పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము
కర్ణుండు భీమసేను నవమానించి నీచోక్తులు పలుకుట (సం. 7-114-69)
ఆ. ‘తిండిపోత! నీకు భండనం బేటికి? | గడవఁ జేరి మనసు కాంక్ష దీఱ
నోపుకొలఁది మ్రింగి యూరక నీ వింటి | కడన యుండు మింక నడిచి పడక.’
239
వ. అని మఱియును. 240
క. వనమున ఫలమూలంబులు | దిని ముని వై యుందుగాక ధీరోద్ధతిమై
నని సేయ నీకు వచ్చునె? | చను మచటికి నుడిఁగి మడఁగి శాంతుఁడపోలెన్‌.
241
వ. అట్లు నీ యొడ లుండ దేని. 242
క. చేయలఁతిం గని సమరము | సేయుము; నను బోఁటి తోడఁ జెనయకు; నరనా
రాయణులు వారె యచటికిఁ | బోయెదవేఁ బోయి బ్రదుకుపొంక ముడుగుమీ!’
243
క. అని పలికె నట్టియెడఁ గృ | ష్ణుని పనుపున నర్జునుండు సునిశిత నారా
చనితాంతపాతముల నా | తనిఁ బిఱుసనఁ జేసి భీము దైన్యము వాఁపెన్‌.
244
క. మండెడు బలునారసముల | వెండియు నా రజ్జులాని వివ్వచ్చుం డు
ద్దండత నేసిన యెడ నవి | ఖండించెను గురుసుతుండు గర్వం బలరన్‌.
245
వ. అప్పు డశ్వత్థామ యఱువది నాల్గు నారసంబుల నొప్పించిన నన్నరుండు నిలు నిలు మని యదలించినం దెరలి యతండు కరులగమిఁ జొచ్చె; నాలోనన యమ్మారుతి సారథి యగు విశోకుండు తేరాయితంబు సేసి తెచ్చిన నెక్కి యాతండు విన్నని మొగంబుతోడఁ గవ్వడి కడకుఁ జనియె; నప్పుడు సాత్యకియు నద్దిక్కునకు సగర్వగమనంబునం బోయె’ ననిన విని వైచిత్రవీర్యుండు సంజయునితో ని ట్లనియె. 246
క. ‘బలియురతోఁ బగ గొనినం | గలుగునె మే లెల్లభంగిఁ గౌంతేయులకుం
గల పా లీఁ దగుఁ దోడ్తోఁ | గలిమియు గీర్తియును బొలియఁగా విన వశమే?
247
క. విను మడుగులపైఁ బడి యై | నను, నెంగిలి గుడిచి యైన నరులకుఁ బగ బోఁ
గొని యరుల కినుకడఁచి బ్రదు | కనవలయు నిహమ్ముఁ బరముఁ గలుగునె చెడినన్‌?
248
క. తా నెఱుఁగఁ డొరులు సెప్పిన | నైనను విననేరఁ; డట్టి యతిబాలిశు నిం
కే నే మందుఁ? గొడుకు దు | ర్మాని గనునె బ్రదుకు పోకరాకలు దెలియన్‌.
249
వ. అది యట్లుండె. 250
ఆ. గురునిఁ గడచి నరుఁడు కురుసేన సొచ్చిన | యపుడ తెగియెఁ గార్య; మదియుఁ గాక
కలసి రట్టి బల్లిదులు భీమసాత్యకు | లకట! సైంధవుండు హతుఁడ కాఁడె!
251
వ. సమర విశేషంబు తెఱంగెఱింగింపు’ మనిన నమ్మహీపతి కతం డిట్లను ‘నట్లు శైనేయుండు గౌంతేయులఁ గూడం బోవ నలంబుసుం డనురాజు బలంబు మెఱయ నతని మార్కొనిన నయ్యిరువురకుఁ బరస్పర బాణభంజనంబును వర్మ విదారణంబును మర్మభేదనంబును ధనుర్దళనంబును భూచర ఖేచర విస్మయ కరంబును నగు సంగరం బయ్యె; నొక్కింత సేపునకు నాశినిపుంగవుండు. 252
క. తురగములఁ జంపి సారథి | శిరము దునిమి కుండలములఁ జెలువారెడు న
న్నరపతి తల యిలఁ బడ ను | ద్ధుర భంగి వెడంద వాతితూపుల నేసెన్‌.
253
క. ఏసి యెలమి నరుగఁగ దు | శ్శాసనుఁడు మొగంబుగా వెసన్‌ నీ కొడుకుల్‌
డాసిన నవ్వీరుఁ డనా | యాసంబున దుస్ససేను హయములఁ జంపెన్‌.
254
వ. చంపి, యతని రథంబునకుఁ గవియుడుఁ ద్రిగర్తు లనేకు లడ్డంబు సొచ్చిన నతండు సేయం గలవారిం బంచశత రథికులం బంచత్వంబు నొందించి బలంబుల బడలువడం జేయఁ బెఱవారు విఱిగిన నాసత్యకసుతుండును మెఱసి చన శూరసేన సైనికులు దొడరుటుయు, దోర్విలాసంబు నెఱపి పఱపి కళింగులు గవిసినన్‌ గం డడంచి కడచి గాండీవిం గనుంగొని జలాశయంబు వెలువడి సింధురంబు సుస్థలంబు సేరిన ట్లాశ్వాసించుచున్న నచ్యుతుం డయ్యోధవరు నాలోకించి నరు నుద్దేశించి. 255
మ. కృతవర్మాదులఁ జెప్ప నేల? గురు నక్షీణ ప్రభావంబు ము
న్నితఁ డెబ్భంగి నడంచె నొక్కొ! యొకరుం డి ట్లేపుమై రాకకుం
గత మాధర్మజుపంపు నీ దెస సమగ్ర స్నేహముం జూపెఁ జూ
చితె? నీ శిష్యుని సాత్యకిం బటుభుజాశ్రీ గర్వనిర్వాహకున్‌.
256
వ. మన కింత ప్రియం బగునే!’ యనిన నయ్యింద్రనందనుం డిట్లను ‘నితని రాక నా కప్రియంబై తోఁచె నెట్లంటేని ధర్మరాజ రక్షణంబున కితనిం జాలించి వచ్చితి; మీ రథికుం డచ్చట లేమి నతం డే మగునో యెఱుంగ; మా భూపతియును భరద్వాజుబారి నున్నవాఁడు సైంధవుండును నేలకు వ్రాలండు; ప్రొద్దునుం బెద్దయు వ్రాలె నది యట్లుండె; బలసారోదారులైన గురు కృతవర్మాదులను ననేక యోధవీరులతోడం బోరి రథ్యసారథి సహితంబుగా నిప్పురుషార్థపరుండు దప్పిం బడి తెప్పిఱంగానని యాలోనన కయ్యంబున డయ్యనివాఁడును సహాయ సంపన్నుండును నగు భూరిశ్రవుం డదె తలపడఁ గడంగెడు నక్కురు సింహుండు శక్తి చాతుర్య శౌర్యధైర్యాస్త్ర వీర్య సమగ్రుండును గావున నిద్ది సాత్యకికి చాల డెప్పరం బైన తెఱంగు వాటిల్లె; బాండవాగ్రజుం డీయన నిక్కడ కేల పుత్తెంచె? గురుం డామిషంబునకు వేచు డేగచందంబునఁ దనకు వేచుట దలంపవలవదే?’ యనుచున్న సమయంబున నాసోమదత్త సూనుండు శైనేయున కడ్డంబు వచ్చి నిలు నిలు మని యదల్చి వెండియు. 257
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )