పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - పంచమాశ్వాసము
ద్రోణార్జునుల ద్వంద్వ యుద్ధము (సం. 7-163-20)
వ. పవననందనుండు నకులస్యందనం బెక్కె; గురుండును గిరీటియు వివిధ బాణాసారంబుల నంబరంబు గప్పుచు సమరవిహారంబు సలిపి; రట్టియెడ. 291
క. గురుఁ డేయ నరుఁడు ద్రుంపఁగ | నరుఁ డేయఁగ గురుఁడు ద్రుంప నానావిశిఖ
స్ఫురణ పరిహరణముల క | చ్చెరు వందుచు నుండి రుభయసేనల జనముల్‌.
292
చ. దొరఁకొని దివ్యబాణములు ద్రోణుఁడు బల్విడి నైంద్ర మాదిగా
నరుపయి నేయ నాతఁడు మనంబునఁ గొంకక తత్తదస్త్రము
ల్వెరవున నేసి యేసి యఫలీకరణం బొనరించి పేర్చుఁ ద
ద్వర శరజాలమున్‌ గురునివారితమై యడఁగుం బొరిం బొరిన్‌.
293
వ. ఇట్లు సదృశంబులగు శస్త్ర బల బాహు వీర్యశౌర్యంబు లసదృశంబుగాఁ బోరు నగ్గురు శిష్యుల నుపలక్షించి సుర ఖచర విద్యాధరులు దమలోన. 294
క. ‘హరుఁడు వినోదార్థముగా | నిరుమే నయి రణ మొనర్చె; నింతియ కా కి
ప్పరుసున నక్కజ మగు సం | గర మొనరింపంగ నొరులఁ గంటిమె యెందున్‌?’
295
వ. అనుచుండి రప్పుడు. 296
మ. క్షితియుం బర్వత కోటియున్‌ వడఁకె నగ్నిచ్ఛాయ లయ్యెన్‌ దిశ
ల్చతురంభోనిధులుం గలంగె భయలోలం బయ్యె దేవవ్రజం
బతి సంక్షోభము నొందె నొక్క మొగి సైన్యద్వంద్వమున్‌ ద్రోణుఁ డు
ద్ధతి బ్రహ్మాస్త్రము మౌర్వితో నియతమంత్రస్ఫూర్తి సంధించినన్‌.
297
వ. ఇట్లు సువిహిత సంధానుండై యతం డమ్మహాస్త్రంబుఁ బ్రయోగించిన. 298
తే. అంతరంగంబునం దొక యింత యేని | యలుకు లేక తనర్చి బ్రహ్మాస్త్రమునన
వేడుకకు మరలించిన విధము దోఁప | నద్భుతంబుగ వారించె నర్జునుండు.
299
వ. ఇత్తెఱంగున గెలుపోటమియు లేక యయ్యిరువురుఁ బోరుటయు, నత్తఱిం గెరలిన సందడి కయ్యంబు కతంబున మాని యగ్గురు పార్థులు పాంచాల కౌరవ బలంబులపైఁ దఱిమి; రా సంకుల సమరంబున దుశ్శాసనుండు ధృష్టద్యుమ్నుం దాఁకి యోర్వలేక తొలంగె; నతండు ద్రోణుమీఁదం గవిసినఁ గవలును దోడ్పడం గృతవర్మ యడ్డపడి పెనంగె; సుయోధనుండును సాత్యకియుఁ దార్కొని తమ శైశవ క్రీడలు దలంచి యుగ్గడించి ‘రాజధర్మం బిట్టిద కాక’ యని తలంచి పోరం జొచ్చి; రట్టి యెడ నా శినివరుండు భూవరువిల్లు ద్రుంచి మేను నొంచిన నోహటించి యోసరించి దప్పిదీర్చికొని మగుడ నమ్మాధవానుజుం దలపడి యెప్పటియట్లు కలంగం జొచ్చినం జూచి రాధేయుఁ డయ్యోధవరుదెసకు నడరినం గని వడముడి యతని మార్కొని తూపులు నిగిడించిన నవి నిలువరించి నవ్వుచు నాతం డవ్వీరు సారథి సొగయను శరాసనంబు దునియలై తొరఁగను జేసిన నా బల్లిదుండు బలుగద ద్రిప్పి బిట్టు వైచిన సూతుండును రథంబును బొడియైననుం దెరలక సూతసుతుండు శరవ్రాతంబు నిగిడించె; నప్పు డనేక చతురంగంబు లెడసొచ్చె; ధర్మతనయుండు మాత్స్యాది బలంబులం బురికొల్పుకొని కుంభసంభవు దిక్కున కురవడించె; నంత మధ్యాహ్నం బగుచు; వచ్చె నా సమయంబున నకుల సహదేవ సమీరనందను లర్జును నుద్దేశించి యెలుం గెత్తి. 300
తే. ‘కోలు మసఁగి గురుండు పాంచాలసేన | నేలకును గోలకును దెచ్చె; నీవు గడఁగి
కౌరవులఁ బాయ పఱపు; మేకతమ యైన | నతనిఁ బరిమార్చుఁ బైకొని యబ్బలంబు.’
301
వ. అనుచు నయ్యాచార్యుపైఁ గవిసి; రిట్లు పెక్కు బలంబులు గ్రమ్మినఁ బటు ప్రదరజాలంబులు వఱపి పొడిసేయు నమ్మహాత్ము నాలోకించి ధర్మతనయ భీమసేన మాద్రీతనయులు గూడికొని తమలోన. 302
మ. ‘కరులం గూల్చుచుఁ, దేరులన్‌ నఱకుచున్‌, గర్జిల్లి ఘోటమ్ములన్‌
నరులన్‌ నెత్తుటఁ దేల్చుచున్‌, దొరల నానారూపఖండంబు లై
తొరఁగం జేయుచుఁ గుంభజుండు విలసద్దోర్దండ చండాకృతిం
దెరలం బైఁజనుదెంచు నేపు మనలం దీర్పంగ నోపుం దుదిన్‌.
303
వ. ఎవ్వరికేని నిలువరింప నలవి గాదు; నరుండును ధర్మపరుండై యూరకున్నవాఁడు; దెగువకుం జొరం’ డనుచు దలంకిరి; వారి తెఱంగు గనుంగొని కమలనాభుండు దమతేరు వారల కడకుం గొనిపోయి కిరీటితో నిట్లనియె. 304
చ. ‘అని మొన దేవ దానవుల కైనను గెల్వ నశక్య మిమ్మహా
త్ముని; నొకమందు సెప్పెద; సుతున్‌ హతుఁ డయ్యె ననంగ విన్న యం
తన యితఁ డాయుధంబు దిగఁ ద్రావి యచేష్టతఁ బొందు; నప్పు డీ
తనిఁ బరిమార్పవచ్చు; నిది తప్ప నుపాయము గల్గ దెమ్మెయిన్‌.’
305
వ. ‘కావున నశ్వత్థామ సచ్చె నని యొక్కరుం డతనికిఁ జెప్పుటయ కర్జం’ బనిన విని యచ్చటియందఱు ‘నిదియ మే’ లని; రర్జునుండు దాని కొడంబడక యుండెఁ; బాండవాగ్రజుండు విషాదంబుతో విచారించెఁ; దదనంతరంబ. 306
క. భీమునిచే నని నశ్వ | త్థామ యనం బరఁగు భద్రదంతి వడిన ను
ద్దామగతి నన్నెపమ్ముగ | నామారుత పుత్రుఁ డేగి యగ్గురుతోడన్‌.........
307
వ. ‘అశ్వత్థామ సచ్చె’ నని చెప్పుటయుఁ’ జిత్తంబు జల్లని చెదర బెదరియు నతండు దన కొడుకు నస్త్రవీర్యాది గుణంబులు గణుతించి యప్పలుకులు పెడచెవులం బెట్టి కలఁక లేక ధృష్టద్యుమ్నుపైఁ గవిసి పెల్లేసి, యతని కడ్డపడిన పాంచాల రథికుల నిరువది వేవుర వధియించి, మాత్స్యబలంబున కుఱికి యేనూఱు రథంబులఁ బదివేలు మాతంగంబుల నన్నియ తురంగంబులం బొరిగొని, తేజరిల్లి రాజుల గములకు నాదిగొనునప్పుడు విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ గౌతమ కశ్యప వశిష్ఠాత్రిప్రభృతి మునివర ప్రకరం బాతని పాలి కేతెంచి- ‘భారద్వాజా! నీవు బ్రాహ్మణుండవు, వేదవేదాంగవిదుండవు; నీకు సంగ్రామంబు సేయ ధర్మంబగునే? యింతకు మున్ను చేసితేనియుం జేసితి గాని, కాలంబు పూర్ణం బయ్యెఁ గాన నింక సమరంబు నుడుగుట మేలు; మా మాటలు వట్టి యాయుధంబులు వెట్టి శాంతిఁ బొందు’ మని చెప్పి యంతర్థానంబు సేసిన న వ్విప్రవరుండు వారల పలుకు లూహించి భీమసేను వచనంబులం దలంచి యగ్రభాగంబునకు వచ్చి యున్న ధృష్టద్యుమ్నుం గనుంగొని వికల చిత్తుండును శోకాయత్తుండును నగుచు నిజపుత్రుండు సచ్చుట బ్రదుకుట, యజాత శత్రు వలన నున్నరూపు దెలియువాఁడై యతని నడిగె; నయ్యవసరంబున వాసుదేవుం డవ్వసుమతీపతి కిట్లనియె. 308
తే. ‘అడరి యీ దివసము నపరాహ్ణమునను | ద్రోణుఁ డని సేసిన ట్లైనఁ ద్రుంగిపోక
యుండ నేర్తురే యిక్కడి యోధు లెవ్వ | రైన? విను నుతి గాదు సత్యమ్ము సుమ్ము!
309
క. మము నీతని కొప్పింపక | సముచితముగఁ గాచికొను; మసత్యవచన దో
షము లేదు ప్రాణరక్షణ | సమయంబున; నతని కొడుకు సచ్చెన యనుమీ!’
310
వ. అని పనిచె; నట్టియెడ నయ్యుధిష్ఠిరుతో భీమసేనుం ‘డే నప్పుడు కృష్ణుండు సెప్ప నయ్యోధవరు వధియించును పాయంబు విని యదియ మనంబున నుండి మాళవేంద్రుండగు నింద్రవర్మ వారణం బశ్వత్థామ యనుపేరిటిది నాచేతఁ జచ్చె;నది నెపంబుగ నతనికి నశ్వత్థామ సచ్చె నని చెప్పితిఁ జెప్పిన నొక్కింత విచారించి యమ్మాట దెస ననాదరంబు సేసె; నీకు విజయంబు గోరి హితం బుపదేశించు నీ గోవిందుని వాక్యం బుల్లంఘింపక నీవు నట్ల చెప్పుము; నీ వచనమ్ము నమ్మి యతండు గయ్యంబు సేయఁ జేయాడక చెడు’ నని యొత్తి చెప్పుటయు. 311
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )