పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - పంచమాశ్వాసము
విరాట ద్రుపదులు ద్రోణునిచేతఁ జచ్చుట (సం. 7-161-34)
శా. చంచద్బాణ పరంపరా ప్రహతులన్‌ సైన్యంబుఁ గ్రూరోద్ధతిం
జించెం; జించిన నింక నెన్నఁటికి నిస్సీ భూరిబాహాబలం
బంచుం గూడి కడంగి నొంపఁ గుపితుండై మత్స్యభూవల్లభుం
బాంచాల క్షితినాథునిం దునిమె దర్పస్ఫూర్తి శోభిల్లఁగన్‌.
283
వ. ఇవ్విధంబున విరాటద్రుపదులు పడినం జూచి ధృష్టద్యుమ్నుండు ‘ద్రోణుం జంప నయితినేనిం గులాచార ధర్మంబులకుఁ దప్పినవాఁడ నగుదు’ నని పలువురు విన బాస యిచ్చి పాంచాల సేనా సమన్వితుండై యతని పయిం గవిసినం గురుపతి గర్ణాదులుం దానును నడ్డపడి పెనంగె; పెనంగినం దవులం బడిన యా ద్రుపదనందనుం గనుంగొని యనిలతనయుం డదల్చి ‘నన్నుఁ జూడు’ మనుచు నడరిన నప్పార్షతుండును గూడికొనిన నక్కౌరవేశ్వరుండును బరవసంబు సేయుటయు, నుభయ బలంబులుం బురికొని తలపడిన సంకుల సమరం బయ్యె; నంత. 284
క. విరియించి తామరలలో | నరుణాంశులు సొచ్చి సుభగ మగు సౌందర్య
స్ఫురణము నొందఁగఁ దోఁచెం | దరణి యుదయ శిఖరిమీఁద ధరణీనాథా!
285
వ. అప్పుడు రెండు దెఱంగుల జనంబులుం గాలోచిత కృత్యంబులు సలిపి క్రమ్మఱఁ గయ్యంబు సేయం దొడంగిరి; ప్రొద్దెక్కిన నెండ తాఁకును రేయింటి యలజడియు నప్పటి యాఁకలియు నొడళ్ళు డిల్లపడం జేసినను మొగంబులు వెడంగు పఱపినను బొలివోని పౌరుషంబుల నయ్యిరువాఁగునుం గడంగి కలయన్‌ బెరసి పెనంగు నా రభసంబునం బెల్లెసఁగు ధూళికతంబునం బోయిన రాత్రి మగుడ వచ్చె నను బుద్ధి యెల్లవారికిం బుట్టె; నట్టియెడ ద్రోణ ధనంజయులు మిసిమింతులుగాక సేనలం జీకాకు పడనీక పొదివి పోరించిరి; బెట్టిదంబు లగు వివిధాస్త్ర శస్త్ర పాతంబులం గరి తురగ పదాతి వ్రాతంబుల శరీరంబులం దొరంగు రుధిరం బారేణువు నడంచిన కొలఁది నిలువక బహుల ప్రవాహంబుల నుత్పాదించె; నార్పులు బొబ్బలుం బోట్ల నొఱలు చప్పుళ్ళను జిందంబుల మ్రోఁతయు బెరసి పరఁగి నలుదిక్కులుం బిక్కటిల్లె; నా సమయంబున. 286
తే. పతియు యువరాజుఁ గవలను బార్థుఁ గురుఁడు | భీముఁ గర్ణుఁడుఁ దాఁకి రుద్దామ లీల
వారి రథ బహుగతులు దుర్వార విశిఖ | విసరణంబులు నద్భుత విధము లయ్యె.
287
క. నకులుఁడు నృపతియు నొక్కం | డొకనిం జుట్టుకొని వచ్చు నొప్పును బలుపుం
బ్రకటీకృత శౌర్యమ్మును | సకలజనముఁ బ్రస్తుతించె జగతీనాథా!
288
క. విను సహదేవుఁడు దుశ్శా | సనుసూతునిఁ దునుమ, నతఁడు సారథికృత్యం
బును జలుపుచు నేయుచుఁ గవి | సిన నాతఁడు నొంపఁ బఱచెఁ జెడి తురగంబుల్‌.
289
ఉ. భీముఁడుఁ గర్ణుఁడుం గదిసి భీమసముద్ధతి నేటులాడి రు
ద్దామ గదానిపాతన విధంబులు నప్పుడు గల్గె నయ్యెడన్‌
భీముని వాజులన్‌ రయము పెంపునఁ గర్ణుఁడు గూల్చె మార్గణ
స్తోమమునం గురుప్రతతి చూడ్కులకుం బ్రమదం బొనర్చుచున్‌.
290
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )