| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
ప్రదర ప్రవాహమునన | మ్మదవద్ద్విరదంబు పటుగమన ముడిపి ముదం బొదవిన సాత్యకి విలు బె | ట్టు దునిమె న మ్మగధనాథుఁడు మహోగ్రుం డై. |
35 |
| తే. |
తునిమి నవ్వుచు నేఁబది తూపు లురము | నందు నాఁటిన శైనేయుఁ డలిగి బెట్టి దంపు విలుగొని యాతని ధనువు నఱకి | యుఱక యఱువది యమ్ములు వఱపె మేన. |
36 |
| వ. | దానికిం జలింపక జలసంధుండు. | 37 |
| చ. |
పటుగతి నా శినిప్రవరు బాహువుఁ దోమర కీలితంబు సే యుటయును గాక త్రుంచె ధను వుగ్రకృపాణము వైచి యాతఁ డు త్కట మగు నల్క నొండువిలు గైకొని వాని నికృత్తహస్తునిం ద్రుటిత శిరస్కునిం బ్రదరధూత మదావళుఁ జేసి యార్చినన్. |
38 |
| క. |
పెలుకుఱి యచ్చటి మూఁకలు | గలఁగిన గని తన ముఖంబు కయ్యంబునకున్ బలియురఁ గృతవర్మాదుల | నిలిపి గురుఁడు వచ్చి యా శినిప్రభుఁ దాఁకెన్. |
39 |
| వ. | ఇవ్విధంబునం గడంగిన కుంభసంభవుం జూచి యతని ప్రాపున దుర్మర్షణ దుస్సహ వికర్ణ దుర్ముఖ దుశ్శాసన చిత్రసేన ప్రముఖు లగు కురు కుమారు లొక్కపెట్ట కవిసి మిక్కుటం బగు తూర్యరవంబులతోఁ బెక్కమ్ముల సాత్యకిం బొదువ నత్తుములంబులకు దుర్యోధనుం డేతెంచి తమ్ములం గలిసినం గనుంగొని గురుండు వార లతని కోపుదు రను బుద్ధిఁ బాండవసేనాముఖంబునకుం జనుదెంచిన నయ్యచ్యుతానుజుం డారథికు లందఱ కన్నిరూపు లయి వారల శరాసారంబులు నివారించుచు నొకని నొకని ననేక బాణజాలంబుల నొప్పించుచుండ నక్కౌరవేశ్వరుం డుద్దామగతిని గవిసి వాలమ్ము లాతని తనువునం జొనిపిన నతండు. | 40 |
| క. |
నగుచు విలు దునిమి తీవ్రా | శుగముల నొంచుటయు నీదు సుతు లెల్లను నా మృగపతివిక్రముపైఁ దఱ | చుగ నిగిడించిరి ప్రదీప్త సునిశిత శరముల్. |
41 |
| క. |
చిక్కు వడక సాత్యకి యొ | క్కొక్కరు నయిదయిదు దృఢ మహోగ్రాస్త్రములన్ స్రుక్కించి యెనిమిదిటఁ బే | రుక్కున నక్కురునృపాలు నొడలం గ్రుచ్చెన్. |
42 |
| ఉ. |
అంతటఁ బోక రత్నమయ మైన భుజంగ పతాక గూల్చి య త్యంత రయంబుమై ధనువు నశ్వచయంబును సూతుమేను నిం తింతలు వ్రయ్యలై పడఁగ నేసిన బెగ్గిలి తేరు డిగ్గి భూ కాంతుఁడు వాఱె సేన కలఁగంబడి మ్రోయ నతండు నవ్వఁగన్. |
43 |
| వ. | ఇట్లు వాఱి చిత్రసేను నరదం బెక్కె నక్కోలాహలం బాలించి కృతవర్మ తనరథంబు రయంబున నద్దెసకుం బఱపం బనిచి యురవడి నరుగుదెంచినం గని శినిపుంగవుండును నిజస్యందనంబు సమ్ముఖంబు సేయించె; నయ్యిరువురుం గొఱవి గొఱవిం దాఁకిన తెఱంగునం దలపడి యొండొరులపైఁ బ్రచండ బాణంబులు పరఁగించుచుం బోరునెడ జనార్దనానుజుండు హార్దిక్యు నతిక్రమించి. | 44 |
| తే. |
హయములను సూతు నొంచి శరాసనంబుఁ | ద్రుంచి మెఱుఁగులు వెరిఁగిన దొడ్డనార సంబు మే నుచ్చిపో నేయఁ జచ్చినట్ల | మూర్ఛ వోయి మోఁకాళులు మోవఁబడియె. |
45 |
| వ. | ఇత్తెఱంగునం దేరిపయిఁ గూలిన కృతవర్మం దెగియెన కాఁ దలంచి ధనంజయుం గలయం దమకించి సాత్యకి యక్కడఁ బోవ నా భోజపతి దెప్పిఱి సన్నద్ధుండై మరలి చని యెప్పటి నెలవున నిలిచి యనిలతనయ ప్రముఖుల కడ్డపడినం జూచి యాచార్యుం డచ్చోటి కతనిం జాలించి శౌర్యధుర్యుం డగు నా శినివరుం డట సనుట సైరింపం జాలక రయంబున. | 46 |
| క. |
మగుడఁ జనియాఁ గి నిశితము | లగు నారాచములు మూఁట నతని నుదుట బె ట్టుగ నాటినఁ ద్రిశిఖరయుత | నగము క్రియం బొలిచె నతఁడు నరవరముఖ్యా! |
47 |
| వ. | ఆ రథికవరుండును గురునిపైఁ గ్రూర నారాచంబులు నిగుడించె; నిట్లు దొడంగి యయ్యిరువురు నొండొరు శరజాలంబులు వారించుచుఁ దురంగంబుల యంగంబుల రుధిరంబులు పూరించుచు సారథుల నొప్పించుచు మేనుల వాలమ్ముల గుప్పించుచు నసదృశంబు లగు కరలాఘవంబులు సదృశంబులుగా బోరునప్పుడు. | 48 |
| మ. |
ధనురాచార్యుఁడు కేశవానుజు ధనుర్దండంబు ద్రుంచెన్; గదం గొని వైచెన్ వడి నాతఁ డగ్గురుఁ డెడం గ్రూరంపు భల్లంబునం దునుమం గ్రక్కున నొండు విల్లు గొని యాదోర్దర్పదుర్దాంతు మై ఘనబాణంబుల నొంచె నించె నతఁ డాకాశంబు గర్జాధ్వనిన్. |
49 |
| ఆ. |
అలిగి గురుఁడు శక్తి నడరింప నది విధి | ప్రేరణమునఁ జేసి తేరు దాఁకెఁ గాని యతనిఁ దాఁకఁ గానద యతఁడు త | ద్బాహుశాఖ నొంచెఁ బటుశరమున. |
50 |
| వ. | నొంచినం గోపించి. | 51 |
| క. |
చాపాచార్యుఁడు సాత్యకి | చాపము దునుమాడి సూతు సమ్మూర్ఛితుఁ గా నేపారియేయ రథ్య | వ్యాపారము దాన నడపి యతఁ డని సేసెన్. |
52 |
| వ. | ఆలోన నతని రథచోదకుండు తెలిసిన నెలమిం బొంది. | 53 |
| క. |
బలువిడి బహుభంగుల ను | జ్జ్వల శరములఁ బోరి పోరి శైనేయుఁడు బె ట్టిలఁ బడ సారథి నేసినఁ | దొలఁగంగాఁ బఱచె ద్రోణుతురగములు వెసన్. |
54 |
| ఆ. |
అచటి రాజలోక మగ్గురు నరదంబు | సనిన దిక్కు సనుచు సంభ్రమమున నాఁగి కొనుఁడు పట్టుఁ డలుపుఁ డేయుఁ డ | శ్వముల ననఁగఁ దెరలె సైన్యసమితి. |
55 |
| వ. | ఇ వ్విధంబున నిజరథంబు విఫల మనోరథం బై పోయిన నదియ పోకగాఁ బోయి సన్నద్ధుం డై సముద్ధతం బైన పాంచాల బలంబుచేతం గలంగు తనమూఁకలం బురికొలిపికొని కుంభసంభవుం డవష్టంభ విజృంభణంబున సేనాముఖంబునం బొలిచి నిలిచె; నిత్తెఱంగున ద్రోణ కృతవర్మ దుర్యోధనాదులగు జెట్టి జోదుల బెట్టు వఱచి చిఱునవ్వొలయ సాత్యకి సారథితో ని ట్లనియె. | 56 |
| క. |
‘ఇక్కడఁ గృష్ణుల తేజము, | నక్కడఁ బవమాననందనాది జనుల పే రుక్కును గెలిపించె మనలఁ; | జిక్కక వెడలితిమి శత్రుసేనలచేతన్. |
57 |
| వ. | అని పలికి యర్జునుం డున్న దిక్కునకు రథంబు రయంబునం బఱపం బంచిన వాఁడును నట్ల చేయ విమలాశ్వవేగంబునం జారు భీషణం బగు నత్తేరు నీ వారికి దుర్నిరీక్ష్య ంబై నభంబున భానురథంబు సనుచందంబున. | 58 |