| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
చని యాప్తు లైన బల వ | న్మనుజేంద్రులు గొలువనున్న మానవనాథుం గని యిట్లను సిగ్గు గడచి | తన యుల్లముఁ గలఁచి వెఱపు దల్లడవెట్టన్. |
287 |
| ఉ. |
ఏ నొకరుండనే తనకు నెగ్గొనరించితి? నేల నాపయిం బూనినవాఁడు ఫల్గునుఁడు? పోర వధింపగ నెట్టి పాడి? మీ కీ నెఱిసంతసంబు వగ పేటికి నా కెట యేని పోయెదన్ వాని ప్రతిజ్ఞ కడ్డపడు వారె సురాసుర సిద్ధసాధ్యులున్. |
288 |
| వ. | అనుచుం గొలువు గనుంగొని. | 289 |
| ఆ. |
ద్రోణ కర్ణ శల్య దుర్యోధనులుఁ గృప | బాహ్లికులును జముఁడు వట్టికొన్న వాని నైనఁ గావ వలఁతురు వలచిన | నొల్లకున్న నెట్టు లొకొ యెఱుంగ.’ |
290 |
| వ. | అని వెండియు. | 291 |
| క. |
‘పెదవులు దడుపుచుఁ గాళ్ళున్ | గుదివడ వడఁకుచు, మనంబు గొందలపడఁగా నిది ‘యేటి మాట లాడెదఁ? | దుదిఁ బార్థుఁడు గానకుండఁ దొలఁగన వలయున్. |
292 |
| వ. | మీయందఱచేత ననుజ్ఞాతుండనకదా! పోయివచ్చెద’ ననవుడు నిజకార్య ధురంధరుండగు నక్కురుధరణీవరుం డతని కిట్లనియె. | 293 |
| మ. |
‘మును నీ వెన్నితి విక్రమాఢ్యు లని మమ్ముం గొందఱన్; ద్రౌణి పెం పును, హార్దిక్యుబలంబు, సౌబలుని యేపుం జేవయున్, సోమద త్తుని ధైర్యంబును శౌర్యమున్, శలు మహా దోర్దర్పముం గూడ నె న్నిన నీ కెట్లగుఁ జూడు మిట్టి మగలు న్వేయేల ని న్నిత్తురే? |
294 |
| క. |
నమ్ముము, వెఱవకు; మేనును | దమ్ములునుం గోట నీకుఁ దాత్పర్యముమై నిమ్మేటి మగలు సూరెల | నెమ్మి నిలువ నింద్రుఁ డైన నీ కెదురగునే?’ |
295 |
| వ. | అని చుట్లనున్న రాజులం జూపిన నూఱడిల్లి, యంత నిలువక నీ కొడుకుం దోడ్కొని ద్రోణుని కడకుం జని జయద్రథుండు దనకు నర్జునునకు ధనుర్విద్యా విభవంబు నందలి వాసి యెట్టి? దని యడిగిన, నతండు ‘నీకు నతనికి నాచార్యకంబు సమప్రకారంబ; యవ్వీరుండు వివిధ శ్రమంబుల యలజడి కోర్చి యలఘు ప్రయోగంబులు పెక్కులు సాధించుటం జేసి నీకంటె నధికుండై యుండు; నది యట్లుండె; నేను గలుగ నీ వా సవ్యసాచికి వెఱవ వలదు; మద్బాణంబుల మఱువున నున్న నిన్ను దేవతలకుం దేఱిచూడవచ్చునే? వివ్వచ్చునకుం బ్రవేశింపరాని బంధురవ్యూహంబు పన్నించెదఁ; గులధర్మంబు శిథిలంబు గాకుండ సమరంబు సేయు’మని చెప్పి వెండియు. | 296 |
| క. |
శ్రుతు లభ్యసించి తతుల | క్రతువులు సేసితి కులంబు రక్షించితి వీ వితరుల క్రియ మృత్యుభయా | న్వితుఁడవు గాఁ దగునె మేదినీవర! యింకన్. |
297 |
| క. |
యాదవ కౌరవ పాండవు | లాదిగఁ గల యఖిలనృపులు నవ్యయ వృత్తిన్ మేదిని నిలుతురె క్రమమునఁ | బోదురు గా కెల్ల జనులుఁ బోవు తెరువునన్. |
298 |
| క. |
తపములు దానంబులుఁ జే | సి పడయు లోకంబు లెల్లఁ జేయలఁతులు భూ మిపులకు సంగరవిద్యా | నిపుణతఁ దలఁ కుడిగి పోర నేర్చినఁ జాలున్.’ |
299 |
| క. |
అని యూఱడిల్లఁ బలికిన | విని యతఁడు గలంకు దేఱి, విభుఁడుం దానుం జని సంగ్రామోత్సాహం | బునఁ బొదలిరి తూర్యఘోషములు దివి ముట్టన్. |
300 |
| వ. | సర్వసైన్యంబులును దైన్యంబు వాసి కయ్యంబుకడంక నుల్లసిల్ల సైనికోత్తముల సింహనాదంబులు సెలంగె; నిత్తెఱంగున భవత్తనయు శిబిరంబు సముద్యమ సుముఖం బయ్యె; నంత నక్కడ పాండవాగ్రజుండు పాంచాలమాత్స్య పాండ్య యాదవ కేకయాది రాజలోకంబు శోకంబు దగుమాటల మలుఁగం జేసి విడిదలకుం జన నియమించి, యనుజుల నచ్యుతునిం బెట్టికొనియున్న యెడ నగ్గోవిందుండు గాండీవి కిట్లనియె. | 301 |
| క. |
‘నాతోఁ దలపోయక రో | షాతురతం బ్రతినవట్టి తవనీనాథ వ్రాతంబు వినఁగ; నిట్టులు | చేతాఁకున డెప్పరంబు సేసితి కంటే! |
302 |
| క. |
అస్తమయమునకు మును రిపు | మస్తకముం దునుమవలయు; మన కిది సాలన్ దుస్తరమును నగు; నస్త | వ్యస్తం బగునేని నాకు వగపు గదిరెడున్. |
303 |
| వ. | మన వేగుల వారు వచ్చిరి; వారు సెప్పిన తెఱంగు వినుము: ‘నీవు ప్రతిజ్ఞ సేసినప్పుడు మ్రోసిన చిందంబులపెల్లునన్ బెదరి యవ్వీటివారు గవ్వడి కొడుకు చావునకుం గోపించి యిప్పుడ యెత్తి వచ్చు నని రథకరితురంగంబుల నాయితంబుసేయుచుండ, సైంధవుఁడు దనచారులచేత నీ యాడిన మాటలు విని, వెఱచఱచి కురురాజు గొలువున్న చోటికిఁ జని, సిగ్గఱి నిన్ను నగ్గించి, నీ ప్రతిన యెఱిఁగించి, యతం డలిగిన మీరు గావలే రని పలికి, తా నెందేనియుం బోయెద ననిన, నమ్మనుజపతి గురు కృతవర్మ కృప కర్ణ శల్యాశ్వత్థామ ప్రభృతులగు మేటి మగలం బేర్కొని ‘వీరును నా తమ్ములును గలుగ నరునకు నిన్ను జుట్టనవ్రేలనుం జూపవచ్చునే’ యని భయంబు వాపె; భారద్వాజుండును మహోత్సాహుండై దురవగాహ వ్యూహ విధానంబున జయద్రథుం జేరకుండ నిన్ను నిలువరించువాఁడయ్యె; అది యట్టిద; వా రొక్కొక్కరుండు గెలువరాని యట్టి జెట్టి జోదు; లందఱు నొక్కపనికిం దలకొని నిలిచిన గెలుచుట యశక్యంబు గాదె! ఇక్కార్యం బార్యు లగు నాప్తజనంబులం గూర్చికొని విచారింపవలయు’ ననవుడు వివ్వచ్చుండు నవ్వుచు నిట్లనియె. | 304 |