పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - పంచమాశ్వాసము
అంజనపర్వుం డశ్వత్థామతో యుద్ధంబు సేసి చచ్చుట (సం.7-131-44)
వ. అప్పుడద్దనుజుని తనయుం డంజనపర్వుం డశ్వత్థామం దలపడి బలుతూపులం బొదివిన బెదరక యతం డ య్యసుర వీరుని విల్లుద్రుంచి విరథుం జేయుటయు, వాఁడు కరవాలంబు గొనినం, దునిమె గద వైచిన దుమురు సేసె, నింగి కెగసి మ్రోఁగుచుం బాషాణ వర్షంబు గురియ నదియును వారించి యమ్మాయావి మేన మేఘంబున గిఱికొను తరణి కిరణంబులంగ్రేణిసేయు పటు బాణంబుల నిగిడించె; మగిడి యొండు రథంబున నరుదెంచినఁ దల ద్రెంచె; నిట్లు గురుపుత్రుండు వానిం బరిమార్చి పేర్చి పాండవ బలంబులఁ బరిమార్పం దొడంగినం గని కడంగి హిడింబా నందనుండు ‘నిలు నిలు నా బారిం బడి యెందుఁ బోవచ్చు?’ ననవుడు నా రథికుం డతని నవలోకించి. 72
ఆ. ‘వలదు రన్న! పిన్నవాఁడవు తండ్రి నే | నకట! నిన్నుఁ జూచి యలుగ రాదు;
పెనఁగు మొరులతోడ’ ననవుడుఁ బుత్ర శో | కాభితప్తుఁ డైన యతఁడు గనలి.
73
క. ‘ఎక్కడి తండ్రివి? నీవే | నక్కౌంతేయులకుఁ గొడుకనై పగతుర పే
రుక్కు సహింతునె? తనయుం | గ్రక్కించెద నిపుడ పట్టి కండలు దిందున్‌.’
74
క. అని పలికి యిరుసులంతలు | సునిశిత బాణమ్ము లేయుచుం దఱిమిన ద్రో
ణుని కొడుకు వాని నన్నిటిఁ | దునుమ నసుర మాయఁ బెఱిగి దుర్దాంతగతిన్‌.
75
క. గిరియై పఱతేర నశని | శరమును, మేఘత్వమొంది సాయక వృష్టిం
గురిసినఁ బవనాస్త్రంబును | బరువడి నిగిడించి గురుని పట్టి దెరల్చెన్‌.
76
సీ. హైడింబుఁ డల్గి యుగ్రాకృతిఁ గవిసిన | దనుజ గణంబు మాతంగ తురగ
రథ నివహంబుతో రారాజు మొన లెల్ల | నొక్కెత్తుగాఁ బ్రేల్చి యురవడింప
న న్నరనాథుండు విన్నఁబోయిన గురు | తనయుండు ‘నీకు నీ యనికి నేమి
పని? నీవు సంభ్రమింపకుము; దానవుల న | క్కడి మానవులను వ్రేల్మిడి నడంతు’
 
ఆ. ననిన సంతసిల్లి యతఁడు సౌబలుఁ జూచి | వీరె ద్రౌణిబాణదారితాంగు
లైరి పాండుసుతులు; దేరిగములతోడ | సత్వరముగ నరిగి జయము గొనుము’.
77
వ. అని యవ్వలను సూపి కృప కృతవర్మ కర్ణ వృషసేనులను దుశ్శాసన ప్రముఖులైన కొందఱు దమ్ములను నిరూపించి ‘వీరును నీవును గూడుకొని కవియుం’డని పనిచిన నతండును బింకంబుతోడం బోయె; నశ్వత్థామ భీమనందనుల సంగ్రామంబు భీమంబయ్యె; నట్టి యెడ నా ఘటోత్కచుండు. 78
మ. పటుబాణాహతి ద్రౌణి యంగము చలింపం జేసి తచ్చాప ము
త్కట వేగంబునఁ ద్రుంచినం గినిసి యాతం డొండు వి ల్లెత్తి యు
ద్భట బాహాబల శౌర్యముల్‌ నెఱపె నా దైత్యుండు సైన్యంబు నొ
చ్చుటయుం జచ్చుటయున్‌ మహీపతికి మెచ్చుం బ్రీతియుం జేయఁగన్‌.
79
వ. ఇ ట్లసురబలంబు నశ్వత్థామ సించి చెండాడం బాండవ బలంబులు దర్పం బేది మార్పెట్ట లేక చూచుచుండ నుద్దండ పరాక్రముం డగు నా ఘటోత్కచుండు దర్పంబున నెక్కటెక్కటి తలపడి పరిఘంబున వైచినం బట్టుకొని యతండు దానిన యద్దానవునిపై వైచుటయు, వాఁడు దొలంగ నుఱికి ద్రుపద నందన స్యందనంబునకుం బోయె; నయ్యుగ్ర సాధనం బతని తురంగ సారథి రథంబుల రూ పడంచిన. 80
ఆ. ఒక్క తేరిమీఁద నుండి ధృష్టద్యుమ్న | భీమసేన సుతులు పెనఁగి రస్త్ర
గురుతనూజు వీఁకఁ దెరలక యంత ను | ద్దామసేనతోడ భీముఁ డడరె.
81
వ. అప్పు డశ్వత్థామ నవ్వుచు నమ్మువ్వురం గ్రొవ్వఱ నేసి భాసమాన మార్గణంబులు నిగిడించిన. 82
మ. భటగాత్రంబుల ఘోటకాంగముల శుంభత్కుంభి కాయంబులం
జటుల స్యందన ఖండ సంచయములన్‌ సంగ్రామరంగంబు గ
ప్పుట చూడన్‌ వెఱఁగయ్యె నబ్బలములుం బోకేచి క్రమ్మంగ నె
త్తుటఁ దేల్చెం బొరిమార్చె నాతఁ డడరం ద్రుంచెన్‌ మథించెం గడున్‌.
83
వ. ఇ ట్లేకాక్షౌహిణీ బల క్షయం బాపాదించి యాతపత్ర శత పత్రంబును జామరమరాళంబును గేశ శైవాలంబును నాయుధమీనంబును మాంసమేదో మస్తిష్క పంకంబును; రక్త జలోద్రిక్తంబును నగు నదీప్రవాహంబు నుత్పాదించె; నప్పుడు దర్పంబున సురథుండును శత్రుంజయుండును బలానీకుండును బృషధ్రుండును జయానీకుండును జయుఁడును జంద్రసేనుండును జండ రయంబునఁ గదిసి బాణంబులు వరఁగించిన, నప్పాంచాల కుమారుల నమానుష విక్రమంబున సమయించినం గోపించి, కుంతిభోజ తనూజు లొక్కపెట్ట పదుమువ్వు రతనిం బొదివినఁ బదుమూఁడు మేటి తూపులం గీటడంచి కెరలి జము చందంబున గర్జిల్లి ఘటోత్కచుం గాలదండంబుఁ బోని కోలం దేరిపైఁ ద్రెళ్ళి మూర్ఛిల్ల నేసిన నోసరిల నయ్యరదంబు దోడన ధృష్టద్యుమ్నుండు గొనిపోవుటయుఁ, బొంగి సింగంబు చాడ్పున గర్జిల్లిన నిర్జరు లగ్గురునందను నగ్గించి; రంతయుం గనుంగొని. 84
ఆ. పాండవాగ్రజుండు పవనాత్మజునిఁ గూడి | తఱిమి సాత్యకియును దాను గవిసె;
నంత మూర్ఛ దేఱి హైడింబుఁ డొక్కతే | రనువుగాఁగఁ జేసికొని కడంగె.
85
వ. తోడన ధృష్టద్యుమ్నుండును బరవసంబు సేసినం దత్సైన్యంబు లొక్క మొగిన మొనయుటయును మనమూఁకలును సోమదత్త బాహ్లిక పురస్సరంబుగా నురవడించిన సందడి కయ్యంబయ్యె; నందు సంజ చీఁకటి చూపునకుఁ జొరవయీకున్నను సైనిక నికర వివిధాభరణ మణి కిరణ కలాపంబులుఁ జర్మవర్మాతపత్ర కేతుకీలిత రత్నరశ్మిజాలంబులు నాలోకనంబు నాపాదించె; నట్లిరువాఁగును గలయ బెరసి పోరునప్పుడు. 86
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )