| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - పంచమాశ్వాసము |
| క. |
‘అదె పార్థుఁడు దన మునుమున | కొదవిన సేనలఁ గలంచునులి వడఁ డితనిం గదియఁగ రాకుండఁగ మును | పొదువుదమే సాత్యకిం బ్రభూత బలముతోన్? |
178 |
| వ. | అట్లయిన వీఁ డభిమన్యుపోయిన పోకం బోవు; నది నీకు విజయంబునకుఁ గారణం బగు; వీనిం బలువురు ముట్టుట యెఱింగెనేని వివ్వచ్చుండు వచ్చు నతం డెఱుంగకుండ నక్కడ నిలువరించి పోరం జాలు బల్లిదుల నట పుచ్చవలయు’ ననుటయు, నమ్మనుజవిభుం ‘డిది లెస్సకర్జం’ బని గాంధారపతిం గనుంగొని ‘నీవు పదివేలేనుంగులు నన్ని యరదంబులుం గొని దుశ్శాసన సుబాహు దుష్ప్రధర్షణ దుర్విషహులు దోడుగాఁ గ్రీడిపై నడచి కయ్యంబు సేయు; మద్దిక్కునం దక్కిన పాండవులు నున్నవా; రయ్యన్నదమ్ములం బొదివి గెలువు’ మనిన నతం డమ్మెయికిం జనియెఁ దదనంతరంబ. | 179 |
| క. |
చేయఁగల రథికులును రా | ధేయుఁడు బలయుతము గాఁగఁ దెప్పదెరల శై నేయుపయిఁ గవిసి బహువిధ | సాయకములు గురిసి రథిక సంరంభమునన్. |
180 |
| వ. | అతండును గోపాటోపంబున. | 181 |
| క. |
కరుల కరంబులు హయముల | శిరములు రథసంచయంబు చెక్కలును సమి ద్ధరఁ గప్పి క్రమ్మఱఁగ నె | త్తురు టేఱులు వఱపి దానిఁ దొలఁగం ద్రోచెన్. |
182 |
| క. |
శినివరు నద్భుత విక్రమ | మున కోర్వక కలఁగఁబడిన మొనఁ గనుఁగొని నీ తనయుఁడు తనయరదము నా | తని యరదముమీఁద నత్యుదగ్రతఁ బఱపెన్. |
183 |
| వ. | అయ్యిరువురు నక్కజం బగు కయ్యంబు సేయునెడ నా శైనేయుండు. | 184 |
| క. |
తురగముల సూతుఁ జంపినఁ | గురుపతి పొలివోక యతని గురుసున నేయం గరమలిగి ధనువు దునుముడుఁ | బరవస మఱి యొరుని తేరుపైకిం బోయెన్. |
185 |
| వ. | ఇ వ్విధంబున. | 186 |
| తే. |
పతి గలంగ శైనేయుఁ డ బ్బలము బాణ | నిహతిఁ దూలించె; నక్కడ నీ మఱంది యడరి యర్జునుతో విస్మయావహముగ | నాహవము సేసెఁ దగు సహాయంబు కలిమి. |
187 |
| చ. |
అతని సుతుం డులూకుఁడు నుదగ్రతఁ గృష్ణునిమేనఁ బార్థుపై శితశరకోటి నించి విలసిల్లఁగ సౌబలుసూతుఁ జంపి యు ద్ధతిఁ దురగంబులం దునిమి తద్ఘన చాపముఁ ద్రుంచె న న్నరుం డతఁడు తనూజు తేరి పయి కాత్మ చలింపఁగఁ బోయి వెండియున్. |
188 |
| తే. |
వాఁడుఁ దోడ్పడఁ గడఁగి వివ్వచ్చు నేసె; | నతఁడు వారలు సేడ్పడునట్లు గాఁగ గడఁక గల యోధవీరులు బడలు వడఁగ | బలము సెడి పాఱఁ దనవింటి బలుపు సూపె. |
189 |
| వ. | ఇట్లు వివ్వచ్చుండు పేర్చిన యా సమయంబున ధృష్టద్యుమ్నుండు. | 190 |
| క. |
తఱిమి గురు వింటి గొనయం | బఱిముఱిఁ దునియంగ నేయ నతఁ డాతని నే డ్తెఱ నొండు వింట నేసిన | నుఱక తునిమె నాతఁ డ మ్మహోగ్రశరంబుల్. |
191 |
| వ. | వెండియు నాచార్యుం డేయు సాయకంబులు ద్రుంచుచు నంగంబులు నొంచుచు మిగిలి మార్గణజాలంబుల సైన్యంబు దైన్యంబు నొందించె; నట్లు సాత్యకి సవ్యసాచి ధృష్టద్యుమ్నులచేతం గలయం గలంగి కౌరవానీకంబు గాందిశీకం బగుటయుఁ, బాంచజన్య దేవదత్తాది శంఖరవంబులు సెలంగం బాండవ బలంబులు గూడికొని వెన్నడిం గవిసినం గని భీషణరోషాతిరేక విధేయుం డయి రాధేయుండు. | 192 |
| మ. |
తలలుం జేతులుఁ గాళ్ళులుం దనువులున్ ధాత్రీస్థలిం బెక్కు తి ట్టలు గావించి రథప్రతానములు ఘోటశ్రేణులున్ వారణా వలులుం జేడ్పడఁ బైపయిం దఱిమి దుర్వారైక దర్పోద్ధతిం జలముం జేవయుఁ జూపె నుద్భటభుజా సంరంభ రౌద్రంబుగన్. |
193 |
| వ. | ఇ వ్విధంబున విజృంభించి నొంచినం బఱిపఱియై పఱచు న వ్వాహినుల వెనుకొను నా సూతనందనుం జూచి తలంకి ధర్మతనయుం డర్జునునితో నిట్లనియె. | 194 |
| క. |
నడురేయి తీవ్రభానుఁడు | పుడమి వెలసె నను తలంపు పుట్టించుచు ను గ్గడు వగు తేజంబున వెలిఁ | గెడుఁ గర్ణుఁడు బాణరుచులు గిఱికొన దెసలన్. |
195 |
| ఆ. |
‘ఇట్లు దఱిమెనేని యిప్పుడ యీతఁ డి | ద్దిక్కు వారినెల్ల నొక్కయెత్తు గాఁగఁ బిలుకుమార్చుఁ గావున నెమ్మెయి | నైనఁ బ్రతివిధాన మాచరింపు’. |
196 |
| వ. | అనిన విని యతం డచ్యుతు నాలోకించి ‘రాధేయు రభసంబున కిమ్మోహరం బోహటించిన భూపతి భీతుండయ్యె భారద్వాజుండును బైకొని యొక్క వలన మొనలం దెరల్చెడి నే నదల్చి యిక్కర్ణు నుక్కడంచి యక్కుంభసంభవు సంరంభంబు వారించెదఁ దేరు నడపు’ మనుటయు నద్దనుజమర్దనుం డతని కిట్లనియె. | 197 |
| క. |
‘వినుము నిశాసమయంబున | దనుజులకుం బేర్చు బాహుదర్పము శౌర్యం బును; గావున హైడింబుం | డనిఁ గర్ణుని నోర్చుఁ; బనుత మతని నతనికిన్’ |
198 |
| వ. | అని వెండియు. | 199 |
| క. |
‘మన మంతకు వేఱొక ది | క్కున నడతము; భీమసుతునకును మాయలుఁ బెం పొనరిన దివ్యాస్త్రంబులు | ననేకములు గలవు; వలవ దనుమానింపన్. |
200 |
| వ. | అని చెప్పి ఘటోత్కచుం బిలిచిన నతండు సన్నాహ సంరంభమూర్తి స్ఫూర్తి మెఱయం జనుదెంచి ‘పనియేమి?’ యనుటయు. | 201 |
| ఉ. |
‘పాండవ సైన్యముల్ సెదరి పాఱెడుఁ గర్ణునిచేత నొచ్చి, యు ద్దండత నీదు శౌర్యమును దర్పము నేర్పడ నిల్వరింపు; మీ తం డని రాత్రి నీకుఁ గడుఁ దక్కువ; తండ్రులకున్ జయంబు పు త్రుం డొసఁగంగఁ గాన్పు మహి రూఢికి నెక్కదె? గెల్వు మీతనిన్.’ |
202 |