పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - పంచమాశ్వాసము
కర్ణుఁ డింద్రదత్తం బైన శక్తిచేత ఘటోత్కచునిం జంపుట (సం. 7-154-5)
ఉ. వైరివినాశనక్రియకు వాసవుఁ డిచ్చిన డాఁచియున్న యా
ఘోరపుశక్తి నాలుకలు గ్రోయ మెఱుంగులు ప్రజ్వరిల్ల ఘం
టారవ మధ్రవీథి నిగుడం దగఁ గేల నమర్చి పేర్చి య
వ్వైరికిఁ బూఁచినం దలఁకి వాఁడు మహోన్నతఘూర్ణితాకృతిన్‌.
229
తే. తెరలి పాఱఁగఁ దలఁచుచో దృష్టితోడఁ | గూడికొను ముష్టి మృత్యువు తోడఁబుట్టు
వనఁగఁ జాలు నద్దివ్యసాధనము వైచె | గగన తలమున భూతసంఘములు మ్రోయ.
230
వ. ఇ వ్విధంబున రాధేయుండు మహోగ్రంబుగా వైచిన. 231
క. మును మాయ మ్రింగి దనుజేం | ద్రుని యురము పగిల్చి కొనుచు దుర్భరగతి వీఁ
పున వెడలి శక్తి యెగసెను | వినువీథికి నుడుగణంబు వెలుకం బాఱన్‌.
232
వ. అప్పుడు. 233
క. సోలుచు బోరగిలంబడి | నాలుక వెడలంగఁ బెట్టి నడుము గఱచుచున్‌
లాలలు గ్రమ్మఁగ రక్షః | పాలుఁడు వికృతాస్యుఁ డగుచుఁ బ్రాణము విడిచెన్‌.
234
వ. ఇట్లు ఘటోత్కచుండు వడిన మన సైన్యంబున శంఖభేరీ స్వన సహితంబులగు సింహనాదంబులు సెలంగె; నీ పుత్రుండు బంధుమిత్ర సమేతంబుగాఁ బ్రమోదంబు నొంది సూతనందనుం గౌఁగిలించి తనయరదం బెక్కించికొని యుల్లసిల్లె; ననిన విని ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె. 235
క. బలు మాయా బల బాహా | బలములు గలవాఁడు భీముపట్టి వడిన న
గ్గలమగు శోకముఁ గోపము |నలఁచుం బాండవుల నెట్టు లైరొకొ వారల్‌?
236
వ. అని యడిగిన నమ్మహీపతికి నతం డిట్లను నట్లు మృతుం డైన హిడింబాసుతుం జూచి కౌంతేయు లత్యంత దీనమానసులై కన్నీరు గడలుకొన నడలునఁ గుందిరి; గోవిందుండు ప్రమోదంబు నొంది సింహనాదంబు సేసి శంఖంబు పూరించి పగ్గంబులు నొగల ముడిచి మందమారుతాందోళితంబగు మందారంబు చందంబు దోఁప నర్తించుచు నరదంబు నడిమి కరిగి కిరీటిం గౌఁగిలించికొని వీఁ పప్పళించి వెండియు నార్చిన నాతం డ య్యుపేంద్రు నుపలక్షించి. 237
ఉ. ‘చచ్చె ఘటోత్కచుండు మన సైన్యము లెల్లఁ గలంగి నల్గడన్‌
విచ్చుటఁ జూచి మేము వగ నెక్కొన వందెద మిప్పు డెమ్మెయిన్‌
వచ్చెఁ బ్రమోద? మెట్లు గరువంపుఁ జరిత్రము దక్కి లాఘవం
బచ్చువడం జెలంగెదు? మహాపురుషా! యిది యేమి సెప్పవే .’
238
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )