| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము |
| సీ. |
‘తేఁకువ లేక పుత్తెంచిన యప్పాండ | వజ్యేష్ఠునకుఁ దలవంపుఁ గాఁగ వచ్చుచో మార్కొని చచ్చినవారల | బంధులోకమునకుఁ బ్రమదఁ మెసఁగ నంతంతఁ జనుదేరఁ నాదటఁ గనుఁగొను | శౌరికిఁ బ్రాణంబు జల్లనంగఁ బెనఁగించి గెలిపింతు నని యాస సేయు కి | రీటికి నాలావు దేటపడఁగ |
|
| తే. |
నాయుధంబులఁ దునిమి రథ్యములఁ గూల్చి | సూతుఁ దెగటార్చి తనువున శోణితంబు వఱపి పఱుపుదు నిలిచిన నుఱకపట్టి | వ్రచ్చి పడవైతు నెందుఁ బోవచ్చు నీకు?’ |
258 |
| క. |
అనిన విని నవ్వి ‘నాతో | నని సేఁతకుఁ దెంపు సేసి యడరెడు రథికుం గనుట యది నాకుఁ బండువు; | వినవే మీ కెల్ల వేరువి త్తని నన్నున్?’ |
259 |
| వ. | అని పలికి సాత్యకి మఱియును. | 260 |
| ఆ. |
‘ఎదుర నుండ వెఱచి మద మఱి దవ్వుగా | వచ్చి యొదిఁగి తేల? పెచ్చు వెఱిగి ప్రేలె; దిపుడ పట్టి నాలుక గోసెద; | మాను మాను రిత్తమాట లేల?’ |
261 |
| వ. | అనియె న ట్లియ్యిరువురు నొండొరులఁ బరుసంబులు పలుకుచుఁ దలపడి పలుదెఱంగుల మెఱంగుటమ్ము లొండొరులపై నిగిడించుచు నొకళ్ళొకళ్ళ మార్గణంబులు మగిడించుచు వర్మంబులు వ్రయ్య నేయుచుఁ దనువులు నెత్తుట జొత్తిల్లం జేయుచుఁ దమ్ము సేన లేనికపోరు సూచునట్లు సూడం బోరి పోరి పరస్పర తురంగ విదారణంబును మిథస్సూత మారణంబును నన్యోన్యధ్వజపాతనంబును నితరేతధనుశ్ఛేదనంబును జేసి యీసునం గరవాలంబులుఁ బలకలుం గొని పాదచారు లై చేరి వివిధ చిత్రగతులం బెనంగి పాసి యించుకసేపు దప్పిక తీర్చికొని క్రమ్మఱఁ గదిసి పలకలు పఱియలు గావించి యలుఁగుల నొడ్డనంబుల నంగవంచనంబులను వ్రేటుపోటుల సవదరింపకుండం గాచికొను నోజ మెఱయుచుండి విన్నాణంబుతగులున మేనులు బెరసిన మల్లయుద్ధ ప్రకారం బగు పెనంకువకుఁ జొచ్చి; రప్పుడా భూరిశ్రవుండు మేలుచే యయి పోరుట గనుంగొని కృష్ణుండు జిష్ణున కి ట్లనియె. | 262 |
| చ. |
పెనుమొనతోడ మున్ పెనఁగి పెద్దయు డయ్యుటఁ జేసి సోమద త్తునిసుతుచేతఁ జిక్కి కడుదుర్దశఁ బొందె శినిప్రవీరుఁ డీ తనిఁ దగుఁ గావ నీకయి కదా యిట రాక! మృగేంద్రు బారిఁ జొ చ్చిన కరివోలె నయ్యె; వెసఁ జేకొని కావుము పాండవోత్తమా! |
263 |
| క. |
అనునెడ భూరిశ్రవసుం | డనూనబల మొప్ప దానవాంతకు ననుజ న్మునిఁ బట్టి పుడమిపై వై | చినఁ గ్రిందై యోపినంత సేయుచునుండెన్. |
264 |
| వ. | అమ్మురహరుండు మఱియుం దఱిమి ధనంజయుతో ‘నీకుం దోడ్పడ వచ్చి నీ శిష్యుండొరులచేత దురవస్థం బొంద నూరకునికి యుచితంబగునే?’ యనిన నతం డిట్లనియె. | 265 |
| తే. |
ఒండు దెసఁ జక్కఁ జూడరాకుండునట్లు | గాఁగ రథములు పయి పయిఁ గ్రమ్మె వార లెక్క టెక్కటి పోరెద రిపుడు నాకు | నేయఁగాఁ దగ; దీరెండు నిటుల నుండ. |
266 |
| వ. | నెచ్చెలి చావునుం జూడం జాల; నీ రథికులను వారించెద; నయ్యోధవరునిం గాచెద’ ననియె; నప్పుడు సాత్యకి చాల డస్సిన సౌమదత్తి యతిక్రమించి యెగసి పడవైచి వాని వలచేయు నురంబును నిరుగాలం ద్రొక్కి యెక్కుడు మదంబున మణికంకణ కిరణ స్ఫురణ సుందరంబగు కరంబు మెఱయం గృపాణం బెత్తి గళంబు దునియ వేయువాఁడై పూఁచిన నా భుజం బింద్రధ్వజంబునుం బోలెఁ బొలిచి నీ సైనికుల చూడ్కులకు వేడ్కలు సేయ వాసుదేవుండు వేగిరపడి యేయు మేయు మని పలికిన బార్థుం డక్కౌరవోత్తముం జిత్తంబున నగ్గించుచు వెడందవాతియమ్ము గ్రక్కునం దొడిగి గాఢాకర్షణంబును దీవ్రతేజంబును రయంబునుం బరఁగంజేసి యేసినం దునిసిపడి యబ్బాహువు మహాభుజంగంబు చందంబున శోభిల్లె; నిచ్చటి సేననెల్ల దురపిల్లె నా భూరిశ్రవుండు దన్ను నఫలితప్రయత్నునిం జేసినవాఁడు గాండీవి యగు టెఱింగి యాఱని కోపంబున గర్హించు మనంబుతో నతని దిక్కు సూచి తగునెలుంగున ని ట్లనియె. | 267 |
| ఉ. |
‘నీ దెసఁ జూడ నొండొకరినిం దగ మార్కొని పోరుచుండఁ బెం పేది వినీచకర్మమున కియ్యకొనం దగునే? భవాదృశుం డీదురుపాయ మగ్గురుఁడొ యింద్రుఁడొ రుద్రుడొ నీకుఁ జెప్పె దా మోదరుఁ డింతపాపమున కోర్వఁగఁ జేయునె నిన్ను నర్జునా!’ |
268 |
| వ. | అనిన విని అబ్బాహ్లికపౌత్రు నాలోకించి. | 269 |
| చ. |
‘నృపతులు సొచ్చి పోరునెడ నెయ్యురు బంధులుఁ దోడుపాటు నీ చపుఁ బనియే? నినుం బగఱు సంపఁగఁ గావఁగ లేని మీ బలా ధిపతుల దూఱు సాత్యకి యతిశ్రమ మొందిన చోటఁ దాఁకి క ష్టపఱిచి చంపె దీ; వతఁడు సచ్చునె యాఱడి యేను గల్గఁగన్? |
270 |
| వ. | మీ రందఱు నట్టకాదే? యధర్మపరులయి యభిమన్యు ననుచితంపు జంపు చంపితి’ రని నిరుత్తరుం జేసి, యప్పుడు దన్ను నీ కొడుకులం గొందఱు రాజులును నిందించిన నత్తెఱంగునన పలికి వారల పలుకుల నుడిపి, యా సౌమదత్తి నుపలక్షించి శోకించి, యతనికుందు మాన్పం దలంచి. | 271 |
| తే. |
‘క్షత్ర ధర్మంబు కీడునఁ గటకటా మ | హాత్మ! నీయట్టి వాని కి ట్లధిక పీడ సేయ వలసె; నా ప్రతిన చర్చింపు; మెల్ల | పనులకును మూల మా సుయోధనుఁడ సూవె! |
272 |
| వ. | అన్నరపతి నరకంబునం బడం గలవాఁడు; నీవు సద్గతిం బొందు’ మనవుడు నతండు శైనేయు విడిచి యపసవ్యకరంబున శరంబులు వఱుచుకొని ప్రాయోపవేశనమతి నుండి ప్రాణాయామ పరాయణుండై యోగయుక్తుండయ్యె; నంత నొడలి కుత్సాహంబు వచ్చి లేచి సాత్యకి గరవాలం బమర్చికొని మాధవధనం జయభీమాశ్వత్థామ కృపకర్ణులు వలదు వలదని యెలుంగెత్తి వారింప క్రోధోన్మాదంబున శిరశ్ఛేదనంబు సేసిన భూరిశ్రవుండు సిద్ధచారణ గణాభినందితుం డగుచుఁ బుణ్యలోకంబున కరిగె; నా శినివరుండు దన్ను వారించిన వారల నుద్దేశించి యభిమన్యు వధప్రకారం బుపన్యసించె; నప్పుడు మన సైనికు లిట్టు దగునే యనువారును, గోపం బేమి సేయింప? దనువారును నతని చేతఁబడినవాఁ డుడుగునే? యనువారును గోపం బేమి సేయింప? దనువారును నతని చేతఁబడినవాఁ డుడుడునే? యనువారును నై రనిన విని ధృతరాష్ట్రుండు సంజయున కి ట్లనియె. | 273 |
| క. |
‘గురు కృతవర్మాది రథిక | వరులకు నవిజయ్యుఁ డైనవాఁడు శినివరుం డరయఁగ మహాద్భుతం బ | క్కురువరుచే నాతఁ డిట్లగుట సూతసుతా!’ |
274 |