| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
అరుగఁగ సుదర్శనుం డను | ధరణీపతి యడ్డపడియె దర్ప మలర న య్యిరువురుఁ బెనంగుటయు న | చ్చెరువుం గావించె నచటి సేనల కెల్లన్. |
59 |
| వ. | అట్టి యెడ నమ్మహీనాథుండు. | 60 |
| క. |
పలు తునియలు సేయుచుఁ దూ | పుల దనదెసఁ జేరనీక పోర శినివరుం డలిగి తురగముల సారథి | నిలఁగూల్చి తదుత్తమాంగ మేడ్తెఱ నఱకెన్. |
61 |
| వ. | నఱకి నిజసారథిం జూచి. | 62 |
| క. |
‘గురుఁ డను జలనిధిఁ గడచితి; | నొరులు దలంపంగ నాకు నులిగాలువ లీ నరపతుల సరకు గొన నీ | వరదము సననిమ్ము నేఁటి యని కలయకుమీ! || |
63 |
| వ. | అనవుడు వాఁడు నగుచు ‘నీ విక్రమంబునకు నా వెరవు సంగడంబు గాదె! సంగరంబున నేమి సేయుదు? నెవ్వని పైఁ దేరు నడపుదు?’ ననిన విని శినివరుండు వివ్వచ్చుచేతం జచ్చిన కరితురగ నరనికాయంబుల తిట్టలు సూపి ‘యజ్జాడం దేరు వఱఫు; మదె గాండీవగుణ చండనాదంబు వీతెంచుచున్న యది; నేఁడు పాండవ మధ్యముం డిచ్చిన ధనుర్విద్యా విలాసంబు మెఱయను బాండుసూనుల కేను జేయు భక్తి స్నేహంబులు నెఱపను వలయు; నా కడంక గని కురువిభుం డిరువురు ఫల్గునులను బుద్ధికలంగు నట్లు సేసెద’ నని పలుకు నవసరంబున నద్దెసం గాంభోజ యవన సైన్యంబు లతని కడ్డపడం గడంగిన నవ్వీరుండు గుణంబు సారించి యబ్బలంబువలనికి దేరు వఱపించి. | 64 |
| క. |
నానాస్త్రంబులు ముందఱ | వే నిగుడన్ బడలువడిన వీరభటులపై నేనుంగుల గుఱ్ఱంబుల | పీనుంగుల మీఁద దేరు పెలుచం బఱపెన్. |
65 |
| వ. | ఇవ్విధంబున వెండియుం గిరాతశకబర్బర పారద యవన ప్రముఖ మ్లేచ్ఛసేనల రూపడంచి నీ మూఁకలు గలఁ గం దఱిసి చిత్ర వర్మంబు మైచాయగా నారాచంబులు నఖంబులును విల్లు బలుమొగంబును నై బెబ్బులి వోలెం బోవం బోవ దుర్యోధన దుశ్శాసన చిత్రసేన వివింశతి శకుని దుస్సహ దుర్ధర్షణ క్రథప్రభృతి రథికనికరంబు రభసంబునం బోకు పోకు మను నెలుంగులతోఁ బిఱిందిదెసం దఱిమినం దత్కలకలంబు విని యతండు సూతు నాలోకించి. | 66 |
| క. |
‘మందగతిఁ జనుము నావెను | కం దగిలెడు సైన్యజలధి గ్రక్కున శోషిం పం దీవ్రశరార్చుల నం | దంద వడిం బఱపి నగుచు నరుగుద’ మనినన్. |
67 |
| క. |
అతఁ డట్ల చేయ నబ్బల | మతిరయమున నెయిది పొదువ నరిగి కరిచతు శ్శతియు హయత్రిశతియు వసు | మతిఁ గూల్చెను శినివరుండు మద మెలరారన్. |
68 |
| వ. | అంత నిలువక చలంబున నా సేన శైనేయుపై బెట్టు గిట్టె; నట్టియెడ. | 69 |
| క. |
నర తురగ ద్విరద రథో | త్కరములలో నతని శరము దాఁకనిరూపుం బరికించియుఁ గానం ద | త్త్వరితత్వంబునకు వేఱ వర్ణన యేలా? |
70 |
| క. |
‘నరుబాహాస్ఫురణమునకు | సరి యగు నెక్కు డగుఁ గాని సాత్యకి భుజ వి స్ఫురణం బల్పము గా’ దని | సురనికురుంబంబు పొగడుచుం జూచె నృపా! |
71 |
| మ. |
కురుముఖ్యుండును దోడి సైనికులుఁ బెక్కుల్ దూపు లొక్కుమ్మడిం గురియం బిన్నటి నవ్వుతో నతఁడు తత్కోదండ సూతాశ్వకే తురథంబుల్ వికలత్వముం బొరయఁగా దోర్దర్పదుర్దాంతుఁ డై వెరవుం జేవయు లావునుం దెలిపె నుర్వీనాథ! యా సేనకున్. |
72 |
| వ. | అప్పుడు. | 73 |
| క. |
కదిసి నరేంద్రుఁడు సూతుని | మదమును దురగముల యుబ్బు మానిచి నిశిత ప్రదరముల నతని యంగము | పొదివె శకుని దోడుపడఁగ భుజబల మలరన్. |
74 |
| వ. | పొదివిన నొదవిన కోపంబు నాటోపంబున. | 75 |
| మ. |
ధరణీనాథ! మురాంతకానుజుఁడు గాంధారేశు చాపంబునుం గురువంశాగ్రణి సూతుకంఠము నతిక్రూరాస్త్రపాతంబునం గరమాశ్చర్యము గాఁగఁ ద్రుంచినఁ దురంగస్తోమ మా మేదినీ శ్వరు తే రచ్చటు వాయ నీడ్చికొని పెల్చంబాఱె దుర్వారమై. |
76 |
| వ. | ఇత్తెఱంగునం బాఱిన. | 77 |
| క. |
తమ్ములు దొరలును నేపఱి | యమ్మనుజాధిపునిపజ్జ కరుగుటయును సై న్యమ్ము వెఱచఱచి విచ్చిన | నెమ్మదిఁ దన యరుగు దెస శినిప్రభుఁ డరిగెన్. |
78 |
| వ. | అనిన విని యాంబికేయుండు సంజయున కి ట్లనియె. | 79 |
| క. |
‘పులికిఁ బసులు వాఱిన క్రియ | నలవుఁ జలము సిగ్గు విడిచి య ట్లొక్కని కో ల్తల కోర్వక విఱిగిన పు | త్రుల నే మని విందు నేను రోయక యింకన్?’ |
80 |
| క. |
అనుడు నతఁ డవ్విభుని కి | ట్లను ‘నీవును నగ్రసుతుఁడు నవినయములు సే సినఁ బాటిల్లిన యాపద | వినకుండఁగ వశమె? మీఁదు విను తెలియంగన్. |
81 |
| వ. | అట్లు గాసి యై కోపించి నీ కొడుకు పురికొల్ప నంబష్ఠ టేంకణ పారద ప్రముఖ దేశంబుల బలంబులు దుశ్శాసన పురస్సరంబుగా రయంబునం జని సాత్యకిం జుట్టుముట్టిన నా జెట్టిమగండు నిజభుజ విక్రమాటోపంబునకుం బాటవంబు దలకొల్పిన. | 82 |
| మ. |
విఱిగెం బెక్కు రథంబు; లొక్క మొగి నుర్విం గూలె శుండాలముల్; దఱచై రాలె దురంగమావయవ సంతానంబు; లింతింత లై కుఱుకుల్ గట్టె భటాంగకంబులు రణక్షోణిం బ్రవాహంబు లై పఱచెన్ నెత్తురు భూతకోటి విహరింపం బ్రస్తుతింపన్ సురల్. |
83 |