పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - పంచమాశ్వాసము
ద్రోణుఁడు పాంచాలురఁ జంపక కవచంబు విడవ నని ప్రతిజ్ఞ సేయుట (సం.7-126-32)
వ. అని పగతుర యుత్సాహం బుపన్యసించి. 36
క. ‘పలుకులఁ బని లే దీ రే | తలపెట్టక పోరువా రుదగ్రత నేనుం
జలము మెఱయఁ బాంచాలురఁ | బొలియింపక కత్తళంబు పుచ్చ నరేంద్రా!
37
క. కావున మన సైన్యంబులు | సేవ సెడక సంగరంబు సేయునటులుగా
నీ వుత్సహించి నిజ బా | హా విభవము సూపు శక్తి కనురూపముగన్‌.’
38
వ. అని తెంపు సేసి. 39
క. ‘భూసురభక్తియు వృద్ధో | పాసనముం గలిగి ధర్మపథవర్తన ని
త్యాసక్తుఁడ వగు మనఘా! | నా సుతు బోధింపు వగపునకుఁ జొరకుండన్‌.’
40
వ. ‘నా చేతఁ దెగని పాంచాలురు గలిగిరేనియు వారిం బోనీక పొదివి తెగఁ జూచునది’ యని చెప్పుము.’ 41
క. అని పలికి గాఢ నిశ్చయ | మున వదనం బెలమిఁ బొంద మును కలఁగిన నీ
మొన లెల్ల నొక్క మొగముగ నొనరిచితలకొలిపె భూసురోత్తముఁ డనికిన్‌.
42
వ. అ ట్లాచార్యుండు పురికొల్పినం గౌరవపతి సమర సముత్సాహ రహితం బగు మనంబుతో సూతనందనుఁ జేర నరిగి యి ట్లనియె. 43
క. ‘అరుల కభేద్యం బగు న | ప్పరుసున బలుమోహరంబు పన్నించి తుదిం
జొర విడిచెఁ గాని గురుఁ డ | న్నరు నాఁగఁడ; యతఁడు గీడు నాకుం జూడన్‌?
44
క. ఒకఁ డట్లు సొచ్చి, భూప | ప్రకరంబులఁ గూల్చి, సింధురాజుఁ దునిమె నె
ట్లొకొ? యతని కడిమి కుంభజు | నికి వారింపంగ రామి నిక్కమె? యరయన్‌.
45
క. తన మాట నమ్మి సైంధవు | మొనకుం దెచ్చితిమి గాక! ము న్నెఱిఁగిన నా
తని నింటఁ బెట్టి వత్తుము; | మన సేనయు నివ్విధమున మడియక యుండున్‌.
46
క. మన మెంత సెట్టలమొ ఫ | ల్గునుపై నాతనికి నంత గూర్మి గలిగె? నే
మనఁ గల? దింక నతనిఁ గొని | యని సేయుద మనుట కార్య మగునే మనకున్‌?’
47
చ. అన విని కర్ణుఁ డిట్లనియె ‘నగ్గురు దూఱఁగ నేల? యాతఁ డో
పినటుల పోరుఁ గాక; నరుబీరము లావును నెక్కుడైన వా
ని నుడుప వచ్చునే విధియ నేర్చు విషం బిడి యిల్లు గాల్చి కా
ననమున కేఁగఁ జేసి యొక నాశముఁ గంటిమె గొంతిసంతతిన్‌?
48
క. కావున మన సైంధవునిన్‌ | దైవమ తెగటార్చె నంతఁ దలరి మనమునం
జేవ సెడ నేల? పోరం | గా విధి పంచినటు లయ్యెఁ; గడఁగన వలయున్‌.’
49
క. అనునెడఁ బాండవ సేనలు | మొనసి కదియ నడచె; నీదు మొనలుం దగ మా
ర్కొనియె; నిటు లుభయ బలములు | ననిమిషులకు వేడ్క వుట్టునట్లుగఁ దాఁకెన్‌.
50
క. తురగము తురగముఁ గరి కరి | నరుఁడు నరుఁడు దేరు తేరు నలిఁ దాఁకిన య
ప్పరుసఁదన మేమి సెప్పుదుఁ? | పొరి మిడుఁగుఱు లెగసి కైదువుల పొడి రాలెన్‌.
51
వ. అట్టియెడ నీ కొడుకు సైంధవుని చావునకు దుఃఖితుం డగుటఁ బ్రాణంబుల దెస నిరపేక్షుం డయి కడంగినం గని ద్రోణ కృపకర్ణులు వారింపం ద్రోచి తలకడచి దర్ప ప్రచండగతిం బాండవ సైన్యంబు సొచ్చి నిశిత వివిధ విశిఖ పరంపరలు పరఁగించినఁ, జతురంగంబుల యంగంబులు ధరం దొరఁగి చిక్కుపడి మదకల మాతంగంబు గలంచిన కమలాకరంబు చందంబయ్యె; నప్పు డందుఁ జేయంగల బలుమగ లెల్ల నొక్కమొగిం గవిసి నమ్మహీపతిం బొదివిన నతండు భీమసేనుఁ బదిబాణంబులను నకుల సహదేవ ద్రుపద విరాటద్రౌపదేయుల మూఁడు మూఁడు మార్గణంబులను, శిఖండిని నూటను, ధృష్టద్యుమ్ను డెబ్బదింటను, ధర్మపుత్ర సాత్యకుల నైదైదమ్ములను, ఘటోత్కచు నఱువది నాలుగింటను నొప్పించి కేకయ చేది ప్రముఖ యోధవరుల ననేక సాయకంబుల బెట్టు పఱిచి సింహనాదంబు సేసిన. 52
క. ఆ ధర్మనందనుఁడు స | క్రోధాత్ముం డగుచు నేసెఁ గోదండము ను
గ్గై ధరఁ దొరఁగఁగ; నాతఁ డ | బోధంబునఁ దేరి మీఁదఁ బొలుపఱి వ్రాలెన్‌.
53
తే. ఇట్లు మూర్ఛిల్లుటయుఁ గౌరవేశ్వరుండు | సచ్చె ననియెడు నెలుఁగులు శంఖ కాహ
ళారవంబులు సెలఁగఁ బ్రియంబు నొందె | వారి బలములు, ద్రోణుఁ డేపారి కదిసె.
54
వ. అంత. 55
క. తెలివొంది ‘యుధిష్ఠిర! నిలు | నిలు మని రభసమునఁ దాఁకు నీ సుతుఁ గని యా
బల మేచిన నీ బలముం | బెలుచ నిగుడ నపుడు రణము భీషణ మయ్యెన్‌.
56
వ. అనిన విని ధృతరాష్ట్రుం డట్టియెడ ‘నాచార్యుం డెవ్విధంబున నరివధంబు సేసె? నిందలి యందలి చేయంగల సైనికోత్తము లెత్తెఱంగునం బెనంగిరి? చెప్పు’ మనవుడు సంజయుం డిట్లను న ట్లుభయబలంబులుఁ బురికొని పోరుచు నుద్దండ రయంబు మెఱసి యుధిష్ఠిర ప్రముఖ పాండవులును, శైనేయాది యాదవులును, ద్రుపద ప్రభృతి పాంచాలురును, విరాట పురస్సరమాత్స్యులును, గుమార వర్గంబును మఱియు ననేక దండనాయకులును సాయకాసారంబు పరఁగించుచు భారద్వాజుపై నడరిన; నతం డత్యుదీర్ణుండయి కర్ణుండు మొదలుగాఁ గల బలుమగ లిరుగెలంకుల సంరంభంబునం దఱుమ విజృంభించె; నయ్యవసరంబున నెగసిన ధరణీపరాగంబు జనంబుల చూడ్కులు నిగుడనీక యుండె; నాలోనన శుండాల సుభట ఘోటకంబుల యంగంబులం గ్రమ్ముదెంచు రుధిరం బది యడంచిన నమ్మొనల కడంక రెట్టించె; నప్పుడు కౌరవుల దిక్కున ఘూక సృగాల రవంబులు సెలంగ వా రది సరకుసేయక సమరోన్మత్తులై నెత్తురు టేఱులు వాఱఁ గేలి సలిపి; రా సమయంబునఁ గేకయ రథికులును ధృష్టద్యుమ్న తనయులును లోనగువారిం బెక్కండ్ర నక్కుంభసంభవుండు నుఱిపియు మఱియు బలువురఁ బఱపియుఁ గడిమి నెఱపం బ్రతాపశీలుం డగు శిబి సాహసరసికుండై. 57
క. ఉరవడిఁ దాఁకుటయును బది | శరము లతని మేనఁగ్రుచ్చె సాయకగురుఁ డ
చ్చెరువగు మగఁటిమి; నతఁడు | ద్ధురుఁడై తత్సూతు శిరము ద్రుంచెం బెలుచన్‌
58
తే. త్రుంచి తోడన ముప్పదితూపు లతని | యొడల నాటుడు హయముల మెడలు సూతు
గళము నజ్జనపతి కుత్తుకయును దునిమె | ఘోర భల్ల షట్కమ్మునఁ గుంభభవుఁడు.
59
వ. అప్పుడు. 60
తే. భానుమంతునిఁ జంపిన పగ మనమునఁ | బెట్టికొని యుండి యాతని పట్టి భీమ
సేనుపై వడిఁ గాళింగ సేనతోడఁ | గవిసి నారాచధారలఁ గప్పి యొప్పె.
61
క. కినిసి బకమర్దనుఁడు వెసఁ | దన యరదము వాని తేరు దాఁకఁ బఱపి, యా
తని మీఁద నుఱికి క్రుమ్మెం | గనుకని నెంపపొడి సెదరఁ గాలం గేలన్‌.
62
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )