| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - పంచమాశ్వాసము |
| క. |
‘అలిగి నరుఁడు భీముఁడు నిరు | గెలఁకుల నయ్యస్త్రగురునిఁ గిట్టి శరౌఘం బులఁ దేల్చిన మగుడ ననికిఁ | దలకొని వడి నురవడించెఁ దత్సైన్యంబుల్. |
132 |
| తే. |
అధిపతియు నస్త్రగురుఁడు బేరగ్గలికలఁ | దఱుమఁ జతురంగములుఁ బేర్చి యుఱక వారి మొనలతోఁ దాఁకి గాండీవ ముక్త విశిఖ | శిఖల వేఁడిమి కోటఱి చెదరి పఱచె. |
133 |
| వ. | అట్టియెడ సోమదత్తుండు సమరోల్లాసంబునం బాండవ సైనికుల ‘నిలు నిలు’ మని యదల్చుచు నిల్చినం గనుంగొని సాత్యకి యతనితోడం దలపడినం దత్సంగ్రామంబు భీమం బయ్యె నందు. | 134 |
| సీ. |
సాత్యకి వి ల్లర్ధచంద్ర బాణంబున | నఱికి యా బాహ్లిక నందనుండు ముప్పదేనమ్ముల నొప్పింప, నత డొండు | విలు గొని యాతని నలుఁగుటమ్ము లైదింట నేసి మహారజత, ధ్వజం | బిలఁ గూల్చి ధనువు; సెక్కలుగఁ జేసెఁ జిఱునవ్వుతో నాతఁ డుఱక వేఱొక వింట | నేట్లాడఁగా భీముఁ డేసె నపుడు |
|
| తే. |
దాఁకి మీ తండ్రిపై ఘటోత్కచుఁడు వైచెఁ | బరిఘమును; నది దునిమె నక్కురువరేణ్యుఁ; డపుడు హయ సారథులఁ జంపి యతని యుసుఱు | గొనియె బలు నారసమున నా శినివరుండు. |
135 |
| క. |
మారుతి యిమ్మెయి నక్కురు | వీరునిఁ జంపించి మోము వికసిల్లఁగఁ దాఁ బోరెడు నెప్పటి మునుము మ | హీరమణుల మీఁదఁ దఱిమె నిభపురనాథా! |
136 |
| ఉ. |
చచ్చిన సోమదత్తుఁ గని సాత్యకిపై మనవారు గ్రమ్మినం జెచ్చెర ధర్మజుం డతనిఁ జేకొని వారలఁ దూలఁ దోలుడున్ వచ్చి గురుండు విల్ నఱకి వైచి సిడంబును డొల్లఁ జేసి మే నుచ్చి చనంగ నేయ నతఁ డుద్భట రోష మహోగ్ర మూర్తి యై. |
137 |
| క. |
వేఱొక విలు గొని యెమ్ముల | గీఱ మెఱుఁగు నారసముల గిఱికొలిపిన నో టాఱి మెయిం గ్రొన్నెత్తురు | వాఱ నతఁడు దేరిమీఁదఁ బడి మూర్ఛిల్లెన్. |
138 |
| వ. | కొండొక సేపునకు సేద దీఱి యక్కుంభసంభవుండు విజృంభించి వాయుదైవత్యం బగు శరం బేయుటయు నా భూవిభుండు దద్దేవతాకంబగు సాయకంబున శమియింపం జేసి పెల్లేసినం గని కృష్ణుం డతని కి ట్లనియె. | 139 |
| క. |
‘నినుఁ బట్టఁ గుంభజుండు ప్ర | తిన సేయు టెఱుంగు; దతనిఁ దేఁకువ సెడి మా ర్కొనఁ దగదు; నీకు భీముం | డని సేయు మొగమునఁ బొదువు మక్కురుసేనన్. |
140 |
| తే. |
ఇతని వధియించుటకు జనియించె నెవ్వఁ | డతఁడ యీతని తోడఁ బోరాడుఁ గాక!’ యనుడు నొక్కింత యూహించి యానృపాలుఁ | డరిగె; ద్రోణుండు ద్రుపద సైన్యమున కడరె. |
141 |
| వ. | అట్లు సని యుధిష్ఠిరుండు దన తమ్మునకుఁ బెను బ్రాపయ్యె; నయ్యనిలసుతుండును సాత్యకియు ధృష్టద్యుమ్నుండును బరవసంబు సేసినఁ గృప కర్ణ కలశభవులు గడఁగి; రయ్యుభయ సైనికోత్తములు సంరంభంబునం బేర్చిన సైన్యద్వయంబును రయంబునం గలయన్ బెరసినం బెందూళి యెగసి తఱితోఁ గవియుదెంచు దమంబునకుం దోడుపడి చూడ్కులు నిగుడనీకున్నను దమకంబునం దమ తమ పేళ్ళు బిరుదులు నుగ్గడించుచు నగ్గలిక సొంపునను సన్నల నుద్దేశంబుల నద్దెస నిద్దెస వీరులు వోరుచుండ నంధకారం బతిసాంద్రంబై చిక్కుపఱిచె; నట్టియెడ బిట్టడరి పాండవు లుద్దండ బాహాసంపదలు సూపిన నేపఱి కౌరవబలంబులు గలఁగి చీకాకు పడి చీఁకటి కతంబునం గూడుకొనంగానక పలుదెసలఁ దొలంగి పొలుపఱిన నయ్యాచార్యుండు ధైర్యంబు మెఱయ దుర్యోధనుం గూర్చుకొని యుద్దామ సామర్థ్యంబున సకల చతురంగంబులం బూఁచున ట్లొనర్చి యొక్క మోహరంబుగా నమర్చి, యం దగ్రభాగంబునం దాను నిలిచి యిరు గెలంకుల నశ్వత్థామ సౌబలుల నునిచి నడుకొన శల్యు నిలిపి యన్నరేంద్రుండు వెన్నుదన్ని నిలుచునట్లు సేసె ననుటయు; ధృతరాష్ట్రుండు సంజయునితో నిత్తెఱంగునం బన్ని బహుల తిమిరంబున సమరం బెట్లు సేసి రని యడిగిన నతం డతని కిట్లను - నా సమయంబున నక్కురు భూపాలుఁడు దమ కాలుబలంబుల నెల్ల నాయుధంబులు పెట్టి దివియలు పట్ట నియోగించిన. | 142 |
| క. |
మున్నాపని మానుసులం | గ్రన్నన పతి సంఘటింపఁగాఁ బనిచిన సం పన్నంబుగ నొడఁగూర్చిన | నున్నత కరదీప నికర ముజ్జ్వలితముగన్. |
143 |
| వ. | చేసికొని యప్పదాతి వర్గంబులు దివియలు దెచ్చిన నద్ధరణివరుండు రథంబున కైదును, గరికి మూఁడును, దురంగంబున కొండును నియతంబుగాఁ బట్టించి మఱియు వానికెలంకులను గేతనంబులకును దగం బట్టునట్లు సేసి, వెండియు మోహరంబు ముందటను బార్శ్వ ంబులను బిఱుందను బ్రభలు నిగుడం బొడవుగా నెత్తిపట్టం బనిచిన, నవ్వెలుంగు నింగికి నేలకుం జాలి పొలిచె; నట్టియెడ మణి భూషణంబులను రత్నకేతనంబులను వివిధాయుధంబులను బ్రతిప్రభలు ప్రజ్వరిల్ల శోభిల్లి నీ సైన్యం బొప్పె; నప్పుడు పాండవ బలంబునను రథంబునకుం బదియును గరికేడును దురంగంబునకు రెండునుగాఁ దత్ప్రకారంబునం గర దీపికాలోకం బాలోకనీయం బయ్యె; నయ్యవసరంబున నయ్యస్త్రగురుఁడు మధ్యందినమార్తాండు పగిదిం బ్రదీప్తమూర్తియై వెలుంగ నమ్మనుజపతి యనుజన్ములతో ని ట్లనియె. | 144 |
| తే. |
‘శల్య కృతవర్మ ముఖ యోధ సమితిఁ గూర్చి | కొని మహోద్యోగమున మీరు కుంభజన్ము చెంత కా ద్రుపదాత్మజుఁ జేరకుండ | నాఁగు’ డొరు లెల్లవారల నతఁడు గెలుచు.’ |
145 |