| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - పంచమాశ్వాసము |
| క. |
‘భీమునిఁ దత్సోదరులను | భూమీశ్వర! యిపుడ పట్టి పొరివుచ్చెద; ను ద్దామత మ్రింగెదఁ గృష్ణుని | తో మిత్రగణంబుతో సుతులతోఁ గూడన్. |
210 |
| వ. | నీకును నీ వారికిం గయ్యంపు టలజడి గాకుండునట్లుగా నరిసేన సమయించెద’ ననియె; నప్పుడు ద్రోణద్రౌణి కృప కృతవర్మ మద్రపతి ప్రముఖ యోధవీరులు వెఱఁగుపడి చూచుచుండం బేర్చి హైడింబుండు గవిసినం గర్ణుదెస నఖిలజనంబులును నిరాశులైరి; సుయోధనుం డలాయుధు నాలోకించి. | 211 |
| తే. |
‘భీమతనయుండు మాయపుఁ బెనఁకువలను | గర్ణు నొప్పించుచున్నాఁడు; గడఁగి వానిఁ దాఁకి గెలువు నీ’ వనవుడు దైత్యవిభుఁ డు | దగ్రగతిఁ జని తాఁకె నా దైత్యవిభుని. |
212 |
| క. |
అరదము మొదలైన సకల | పరికరములు రూపునేపుఁ బ్రాయంబును న య్యిరువురు దనుజాధిపులకు | సరియై యొప్పారెఁ జూడ జగతీనాథా! |
213 |
| వ. | ఇ ట్లేపు మెఱయ నిరువురుం దలపడి పోరు వారలం జూచి సూతసూనుండు మరుత్సూనుపయిం గవిసిన నతండు దన సుతుం డలాయుధుచేత నొచ్చునో యను తలంపునఁ గర్ణునిఁ గ్రేడించి యమ్మేటి రక్కసునిమీఁద నాటోపంబున నడరుటయుఁ, దదనుచరులగు నిశాచరు లనేకు లొక్కమొగి నతనిం బొదివిన కినుక నమ్ములగములు వఱపి యవ్వీరుండు వారిం బఱపిన. | 214 |
| తే. |
పోక నిలిచి యమ్మారుతపుత్త్రుఁ డేయు | సాయకంబులఁ గొన్నింటిఁ జంచదస్త్ర కుంఠితంబులఁ గావించి కొన్ని యురము | నందు డిందంగ మెఱసె న య్యసురవరుఁడు. |
215 |
| క. |
భీముఁడు గద వైచిన ను | ద్దామ గదాప్రహతి నది యతండు సదిపి యు గ్రామేయ వివిధ విశిఖ | స్తోమంబుల నతని నొంచె దుర్జయలీలన్. |
216 |
| వ. | నిజ బలంబులం బురికొల్పిన నవి పాంచాల సైన్యంబుల బడలు వఱిచె; నప్పుడు శౌరి సవ్యసాచిం జూచి ‘రాత్రి యుద్ధంబున రాక్షసులు వేర్చిరి; వీరి మరల్ప నకుల సహదేవ సాత్యకి ప్రభృతుల నియోగింపుము; కర్ణుదెసకు శిఖండి ధృష్టద్యుమ్న ప్రముఖులం బనుపుము; గురుని ప్రాపున నురవడించు నరపతుల నీవు నిలువరింపు’ మనునెడ నలాయుధుం డనిలతనయు ధనువు దునిమి యతండు వేఱొక్క విల్లెత్తికొను సందున సారథి రథ్యంబుల సోలనేసినం బొలివోవక యబ్బలుమగండు గదాహస్తుండయి గొదకొన వాఁడును గదగొని మార్కొని ఘోరంబు గాఁ బోర గదలు దుము రగుటయు రథావయవంబులుఁ గరిదంతంబులు లోనుగా దొరకొన్నవియ సాధనంబులుగా నొండొరుల నొప్పింపం దొడంగిన. | 217 |
| క. |
కని హరి ‘గర్ణునితోడం | బెనఁగు ఘటోత్కచునిఁ బిలిచి భీముఁడు వల; ది ద్దనుజుని మర్దింపుము నీ’ | వన నాతం డతని విడిచి యతనికిఁ గవిసెన్. |
218 |
| క. |
నకులాదులు నా దైత్య | ప్రకరంబుఁ దెరల్చి రేఁచి రాధేయుఁడు నే లకుఁ గోలకుఁ దెచ్చెను సో | మకుల శిఖండ్యాది రథిక మర్దనుఁ డగుచున్. |
219 |
| వ. | ఆ విక్రమంబు వీక్షించి సన్నద్ధుం డయి సమీరనందనుం డా సూతనందనుం దలపడినం దోడ్పడి నకులాదులు నానాస్త్రంబులు గురిసిరి; కిరీటి పాంచాలురం గూర్చికొని కుంభసంభవ సైన్యంబుఁ బొదివి సమయించుచుండె; నలాయుధుండు ఘటోత్కచునిం బరిఘ పాతంబున సోలంజేసిన, నాలోనన తెలిసి యతండు. | 220 |
| క. |
గదఁద్రిప్పి బెట్టు వైచిన | నది రథ్యంబులను సూతునరదము సిడముం జిదురుపలు సేయ నతఁ డం | బుదమై గర్జిల్లె నభము బూరటిలంగన్. |
221 |
| వ. | ఇట్లు మాయ గైకొని నెత్తురు సోనతోఁ బిడుగులు వడంజేయ, వాయు తనయ తనయుండును దివి కెగసి తనమాయ నమ్మాయ మాయించినఁ, గ్రమ్మఱ బకభ్రాత భూచారి యయినఁ, దోడన హైడింబుండును డిగ్గిన నయ్యిరువురకుం దరువుల పాషాణంబుల భీషణం బగు రణంబు వాలి సుగ్రీవ సమరసమంబై చెల్లె; మగుడ వివిధాయుధంబుల నా యోధు లాయోధనంబు సేసి; రట్టియెడఁ గరవాలంబు గొని మదంబునఁ గవిసినచో ఘటోత్కచుం డలాయుధుం దలవట్టి బలువిడి నిలంబడ దిగిచి మెడ దెగవ్రేసి యార్చినం బేర్చిన పాండవ బలంబులఁ దూర్యనినదంబులు సింహనాదంబులుం జెలంగె; నప్పుడు. | 222 |
| క. |
పటుగతిఁ జని కురుపతిముం | దట వైచెం జేత నున్న తల రౌద్రం బు ద్భటముగ ఘటోత్కచుం డు | త్కట శోకము వొంది రతఁడుఁ దత్సైనికులున్. |
223 |
| క. |
మును బకుననుజుని వలనం | దనతమ్ములుఁ దాను బ్రదుకఁ దలఁచి యతఁడు స చ్చిన విభుఁడు భీమసేను ప్ర | తిన పారం బెయ్దు నని మదిం దలఁచె నృపా! |
224 |
| వ. | అట్టియెడఁ గర్ణుండు కౌంతేయ సైన్య సంతానంబు నానాస్త్ర ఘట్టనంబుల విఘటితంబు సేయుచున్న నవ్వాయునందననందనుండు నిజస్యందనం బెక్కి యుక్కు మెఱయం దలపడియె; నయ్యిద్దఱుం బెద్దసేపు శరపరంపరల సరి యై సంగరంబు సేసిరి; పదంపడి రాధేయుండు రథ్యంబులం జంపిన రథ సమేతంబుగా నా ఘటోత్కచుం డదృశ్యుండైన నీ సైనికులు దల్లడిల్లి ‘యెక్కడ వచ్చి యెవ్వరి నేమి సేయునో’ యనుచు మేనులు వడంక నలుగడలుం గనుంగొనుచుండిరి; హైడింబుండును మహాంబుదంబు చందంబునఁ జదలం దోఁచి మెఱుముచు నుఱుముచు బాణ కృపాణ ముసల ముద్గర కుంత క్షురికాది హేతివ్రాతంబులుం బరుషోపల పటలంబులుం దొరఁగింపం దోడి దానవులు మొగిళ్ళయి యొక్క మొగి నట్లు చేయ నా సూతసుతునకుం బ్రతివిధాన మాచరింప నలవిగామిఁ గౌరవ బలంబున రథంబులు గజంబులుఁ దురగంబులుఁ ద్రెళ్ళను గూలను డొల్లను దొడంగె; నొండు గడకుం గడంగు తలంపులు దక్కి తలలుఁ గప్పికొని యుండి యోధులు భగ్నాపరభాగులై పడంజొచ్చి; రప్పు డిద్దెస వా రెల్ల నాఖండల ప్రముఖ బృందారకులు పాండునందనులకుం దోడ్పడి యిట్లు సేసెద రను వగ వెగడంది కలంగంబడి; రయ్యవసరంబున. | 225 |
| శా. |
ధీరత్వం బొకఁడుం సహాయముగ రాధేయుండు దివ్యాస్త్ర సం చారోల్లాసము సూపెఁ జూపుటయు రక్షస్సంచయానేక మా యా రూపావళి భాస్కరాంశుల నదృశ్యాకారమై పోవు నీ హారంబుం దలఁపించుచున్ విరిసె నే నాశ్చర్యముం బొందితిన్. |
226 |
| చ. |
మగుడఁగ దానవప్రవరు మాయ సమంచిత దివ్యబాణ శ క్తి గుదియఁ జేసి తొంటితన తీవ్రత గైకొని నీదుసైన్యముల్ బెగడువడన్ మదించి యతి భీమ సముద్ధతి నింక నెమ్మెయిం దెగఁ డను భీతి యోధులమదిన్ జనియింపఁగ నాక్రమించినన్. |
227 |
| వ. | వార లందఱు సూతనందనుం జూచి యాతండు గలంగమికి నచ్చెరువందుచు నగ్గించి యతని నుద్దేశించి, ‘యన్నిశాచరుం డిందఱ సమయింపకుండం గాచికొనుము; నీవును బ్రదుకు; మాఖండలుండు గవచకుండలంబులు గొనునప్పుడు నీకు నొసంగిన మహాశక్తి యింక నెన్నఁటికి? భీమార్జునులు ని న్నేమి సేసెద? రిప్పుడు బ్రదికిన మఱి చూచికొంద; మప్పరమ సాధనంబు వీనిమీఁదం బ్రయోగింపు’ మనునెడ నారక్కసుం డామేటి మగని గీటడంచువాఁడై యాటోపంబునం గదిసి తదీయ రథ్యంబులఁ బటు గదా పాతంబునం బొలియించె; న ట్లవ్వీరుండు విరథుం డగుటయుం దఱిమి యద్దనుజుండు గదాంతర పాతాభితాడితుం జేసిన నోసరిలి యతం డాసైనికుల యాలాపంబుల నాలించి తనకుఁ జావు దప్పించుకొన నది దప్ప నొండుపాయంబు లేమిం జేసి. | 228 |