పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - పంచమాశ్వాసము
పాండవ కౌరవ వీరుల ద్వంద్వ యుద్ధము (సం.7-139-22)
వ. పదంపడి యా ధృష్టద్యుమ్నుం బరిమార్చు, కిరీటిం గర్ణుండును, భీమసేనుని నేనును గెలుతు’ మని పలికి బలంబులకుఁ జేయివీచి కడంగిన, నెదిరి సేనయు నురవడింప నెన్నండును జూడవినంబడని యట్టి బవరంబయ్యె; బాండవాగ్రజుండుఁ దన దొరల ద్రోణుమీఁదం గవియుం డని పనిచి, తానును దఱిమిన, నమ్మనుజపతిం గృతవర్మయు, సాత్యకిని భూరియు, సహదేవు రాధేయుండును , వాయుసూను సుయోధనుండును, నకులుని శకునియు, శిఖండిఁ గృపాచార్యుండును, బ్రతివింధ్యుని దుశ్శాసనుండును, ఘటోత్కచుని గురుపుత్రుండును, బాంచాల విభుని వృషసేనుండును, మత్స్య రాజును మద్రేశ్వరుండును, శతానీకునిఁ జిత్రసేనుండును, నర్జునుని యలంబుసుండునుం దలపడి; రిట్లు గురుని నొంపను రక్షింపను బూని మఱియు ననేకు లనేకులఁ దార్కొనిరి; సోమక సైన్యంబు సమయించు నక్కుంభసంభవుని ధృష్టద్యుమ్నుండు మార్కొనియె; నట్టియెడ. 146
సీ. పాండవాగ్రజుని చాపము ద్రుంచెఁ గృతవర్మ; | యతఁ డొండు విలు గొని యతని నొంచె;
ధనువును దునిమి హస్తం బుచ్చిపో శక్తి | యడరింప వేఱ శరాసనంబు
గొని హయ సూతులఁ గోదండంబును బొడి | సేసి హార్దిక్యుండు సెలఁగి యేసె
నరనాయకుఁడు గృపాణముగొన్న నఱకెఁ | దోమరముఁ బూనిన రూపుమాపి మఱువుఁ
 
తే. బఱియలుగఁ జేసి తనువునఁ బఱపె నార | సంబు; లిట్లమ్మహాబలు చటుల విక్ర
మంబు దుస్సహ మగుడు నమ్మానవేంద్రుఁ | డనికిఁ దొలఁగిన గురుబల మలరె నధిప!
147
క. భూరియు శినివరుఁడు శరా | సారము లొండొరులమీఁద సరిఁ బఱపి వడిం
బోరునెడ భల్లమున నా | కౌరవు విలు ద్రుంచె సత్యకసుతుం డధిపా!
148
ఆ. త్రుంచి మేను గాఁడఁ దూపులు నిగిడింప | నాతఁ డొండు వింట నతని నొంచి
ధనువు దునుమఁ గోప మినుమడి యై శక్తిఁ | ద్రెళ్ళ వైచె శినివరేణ్యుఁ డతని.
149
వ. ఇట్లు సాత్యకి చేతం జచ్చిన భూరిం జూచి భారద్వాజపుత్రుం డతని పయిం గవియుటయు ఘటోత్కచుండు ‘నిలునిలు’ మని యెలుంగు సూపి దొడ్డ తూపు లడరించిన నతం డవి మగిడించి పెల్లేసిన నేదు వెఱిగిన ట్లయ్య సురవరుండు దశ విశిఖంబులు రయంబున నురంబునఁ గ్రుచ్చిన మూర్ఛవచ్చి యమ్మేటిజోదు కేతుదండం బవలంబించి. 150
క. ఆలోనన తెలిసి మెఱుఁగు | వాలిక నారసము దైత్యువక్షమున వెసం
గీలించిన నరదముపై | సోలిపడుడుఁ దేరు దొలఁగ సూతుఁడు దోలెన్‌.
151
క. భీముఁడుఁ గురుపతియు శర | స్తోమము లొండొరులమీఁదఁ దొరఁగించుచు ను
ద్దామాంభోద పిహిత రవి | సోముల చందమున నొప్పుచుం బోరునెడన్‌.
152
చ. ధనువు సిడంబుఁ ద్రుంచి సముదగ్రత భీముఁడు మేను నొంప న
మ్మనుజవిభుండు వేఱొక సమగ్రబలం బగు చాప మెత్తి యా
యనమెయిఁ గాఁడ విల్‌ విఱుగునట్లుగ నేసిన నొండువింట న
య్యనిలజుఁ డేడు నారసము లా నృపు గాత్రమునందుఁ గ్రుచ్చుచున్‌.
153
చ. విలు దునుమాడి వెండియును విండులు నా ల్గతఁ డెత్త నెత్త ను
త్తలముగఁ ద్రుంచి వైచె గదఁ దత్తురగంబుల సూతుఁ జంప న
గ్గలమగు భీతి రాజు దొలఁగన్‌ వెస దాఁటుడుఁ గాన కాతఁడుం
బొలిసెనకాఁ దలంచి మదిఁ బొంగి వృకోదరుఁ డార్చె; నార్చినన్‌.
154
వ. మన మూఁకలు నట్లకాఁ దలంచి హాహాకారంబులతో నాకులతం బొందె; నందలి జనంబులు ప్రమదంబునం జెలంగి రక్కౌరవేంద్రుండు వేఱొక్క తేరెక్కి తోఁచినం గని యెల్లవారును డిందుపడిరి ; కర్ణ సహదేవులు సముదీర్ణ విక్రమంబు వెలయం బెనంగునప్పుడు. 155
క. అమ్మాద్రీసుతుఁ డేపునఁ | దొమ్మిది వాలమ్ము లొడలఁ దూర్చిన నతిరో
షమ్మునఁ గర్ణుండు దదం | గమ్ములు నొప్పించెఁ దీవ్రకాండ శతమునన్‌.
156
వ. ఇట్లు సహదేవుం బొదివి రాధేయుండు. 157
చ. రయమున విల్లు ద్రుంచిన పరాక్రమ మొండొక వింటఁ జేయఁగా
హయముల సూతుఁ జంపుటయు నాతఁడు ఖడ్గము ఖేటకంబు ని
ర్భయముగఁ బుచ్చుకొన్న బహు బాణములం దునుమాడె నన్యదు
ర్జయ మగు లావునం గడువెసన్‌ గద వైవ నడంచె నవ్వుచున్‌.
158
వ. దానం బెండువడక యప్పాండు నందనుండు. 159
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )