| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | అప్పుడు శత్రుంజయుండును శత్రుసహుండును సుదేహుండును మదనుండును ద్రుముండును జిత్రబాహుండును వికర్ణుండును గర్ణ రక్షణ పరులై కడిమివెలయఁ దలకడచి యొక్కట భీమసేనుం దాఁకి ధరాధరంబు నంబుధారలం గప్పు జలధరంబుల చందంబున నతని నతినిబిడ పరంపరలఁ బొదవినం బెరిఁగిన దర్పంబునం బొదలి యతండు దృఢైకముష్టి నిర్ముక్తమార్గణ సప్తకంబున వారిం బిలుకుమార్చి యార్చిన, నా సింహనాదంబు విని ధర్మతనయుం డది విజయాగ్రజుండు నిజవిజయం బెఱింగించునట్లుగా నెఱింగి మనంబునం బొంగి ద్రోణుదెసకుఁ దఱిమి కయ్యంబు సేసె; నట్లు పలువురు దమ్ములు వొలిసిన దుర్యోధనుండు దనమనంబున జూదంబునప్పుడు విదురుండు సెప్పినట్ల యగుచున్నదని విషాదంబునొంది యా సభ నమ్మెయిఁ బాండవులఁ బఱచిన పాపఫలం బనుభవించె’ ననవుడు వైచిత్రవీర్యుండు. | 226 |
| క. |
‘గతవృత్తములకు వగవం | గత మేమి? యతండు వెఱ్ఱి; కార్యము నా దు ర్మతిఁ దప్పె; నోర్చి కొడుకుల | కత వినియెదఁ జెప్పు చెప్పఁగలయది యెల్లన్.’ |
227 |
| వ. | అనిన నతనికి సంజయుం డిట్లను ‘న ట్లనిలజుఁ డార్చినం బేర్చి కర్ణుఁ డతనిపయిం గవిసి ఘోర సంగ్రామంబు సేయుచుండ నీ సేన భీమసేనుఁ జుట్టుముట్టిన నతండు బెట్టిదంబులగు భల్ల ప్రముఖ బాణంబులఁ గేతు చ్ఛత్ర చామరంబులు సూతరథరథ్య రథికావయవంబులు దురంగమాతంగ సుభటాంగంబులుఁ దునియలై దొరఁగి పెరుఁగు నెత్తురుటేఱుల వెంబడిం బాఱంజేయుటయుఁ బతితశేషం బగు నబ్బలం బిరుగెలంకులం దొలంగి యంపవెట్టునేల కవుల సని చూచుచుండె; వెండియు రాధేయుండు రయంబున నతనిం దాఁకి పోరె; నట్టి యెడ నమ్మారుతనందనుండు. | 228 |
| క. |
ఆభీలతఁ గర్ణుని క | ర్ణాభరణము చుక్కవడిన యట్లు వడఁగ సం శోభిత శరమున నేసి మ | హాభల్ల మురస్ స్థలమ్ము నాడఁగ నేసెన్. |
229 |
| క. |
ఆలోనన యారథికుని | ఫాలస్థలి నోలి నెనయఁ బది నారసముల్ గీలించిన నవి యచ్చట | నీలోత్పలమాల వోలె నెఱయం బొలిచెన్. |
230 |
| తే. |
అలిగి బాణశతంబున నాతఁ డతని | నొంచె; నవ్వీరు చాపంబు ద్రుంచె నతఁడు పఱపె బలువింటఁ గర్ణుండు పటు శరములఁ | బట్టపవలింటి సూర్యుని ప్రభలు వొలయ. |
231 |
| వ. | ఇట్లేయు నా సూతనందను విల్లు విదుర్పు దోఁపక గుడుసువడుటఁ జక్రాకృతిం బొలుచు ననలశిఖల చెలువు దాల్చె; నట్టి రయంబునకు భయంబు గొనక భీముండు నిగిడించు హేమ లిప్తనారాచధారలు గగన లక్ష్మి కనకాభరణంబుల చెన్ను చేకొనియె; నప్పుడు కోపంబు రూపంబు గైకొన్న కైవడి నుదీర్ణుండై యక్కర్ణుండు. | 232 |
| చ. |
పవనజు చాపమున్ హరుల పగ్గములుం దునుమాడి కాఁడితో నవి పెనఁగాడఁగా వెడఁదయమ్మునఁ గేతువు గూల్చి సూతు మే నవియగ నేసినం బఱచె నాతఁడు ఫల్గును చక్రరక్షు తే రి వెనుకకుగ్రశక్తి యడరించెఁ జలింపక భీముఁ డత్తఱిన్. |
233 |
| క. |
అది సూతనందనుఁడు దొ | మ్మిది శరములఁ దునుముటయు సమీరసుతుఁడు బె ట్టిదముగ వాలుఁ బలకయు | న్మదమునఁ గొన నతఁడు పలక నఱకె; నఱకినన్. |
234 |
| మ. |
కరవాలంబున వైచి యా రథికువిల్ ఖండింప నొండొక్క ని ష్ఠుర చాపం బతఁ డెత్తునంతకు జవాటోపంబుఁ గోపంబు మ చ్చరముం దేటపడన్ వియచ్చరులు మెచ్చన్ భీముఁ డా సూతసూ తి రథం బల్లల నాడ దానిపయికిం దెం పొప్ప లంఘించినన్. |
235 |
| వ. | అతండు కేతనంబునకుం గుదురుగాఁ బెనుపొనరం గావించిన పీఠంబు నడుగున నొదింగినం దేరిపయి నతనిం గానక భీమసేనుండు నలుదిక్కులుం బరికించి యతని పాఱుటయు లేకున్న, నయ్యరదంబు క్రిందఁ దూఱె నను తలంపున నతనిం బట్టికొనువాడై డిగ్గ నుఱుకుటయుం, దోడన తోఁచి రాధేయుండు రథచిత్రగతులు మెఱయ రయంబారఁ బెక్కు నారాచంబు లొక్క మొగిం దనువునఁ జొనుపుచు నేచిన నయ్యనిలతనయుండు సాధన వైకల్యంబున వెడంగు పడియును వెన్నీక మున్ను వివ్వచ్చుచేతం జచ్చిన సామజంబుల హయంబులఁ బుచ్చికొని డాచేత నొడ్డుకొనుచు వలచేత వైచుచుఁ బెనంగె; నవియును వివిధ విశిఖంబులఁ దునియలు సేయుచు నెఱఁకులు నో నేయుచుఁ గర్ణుండు గదిసి తఱుమఁ దదీయ స్యందనంబునకు దుర్గమం బగు నని యతం డర్జునాస్త్ర పతితంబు లైన చతురంగంబుల తిట్టల యోలంబు సొచ్చిన. | 236 |
| తే. |
మొనలతోడను దనతోడ మున్ను పెనఁగి | శ్రమము నొందియు న ట్లరదమున కరిగి వెండియును బోరి కడు డస్సి బెండు వడిన | యన్నిరాయుధుఁ జూచి సూతాత్మజుండు. |
237 |
| క. |
మనమునఁ గుంతీవాక్యం | బును నొలసిన నేయు టుడిగి పోయి కదిసి న వ్వున మోమొప్ప నతని కి | ట్లను వింటం గడుపు లీల నల్లఁ బొడుచుచున్. |
238 |