| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము |
| చ. |
నిరుపమశక్తిఁ గర్ణుమెయి నెత్తురు వఱ్ఱుగఁ జేసి సూతునిం దురగములన్ సిడంబు వెసఁద్రుంచి రథంబును నాతపత్రముం దర మిడి నుగ్గు సేసె వసుధావర! తమ్ములు రాజుఁ జూడ న ప్పరుషత సూచి చేయఁగల పార్థివు లాతనిఁ జుట్టుముట్టినన్. |
282 |
| క. |
శరవేగము రథగమన | స్ఫురణ విచిత్రతయు మెఱయఁ బోరి యతం డ య్యరదములగములు సుడివడఁ | దెరల మరలఁ బఱవఁజేసె దీపించె నృపా! |
283 |
| క. |
అనుటయు ధృతరాష్ట్రుఁడు గృ | ష్ణుని రథమును రథ్యములను సూతుఁడు నగుటన్ శినివరునకు నుత్సాహం | బనూన మయి చూవె యంత యధికుం డయ్యెన్. |
284 |
| వ. | అనిన విని సంజయుం డతని కిట్లను నట్టియెడ మున్ను దారకుండు దేరు దెచ్చుసంరంభంబు సూచి యది కృష్ణుని పనుపని యెఱుంగని వాఁడగుటఁ గయ్యంబు గజిబిజిగాఁ దలంచుచు వాని పిన్నతమ్ముండు మేలిమి రథంబునం దగు తురంగంబులం బూన్చికొని వివిధాయుధంబు లమర్చికొని కేతనోద్ద్యోతితంబు సేసి యా రథంబు వచ్చిన జాడ నేతెంచి సన్నిహితుం డగుటయు, సాత్యకి సముచితంబుగా నయ్యరదం బెక్కి విక్రమాటోపంబు సూపుచుండ రథాంగధరుని సారథి రథసహితంబుగా నతనికడకుఁ జనియె; నీ కొడుకులు కర్ణుం గల్పితరథోదీర్ణుం గావించి రనవుడు నాంబికేయుం ‘డట్లు కిరీటిం గలిసి భీముం డేమి సేసె’ నని యడిగిన. | 285 |
| తే. |
ఆతనికి సంజయుం డిట్టు లనియె; ‘గర్ణు | చేత నవమానింతుం డయి చిన్నఁ బోయి పార్థుపాలికి నరిగియుఁ బలుకకుండెఁ | గినుక నెరియు మనంబుతో మనుజనాథ! |
286 |
| వ. | పదంపడి త న్నా సూతపుత్రుండు పలికిన పలుకు లా ఫల్గునుతో నుగ్గడించి ‘వానిం దొడరి, యే నెల్లభంగులం బరిమార్తు’ ననిన నాతం ‘డవి నా చెవి సోఁక నాడుట నన్నుఁ బలుకుట గాక నీకుం బని యేమి నీ వటుండు’ మని పలికి రాధేయు రథంబున కభిముఖుం డై. | 287 |
| ఉ. |
‘ఏమిర కర్ణ! భీము నటులేటికిఁ దిట్టి; తతండు దోల సి గ్గేమియు లేక పాఱునెడ నెవ్వరు దిట్టిరి నిన్ను గెల్పు సం గ్రామములోనఁ దప్పిదము గల్గిన యంతన యింతగర్వ మే లా? మును ని న్నెఱుంగమె? చలంబున సాత్యకి యిప్డు గెల్వఁడే? |
288 |
| క. |
గెలుపును నోటమియును ననిఁ | గలుగవె? యెడపెట్టి యెట్టిఘనులకు నిమ్మైఁ బలుకుదురే తగువారిం | దులువా! నీకులము గుణముఁ దోఁచెం బ్రజకున్. |
289 |
| వ. | ఇంత వట్టును వెలారింతు నీ మాటలు మఱవకుండు; మిదియునుం గాక నాయసన్నిధిన ధర్మంబున నభిమన్యుని విల్లు దునిమితివి; దానికి నీవు గనుంగొనుచుండ ధర్మప్రకారంబున వృషసేనుని తల దునుము దు; మఱియు నీతోడంగూడ నప్పు డప్పాపం బాచరించిన వారిని నిన్ను నెట్లు సేసెదనో యటుచూడు’ మని పలికి తఱిమిన మన సైన్యంబు లఱిముఱి నతనిపైఁ గవిసినఁ దత్సమరవిహారంబు దారుణం బయ్యె; మిహిరుండును మందరశ్మి యగుచు వచ్చె; నా సమయంబున సుయోధనుండు రాధేయున కి ట్లనియె. | 290 |
| సీ. |
‘శైనేయుఁడును భీమసేనుండు నిరుదెస | రా నర్జునుఁడు సింధురాజు దెసకు నేడ్తెఱఁ దఱిమెడు నింక నొక్కించుక | ప్రొద్దాఁగి పెనఁగినఁ బ్రొద్దు దాను నస్తమించెడును నీయట్టి జోదునకు శ | ల్యుండును గురునందనుండుఁ గృపుఁడు దుశ్శాసనుఁడు నేను దోడ్పడ నతనికిఁ | జేయార్పవచ్చునె? చేటుకాల |
|
| ఆ. |
మైనఁ బ్రతిన వట్టె నంతియ తనతోడి | వార సోదరులును వీరు సనిన నేల యెల్ల మనమ యేలుద మిత్తఱి | నలవుఁ జలముఁ జూపవలయు నీవు.’ |
291 |
| వ. | అనిన సూతనందనుం డమ్మానవపతి నాలోకించి. | 292 |
| చ. |
‘అనిలతనూజు బాణముల నంగము లెల్లను జాల నొచ్చె నై నను నను మీఱ వచ్చునె? రణంబునఁ గ్రీడికి మేదినీశు మ న్నన గల మేటిబంటు ప్రధనంబున నింతలు సేయ కున్న నొ ప్పునె? యనిఁ బేర్చువాఁ డ నట భూవర! దైవమ నేర్చు’ నావుడున్. |
293 |
| వ. | ఆతండు ప్రీతుం డయ్యె; నయ్యవసరంబున భీమ సాత్యకి సహాయుం డగు నా సవ్యసాచి గాడ్పు తోడు గల యగ్నిదేవుండునుం బోలె దేజరిల్లె; భల్లాది బాణంబులు నీ బలంబులపై నిగిడింపఁ జతురంగంబుల యవయవంబులుఁ జామర చ్ఛత్త్రకేతుక శకలంబులుఁ గోదండ గదాదండాది హేతిఖండంబులుఁ గీడ్పెరసి పాఱు నెత్తురుటేఱులఁ దెట్టువలు గట్టె; నట్టియెడ దుర్యోధన కర్ణవృషసేన శల్య కృపాశ్వత్థామలు గడంగి తమతోడన తఱుము జయద్రథుం బిఱిందికిఁ ద్రోచికొని ప్రొద్దులావునం జేవయెక్కి యక్కిరీటిం దాఁకి తీవ్రశరంబులు పరఁగించిన నవి యతం డొక్కొక్కటిం బెక్కు తునియలు సేయం దఱిమి యందఱు నొక్కుమ్మడి యొక్కొక్కరుండు పె క్కమ్ము లమ్మధుసూదన ధనంజయ తనువులం బఱపిన నన్నరుం డుఱక యొక్కొక్కరినిం బెక్కు నారాచంబుల స్రుక్కించి. | 294 |