడం గలయం గనుంగొని విజయుని వంది మాగధసందోహంబులు సంస్తుతించె; నట్టియెడ నిక్కడ. | 284 |
| క. |
జననాథ! పాంచజన్య | ధ్వనిఁ గూడి చెలంగు దేవదత్తరవంబున్ విని, భీతి సంభ్రమంబుల | మన సైన్యము లెల్ల ఘూర్ణమానము లయ్యెన్. |
285 |
| క. |
అప్పుడు వేగులవారలు | సెప్పిన నంతయు నెఱింగి సింధువిభుఁడు దన్ గప్పెడు నెవ్వగపెల్లున | నిప్పులఁ బడినట్లు గాలు నిలువఁగ లేమిన్. |
286 |