పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము
కృష్ణార్జునులు స్వప్నమందుఁ గైలాసమునకుఁ బోవుట (సం. 7-57-24)
వ. అనిన నచ్యుతుం ‘డది యట్టిద! కాదె!’ యని పలికి తదీయ హితార్థియై యుపాయంబువిచారించి, యుప స్పర్శనంబాచరించి,తూర్పు మొగంబై యుండి, యవ్విజయు వీక్షించి, శూలపాణికిం బరమ సాధనం బైన పాశుపతంబు నీకుంబ్రస్ఫుట పరిజ్ఞానం బయిన నీవు జయద్రథవధం బవశ్యంబును జేయుదు; వమ్మహాస్త్రంబు కలిమి సమంత్రక ముష్టిక స్థానక విజ్ఞానంబుగాఁ గ్రొత్త సేసికొనుట మేలు; తదర్థంబుగా నద్దేవుఁ జిత్తంబున నిలిపి సభక్తిక ధ్యానంబు సేయు’ మనవుడుఁ గిరీటియుం గృతాచమనుండును భూసమాసీనుండును నై పరమేశ్వర స్మరణ తత్పరత్వంబున నుండి, కృష్ణుండును దానును గగనంబున కెగయుటయు, నతండు దన వలచేయి వట్టికొని చనుదేరం దా రిరువురు నుత్తరాభిముఖులై పోవుటయుం గాంచె; నవ్విధం బున వారలు చారణసిద్ధ గంధర్వ సేవితంబైన పథంబున వివిధ విశేషంబు లాలోకించుచుం బోయికైలాసంబుఁగని, యందు సరిత్సరోవర సుందరంబును బుష్పలతా భూషితంబును రమ్యతరు సంతాన కాంతంబును నయిన కుబేర విహారస్థానంబు సూచుచుం జనిచని, దాని కనతి దూరంబున మహనీయ మణిమయంబయి తేజరిల్లు మహామందిరంబు సొచ్చి, యచ్చటఁ బ్రమథగణ పరివృతుండును, బార్వతీ సహితుండును, బ్రద్యోతన సహస్ర ప్రభా విభాసమానుండును, దివ్యోత్తమ సేవ్య మానుండును, మహాముని ప్రస్తూయమానుండును, నప్పరోజన సంగీత మంగళమహిత పురోభాగుండును నై పేరోలగంబున నుండి శోభిల్లు శంకరు దర్శించి, సప్రణవోచ్చారణంబుగా దండ ప్రణామంబు లాచరించి యున్న నన్నరనారాయణుల దెసం బ్రసాదమందస్మిత సుందర విలోకనంబు లొలయ నయ్యిందుధరుండు మధురస్వనంబున నిట్లనియె. 361
క. ‘స్వాగతమే మీ యిద్దఱ | యాగమనంబునకు హేతు వగు కోర్కి యను
ద్వేగంబున నెఱిఁగింపుఁడు; | వేగమ యొడఁ గూర్తు నెల్ల విధముల దానిన్‌.’
362
వ. అనినం బ్రీత చేతస్కు లగుచు నుత్థితులై లలాటంబుల నంజలిపుటంబులు ఘటించి నిలిచి వాసుదేవార్జునులు తమ చిత్తంబులు భక్తిరసంబున జొత్తిల్లుచుండ. 363
చ. ‘రవి శశివహ్నిలోచన ! సుర ప్రతివీర విమర్దన క్రమా!
భువనమయాత్మకా! భుజగభూషణ! పోషితభక్త! సంయమి
స్తవన కథావధానపర! దర్పకదర్ప హరా! నిరస్త సం
భవమరణాది వైకృత! యపారగుణా! గుణ దోష వర్జితా!
364
క. జగములు గలిగింపఁగ నవి | దగు వర్ధన మొంద నిలుపఁ దఱితో వానిం
దెగఁ జేయ నీవ నేర్పరి | వగుట శ్రుతులు సెప్పు నిర్మలాద్భుతమూర్తీ!
365
క. ప్రకృతి యనఁ బురుషుఁ డనఁగా |వికృతు లనం బరఁగుచున్న వీనికి నెల్లన్‌
సకలాత్మక! నీ విభవమ | యకృత్రిమాధారభూతమై యుండు శివా!
366
క. అవ్యక్త మప్రమేయము | సువ్యక్త మనాది భక్తి సుగమ మగమ్యం
బవ్యయము త్రిలోచన! నీ | దివ్య మహిమ యాగమోపదేశము రుద్రా!’
367
వ. అని మఱియు ననేక ప్రకారంబుల నవాఙ్మనసగోచరుండగు నప్పరమేశ్వరుం బ్రస్తుతించి; రప్పు డచ్యుతుండు పార్థునిం బాశుపతం బర్థింపు మని కఱపిన, నతం డవ్వరంబు వేఁడుటకై విశ్వేశ్వరుం దప్పక చూచి తాను మున్ను ముకుందునందు సమర్పించిన నిశాసమయ పూజా ద్రవ్యంబు లగు మాల్యానులేపనంబు లద్దేవుని దివ్యదేహంబునం గాంచి యచ్చెరువంది, యమ్మురహర పురహరుల యేకత్వంబు మనంబునం గొనియాడి, ‘దేవా! భవదీయ దివ్యాస్త్రంబు దయసేయు’ మని విన్నవించుటయు భక్తవత్సలుం డగు శక్తినాథుండు గృష్ణు లిరువురను దరహాసంబుతో నవలోకించి. 368
తే. అమృతమయ మగు నుల్ల పద్మాకరమున | నాదు బాణాసనంబు బాణములు నున్న
యవి; దృఢవ్రతులార! మీ రచటి కరిగి | వానిఁ దెం డిచ్చటికి’ నని యాన తిచ్చె.
369
వ. అ ట్లనుగ్రహించినం జిత్తానువర్తన తత్పరులగు తత్పరిసరవర్తులు కొందఱు దోడ్కొని పోవం బోయి పరమమునులగు నన్నర నారాయణులు త్రిణయన నిర్దిష్టంబైన యద్దివ్యసరస్సునందు. 370
క. నాలుకలు గ్రోయుచు విష | జ్వాలలు నిగుడంగ నుగ్రసర్పద్వయ మా
భీలాకృతి నుండఁగ బి | ట్టాలోకించి జనితాద్భుతాత్మకు లగుచున్‌.
371
వ. అవ్విధం బద్దివ్యాస్త్ర విలాసంబుగా నెఱింగి, పాదప్రక్షాళనోపస్పర్శనంబు లాచరించి యమ్మహోరగంబుల కుపస్థానంబు సేసి, వేదవిదులగు నమ్మహాత్ములు నియతాత్ములై శతరుద్రీయంబు జపించుచు నప్రమేయ ప్రభావుండగు భవునిం దమభావంబులలో నిలిపికొని యుండం దదీయానుభావంబునం జేసి యాదందశూకంబులు ముందటి చందంబు విడిచి విల్లును నమ్మునునై యున్నం జూచి యా సవ్యసాచియు శౌరియు సమ్మదంబునం బొదలి వానిం బుచ్చుకొని వచ్చి శంభు సన్నిధిం బెట్టుటయు. 372
తే. నీలలోహితవర్ణుండు బాలుఁ డొక్క | బ్రహ్మచారి మహాబల భవ్యమూర్తి
హరుని పార్శ్వ ంబు నందుండి, యలిగి యా శ | రాసనము పుచ్చికొని శర మరి నమర్చి.
373
వ. తెగవాపుటయుం దదీయ స్థానకంబును ముష్టి ప్రకారంబును నేకాగ్రదృష్టిం గనుంగొను గాండివికి మన్మథ మథనుండు మంత్రస్వరూపం బనుగ్రహించినం బరిగ్రహించి. 374
క. పురహరుఁ డనుమతి సేయఁగ | శరము శరాసనము దివ్యసరసిన యిడి య
న్నరుఁడు సనుదెంచి యాశం | కరు ముఖకమలంబు తెలివిఁ గాంచి ముదమునన్‌.
375
వ. తనకు నరణ్యంబున నయ్యీశానుం డిచ్చిన వరంబును, దత్కాల సందర్శన ప్రకారంబునుం దలంపించిన నెఱింగి, యప్పశుపతి యతనిపైఁ గరణార్ద్రంబగు కటాక్షవీక్షణం బొలయ ‘నది యట్ల కాక దానికి నన్యధాత్వంబు గలదే?’ యనియె నప్పు డప్పాశుపతాస్త్రంబు బ్రస్ఫుటంబుగాఁ బడసినవాఁడై పార్థుండు పులక పటల పరికలిత దేహుం డగుచుం దన యుత్సాహం బప్రతిహతంబయ్యె నని మనంబున నిశ్చయించెఁ దదనంతరంబ. 376
తే. భవునిచే సాదరానుజ్ఞ వడసి శౌరి | ఫల్గునులు పలుమాఱుఁ దత్పదయుగంబు
ఫాలములు సోఁకఁ బ్రణమిల్లి బహులరోమ | హర్ష సంభృతగాత్రులై యరుగుదెంచి.
377
వ. నిజ శిబిరంబు సొత్తెంచి; రివ్విధంబున నర్జునుండు గల గాంచెఁ; గృష్ణుండు దారుకుతోడం దగు మాటలాడుచుండఁ దెలతెల వేగె; నది యాధనంజయస్వప్నాంత సమయంబై సంఘటించె నని యిట్లు సంజయుండు సవ్యసాచి యంతర్వర్తనంబు తెఱంగు ధృతరాష్ట్రున కెఱింగించె ననుటయు. 378
క. ‘మునినాథ! దేవకీసుతుఁ | డును సంక్రందనతనూజుఁడుం బూనిన యా
పని యెమ్మెయిఁ గడతేఱెనొ | వినవలతుం; దేటపఱుపవే పరిపాటిన్‌.’
379
వ. అని అడుగుటయు. 380
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )