పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము
శ్రీకృష్ణుఁడు దారుకుతో అర్జును ప్రతిజ్ఞా విషయంబులైన వాక్యంబులం గొన్ని సెప్పుట (సం. 7-56-27)
చ. ‘నరుఁ డిటు లాడునే నృపగణంబు వినంగ? జయింపవచ్చునే
గురుకురు సేనలం దరణి గ్రుంకక మున్న తలంపఁ జాల దు
స్తర మిది యాతఁ డీ ప్రతిన దప్పకయుండఁగ దీర్చునట్టుగాఁ
బొరయక యున్న దుర్దశలఁ బొందనె పాయని నిందఁ గుందనే!
348
క. కడుఁ గూర్తుఁ గవ్వడికి న | య్యొడలు గలుగ నేను బ్రతికియుండుదుఁ గా; కె
క్కడి బ్రదుకు నాకు నాతం | డెడలిన; నప్పార్థుఁ గాతు నెల్ల విధములన్‌.
349
క. నాలో సగ మర్జునుఁడే | నాలమునం దతని కగుట యరుదే! యెమ్మై
వ్రాలెదనో? రిపు లెట్టులు | గూలెదరో? చూడు; నాకుఁ గురుబల మెదురే?
350
తే. ఎల్లి సచరాచరములగు నెల్ల భూత | ములును నాదగు నేర్పును, బలముఁ, బాండు
తనయులకు నేను గూర్చుటయును నెఱుంగ | వలయు దారుక! యేచెదఁ గలనిలోన.
351
క. ఇనుఁ డస్తమింపకుండఁగ | మును సైంధవుఁ జంపువాఁడ; మునుకొని పరు లే
చినఁ జిత్రవధ విహారం | బున నప్పుడు రౌద్రరసము పొడ వేర్పఱుతున్‌.
352
ఉ. సైంధవుఁ డొక్క డేల? యనిఁ జావకపోవఁగ నేర్తు రెట్లు గ
ర్వాంధుఁడు కౌరవేశ్వరుఁడు నందఱు దమ్ములు, నెల్ల మిత్త్రులున్‌,
బంధులుఁ దోడు వచ్చిన నృపాలురుఁ బాండవకీర్తి సర్వది
క్సింధుర దంతకాండములఁ జెందఁగఁ జేయుట కేను బూనఁగన్‌.
353
వ. అది క్రమంబునం జూచెద; వెల్లి నీవు మనయరదంబు పన్ని శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకంబులను గనకమణి మాలికాలంకృతంబులం జేసి పూన్చి, గరుడధ్వజంబు సంఘటించి, చక్ర గదా శార్‌ఙ్గ ప్రముఖాస్త్ర శస్త్రంబులు దగు తెఱంగున నునిచికొని మైమఱువు దొడిగిరమ్ము; పాంచజన్య రవం బాకర్ణించి నప్పుడ వేగంబ యెయిది కొను’ మనిన విని దారుకుండు. 354
చ. ‘అలఘువిచార! యట్ల తగు; నప్పని సేసెద; నంత సేయఁగా
వలయునె? యెవ్వ రక్కడ నవార్యులు క్రీడికి సారథిత్వముం
దలకొని నీ వనూన శుభదం బగు వర్తన మాచరింప నీ
నిలుపును బార్థు చాలుటయు నేఁడుగదా భువనం బెఱింగెడున్‌.
355
వ. అని సవినయంబుగాఁ బలికి దనుజమర్దను తమకంబు వారించె; నంతఁ ‘బాంచజన్య రవాభిజ్ఞానంబు సవిశేషంబుగా నతనిచేత వినికొని తత్కాలంబున నాలంబులోనికి నరదంబు గొనివచ్చెద’ ననియె; వెండియు వాసుదేవుండు సూతునితోడ సముచిత సల్లాపంబులు సేయుచుండె; నంత నట బీభత్సుండు ప్రతిజ్ఞోత్సాహంబు నిర్వహించు తెఱంగు దలంచుచు దామోదర కృత స్థండిల శయనంబున నుండి శోకనిద్రా వివశుండయ్యె; నయ్య వసరంబునం గలలోనం గృష్ణుం డతనిపాలికిం బోయిన, నాతండు భక్తిం బ్రత్యుత్థానంబు సేసి తనయున్న సెజ్జ యిచ్చి, తొలంగి నిలుచుండ, నమ్మురారి యాసీనుండై యుండి యతని కి ట్లనియె. 356
క. వగపున కెడ యీకుము; నె | వ్వగఁ గుందిన మానవుండు వైరులచేతన్‌
దెగుఁ గాని తనదు కార్యముఁ | దగ నొనరింపంగ లేఁడు; తగునే వగవన్‌?’
357
వ. అనిన విని యతం డతని కిట్లనియె. 358
క. ‘వగ పింక నెన్నఁటికి దెగు? | మిగిలి ప్రతిన పూరగింప మేకొని చను నా
మగటిమియు లావు మాన్చుట | తగవే గురునకు నతండు దానికిఁ బూనన్‌.
359
క. ఇనతనయ సహిత మడ్డము | సనుదెంచు జనంబు పెల్లు సైంధవుఁడు బలం
బున కెల్ల వెనుక నునికియు | మనమునఁ దలపోయ వగపు మానునె నాకున్‌?’
360
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )