| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - పంచమాశ్వాసము |
| వ. | కనుంగొని గృపాచార్యుం డలంతి నవ్వుతో నతని కి ట్లనియె. | 98 |
| చ. |
‘అగు నగు! మేలు మేలు! మనుజాధిపుఁడున్ మహి యేలు మాటల న్మగఁటిమి యిమ్మెయిన్ నెఱపినం జెడుఁ బాండుతనూజ కోటియుం దగు మును ఘోషయాత్రను బదంపడి గోగ్రహణంబునందుఁ బే రు గొనిన నీకు ని ట్లనుట క్రొవ్వులు దక్కుము; సాలు నిన్నియున్. |
99 |
| వ. | అని వెండియు. | 100 |
| క. |
నిన్నును బాండుతనూజుల | నెన్నండును బోరఁ జూచి యెఱుఁగని వారిం గన్నట్లు పలుక నేటికి | నిన్ని సెనటి రజ్జు లనికి నివి దోడ్పడునే? |
101 |
| క. |
క్రీడికి మును మన మందఱు | నోడు టెఱుఁగు; దన్నలును ఘటోత్కచుఁడు దగం దోడు పడ బంధునృపతులుఁ | గూడి నడవ మనకు గెలుపు గొన నెట్టు లగున్?’ |
102 |
| చ. |
అనవుడుఁ గర్ణుఁ డిట్టు లను ‘నాడిన యంతయుఁ జేయఁ జాలు బం టున కెటు లన్న నేమగుఁ? గడుం బెలుచన్ మును మ్రోసికాదె వృ ష్టి నిగుడఁజేయు నంబుదము సెల్లదు నీ పలు కింతవట్టు సైఁ పన తగు నింక నేమనినఁ బాఱుఁడ! నాలుక గోయుదుం జుమీ!’ |
103 |
| వ. | అని పలికి మఱియును. | 104 |
| క. |
‘నరు నద్దెసఁ గలవారిని | గురుబల ముబ్బు సెడఁ బొగడి కొఱ కొఱ గాఁగన్ గురుని గురుతనయు మద్రే | శ్వరు నను నేమిటికిఁ గాని వారిం జేయన్.’ |
105 |
| క. |
అని మామఁ బలుకు పలుకులు | విని యశ్వత్థామ క్రోధవివశుం డయి గ్ర క్కున వాలు వెఱికికొని క | ర్ణుని దెసకుం గవియ భూవరుం డెడ సొచ్చెన్. |
106 |
| ఆ. |
నృపతితోడఁ గూడి కృపుఁడును నెడ సొచ్చె | వార లతనిఁ బట్టి ‘వలదు రోష ముడుగ వలయు’ ననిన నుగ్రత నాతఁడు | పెనఁగఁ గర్ణుఁ డిట్టు లనియెఁ గనలి. |
107 |
| క. |
‘విడు విడు మాతం డిమ్మెయి | నడిచిపడఁగ నేల పట్టె దవనీశ్వర! నీ వుడిపెడు తెఱఁగున నా బిరు | దుడుగునె నా చేయిదాఁకి యుడిగిన భంగిన్?’ |
108 |
| క. |
అనుడుఁ గృపాచార్యుం డి | జ్జన పతికిం గాఁగ నేను సైరించిన నే మని పలికితేని నీకుం | జనియెం; బొ మ్మింక వలదు సంభ్రమ మనియెన్. |
109 |
| వ. | అప్పు డక్కురుపతి గురుపుత్రు నుద్దేశించి. | 110 |
| క. |
‘గురుఁడును నీవును మద్రే | శ్వరుఁడును గర్ణుండు గృపుఁడు సౌబలుఁడు ననున్ ధర యేలింపఁగ నున్నా | రరు; మీకుం దగునె సంగరములోఁ గలఁగన్. |
111 |
| క. |
క్షమియింపు’ మనుడు నతఁ డురు | శమ మొందినఁ గర్ణుఁడుం బ్రశాంతుం డై వి క్రమకేలి సలుపఁ బ్రతిసై | న్యము దెస మొగమయ్యెఁ బటుగుణధ్వని సెలఁగన్. |
112 |
| వ. | ఇట్లు గడంగినం బ్రత్యర్థి పార్థివు లయ్యోధవరు నాలోకించి ‘పాండవులకుఁ బాటిల్లిన యనర్థంబుల కెల్లను మూలంబు వీఁడ కాఁడె!, వీనిం బొదువుఁడు, పోనీకుఁడు, పడవైవుం’ డనుచు దలపడిన నా సూతసూనుఁడు నిజనామాంకితంబులగు నారాచంబుల నన్నరపతులఁ గరుల నరులఁ దురంగంబుల నరదంబుల రూపుమాపి యేపునఁ దదీయాంగంబులు రుధిరంబున మునుంగునట్లు సేసినం జూచి సవ్యసాచి సాయకజాలంబులు నిగిడించుచుం గవిసిన నతండు మూఁడు మార్గణంబులు దన తనువునఁ జొనుపుటయుం గినిసి యక్కిరీటి ముప్పది శరంబుల నొప్పించి భుజ శిఖరంబున బలు నారసంబులు నాఁటించినం జేతి విల్లు వడియెం; బడుటకుఁ దలంకక యక్కర్ణుం డాక్షణంబ విల్లు పుచ్చుకొని వివ్వచ్చుండు వెడంగుపడునట్టి వేగంబున వివిధ విశిఖంబులు నిగిడించిన. | 113 |
| మ. |
కడక న్నెఱ్ఱనిచెల్వుఁ దాల్ప నతఁ డుగ్రస్ఫూర్తి విల్ ద్రుంచి యె క్కుడు వేగంబున సూతుమస్తకముతోఁ గూడం దురంగాంగముల్ గడికండంబులు సేసి యా రథికుమైఁ గాఁడంగఁ బెక్కమ్ము లే యుడు నొవ్వారినఁ బాఱి యెక్కెఁ గృపుతే రుర్వీశ! నిర్లజ్జుఁ డై. |
114 |
| వ. | ఇవ్విధంబున రాధేయుం డోడి పాఱిన నీడంబోవు మన సైనికులం గనుంగొని కురువిభుండు. | 115 |
| క. |
‘నిలువుఁడు; వెఱపేటికి నేఁ | గలుగఁగ? గాండీవిఁ దక్కుఁ గల పాండవులన్ గెలిచెద నిదె చూడుఁడు నా | యలవుఁ జలము’ ననుచు నడచె నన్నరుమీఁదన్. |
116 |
| వ. | అప్పుడు కృపాచార్యుం డాచార్యనందనున కి ట్లనియె. | 117 |
| చ. |
‘శలభము వహ్నిమీఁదఁ జను చందము గాదె! నృపాలుఁ డర్జునుం దలపడఁ బోక; యాతని శితప్రదరంబుల బారి కగ్గ మై యెలసినఁ గావఁగా వశమె? యీతని నీవును నేను నుండి మొ క్కలమునఁ బోవనీఁ; దగదు గ్రమ్మన నెయ్దుము నిల్పు మవ్విభున్.’ |
118 |
| క. |
అనుటయు గురునందనుఁ డ | మ్మనుజాధిపు నెయిది ‘యేను మాన్చెద బీ భత్సుని కడఁక; యేమి మూఁడినఁ | జనియెదు తల కడచి సాహసక్రియ?’ ననుడున్. |
119 |
| ఆ. |
‘గురుఁడు పాండవులకుఁ గూర్చు; నీవును దానిని | నెఱిఁగి బవరమున నుపేక్ష సేయు; దిది మదీయ భాగ్యహీనత గాక నీ | వేచితేని నెవ్వ రెదురు సెపుమ! |
120 |
| క. |
పలువురు బంధులు నాకై | పొలిసిరి; మీరింకఁ బాండుపుత్రుల దెస రా వలవదు; పాంచాలాదుల | వలన నిలిచి గెలువుఁ డేను వారలఁ దీర్తున్.’ |
121 |
| వ. | అనిన విని యశ్వత్థామ భూమీశ్వరున కిట్లనియె: | 122 |
| క. |
గురునకు నాకును బాండవు | లరయఁగఁ గూరిమికిఁ బాత్ర మగుదుర యైనన్ దురమునఁ జుట్టఱికంబను | గరు సిడికొను టేల కలుగుఁ? గౌరవనాథా! |
123 |
| ఉ. |
పెక్కు రణంబులం గనియుఁ బెద్దయు నమ్మవు నన్ను మద్గురుం దక్కినవారు మేము విను దాఁపము ప్రాణము లోపినట్లు పే రుక్కునఁ బోర దైవగతి యున్నటు లుండెడుఁ గాక; పాండవుల్ మిక్కిలివారు నీ తలఁపు | మే గెలువన్ వశమే మహీశ్వరా! |
124 |
| వ. | మా కిరువురకుం దోడు కృప కర్ణ కృతవర్మ మద్రపతులు గల రెట్లును బాండవ సైన్యంబు సమయింతు; మూఱడు’ మని వెండియు. | 125 |
| తే. |
‘మమ్మ కాదు నీ వెవ్వరి నమ్మ; వెట్లు | నమ్మకున్నను నే మగు? నరవరేణ్య! ప్రతిబలంబుల లోనికిఁ బసుల నడుమ | సొచ్చు పులివోలెఁ జొచ్చెదఁ జూడు నన్ను. |
126 |
| వ. | నీచెప్పిన పాంచాలురం బఱపెదఁ, దక్కిన బలంబులం గలంచెదం; గౌంతేయులు దార్కొనినను మార్కొని నిలువరించెద’ నని పలికి తలకడచి నడచె; నప్పుడు గడంగిన కవ్వడికి మించి పాంచాల కేకయ ప్రభృతిసేన లొక్కపెట్ట కవియుటయు, నా జెట్టి బిరుదు వివిధ విశిఖ పరంపరలు పరగించినన్ బడలు వడియును బలుదెసలం బాఱియు నబ్బలంబులు వికలంబు లైనఁ బదుండ్రు రాజులు నిలు నిలు మనుచుఁ బరవసంబు సేసిన, వారల జముని వశంబు సేసి యేచిన యయ్యాచార్యసుతుం జూచి రోషావిష్టుండై ధృష్టద్యుమ్నుండు దాఁకి ‘నీవు గొందఱ నిర్జించితి నని దుర్జయత్వం బెక్కించుకొనకు; మేను జుమ్ము వచ్చినవాఁడ’ననుటయు నతండు ‘నిన్నకాదె వెదకెద మద్బాణంబులకుఁ బ్రాణంబు లిత్తుగా’ కనవుడు నప్పాంచాల వరుండతని నుపలక్షించి. | 127 |
| క. |
‘మీ తండ్రికి నే మృత్యువ | నై తోఁచినవాఁడ నగుట యట్లుండె; నినుం జూత మట సనక డగ్గఱు | మా తలఁకక; వలదు రిత్తమాటలు మనకున్. |
128 |
| వ. | అనియె నట్లయ్యిరువురును నొండొరులం బరుసంబులు పలుకుచుం బలు దెఱంగుల మెఱుంగుటమ్ముల నే ట్లాడి; రట్టియెడ. | 129 |
| మ. |
ధనువుం గేతువుఁ ద్రుంచి, సారథిని రథ్యవ్రాతముం గూల్చి, యే పునఁ బాంచాల తనూజు వెల్గొడుగు సొంపున్ వమ్ము గావించి, యా తని పార్శ్వ ంబుల యోధవీరశతముం దన్మాన్యులన్ మువ్వురం దునిమెన్ ద్రోణసుతుండు రాజు వొగడన్ దోర్వర్గ దుర్వారుఁ డై. |
130 |
| వ. | ఇవ్విధంబున వైరివధం బాపాదించి సింహనాదంబు సేసిన యశ్వత్థామ కట్టెదుర నిలువలేక పాండవ పాంచాల సైనికులు సెల్లాచెద రైనం గని ధర్మజ సమీరసూనులు ససైన్యంబుగా నతనిం బొదివినం గురుపతియును గురుసమేతుం డయి సేనలతోడ నడరినన్ బలుకయ్యంబయ్యె; నప్పుడు విజయుండును మన ప్రజమీఁదఁ గవిసె; నా సమయంబున నంబష్ఠ శిబివంగాది దేశంబుల బలంబులు భీమసేనుచేత మ్రగ్గె; నా సమయంబున మగధ మద్ర వంగాంబష్ఠాది దేశంబుల బలంబుల సవ్యసాచి సమయించినం గని కినిసి ద్రోణుండు వాయవ్య బాణంబునఁ గౌంతేయుల మొనలఁ జొక్కాకుల చందంబునం దూలం జేసిన. | 131 |