పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము
కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధము (సం.7-120)
క. సింధుపతిదెసకు మదవ | త్సింధురగతిఁ గవియఁ జూచి ధీరోద్ధతిఁ గో
పాంధమతి నడ్డపడియె వ | సుంధర గ్రక్కదల సూతసూనుం డధిపా!
295
వ. అప్పుడు. 296
ఆ. పదియు నేను నిశిత బాణంబు లర్జునుఁ | డనిలనందనుండు శినివరుండు
మూఁడు మూఁడు మెఱుఁగు వాఁడి తూపులు మేను | గాఁడ నేయ నొచ్చి కర్ణుఁ డలిగి.
297
క. అఱువది యఱువదియమ్ముల | నెఱఁకులు నోనాడ నేసి నిలిపి తన రయం
బెఱిఁగించె మువ్వురకు న | త్తెఱఁ గద్భుతరసమువెల్లిఁ దేల్చె జనములన్‌.
298
ఆ. నరుఁడు నూఱు తీవ్రశరముల నయ్యోధ | వరుని తనువు రక్తవారిఁ దోఁప
నాతఁ డట్టి నూఱు లై దడరించె న | వ్వేగమునకు రోష వివశుఁ డగుచు.
299
క. ఆ విజయుఁడు గర్ణుని విలు | వావిరిఁ దునుమాడి విపుల వక్షము నవ బా
ణావిద్ధము సేసి యతని | జీవము గొనునట్టి ఘన విశిఖ మేసె వడిన్‌.
300
వ. అది అర్ధచంద్ర సాయకంబున నశ్వత్థామ త్రుంచె; నంతం గాంచన భాసితంబగు శరాసనంబు గొని రాధేయుండు రయంబునఁ దీవ్రశరంబులు వరఁగింప నర్జునుఁడు ‘నిలునిలు కర్ణ! యర్జును నెఱుంగవే?’యనుచు ననేక చండకాండంబులం గప్పినఁ గర్ణుండు ‘నిలునిలు మర్జున! కర్ణు నెఱంగవే?’ యనుచు నతని బహుపటు ప్రదరంబులం బొదివె; న ట్లయ్యిరువురు నొండొరుల కదృశ్యమూర్తులై సుర లగ్గింపంబోరుచుండం గౌరవపతి తన వారి నెలుంగెత్తి కర్ణునకుఁ దోడ్పడుం డని పనిచె; నక్కొలందికిం గిరీటి కోపాటోపంబున. 301
మ. తురగవ్రాతముఁ గూల్చి, సూతు తనువుం దున్మాడి, విద్వేషి భీ
కర నారాచపరంపరానిహతి నంగం బార్తి నొందింప నా
తురుఁ డై కర్ణుఁడు దర్పహీనుఁ డగుడున్‌ ద్రోణాత్మజుం డెయ్ది యా
త్మరథస్థుండుగఁ జేసి యేసె విజయున్‌ మద్రేశుఁడుం దోడ్పడన్‌.
302
తే. కృపుఁడు వృషసేనుఁడును వారికెడన కూడి | పార్థు తనువునఁ దూపులు వఱపి; రట్లు
పొదువు నలువుర పిఱుఁదను బొంచి సింధు | వరుఁడు నిగిడించె నమ్ములు నరుని మీఁద.
303
క. గురుతనయ ప్రముఖ రథిక | వరుల భుజావిక్రమంబు వారించుచు ని
ర్భరరోషమునం బార్థుఁడు | శరంబు లఱిముఱి నిగిడ్చె సైంధవుమీఁదన్‌.
304
వ. ఆ సమయంబున సుయోధనుండు సేనలకుం జేయి వీచిన నొక్కుమ్మడిం గవ్వడిఁ గదిసి వివిధ హేతివ్రాతంబులు మేన నించి నొంచిన గలంక లేక కడంగి. 305
శా. గాండీవంబు గుణంబు ఘోరరవ మాకాశంబునం బర్వ వే
దండస్యందన ఘోటకంబులు మహాస్త్ర క్రూరపాతంబుల
న్ఖండీభూతములున్‌ విదారితములు న్భగ్నంబులుం గా సము
ద్దండుం డై యడరం గలంగి పఱచెన్‌ తత్సైన్యసంతానముల్‌.
306
వ. ఇట్లు ప్రచండమూర్తియై మధ్యందిన మార్తాండుండునుం బోలె వెలింగి వివ్వచ్చుండు వియ్యచ్చరుల కచ్చెరువందించె; వెండియు దొరలందఱు నొక్కటఁ దఱుమ నతం డదల్చి యమ్ముల వెల్లిం దేల్చి తెరల్చి దీప్తబాణపాత పూర్వకంబుగా జయద్రథునకుం గవిసిన నమ్మహారథుండు. 307
క. పోవక హయకేతన గాం | డీవములం బార్థుమైఁ గడింది వడిన్‌ సై
న్యావళియు దేవతలు నా | నా విధములఁ బొగడ నాఁటె నారాచంబుల్‌.
308
క. విజయుం డతని వరాహ | ధ్వజమును సారథిశిరంబు నొక్కట న
క్కజముగఁ బడవేసిన నీ | ప్రజ తామరపాకు నీటి భంగిం దలఁకెన్‌.
309
క. ప్రాణములు గలుగు నంతకుఁ | ద్రాణపరాయణత నీదు రథికోత్తము ల
క్షీణజవమునఁ బ్రసారిత | బాణు లగుచు నతని కడ్డపడిరి నరేంద్రా!
310
వ. ఇవ్విధంబునఁ గృపాశ్వత్థామ శల్య వృషసేనులు దెంపు సేసి సైంధవున కడ్డం బైనం జూచి యా సవ్యసాచి యతనిఁ దెగఁ జూడ నెడ గానక యవుడు గఱచుచుఁ బ్రొద్దుదిక్కు గనుంగొనినఁ గేశవుం డిట్లనియె. 311
ఆ. ‘చక్కఁ జలము పెనఁగఁ జన దింక నినుఁడు ప | శ్చిమధరాధరంబు సేరఁ బోయె;
దీని కొక యుపాయ మేను గల్పించెదఁ | దానఁజేసికాని దాయ వడఁడు.
312
వ. అది యెయ్యది యంటేని. 313
క. ఇనమండలంబు మఱువడ | నొనరించెదఁ దమము పాండవోత్తమ! యది గ్రుం
కిన చంద మైన సైంధవుఁ | డును గౌరవ యోధులుం గడుం బ్రమదమునన్‌.
314
వ. ప్రతిజ్ఞా భంగ మయ్యె నని కయ్యంబుకడంక దక్కి విచ్చలవిడి నొండొరుల మెచ్చుచుఁ బొంగి చెలంగుదు; రప్పుడు నీవూన్కి దీర్చికొ’మ్మని పలికినం బరాక్రమంబు సవ్యాజం బయ్యె నని మనోవ్యథంజెందు సవ్యసాచిం గనుంగొనుచు నమ్మాధవుండు మాయాతిమిరంబునఁ దిమిరవైరిం గప్పిన. 315
క. అది రవి గ్రుంకుటగాఁ గొని | మద మెసకంబెసఁగ నార్చి మన సైన్యంబుల్‌
వొదలెఁ దల యెత్తి హర్షా | స్పదమతి సింధుపతి యపుడు పడమర సూచెన్‌.
316
వ. తదవసరంబున. 317
ఆ. ‘ఎలమిఁ దేరిమీఁద నిలుచుండి పడమ ర | ఱ్ఱెత్తి చూచుచున్న యిద్దురాత్ము
మస్తకంబు దునుము మసలక’ యని యర్జు | నునకుఁ జూపె సైంధవుని మురారి.
318
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )