పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము
సంజయుఁడు ధృతరాష్ట్రునకు సాత్యకి పరాభవ కారణంబు చెప్పుట (సం. 7-119-1)
వ. అనవుడు నతఁ డమ్మహీపతి కిట్లను ‘దీనికిం గారణంబు గల దాకర్ణింపుము; సోమవంశవరుం డగు యయాతి నందనుం డయిన యదుని కులంబున జనియించిన దేవమీఢునకుఁ బుట్టిన శూరుని కొడుకు వసుదేవుండు రూపగుణంబులఁ బ్రసిద్ధుండై పెరుఁగుచుండ దేవకుం డను భూవల్లభుండు దన పుత్రికి దేవకీదేవికి స్వయంవర మహోత్సవం బాచరించిన నవ్వసుదేవునకై యయ్యాదవాన్వయజాతుం డగు శిని యవ్వనితఁ బరాక్రమంబునఁ దేరఁ గూడిన రాజలోకంబుఁ దొడరి పోరంజాలక నిలిచిన సోమదత్తుం డొక్కరుండును బోక పెనంగె; నయ్యిరువురు నొండొరులచేత విరథులై కృపాణంబులు గొని ధరణికి లంఘించి పోరునెడ నయ్యదువీరుం డాక్రమించి బాహ్లికతనయుం గొప్పువట్టి యొఱగం దిగిచి యనుకంప పెంపునం జంప నొల్లక తన్ని విడిచినం బోయి సిగ్గు పెంపునఁ దలయెత్తి తిరుగనేరక వనంబున కరిగి హరు నుద్దేశించి పెద్దకాలంబు దపంబు సేసిన నప్పరమేశ్వరుండు ప్రత్యక్షంబై వరంబు వేడుమనినఁ దత్కాలంబునకు శినియును దదీయసుతుండును గడచనుటం జేసి శినిమనుమని ననిం బడవైచి తన్నం జాలు తనయు నీవలయు నని యడిగిన నద్దేవుం’ డట్ల యగుం గాక! ‘యని యానతిచ్చి యంతర్హితుం డయ్యెఁ దద్వరప్రభావంబున భూరిశ్రవుండు సాత్యకి నిట్లు సేసె నని చెప్పిన నాంబికేయుండు గయ్యం బటమీఁద నెట్లు సెల్లె? ననుటయు సంజయుం డి ట్లనియె. 275
ఆ. సౌమదత్తి యిట్లు సచ్చినఁ దదనంత | రంబు రథము సింధురాజు దెసకు
నరుఁడు నడపఁ బంచె నారాయణు నపుడు | గురుసుతాది రథికవరులు నృపుఁడు.
276
వ. బరవసంబు సేసి యడ్డపడి; రట్టి యెడ కర్ణ సాత్యకులకుఁ గయ్యంబయ్యె; నత్తెఱంగు వివరించెద వినుము; కృష్ణుండు త్రికాలవేది యగుటఁ దన తమ్మునికి భూరిశ్రవుని వలనం బుట్టు నెడరు తెఱం గెఱింగి తొలునాఁటి రాత్రి నిజసారథి యగు దారుకునితోడఁ బార్థుని ప్రతిన నెరపం బూని పలుకు నెపంబున మన యరదం బాయితంబు సేసికొని యెల్లి గయ్యంబునకుం గొని రమ్మని చెప్పెనప్పు డెట్టి యడియాలంబులతోఁ బాంచన్యంబుం బూరింపం గలవాఁడై పలికె నా చందంబున నంతకు మున్న యాసూతునకు నేతేరవలయు తడవు గనుంగొని శంఖంబు పూరించిన వాఁడును శైల్యసుగ్రీవ మేఘ పుష్పవలాహకంబు లను వాహంబుల వేగంబు నెఱయ మెఱయం బొలుచు గరుడకేతనంబు గ్రాలఁ దేరు తత్కాలంబున కొదవ నాలంబులోనికిఁ దెచ్చిన నయ్యచ్యుతుండు మెచ్చుచు నాశైనేయున కిచ్చినం జూచి కౌంతేయుం డచ్చెరువందిన నతనికి నవ్విధంబు గొంత సూచించె; నిట్లు సాత్యకి సన్నద్ధుం డై. 277
తే. ఏచి నరునకు సాహాయ్య మాచరించు | కౌతుకంబున నేతేరఁ గర్ణుఁ డతని
నధిక సంరంభమునఁ దాఁకె నక్కిరీటి | కని జనార్దనుతోఁడ ని ట్లనియె నగుచు.
278
క. ‘భూరిశ్రవుండు సచ్చుట | సైరింపక సూతసుతుఁడు సాత్యకితోడం
బోరం దొడంగె; మనము వి | చారింపక యెయ్దవలయు సరిగొనకుండన్‌.’
279
ఆ. అనుఁడు నతఁడు సాలు నతనికి నా చక్ర | రక్షకులు గడంగి రయము మెఱయఁ
గదిసి తోడుపడిరి కావున నక్కడి | చింతవలవ దని మురాంతకుండు.
280
వ. తేరును సైంధవుని దెసకుం దరిమె; నప్పుడు శైనేయరాధేయుల పో రెల్లవారును వెఱఁగుపడి చూచుచుండి; రత్తెఱంగు సంగరంబు సురాసుర గంధర్వుల యందునుం గలుగదు; విను; మట్లు పోరి యన్నారాయణానుజుండు. 281
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )