పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - పంచమాశ్వాసము
భీమసేనుఁడు దుర్మద దుష్కర్ణులం జంపుట (సం.7-130-22)
వ. అమ్మహోగ్ర సముద్ధతిం జూచి పాంచాల సైనికులు సింహనాదంబులు సేసిన సహింపక సూతసుతుండును తత్సోదరులును నవ్వీరుం బొదివిన, నతం డద్భుతంబుగా ధ్రువు నరదంబు మీఁదికి లంఘించి వానిఁ బిడికిటి పోటునఁ జావం బొడిచి, జయరాతునిపైఁ గవిసి యాతని నతని సూతునిఁ గాళ్ళు లిరుగేలం బట్టి బె ట్టిలపై వ్రేసి గతాసులం జేసిన నలిగి కర్ణుండు శక్తివైవ మలంగి వెరవున నొడిసికొని దానిన యవ్వడముడి యతనిపై వైచినం గని గాంధార మహీవల్లభుండు భల్లంబున నడుమన నఱకె; నంతఁ గురుకుమారు లమ్మారుతిం జుట్టుముట్టి విశిఖంబులు నిగిడించినఁ గోపించి దుర్మదుని తేరి కురవడించి తురంగంబులం బొరివుచ్చి సారథిం జదిపిన నాతండు దుష్కర్ణు స్యందనం బెక్కె; నయ్యిరువురు నప్పాండుతనయు తనువున మెఱుంగుటమ్ములు గిరిగొలుపం గిట్టి యా రథంబు గూల నవలీలం దన్ని, దుర్యోధన ద్రౌణి కృప కృతవర్మ కర్ణ శల్య బాహ్లికులు సూచుచుండ నక్కుమారుల నిద్దఱం గాల నొక్కనిం గేల నొక్కనింగా సమయించె; నివ్విధంబునం జిత్రవధ విహారంబున విజృంభించు నా భీమసేనుం జూచి, రుద్రుండు రభసోద్రేకంబునం బాండవేయులకుఁ డోడ్పడం జనుదెంచెంగాక! మానవు లిట్టివారునుం గలరే! యనుచు నీ వారెల్లను వెఱచఱిచి యిద్దఱొక్క తెరువునం బోకపఱచి రక్కుమార కంఠీరవుం డుక్కునం దమసేన దిక్కుసూచి యెఱ్ఱ విరిదామరలం దెగడుకన్నులం గౌంతేయాగ్రజు నుపలక్షించి కేలుమొగిచి ఫాలంబునం జేర్చునప్పుడు తన్మూర్తి నతండును నకుల సహదేవ ద్రుపద విరాటులును దేఱి చూడ శంకించి మాఱు మొగంబులతో నగ్గించి రా సమయంబున. 63
క. కడువడి గురుఁ డనిలజుపై | నడరిన రాధాతనూభవాదులు దోడై
కడఁగుటయుఁ గనుంగొని నీ | కొడుకుగమియుఁ గదిసె నుదిత కోపస్ఫురణన్‌.
64
తే. వారిఁ దలపడి పోరిరి దారుణముగ | ధర్మసుతుఁడును గవలు నుద్దండవృత్తిఁ
దఱుమ ద్రుపద విరాట సాత్యకులు మఱియుఁ | జేయఁ గలయట్టి మేదినీ నాయకులును.
65
వ. అయ్యవసరంబున సోమదత్తుండు దనకు సాత్యకి సన్నిహితుఁ డగుటయు నతనితో నిట్లనుఁ ‘బ్రాయోపవిష్టుండగు భూరిశ్రవుం జంపి తది బోయ చందంబు గాక రాజ ధర్మం బగునే? యీ రేయి నీవు నాచేత బ్రదికి పోవు వాఁడవే?’ యని పలికి సింహనాదంబు సేసి శంఖంబు పూరించిన నా శైనేయుఁడు, ‘భూరిశ్రవుండు సచ్చుట యొప్పదేని ని న్నొప్పెడునట్లు సంపెద; నిటు రమ్ము శలుని చావొప్పు నొప్పదని యుగ్గడింప వది యేమి? నీకెట్లయినం గాని కా’ దని భంగించె; నిత్తెఱంగున నొండొరుల నో నాడి యేటులాడం దొడంగి; రప్పుడు నీ కొడుకు ఘోటక స్యందన సందోహ సమేతంబుగా నక్కౌరవునకుం దోడ్పడియె; శకునియుఁ దన బలంబునుం దానును నాతనిం గూడుకొనియె; నవ్విధంబునం బలువు రొక్కనిపైఁ గవిసినం గని ధృష్టద్యుమ్నుండు భూరి సైన్య సమేతుండై వారల నెదుర్కొనం బోరు ఘోరం బయ్యె; నట్టియెడ. 66
తే. సోమదత్తుఁడు తొమ్మిది సునిశితాస్త్ర | ముల శినిప్రభు నేసిన నలిగి యతఁడు
నతని నన్నియమ్ములన మూర్ఛితునిఁ జేయ | రథము దొలఁగంగఁ దోలె సారథి గలంగి.
67
మ. కని ద్రోణాత్మజుఁ డేచి సాత్యకి భుజాగర్వంబు మాన్పింతుఁ బొ
మ్మని పోఁ బో నడుమన్‌ ఘటోత్కచుఁడు ఘోరాకార దైత్య వ్రజం
బును దానుం బటుభంగిఁ దాఁకుటయు నీపుత్రుండుఁ గర్ణుండుఁ ద
క్కిన వారున్‌ వెఱ వానితోడి యనికిం గ్రేడించి రుర్వీశ్వరా!
68
వ. అట్లు సంధ్యాసమయ సంవర్ధిత బలుండగు నప్పూర్వగీర్వాణుని కోల్తల కోర్వక మేటి మగలెల్లం దొలంగిన. 69
క. గురుసుతుఁ డొక్కరుఁడును సు | స్థిరుఁ డై తద్బాణనిహతిఁ దెరలక యతి ని
ష్ఠుర నారాచంబులు పది | యురమున నాటింప దానవోత్తముఁ డలుకన్‌.
70
క. వడిఁ జక్రంబున వైచిన | నడుమన గురునందనుండు నఱకెం; బుణ్యం
బెడలిన నరు సంకల్పము | వడువున నది వమ్ముగాఁగ వసుధాధీశా!
71
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )