| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - పంచమాశ్వాసము |
| తే. |
రథము డిగ్గి హర్షాశ్రులు గ్రమ్ముదేర | నెదురు కొనుటయు సంభ్రమ మెసక మెసఁగఁ బార్థుఁడును గేశవుండును బాదచారు | లై రయంబునఁ జని మ్రొక్కి రవ్విభునకు. |
14 |
| వ. | ఇట్లు ప్రణమిల్లిన. | 15 |
| క. |
నరపతి యానందాశ్రులు | గరసరసిరుహముల నొత్తి కను దనియఁగ న య్యిరువురఁ జూచుచు మేనులు | గరుపాఱఁగ గ్రుచ్చి యొక్క కౌఁగిటఁ జేర్చెన్. |
16 |
| వ. | ఇ వ్విధంబున నాలింగనంబు సేసి యర్జునునితో ని ట్లనియె. | 17 |
| క. |
‘చే నెత్తురు గాకుండం | గా నా సైంధవునిఁ జంపి క్రమ్మఱ మీరల్ రా నోచితి నా భాగ్యం | బేన పొగడు నట్టిదయ్యె నీతని కరుణన్.’ |
18 |
| క. |
అని వాసుదేవుఁ జూపిన | విని యాతఁడు ‘నీదు కోపవేగంబున దు ర్జనుఁ డా జయద్రథుఁడు వొలి | సిన నెవ్వరి కెట్లు సేయఁ జెల్లదె?’ యనినన్. |
19 |
| వ. | అ మ్మహీపతి య మ్మహాత్ము నుద్దేశించి. | 20 |
| క. |
దేవాసురసంఘంబులు | నీ వలిగిన రూ పడంగు నీ కూరిమి సౌ ఖ్యావహ మఖిల జగములకు | దేవ! భవద్భక్తు లరులఁ దీర్చుట యరుదే! |
21 |
| వ. | అని మఱియు ననేక ప్రకారంబులం బ్రస్తుతించి, భీష్మాదు లతని కతన మడియుట యుగ్గడించి ‘నీవు కోపించినట్లు వర్తించుటఁ గౌరవులు సెడిర కాఁ దలంచెద’ ననుటయు నచ్యుతుం డా భూపాలు నాలోకించి ‘ధర్మోత్కృష్టుండవగు నీకు నరిష్టం బాచరించిన వారికిఁ జెడకుండ వచ్చునే?’ యనునెడ ననిలసుతుండును సాత్యకియును దనువులఁ గ్రొత్తగంట్లు గొమరార నద్ధరణీపతి చరణంబులకుఁ బ్రణతులైన, నతం డెత్తి కౌఁగిలించుకొని వారలు కుంభసంభవ కృతవర్మాదుల సంరంభంబు మర్దించుట పేర్కొని యభినందించె; యుధామన్యుండును నుత్తమౌజుండును దగిన తెఱంగునం గాంచిన వారి నుచిత వచనంబుల సంభావించెఁ; దదీయ సైన్యం బెల్లను బ్రమోద భరితంబై కయ్యంబునకుం గాలు ద్రవ్వుచుండె; నా సమయంబున శోక విస్మయ వివశుం డగుచు దుర్యోధనుం డంతర్గతంబున. | 22 |
| ఉ. |
‘ద్రోణుఁడు గర్ణుఁడుం గృపుఁడు ద్రోణసుతుండును నేల వాని గీ ర్వాణులకైననుం జెనయవచ్చునె? యెవ్వరు నాజిఁ గౌరవ త్రాణ పరాయణత్వమున దర్పము సూపఁగ లేమి దెల్ల మ క్షీణ పరాక్రముం డయిన క్రీడికి నిక్కపుటల్క వచ్చినన్.’ |
23 |
| వ. | అనుచు నుత్సాహ రహితంబైన చిత్తం బుత్తలపడఁ గుంభసంభవు పాలికిం బోయి, పరుల జయంబును, దమవారు సమయుటయు నుగ్గడించి మఱియును. | 24 |
| సీ. |
‘బల్లిదుఁ డగు భీష్ముఁ బడవైచి సోదర | వర్గంబుఁ దాను ననర్గళముగఁ గ్రాలెడు నేచి శిఖండి యింతకు మున్న | పొలిసె నేడక్షౌహిణులు, గిరీటి చేత సైంధవుపాటు సెప్ప జిట్టలు నాకుఁ | బూని మేలెంచి కాంభోజవిభుఁడు జలసంధుఁడును సుదర్శనుఁడును లోను గాఁ | గలుగు భూపతులు పెక్కండ్రు నేఁడు |
|
| తే. |
గలనఁ గూలిరి; వీరి లోకంబ యైన | నొండెఁ బాంచాల బలమును బాండవులను దండినై తెగఁ జూచిన నొండెఁ గాక | యెట్లు వాయు నా కిందఱ ఋణము? సెపుమ! |
25 |
| క. |
నరుఁ డనుఁగుబంటు గావునఁ | బొరిగొనఁ జొర వీవు; సూతపుత్రుఁ డొకఁడ మా ర్తుర మార్కొనియెడు; నతనికి | వెరవును గఱతలును లేవు వీరుం డగుటన్. |
26 |
| వ. | అతఁడునుం బోరి పోరి చేడ్పడి సైంధవుం గోలుపోయె’ ననవుడుఁ గటగటంబడి యాచార్యుం డతని కి ట్లనియె. | 27 |
| చ. |
‘నను మది దూఁటు వోవు వచనంబుల నేటికి నిట్లు నొంప? న ర్జునుని జయింపరామి పలుచోటులఁ జెప్పనె? దేవకోటికై నను నవిజయ్యు భీష్ముఁ బ్రధనంబున నాతఁడు సంపఁ గౌరవుల్ మన రని తోఁచె నాకు; నభిమానముఁ గాచుటకై పెనంగెదన్. |
28 |
| ఆ. |
శకునిచేతి యడ్డసాళ్ళులు నేఁడు గాం | డీవ ముక్త బహు పటిష్ఠ బాణ మూర్తిఁ గవిసి నీకు నార్తి యొనర్పంగ | నాఁకగొనఁగ నెట్టు లగు కుమార! |
29 |
| క. |
భూరమణ! విదురుఁ డమ్మెయి | వారింపఁగ నతుల పుణ్యవతిఁ గృష్ణను మీ వా రెల్లఁ జూడఁ బఱచిన | క్రూరపుఁ బాపంబు ఫలము గుడువక యున్నే? |
30 |
| క. |
ఆ సభ నీవును మీ దు | శ్శాసనుఁడును గర్ణుఁడును బ్రశస్త చరిత్రో ద్భాసితు లగు పాండవులకుఁ | జేసిన కీ డెల్లభంగిఁ జెఱుపదె? మిమ్మున్.? |
31 |
| ఉ. |
అన్ని విధంబులం బఱిచి యైనను నక్కటికంబు లేక వా రి న్నెఱి మాలి కానలఁ జరింపఁగఁ బంచినఁ బోయి వచ్చి య య్యన్నయుఁ దమ్ములుం దమకు నయ్య సగం బిల వేఁడి కాన కి ట్లున్నను, వారి మార్కొనుట కోర్చితి నేనొక బ్రాహ్మణుండనే? |
32 |
| క. |
నీవును నచ్చటఁ బన్నిన | నీ వారును సైంధవుని ననిం బడకుండం గావఁగ జాలిరె? యేనును | నీ వాఁడన కానె? యేల నిందింపంగన్.?’ |
33 |
| వ. | అని వీడనాడి వెండియు. | 34 |
| క. |
పాంచాలురుఁ బాండవులు ను | దంచిత గర్వమున ననికిఁ దఱిమి యొడలు మం డించుచు నుండఁగ ని ట్లుడి | కించెద వొకవలన నీవుఁ గీడుపలుకులన్’. |
35 |