పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - పంచమాశ్వాసము
కర్ణుఁడు సహదేవుని వింటికోపునం బొడుచుచు నవమానించుట (సం. 7-141-12)
ఆ. శక్తివైవ నిశితచక్రంబు నిగిడింప | వరుస నదియు నిదియు వ్రయ్యలయ్యు
దునియ లయ్యు నేలఁ దొరఁగంగఁ జేసి పె | ల్లేసి, తెరలుటయును నెయ్దె నతఁడు.
160
వ. ఇత్తెఱంగునఁ గర్ణుండు గదిసి నిశ్చేష్టితుండగు సహదేవు నాలోకించి, కుంతి మాటలు దలంచి, యొండు సేయ నొల్లక యల్లన వింటికోపునం గడుపు వొడిచి నవ్వుచు ‘నెక్కుడైన పగఱ నుక్కునం దలపడకు; మల్ల వాఁడె నరుండు గురుసేనతోడ బిరుదై పెనంగెడు; నతని కడకుం బొ’ మ్మని పలికి పోయె; నక్కుమారుండును నట్లు గర్ణునేటులను మాటలను గడునొచ్చి తన బ్రదుకునకు రోయుచుం బోయి వేఱొక్క రథం బెక్కె; మత్స్య మద్రేశ్వరులు జంభవాసవుల చందంబున సమరంబు సేయు సమయంబున నా శల్యుండు. 161
క. హరులను సూతునిఁ జంపిన | విరటుఁడు పొలివోక వివిధ విశిఖచయంబుల్‌
గురియ శతానీకుఁడు శ | ల్యురథం బస్త్రములఁ బొదివె నుద్ధతభంగిన్‌.
162
వ. ఇట్లు మత్స్యా నుజుండు దాఁకిన. 163
తే. అతనిఁ గూల్చె మద్రేశుఁ డయ్యరద మెక్కి | విరటుఁ డడలును గినుకయుఁ బిరిగొనంగ
ముట్టె నాతని; నాతండు మూర్ఛవోవ | నేయ సారథి దొలఁగంగ నెగచె రథము.
164
వ. ఇవ్విధంబున విరటుండు వికలుఁ డగుటయు నా చక్కటి సైన్యంబులు శల్యునురవడికిం గాక తెరలినం దఱిమి ధనంజయుండు నిలువరించిన బలాఢ్యుం డగు నలంబుసుం డతని మేన మార్గణంబులు గ్రుచ్చి పేర్చిన నప్పాండవ మధ్యముండు. 165
ఉ. చాపముఁ గేతువుం దునిమి, సారథి నశ్వములన్‌ వధింప ను
త్కోపవికారుఁడై యసుర క్రూర కృపాణము గొన్న నేసె ను
గ్గై పృథివీస్థలిం దొరఁగున ట్లలయించి చతుశ్శిలీముఖా
టోపము సూప నాతఁడు గడున్‌ వెసఁ బాఱె భయార్తమూర్తి యై.
166
సీ. నకులనందనుఁడు నీనందనుతోఁ బోరు | నెడ నా శతానీకుఁ డేచి యతని
కంకట మంగంబు గ్రక్కునఁ బాసిపోఁ | బడ వేసి విల్లును సిడముఁ ద్రుంపఁ,
దలఁకక యొండు కోదండంబు గొని నీదు | పుత్త్రుండు నొంప నా చిత్రసేను
శరముల కోర్చి తత్తురగంబులను సూతుఁ | ధరఁ గూల్చె వెస భవత్పౌ త్త్రుఁ డపుడు.
 
తే. గలఁక లేక యతండు శీఘ్రమున నిరువ | దేను దూపుల నొంచిన నెసక మెసఁగఁ
గినుక నాతఁ డా ధనువును దునుమ నక్కు | మారుఁ డేఁగె హార్దిక్యుని తేరిపైకి.
167
క. ద్రుపదుఁడు వృషసేనుండును | నుపమానాతీత ఘోర యుద్ధంబున బా
ణ పరీత శోణిత ప్లుత | వ పురుజ్జ్వలులైరి కౌరవక్షితినాథా!
168
వ. అట్టియెడ నాకర్ణు పట్టి చేయి బెట్టిదంబయి వచ్చినం బాంచాల బలంబు నిజపతికిం దలకడచి యతనింబొదివి యా సైనికోత్తము నంపసోన కోటఱి పఱచినం బ్రదీప్తుండై యతండు మెఱసె; దుశ్శాసనుండు ధర్మనందన నందనుండును బోరునెడ నప్పాండుపౌత్రుం డతని ఫాలంబున వాలిక నారసంబులు మూఁడు నాటించినం ద్రిశిఖరయుత శైలంబులీల నయ్యువరా జొప్పి యవ్వీరుం గ్రూర శరంబులం గప్పి కేతు సారథి రథంబులం దిల ప్రమాణ శకలంబులు సేసిన. 169
క. వింధ్యాద్రి వోలె నాప్రతి | వింధ్యుఁ డచలితోగ్రమూర్తి వెలయ నిలిచి ద
ర్పాంధ్యమతి నడరి దీప్తా | వంధ్యాస్త్రము లక్కుమారవరుపైఁ బఱపెన్‌.
170
ఆ. అలిగి వెడఁదవాతియమ్మున నాతని | ధనువుఁ దునియ నేసి తనువునందు
నిశిత విశిఖచయము నిగిడించె నీ కొడు; | కంతఁ దత్సహోదరాళి గదిసి.
171
వ. కయ్యంబు సేయ నందు భీమసేననందనుం డగు శ్రుతసోము నరదం బయ్యుధిష్ఠిర తనయుం డెక్కి యొక్క సముద్దండం బగు కోదండంబు పుచ్చికొని భండనంబు సేసె; మనవారు నయ్యువరాజున కడ్డంబు సొచ్చి పెనంగిరి; నకులుండును శకునియు సమాన విక్రమంబుల సమరంబు సేయునెడ నా సౌబలుండు. 172
చ. ఒక బలు తూ పురంబు గొని యుచ్చి చనం గర మల్గి యేయుడున్‌
నకులుఁడు మూర్ఛ వోవుటయు నాదము రోదసి నిండ నార్చె; నం
తకుఁ దెలివొంది చాపముఁ బతాకయుఁ ద్రుంచి యతండు నీమఱం
దికి నరసా వొనర్చె ఘన తీవ్ర సముజ్జ్వల మార్గణంబులన్‌.
173
వ. ఇట్లు గాంధారపతి పడుటయుఁ దత్సారథి దేరు దొలంగఁ దోలుకొని పోయెఁ; గృపాచార్యుతోడ రణక్రీడఁ జలుపుచుండ శిఖండి కోదండంబు బిసకాండంబుగా ఖండించి యతండు శక్తి వైవ నదియును దునిమిన ఘనంబగు ధనువు గొని తోరంపు నారసంబున నతనిం దేరిపై సొగయ నేసి, యగ్గౌతముండు గోపంబునఁ జంపఁ దలంపెత్తి వెండియు నేయ నిగుడునంతకు నద్దెస యోధులు పలువు రొక్కట నుక్కున నురవడించిన మన దిక్కు సైనికులు శారద్వతుం గడచి కడిమి నెఱయఁ బోరిరి; మఱియు ననేక ద్వంద్వ యుద్ధంబులు సెల్లుచుండ సంకులసమరం బయ్యె; నయ్యవసరంబున. 174
సీ. ఏచి ధృష్టద్యుమ్నుఁ డాచార్యు నురమున | వెస నాఁటె నైదునారసము; లాతఁ
డాతని నిరువదేనమ్ముల నొంచి విల్‌ | దునిమిన నొండువిల్‌ గొని యతండు
మంటలు గ్రమ్మెడు మహితాస్త్ర మేయుడుఁ | గాలంబు గా కిది కలశజునకు
ననుచు నీవారు భయం బంద నేకాద | శాస్త్రంబు లొక ముష్టి నలవరించి
 
తే. యేసి కర్ణుండు దునియలు సేసె నడుమ; | నంతఁ గురురాజు యువరాజు నడర గురుసు
తుండు శకునియు శల్యుండుఁ దోడుపడిరి | వార లేడ్వుర తాఁకు నవ్వీరుఁ డోర్చె.
175
క. ద్రుమసేనుఁ డడరి పటు బా | ణము లుద్ధతిఁ బఱపె సూతనందనుపైఁ గో
పము గదిరి యతఁడు వాని శి | రము గుండలదీప్త మై ధరం బడ నేసెన్‌.
176
వ. ఇట్లు ద్రుమసేనుండు సచ్చినం బేర్చిన కోపంబునఁ గర్ణుకోదండంబు దునిమి ధృష్టద్యుమ్నుండు నఱిమిన, నొండు బలు వింటం బెనంగు నతనిం గూడుకొని కురురాజు మొదలగు నేగురు రథికులు పెలుచనేసి; రా సమయంబున సాత్యకి సమదగతిం గవిసి ‘నిలు నిలు’ మని యదల్చి రాధేయుం దలపడియె; న య్యిరువుర యుక్కును నొక్కరూపున నక్కజం బై యుండె; నట్టియెడ వృషసేనుండు వచ్చి శైనేయు నేయుటయు, నతండు వాలమ్ములు నిగిడించి వానిం దేరిపయిం ద్రెళ్ళి మూర్ఛిల్లం జేసినం పుత్రశోక పీడితుం డగు సూతపుత్రుం డచ్యుతానుజు నానాస్త్ర పీడితుం గావించె; నంతకుం దెలిసి తనయుండును దోడుపడియె; నట్లడరు నయ్యిద్దఱ నా శినివరుండు గినుక యెక్కిన యేడ్తెఱం జిక్కువఱిచె; నప్పుడు గాండీవ గుణ దేవదత్త మహారావంబును హాహా కారంబును వీతెంచిన నయ్యంగరాజు రారాజున కిట్లనియె. 177
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )