పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - పంచమాశ్వాసము
కృష్ణుండు ఘటోత్కచుండు వడఁ దాను సంతసించుటకు నిమిత్తం బర్జునునితోఁ జెప్పుట (సం.7-155-11)
వ. అనుటయు నయ్యచ్యుతుం డతని కిట్లను ‘నింద్రుండు గుండలంబులు కొనుచుండి కర్ణుని కిచ్చిన శక్తి యతనికడ నున్నంత కాలంబును నిన్ను బ్రతికించుట దుష్కరం బని తలంచుచుండుదు; నేఁడు హిడింబానందనుమీఁద నది వోయినం బ్రమోదంబు నొందితి; నా సూతనందనుం డది సేత నుండెనేనిఁ జక్ర గాండీవ ధరులమై మన మిరువురముం గవిసితి మేనియు జయించు; నతండు దేవ సన్నిభుండు; దివిజపతి వేఁడినఁ గవచకుండలంబులు వికృత్తంబులు సేసి యిచ్చుట వైకర్తనుండనం బరఁగె; నీకై మీతండ్రి యిట్లు సేయఁడయ్యెనేని వాని కెదు రెవ్వరు? కవచకుండల విహీనుండై మానవ సామాన్యంబు నొందుటను శక్రదత్త సాధనంబు లేమిం జేసియు నింక నీకు గెలువవచ్చు; నిట్ల యేకలవ్య శిశుపాల జరాసంధాదుల నీక కా నొక్కొక్క తెఱంగునం బిలుకు మార్చితి; నిత్తఱి వార లున్నఁ గౌరవపతి వారలం దెచ్చుకొను; నమ్మువ్వురుఁ గూడిన నెవ్వరికి నోర్వరాకుండు; ఘటోత్కచుండును గిమ్మీర బక హిడింబులతోడి వాఁడ; ధర్మద్వేషంబును రోషంబును గలిమిం జేసి యొక్కప్పు డొప్పమి వచ్చుం గావున నద్దానవుల యట్ల వీని పొలిసి పోకయు నా కభిమతంబు; వీఁడు రావణునట్టి వాఁ డగుట నిపుడు సావకుండెనేనిఁ బదంపడి నాకుం జంప వలయు; నిది సంతోషకాలంబు గాని శోక సమయంబు గాదు; మన మొనలు గలంగెఁ గురుబలంబు పై కొనియెడు నీవుఁ దెలిసి యుత్సాహంబు వాటింపు, మనియెనని చెప్పిన విని ధృతరాష్ట్రుండు సంజయు దిక్కు మొగంబై. 239
చ. ‘ఒకనిని జంపి యిట్లు సను నుజ్జ్వల శక్తి నెఱింగి కర్ణుఁ డే
టికి నరుమీఁద దాని నిగిడింపక యిన్ని దినంబు లప్రయో
జకముగఁ జేసెఁ గయ్యము? భుజాబలశాలి నరుండు వడ్డఁ బో
రికి మఱి యుత్సహింపఁ గలరే పెఱవారలు; సూతనందనా!
240
క. పిలిచికొని యైనఁ బార్థుం | బొలియింపఁడ శక్తి; నతఁడు పోరికి నెవ్వా
రలు రమ్మన్నను వ్రతమయి | తలకొని చనుఁ; గర్ణుఁ డేల తప్పం జేసెన్‌?’
241
వ. అని వెండియు. 242
తే. ‘నా తనూజులు దుర్బుద్ధు లీ తెఱంగు | నీవుఁ దలఁపవ; యాశక్తి నీరజాక్షుఁ
డొడిచికొనియెనె మొఱకుచే నున్న తియ్య | పండు వెస నాఁచికొనిన నేర్పరియుఁ బోలె’
243
వ. అనిన న మ్మహీపతికి సంజయుం డి ట్లనియె. 244
తే. రాత్రు లీపని కర్ణుతో రాజు ననుజ | సమితియును నేనుఁ దగఁ జెప్పుదుము నరేంద్ర!
యతఁడు లెస్సగ విని ‘యెల్లి య క్కిరీటి | సచ్చుఁ బటుశక్తి’ నని బాస యిచ్చు మాకు.
245
వ. ఏము వెండియు నా కర్ణునితో నిట్లందుము- ‘వివ్వచ్చుండు సచ్చినం దక్కటి పాండవులం దొక్కనిఁ బద్మనాభుండు పట్టంబు గట్టుం; గావున ననర్థ మూలం బగు నమ్మాధవుండు దెగిన జగతీ రాజ్యంబు మనకుఁ దక్కు; నింద్ర దత్తం బయిన శక్తి నతని సమయించుట గార్యంబు.’ 246
క. అని చెప్పిన య మ్మాటలు | విని ‘యెల్ల విధముల కృష్ణవిజయులలో నొ
క్కనిఁ బొరిపుచ్చెదఁ జూడుం’ | డనుచుఁ జనున్‌ సూతసుతుఁ డహంకారముతోన్‌.
247
తే. వినుము వేగిన సంగ్రామమునకుఁ బోయి | నప్పు డ క్కర్ణునకు మాకు నందఱకును
దోఁప దా బుద్ధి వెండియుఁ దోఁచు మగిడి | వచ్చి శిబిరంబు సొరఁగ దైవంబు కతన.
248
వ. దైవం బన వేఱొకండు గలదె? కృష్ణుండ; యది యెట్లనిన - నట్లర్జును బోధించునప్పుడు సాత్యకి శౌరితో ‘నా సూతసుతుం డీ శక్తి యిన్ని దినంబులు ధనంజయుమీఁదఁ బ్రయోగింపమికిఁ గారణం బేమి? యని యడిగిన నతండు. 249
తే. ‘వాని వా రెల్ల నీపని వాని కెపుడుఁ | గఱపుదురు; వాఁడుఁ బూన్కిమైఁ గడఁగి వచ్చుఁ;
దాఁకుదల నేను వారలందఱును మఱచు | నట్లు సేయుదు నరునకునై కుమార!’
250
వ. అని పలికి ధృష్టద్యుమ్నాదులం బేర్కొని యాతనిం గలిపికొని సాత్యకి నుద్దేశించి. 251
క. ‘మీరును బ్రాణములు ద్రిలో | కీ రాజ్యము నాదు బుద్ధికిం బార్థుక్రియం
గూరిమికిం బాత్రంబులె | యీ రేయి గదా! సుఖించి యే నిద్రింతున్‌.
252
వ. అని చెప్పె నట్లు గావున మనకుఁ బశ్చాత్తాపంబు వలవ దనుటయు ధృతరాష్ట్రుండు ‘మీరు దైవోపహతుల; రమ్మహాశక్తి దృణీభూతుం డగు ఘటోత్కచునకుఁగా వమ్మయ్యె; నింక మీవా రెవ్వరు నెప్పరుసున బ్రదికెదరు? చేయునది లే; దటమీఁది వృత్తాంతంబు సెప్పు’ మనవుడు నజ్జనపతికి సంజయుం డిట్లనియె. 253
తే. భీమనందను చావునఁ బ్రేముడించి | ధర్మతనయుండు బాష్పాంబుధార లడర
మేను డిల్లంబుగాఁ దేరిమీఁద వివశుఁ | డగుచుఁ జదికిలఁ బడుటయు నచ్యుతుండు.
254
వ. రయంబునం జని కరంబులం బొదివి యాతని నాలోకించి. 255
క. ‘ప్రకృతిజనునట్టు లిమ్మెయి | వికృతిం బొందంగఁ దగునె? విను! మిట్లయినం
జకితం బగు నీ సైన్యము | సకలము; లె, మ్ముత్సహింపు సమరంబునకున్‌.
256
వ. నీవు వహించు గురుభారంబు దలంపక యింత యలంత నొందిన జయంబు సేకుఱునే?’ యనిన నతండు కన్నీరు కరతలంబున నొత్తికొని మెత్తని మాటల ఘటోత్కచుని గుణముల గణుతించి కామ్యకవనంబునను గంధమాదన యాత్రను దమకుఁ జేసిన సాహాయ్యం బుగ్గడించె; ‘వాఁడు నాకు భక్తుం; డేనును సహదేవుకంటెను వానికిం గూర్తు; నట్టి; పట్టి లేకున్న నాకు శోకంబు గాకుండునే?’యని, తత్ప్రతివీరునిదెసకు నెలసిన యంతరంగంబు రోషాక్రాంతం బగుటయు ‘నిక్కుమారు నిట్లు సేసిన యీ దుర్జాతుండ కాఁడె? మున్ను నభిమన్యువిల్లు నఱికి చిక్కుపఱిచి యబ్బాలునిం బలువురచేతఁ జంపించె; నప్పుడు దవ్వుల నున్న సైంధవుని సవ్యసాచి సమయించె; నది దానికి మాఱుగా; దీరెండు క్రూరకర్మంబులకుఁ గర్ణునిఁ గడికండలు సేయక శాంతింబొంద నేర్తునే?’ యని బిగువుటెలుంగునం బలికి దిగ్గన లేచి ‘యా ద్రోహికి నిన్నయు నేఁడును దోడ్పడిన ద్రోణుం దెగటార్పవలయు; నప్పనికిఁ బావని వోవు; నే సూతసూనుం డున్నెడకుం బోయెద’ నని శంఖం బొత్తి చాపంబు పుచ్చికొని రథంబు నడప సూతు నియమించి చనుచుండె; నప్పు డచ్యుతుండు దమతేరిపైకి వచ్చి వివ్వచ్చు వీక్షించి. 257
క. ‘తనచేతన సూతసుతుం | దునుముదుఁ గా కనుచు నలుకతోడ రయమునం
జనియెడు ధర్మసుతుం డీ | తని నూరక చూచుచునికి దగునే మనకున్‌?’
258
ఆ. అని రథంబు పెలుచఁ జన నిచ్చె; నట్లు క్రో | ధాంధవృత్తి నరుగు నవ్విభునకు
సమ్ముఖంబు గాఁగ సత్యవతీసుతుఁ | డరుగుదెంచి కరుణ నాదరించి.
259
వ. అతండు ప్రణతుం డైన దీవించి యి ట్లనియె. 260
సీ. ‘అనిమిషనాథుఁ డిచ్చిన శక్తి యర్జును | సమయింపఁ గర్ణుండు సంగ్రహించె;
నది యున్న దాన నయ్యాపద వాటిల్లె | నేని నయ్యలఁత సహింప వశమె?
యీ ఘటోత్కచునకు నింతియ కాలమై | యా నెపంబునఁ దెగటాఱెఁ జూవె!
యిట్లు మే లిది దైవ మిచ్చిన దురిత ని | స్తారంబు నీ; కింత దలఁచి నీవు
 
ఆ. సంభ్రమంబు దక్కి సైన్యంబు దోడ్పడ | మనుజపతులఁ దమ్ములను సుహృజ్జ
నములఁ గూర్చికొని రణంబు సేయుము కురు | ప్రతతి తోడ నీదు బలము మెఱయ.
261
క. కలఁక యుడిపి చిత్తము ని | ర్మల ధర్మోదాత్తముగ నమర్చి నెగడు; మె
వ్వలనఁ గలుగు ధర్మం బ | వ్వలనికి జయ మంగళము లవశ్యముఁ గలుగున్‌.’
262
వ. అని హితోపదేశంబు సేసి. 263
క. ‘విను మేనగు దివసంబున | నినుఁ బొందు ననూనమేదినీ రాజ్యశ్రీ
యనుమాన మేమియును లే’ | దని గ్రక్కున నమ్మునీంద్రుఁ డరిగె నరేంద్రా!’
264
వ. ఇ ట్లమ్మహాముని సనుటయు, సావధానుండై పాండవాగ్రజుండు ధృష్టద్యుమ్నుం గనుంగొని ‘గురుని పురోభాగంబునఁ గౌరవసేన భీమసేనుండు దాఁకి తెరల్చుచున్నవాఁడు; నీ వక్కుంభసంభవు సంరంభంబు మాన్పుము; తద్వినాశం బాచరించుటకయి యనలంబున జనియించిన వాఁడవు; శిఖండి ప్రముఖ పాంచాల కుమారులం గొని యరవాయి గొనక యడరు’ మని పలికి కెలంకుల నున్న నకుల సహదేవ ద్రుపద విరాట ద్రౌపదేయ శైనేయ కేకయుల నాలోకించి ‘మీరును ఫల్గున పురస్సరంబుగా ద్రోణవధంబునకుం గడంగుఁ’ డనుటయు. 265
క. వారలు దమ తమ బలములుఁ | దారును గవియుటయు నత్యుదగ్రత గురుఁ డ
వ్వీరానీకము మార్కొని | పోరికిఁ దన సైన్య సమితిఁ బురికొల్పి తగన్‌.
266
వ. బరవసంబు వాటించెఁ; గురువిభుండును గోల్తల సేసె; నప్పు డిరుదెఱంగుల వాహినులును దగ యెత్తి తూలం జొచ్చె; నీ సైనికులు డప్పియు నిదురయుం గదిరి మేను లలయం గొందలంపడి రెల్లవారికి నా త్రియామ సహస్రయామ యయితోఁచె; నట్లైనను నిజధర్మంబు ప్రతిపాలింప నడరి పెనంగుచుండిరి; నిద్రా పరవశత్వంబున దివియల వారును హీనప్రయత్నులైనం దమంబు గవియం దొడంగె; నట్టియెడం గునికి కునికి యాయుధంబులు వడ విడుచు వారును వాహనంబులు వోయినట్ల పోవం దెరలువారును జొక్కునం దమవారిం దామ యెదిరి పొడుచువారును, మఱియు ననేక ప్రకారంబులగు వికల సంచారంబుల గాసి యగువారును నగుటయుం గని గాండీవి యిరువాఁగు నుద్దేశించి యెలుంగెత్తి. 267
క. ‘అడరెడు నిద్రాభరమునఁ | గడు డస్సితి రెల్లవారుఁ; గలనను జాడ్యం
బెడలఁగఁ జొక్కు మడుఁపుఁ; డి | ప్పుడ చంద్రుఁడు వొడుచు; వెండి పోరుట యొప్పున్‌.’
268
వ. అనిన విని మన వారలందఱు నట్ల మే లని కర్ణ దుశ్శాసనుల యనుమతి వడసి విశ్రమించిరి; పాండవ సైన్యంబును విశ్రామంబు నొందె; గగనంబున దేవగణంబు ధనంజయు ధర్మజ్ఞత్వంబు ప్రస్తుతించె; నయ్యవసరంబున. 269
ఆ. ‘కరుణ గలవు; మమ్ము గారవంబున సుఖా | న్వితులఁ జేసి తనఘ! నీకు సురలు
వరము లెపుడు నిచ్చువారు గావుత; మనో | రథముఁ బొందు మమరరాజతనయ!’
270
క. అని యక్కౌరవ సైన్యము | జనములు సంప్రీతి సవ్యసాచికిఁ బలు దీ
వన లిచ్చుచు నాతనిఁ గీ | ర్తన సేయుచు నిద్ర వొందె ధరణీనాథా!
271
వ. ఆ సమయంబున నుభయ బలంబులయందును. 272
క. తరుణుల కుచములపై రతి | పరవశులై యొఱగు పతుల పగిది సమర సం
భరిత శ్రమమున నిద్రిం | చిరి కరికుంభములఁ జెంది చెన్నుగ జోదుల్‌.
273
క. తురగంబులపై నాశ్వికు, | లరదంబులమీఁద రథికు లప్పుడు నిద్రం
బొరసిరి; కొందఱు భూస్థలి | నిరవుగ సుఖనిద్ర సేసి; రి ట్లున్నంతన్‌.
274
సీ. నలువ చెందొవల ఱేకులకు నన్నువు వెట్టఁ | గోరి కావించిన గుళిక యనఁగ;
నఖిల ద్విజ శ్రేష్ఠమగు చకోర చయంబు | తపము సముల్లసత్ఫల మనంగఁ ;
జిగురుజొంపము నునుజిగి యొప్ప నుదయాద్రిఁ | బొలుపారు నవకల్ప భూజ మనఁగఁ;
బూర్వ పయోరాశి పొంతఁ గెంజాయ చె | న్నొదవిన పవడంపుఁ బొద యనంగ
 
తే. నరుణ రుచి తన మండల మతిశయిల్లఁ | బొడిచి, దివిఁ బ్రాఁకి, దీధితు లడరఁ జేసి,
యంతకంతకు నెక్కుచు సంతమసముఁ | గాలుకొననీక చంద్రుఁడు గ్రాలె నధిప!
275
వ. ఇట్లు ప్రౌఢుండై కామినీ గండ పాండు చ్ఛవిం దొట్టి కుముదంబులకు జగన్నేత్రంబులకు నానందం బాపాదించుచుఁ జంద్రుండు మహేంద్ర ప్రముఖ దిఙ్ముఖ్మంబు లలంకరింపఁ గౌరవ పాండవ బలంబులు మేలుకని యాలంబునకుఁ దొడఁగె; నప్పుడు కురురాజు గురుని కడకుం జని యతని యస్త్రవీర్య శౌర్యంబు లగ్గించి ‘యిట్టివాడవు నీకు సరిగాని వారిం బాండవులఁ బెద్దసేసికొని శిష్యత్వంబు వాటించి పోటునకుం జొరక తిరుగుట నా భాగ్యంబు చందంబు గాక! నే నేమి సేయవచ్చు?’ ననవుడు నతండు గనలి ‘యర్జునుండు శిష్యుం డని మన్నించియ కాదె ఖాండవం బాఖండలుండు గోలుపోయె; ఘోషయాత్రఁ జిత్రసేనాది గంధర్వులు నిన్ను విడిచి వలియం బాఱిరి నివాత కవచ కాలకేయాదులు వొలిసి? రివి యేల? వలవని దురుక్తు లనుటయు నమ్మనుజపతి గోపించి సంరంభంబుగా నక్కుంభసంభవుతో ‘నీవు సవ్యసాచికిఁ జాలవేనిం జాలవ కాక! నిలువుము కొంత సైన్యంబు గొని నీయోపినవారితోడం బెనంగు; మేనును దుశ్శాసన శకుని కర్ణులు నా కవ్వడిఁ గూల్చెద’ మనిన నవ్వి యవ్వీరుం ‘డట్ల చేయుం; డిది గర్జం; బత్తెఱంగునన గెలుతురు గాని పొం’ డని పలికి, వెండియు. 276
క. ‘కుడిచితి, కట్టితి, పెట్టితి, | పుడమి సమస్తంబు నఖిల భోగంబుల నె
క్కుడు పేర్మి ననుభవించితి; | తొడరుము వెఱ పుడిగి పార్థుతోడఁ గుమారా!
277
వ. అని యప్పాంచాలు బలంబు దిక్కు పేరుక్కున నడచెఁ; గౌరవపతియును బాండవుల వలనికి నురవడించె; నిట్లు వేకువ జామున సంగ్రామంబు సెల్లఁ బదంపడి తూ ర్పెఱ్ఱ నగుచు వచ్చె; నప్పు డచ్యుతుం డర్జును నాలోకించి ‘రెండు మైల గండు మిగిలి వచ్చి పోరెడు నిమ్మూఁకల నన్నిటిని డాపట నిడి తఱుమవలయు’ నని యతం డొడంబడ నమ్మెయి నరదంబు నడపె; భీముండును బరవసంపు మాటల బీభత్సునిం బురికొలిపె; నివ్విధంబునఁ గడంగిన గాండీవిం బొదివి దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు పెల్లేసిన ‘నయ్యోధవరుం డందఱ కన్నిరూపులై యేట్లాడ నిరువాఁగును బెరసి తలలు వట్టికొని పోట్లాడెఁ; దదనంతరంబ. 278
క. మొనలో నిలువక యుత్తర | మునకై చని యేకతంబు మొనసిన గురునిం
గని పాండవ సైన్యము పులిఁ | గనిన హరిణకులము నట్లు కంపము నొందెన్‌.
279
వ. ఇత్తెఱంగున నెఱి గలిగి యద్దెసవారిం బిలిచిన నా సైనికు లచ్చెరువడువారును, గోపించువారును, గడంకలు దెచ్చుకొను వారును, నివ్వెఱఁగందు వారునునయి; రందు విరాట ద్రుపదులును ద్రుపదు మనుమలలోన మువ్వురును గేకయపతులును సబలంబుగా బలువిడిం గవిసి యక్కుంభసంభవుం జుట్టుముట్టిన, నతండు. 280
మ. ప్రజ నెల్లం దునుమాడి యుగ్రముఖుఁ డై పాంచాల పౌత్రత్రయం
బు జముం జేరఁగఁ బుచ్చి, కేకయుల కేపుం జేవయుం జూపి యం
బుజముల్‌ గోసినకైవడిం దలలు సంఫుల్లాస్య భల్లంబు ల
క్కజ మై యుండ నిగిడ్చి త్రుంచెఁ బటుదోర్గర్వం బఖర్వంబుగన్‌.
281
వ. వెండియు. 282
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )