| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె. | 2 |
| తే. |
‘ధర్మపుత్త్రుండు వనుప సాత్యకి గడంగి | తన బలము దెస నడచుట వినిన యాంబి కేయుఁ డర్జునుఁ గలియ శైనేయుఁ బోవ | విడిచిరే మనవా?’ రని యడుగుటయును. |
3 |
| వ. | సంజయుం డతని కిట్లను; ‘నట్లు మఱందిం బనిచి యుధిష్ఠిరుం డాచార్యుల నవలోకించి యాశిని వరుపిఱుందన తఱిమె; నప్పుడు ధృష్టద్యుమ్నుం డవష్టంభంబున నెలుంగెత్తి పురికొల్పి పాండవసైనికులు గవిసిన మనవారును మార్కొనిరి; తదనంతరంబ. | 4 |
| క. |
తలలను గరముల వక్ష | స్స్థలముల జఘనములఁ దొడలఁ జరణంబుల న య్యిలఁ గప్పెడు సాత్యకి కో | ల్తల కోర్వక నీ బలము గలంగంబడియెన్. |
5 |
| క. |
విచ్చిన మూఁకల కడ్డము | సొచ్చిన నేడ్వురు నృపాల శూరోత్తములం బుచ్చె జముం గొలువఁగ వి | వ్వచ్చుమఱఁది పెఱ నృపాల వర్గము దెరలన్. |
6 |
| సీ. |
ఆ సమయంబున నతని మార్కొని కుంభ | భవుఁ డేడు తూపులు వఱపె మేన నతఁ డస్త్రసప్తకహతుఁ జేసె; నాతని | నగ్గురుఁ డాఱింట నశ్వములను సూతు నాతని నొంచె; నాత డయ్యాచార్యు | నేపుమైఁ బదియును నేడు నాఱు నెనిమిదియును బదునెనిమిదియును శాత | శరముల నొప్పించి తురగచయము |
|
| ఆ. |
నాల్గు సాయకముల నడికించి సారథి | నొక్క మార్గణమున ను బ్బడంచి యార్చుటయును ద్రోణుఁ డలిగి | వాలమ్ములఁ బొదివెఁ దద్రథంబు మద మెలర్ప. |
7 |
| వ. | ఇట్లు బాణజాలంబు గుప్పి గురుండు సాత్యకి నుపలక్షించి. | 8 |
| క. |
‘నా చేతి బలువు గని నీ | యాచార్యుం డోడి తొలఁగి యరిగెను నీవే త్రోచి యట వోవు వాఁడవు | సూచెదుగా కెట్లు నిన్ను స్రుక్కించెదనో! |
9 |
| క. |
అనవుడు ‘ధర్మాత్మజు పను | పున నే గాండీవికడకుఁ బోయెద; న న్నిం తన నేటికిఁ? దడవయ్యెడు | ననుగ్రహము సేయు; మర్హ మది పెద్దలకున్.’ |
10 |
| క. |
అని పలికి తొలఁగిపోవుట | మనమున నూహించి దైత్యమర్దనుతమ్ముం డను సూతుతోడ ‘ద్రోణుఁడు | మనలం బోనీక పెనఁగు మాత్సర్యమునన్. |
11 |
| వ. | తడసినఁ గర్జంబు దప్పు; నితనికి నోసరించి పోవలయు; విను మిదియె బాహ్లికబలం; బదే యంగసైన్యం; బల్లదె దాక్షిణాత్యసేన; వీనియం దొక్కసందున వెడలు ద’, మని గడంగి యడ్డపడిన నొప్పించి చిక్కువఱిచి పోద మనిన నట్ల కాక యని యద్దారుకానుజుండు ద్రోణునకుం దొలంగించి తేరు దోలందీవ్రబాణంబులు గురియుచు నగ్గురుండు వెనుతవుల నయ్యాదవ సింహుండు సింహవిక్రమంబున నంగచమూచ్ఛేదనంబు సేసి చను నెడఁ గృతవర్మ యాతనిఁ దాఁకి. | 12 |
| క. |
ఆ ఱమ్ము లతని మేనం | దూఱంగా నేసి నాల్గు తురగాంగములన్ గీఱించినఁ గని ద్రోణుం | డూఱడి ధర్మజుని దెసకు నున్ముఖుఁ డయ్యెన్. |
13 |
| వ. | అక్కడ మొగమయ్యు నిక్కడ నేమఱక యుండె; నప్పుడు. | 14 |
| క. |
కృతవర్మయొడల సాత్యకి | శితసాయకములు పదాఱు సెరివినఁ గోపో ద్ధతి మెఱయఁగఁ బలుదూపుల | నతఁ డాతని నుచ్చిపోవునట్లుగ నేసెన్. |
15 |
| వ. | వెండియు. | 16 |
| చ. |
విలు దునుమాడి వక్షమున వే పదియమ్ములు నాఁట నాతఁ డు జ్జ్వలఘనశక్తి వైచి కృతవర్ముని బాహువు నొంచి ధైర్య ని శ్చలమతి నొండు విల్లు గొని సారథిఁ జంపిన సూతకృత్యమున్ వలనుగఁ బూని యా రథికవర్యుఁడు నిల్చె నితాంతధీరతన్. |
17 |
| వ. | నిలిచియు సాత్యకి దెసం దఱుమక భీమసేన పురస్సరంబైన బలంబున కడ్డపడ నరిగె; నవ్విధంబున నతని బెట్టు వఱిచి యా శైనేయుం డచటు గడచి చనియె’ ననిన విని ధృతరాష్ట్రుండు సంజయున కి ట్లనియె. | 18 |
| చ. |
గురు కృతవర్మ ముఖ్యు లతిఘోరపరాక్రమ శీలు; రట్టి నా దొరలను సైన్యసాగరము దోర్బల సంపద గాసి సేసె న న్నరుఁ డది గాక క్రమ్మఱ వినం గడు విస్మయ మి ట్లజయ్యుఁ డై వెరవున లావునం బరిభవించుచు సాత్యకి యేపు సూపెనే? |
19 |
| మ. |
హరియుం బార్థుఁడు నట్లు నేర్పు గల బాహాశక్తిమైఁ జొచ్చుచో దొరలున్ సేనలు బెల్లుఁ గూలుటకు నా దుర్యోధనుం డెంత యా తురతం బొందెనొ? దంతి ఘోటక పదాతుల్ సాత్యకిస్ఫార దో స్స్ఫురణన్ మ్రగ్గుట కెట్లు దాను ననుజుల్ శోకించెనో యక్కటా!’ |
20 |
| వ. | అనవుడు సూతసూనుం డమ్మానవపతి కి ట్లనియె. | 21 |
| క. |
‘నీ యవినయంబు పెంపున | నీ యాపద సంభవించె; నింక వగచినం బాయునె? యితరుల క్రియ శో | కా యత్తుఁడ వగుట నీకు నర్హమె యధిపా! |
22 |
| వ. | సుస్థిరుండ వై సమర ప్రకారంబు వినుము; ‘సాత్యకి యత్తెఱంగునం జని కాంభోజసేనఁ జొచ్చిన నందలి మేటి మగలు దలపడి; రట్టియెడం గుంభసంభవుండు. | 23 |
| క. |
కని కృతవర్మకు సారథి | నొనర్చి తన కృత్యమునకు నునిచి కడఁగి యా శినివరు వెనుకొన ధర్మసు | తుని దొర లయ్యస్త్రగురునిఁ దొడర నడరినన్. |
24 |
| క. |
వారిఁ గృతవర్మ మార్కొని | దారుణ శర శిఖల నేర్చి తల్లడపఱుపం గా రయము గుంది నిలిచిరి | వా రొండొరుఁ జూచుచును వివర్ణాకృతులై. |
25 |
| వ. | ఇట్లు హార్దిక్యుబలు విడి కోహటించిన రథికులం బురికొలిపికొని వృకోదరుండు సోదరపుత్త్రమిత్త్ర సహితంబుగా నతనిపై గవిసె; నట్టి సమయంబున నయ్యనిలజుండును ధృష్టద్యుమ్నుండును శరత్రయంబులను, ధర్మనందన ద్రుపదులు బాణపంచకంబులను, హైడింబుం డేడమ్ములను, మత్స్య పతి పదియేనింటను, సహదేవుం డిరువదేనింటను, శిఖండి యిరువదింటను, ద్రౌపదేయులు డెబ్బది తూపులను, నకులుండు సాయక శతంబునను నొక్కుమ్మడి నమ్మేటివిలుకానిం బొదివిన నతండు. | 26 |
| సీ. |
ఐదైదు శరముల నందఱ స్రుక్కించి, | భీముని నేడింట బెట్టు వఱిచి ధనువుఁ గేతనమును దునిమి డెబ్బది తూపు | లతిరయంబున నుర మాడ నేయ సోలిన యమ్మరుత్సుతుఁ జూచి యందఱు | నా కృతవర్మపై నడరి; రంతఁ దెలిసి వృకోదరుం డలఘు దారుణసము | జ్జ్వలశక్తి నాతని వైవ నతఁడు |
|
| తే. |
ముత్తునియఁ జేయ దొడ్డ విల్లెత్తి యతని | యొడలు నెత్తురు వఱ్ఱు సేయుటయు నాస మీరనందనుఁ దక్కటి వారి నొంచె | మూఁడు మూఁడ మ్ము లేసి యవ్వాడిమగఁడు. |
27 |
| తే. |
అందఱును జుట్టుముట్టి తీవ్రాస్త్రజాల | కములఁ గృతవర్మ నొంప, శిఖండి గదిసి యాక్రమించిన విలు ద్రుంచె నాతఁ డప్పు | డతని చాపంబు దునిమె నుగ్రాసి వైచి. |
28 |
| క. |
ఆలోనన భోజపతిన్ | వాలమ్ముల బొదివి రెల్లవారలు దానం దూల కతఁడు బలువిలు గొని | క్రాలుచు నా భీమముఖ్య రథికుల నొంచెన్. |
29 |
| వ. | అప్పుడు. | 30 |
| ఉ. |
ఒండొక చాప మెత్తికొని యుగ్రత శాంతనవాంతకుండు వే దండము వోలెఁ గిట్టిన నుదగ్రత సింహనఖోపమ స్ఫుర త్కాండములం దదంగము రథంబుపయిం బడ నేసె భోజనా థుం డది యాజికిం దొలఁగఁ దోలె రయంబున సూతుఁ డార్తుఁ డై. |
31 |
| వ. | ఇట్లు శిఖండి గం డడంగిపోయినం గని మత్స్య చేదికేకయాది సైన్యంబులు బరవసంబు సేసి యురవడించిన నా కృతవర్మ మర్మభేదనస్ఫార నారాచ పరంపరా ప్రవాహంబున వానినెల్లం గలంచె; తత్కలకలం బాలించి సాత్యకి య ట్లబ్బలంబులు వికలంబు లగుట యాలోకించి, విజయునకుం దోడ్పడం బదంపడి పోఁదగు; రాజు వలనారయవలయు నని యూహించి తనకు నడ్డపడిన భరద్వాజుని తోడి సమరంబు సాలించి మరలి యరదంబు దోలుకొని యరుగుదెంచి కృతవర్మునిం దాఁకి యేసిన, నతండును బొగలేని మంటచందంబున నుద్దీపించి సాయకజ్వాలలు నిగిడించిన నవి మగిడించి యా శైనేయుండు. | 32 |
| శా. |
భల్లం బొక్కట విల్లు ద్రుంచి రయ మొప్పన్ నాల్గిటన్ వాజులం ద్రెళ్ళన్ బెట్టుగ నేసి సూతుతల సందీప్తైక బాణాహతిన్ డొల్లం జేసి యదల్చి, యి ట్లతని యాటోపంబు మాన్పించి యు త్ఫుల్లాస్యుండయి పోవ నడ్డపడినం ద్రుంచెం ద్రిగర్తావళిన్. |
33 |
| వ. | ఇట్లు కృతవర్మ విరథుం డైన రయంబునం బురికొని యురవడించిన పాండవ సైన్యంబులం గని కుంభసంభవుం డా శినివరు విక్రమ విహారంబున కడ్డపడం గడంగక యా సైన్యంబుల సంరంభంబు దన విజృంభణంబున వారించి నిలిచె; నిత్తెఱంగునం ద్రిగర్తసేనఁ జిక్కువఱిచి తఱిమి చను నయ్యాదవరత్నంబు ప్రయత్నంబునకు భంగంబు సేయ నుత్తుంగ మాతంగంబును గొలిపి జలసంధుండు మదాంధుం డయి మార్కొనుటయు. | 34 |